Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
cheppagalaraa..cheppamantara

ఈ సంచికలో >> శీర్షికలు >>

విహారయాత్రలు ( మలేషియ ) - కర్రా నాగలక్ష్మి

malaysia tourism

( లంకావి , పెర్లిస్ )

మలేషియా లోని మరో ప్రసిధ్ద పర్యాటక స్థలం లంకావి . విదేశాలలో వుండే టూరు ఆపరేటర్లు మలేషియ దేశపు టూరు అనగానే కౌలాలంపూర్ , జెంటింగ్ హైలేండ్స్ , లంకావి ఐలెండు , పినాంగ్ ఐలాండులను  కలిపి చెప్తారు .

మలేషియ లోని ‘ కేఢ ‘ జిల్లా కి చెందిన కొన్ని ద్వీపాలలో లంకావి ఒకటి . కేఢ నవాబు ‘ అబ్దుల్ హలీమ్ ‘  ‘ లంకావి ‘ ని కేఢ రాజ్యపు మణి ( పెరమాత కేఢ) గా 2008 లో వర్ణించేడు .

దేశ రాధాని కౌలాలంపూర్ కి సుమారు 413 కిలో మీటర్ల దూరం లో వుంది .

‘ లంకావి ‘ విస్తీర్ణం సుమారు 479 చదరపు కిలోమీటర్లు , జనాభా సుమారు 65 వేలు . ఈ ద్వీపం లో సుమారు 9 నుంచి 10 నెలలు వర్షం పడటం వల్ల నేలంతా యెప్పుడూ తేమగానే వుంటుంది .

లంకావి చరిత్రను పరిశీలిస్తే ఈ ద్వీపం కేఢా ను పరిపాలించిన నవాబుల ఆధీనంలో వుండేది . అప్పట్లో జరిగిన ఓ కథను స్థానికులు చెప్తారు , అదేమిటంటే 18 వ శతాబ్దం లో  ‘ మహ సురి ‘ అనే మహిళను  వేశ్యగా పొరపాటు పడి మరణశిక్ష విధించగా ఆ మహాయిల్లాలు ఆ భూమి మీద యేడు తరాలు నాశనమవ్వాలని శపిస్తుంది . ఇది జరిగిన కొద్దకాలానికి సియామి సైన్యం దండెత్తిరాగా స్థానికులు వారిని నియంత్రించడానికి ధాన్య , ఆయుధగారాలను కాల్చివేసేరు . ఆయధ్దం లో చాలా స్థానికులు మరణించగా కొందరు పొరుగు రాజ్యాలకు పారిపోయేరు . కొద్ది కాలాంతరం దండెత్తి వచ్చిన సియామీలకు యీ భూభాగం సులువుగా వశమయింది . కొంత కాలానికి ఇండోనీషియా రాజుల ఆధీనంలోకి వచ్చింది . 1909 లో యీ దీవులు బ్రిటిష్ వారి ఆధీనంలోకి వచ్చేయి . రెండవ ప్రపంచ యుధ్ద సమయంలో యీ దీవులు తిరిగి సియామీస్ ఆధీనంలోకి వచ్చేయి , మలేషియా జపాను వారి ఆధీనంలో వుండేది . తరవాత యీ లంకావి ద్వీపం సముద్ర దొంగల ఆధీనంలో వుండేది . సముద్రపు దొంగలు యీ ద్వీపాన్ని కేంద్రంగా చేసుకొని మలక్క స్ర్టైటు దాటే ప్రయత్నం చేసే నావలపై దండెత్తేవారు . బ్రిటిష్ సైన్యం 1945 నుంచి 1946 మార్చ్ వరకు విస్తృత దాడులు నిర్వహించి సముద్రదొంగలను అణచి వేసేరు . మలేషియ స్వాతంత్రం పొందిన తరువాత తిరిగి యీ ద్వీపం మలేషియ దేశం లో విలీనమయింది . 1986 లో అప్పటి ప్రధానమంత్రి చొరవ వల్ల యీ ద్వీపాన్ని పర్యాటక స్థలంగా తీర్చిదిద్దాలని నిర్ణయించేరు . రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా ? అని వెంటవెంటనే పనులు ప్రారంభింబడి పర్యాటక స్థలంగా రూపు దిద్దుకుంది .

లంకావి నుంచి మలేషియకి , పొరుగు దేశాలైన థాయ్ లాండు , ఇండోనీషియాలకు సముద్రమార్గం తెరిచి ఫెర్రీ సదుపాయం కలుగజేసేరు . పినాంగ్ నుంచి లంకావి కి ఫెర్రీ సదుపాయం వుంది . పినాంగ్ నుంచి సుమారు  రెండున్నర గంటల సమయం పడుతుంది . ప్రస్తుతం ఒకే సంస్థ ఫెర్రీని నడుపుతోంది . ఈ దేశంలో వున్న మరో మంచి విషయం యేమిటంటే చిన్న పడవ ప్రయాణమైనా లైఫ్ జాకెట్లు వేసుకొనే ప్రయాణించాలి . ఫోటోలకోసం వాటిని తీసివేస్తామంటే జరిమానా కట్టవలసిందే . నీలి సముద్రపునీళ్లు యెగసెగసి పడుతూ సాగే లంకావి ప్రయాణం మనోహరంగా సాగుతుంది . డెక్క్ మీద నిలబడడాలు లాంటివి చేసే అవకాశం లేదు . సముద్రపు నీరు యెంత స్వచ్చంగా వుందంటే నీటి కిందన యీదుతున్న జలచరాలు కూడా కనిపిస్తూ వుంటాయి . లంకావీ ఫెర్రీ స్టేషను ఓ చిన్న విమానాశ్రయాన్ని తలపిస్తుంది . నీటుగా వున్న వైటింగు హాల్స్ , టికెట్ కౌటర్స్ తో చాలా బాగుంటుంది . ఇక్కడ నుంచి పొరుగు దేశాలకు ఫెర్రీ సర్వీసులు వుండడం వల్ల యిమిగ్రేషను కౌంటర్లు కూడా వుంటాయి . విమానాశ్రయాలలో చూసే ఇమిగ్రేషన్ కౌంటర్లు  ఫెర్రీలు ఆగేచోట వుండడం ఆశ్చర్యాన్ని కలుగ జేస్తుంది .

లంకావి లో ముఖ్య ఆకర్షణ పెద్ద గ్రద్ద విగ్రహం , యీ బొమ్మ వున్న ప్రదేశాన్ని ‘ ఈగిల్ స్వ్కేర్ ‘ అంటారు .  ఓ నిజ హోటల్ యాజమాన్యం వారు వారి హోటలు ముందు నిర్మించుకున్న బొమ్మయిది . కొన్ని సినిమాలలో కనిపించడం తో యిది యెంతో ప్రాచుర్యం పొందింది . ఇక్కడకు వచ్చిన ప్రతీవారు యీ బొమ్మతో ఫొటో తీసుకోడం ఆనవాయితీగా మారింది .

ద్వీపం కాబట్టి బీచ్ లకి సీ ఫుడ్ కి కొదవలేదు . అయితే వీరు మరికొంత ముందుకి వెళ్లి జలచరాల పెంపకం చేపట్టి  అందులో యెవరు యెంచుకున్న జలచరాన్ని వారికి వండి వడ్డించడం చేస్తున్నారు . ఇక్కడకు వచ్చే పర్యాటకులలో 80 శాతం మంది వీటికోసమే వస్తూ వుంటారు . షేరింగులో కాని ప్రైవేటుగా గాని యిక్కడి మిగతా దీవులకు వెళ్లే సదుపాయం వుంది . ఇవికాక స్పా లు వున్నాయి , వాటర్ స్పోర్ట్స్ , ఈగిల్ వాచ్ లాంటి ఆకర్షణలు వున్నాయి . స్కైకాబ్ యిక్కడ వున్న మరో ఆకర్షణ . స్కై కాబ్ 2.5 కిలోమీటర్ల యెత్తుకి ‘ స్కై వాక్ ‘ వరకు వెళుతుంది , యిక్కడకు వచ్చేవారికి స్కైవాక్ చెయ్యడం ఓ ఆకర్షణ . దీనిని 2003 లో ప్రారంభించేరు . ఇవికాక కోయిన్ మెషిన్లు , రైడ్స్ పిల్లలను ఆకర్షిస్తాయి . వర్షాకాలంలో మాత్రమే చూడగలిగే జలపాతాలు నిరాశను మిగిల్చేయి . పిల్లలకు పెద్దలకు యిక్కడవున్న’ అండర్ వాటర్ వల్డ్ ‘ మరో పెద్ద ఆకర్షణ .

మన దేశం లో యింతకంటే యెన్నో పెద్ద పెద్ద జలపాతాలున్నాయి , వాటి ముందు యివి దిగతుడుపే .

లంకావీ లో చిన్న చిన్న పల్లెలలో ‘ ఒరాంగ్ లౌత్ ‘ లు నివాసముంటూ వుంటారు . అంటే స్థానిక జాలర్లు అని అర్దం . పర్యాటకులతో యెప్పుడూ కలకలలాడుతూ వుంటుంది యీ ద్వీపం . ప్రతీ చోటా డబ్బు , డబ్బు వెదజల్లడమే , పర్యాటకులను దోచుకోడమే , కాస్త దూరాలు వెళ్లాలన్నా పెద్ద మొత్తాలలో చెల్లించ వలసినదే .

ప్యాకేజీలో భోజన సదుపాయాలతో పాటు సైటు సీయింగ్ , బస మొదలయినవి అందించే యెన్నో పర్యాటక సంస్థలు పనిచేస్తున్నాయి .      పినాంగ్ నుంచి కాకుండా మలేషియాలో మరో రెండు ప్రాంతాలనుంచి కూడా ఫెర్రీ సర్వీసులు లంకావి కి వున్నాయి .  కేఢా నుంచి సుమారు అరగంట ఫెర్రీ లో ప్రయాణం చేసి లంకావి చేరుకోవచ్చు .

తమన్ ఉలర్ ——-

తమన్ అంటే పార్క్ , ఉలర్ అంటే పాము . స్నేక్ పార్క్ అని అర్దం . పినాంగ్ కి సుమారు 175 కిలో మీటర్ల దూరంలో వుంది . దీనిని స్నేక్ పార్క్ అని స్నేక్ ఫార్మ్ అని అంటారు . పినాంగ్ లో పొద్దున్న బయలుదేరితే రెండు గంటల ప్రయాణం తరవాత చేరేవాళ్లం . తమన్ ఉలర్ ‘ పెర్లిస్ ‘ నగరం లో వుంది . పినాంగ్ కి ఉత్తరంగా వున్న హైవే మీదుగా ప్రయాణించి చేరుకోవచ్చు . హైవేని యలయ భాషలో ‘ లెబుహ్ రాయ ‘ అంటారు . పెర్లిస్ థాయ్ లాండుకి బోర్డరు , పెర్లిస్ స్నేక్ పార్క్ కే కాక సున్నపు రాతి గుహలు ,  మార్కెట్  కి కూడా ప్రసిధ్ది . మార్కెట్టులో చైనా వస్తువులు , థాయ్ లాండు దుస్తులు చాలా చవుకగా దొరుకుతాయి .

ప్రయాణం హై వే మీద కాబట్టి చాలా సునాయాసంగా జరుగుతుంది . ప్రతీ 50 , 70 కిలోమీటర్ల ప్రయాణం  తరవాత శుభ్రమైన బాత్రూములు , విశ్రాంతి తీసుకుని ఫలహారాలు చెయ్యడానికి వీలుగా బెంచీలు టేబుల్స్ కట్టిన ప్రదేశం వచ్చేది . ఒక్కోచోట రెస్టారెంట్స్ కూడా వుండేవి . హై వే దిగిన తరువాత ప్రయాణం చిన్న పల్లెల మీదుగా సాగుతుంది  , కను చూపుమేర వరకు జన సంచారం కనిపించదు . దారి తప్పమో లేదో అడుగుదామన్నా మనిషి కనిపించడు , కనిపించిన మనిషితో నాకొచ్చిన నాలుగు పదాలు కలిపి చేతులు తిప్పుతూ అడిగి యెలాగో సమాధానం రాబట్ట వలసి వచ్చేది .

పచ్చిక మైదానాలు , పంటపొలాలు అహ్లాదాన్ని కలుగ జేస్తాయి .

తమన్ ఉలర్ లో రకరకాల పాములను వుంచేరు . 12 అడుగులకు తక్కువకాని త్రాచు పాములు , నల్ల త్రాచులు , అనకొండలు వాటి పిల్లలు భయాన్ని కలుగ జేస్తూ వుంటాయి . భయం అని పించినా పాము పడగ విప్పి చిరాగ్గా చూస్తూ వుంటే చేతులెత్తి దండం పెట్టి  నిశ్శబ్దానికి భంగం కలిగించినందుకు క్షమించు తల్లీ అని చెప్పాలని అని పించింది . ఇది మామూలు పాము కాబోలు పడగ విప్పలేదుగా ? అని మేం మాట్లాడు కుంటూ వుంటే చరాలుమని పడగ విప్పడం చూస్తే పాములకు చెవులుండవంటారు మరి మన మాటలు యెలా వింది అని విస్మయం చెందేం . అంటే పాములను ఓ జంతువుగా కాక యేవో అతీత శక్తులు గల నాగులుగా కనిపించేయి . వాటి కదలికలలో యేదో అందం , యిన్ని సంవత్సరాల తరువాత కూడా చాలా తాజాగా , తలుచుకుంటే ఒళ్లు గగుర్పాటుకి లోనవుతోంది .

గువ కేలమ్ ——-

కౌలాలంపూర్ కి సుమారు 515 కిలో మీటర్ల దూరం లో వుంది పెర్లిస్ ముఖ్య పట్టణం ‘ కంగర్ ‘ . పెర్లిస్ రాష్ట్రం రాజధాని ‘ కంగర్ ‘ కి సుమారు 36 కిలో మీటర్ల దూరంలో వున్నాయి యీ సున్నపురాతి గుహలు .

కేలమ్ అంటే స్థానిక భాషలో ‘ చీకటి ‘ లేక అస్పష్టంగా కనబడేది అని అర్దం , గువ అంటే గుహ అని అర్దం . కొండలో నిరంతరంగా నీరు ప్రవహించడం వల్ల యేర్పడ్డ గుహలు . యిప్పటికీ చాలా చోట్ల నీరు కారుతూ వుంటాయి . సుమారు 370మీటర్ల  పొడవున్న గుహలు . టిన్న్  గనుల త్రవ్వకాల సమయంలో యీ గుహలు కనుగొన బడ్డాయి . కింద కొండను  దొలుచుకొని నీరు ప్రవహిస్తూ వుండడం తో పర్యాటకుల సౌకర్యం కోసం వంతెన నిర్మించేరు . పర్యాటకులు వంతెన మీద నడుస్తూ చుట్టూరా నీటి ప్రవాహం వల్ల యేర్పడ్డ ఆకృతులను చూస్తూ , చేత్తో తాకి ప్రకృతిలోని వింతలకు ఆశ్చర్యపోతూ , ఆ ఆ కృతులను మన పురాణాలలోని దేవీ దేవతలతో పోల్చుకుంటూ ఆ కథలను తలచుకుంటూ,  ప్రాకృతికంగా యేర్పడ్డ ఆకృతులకు అబ్బురపడకుండా వుండలేము . రంగు రంగుల లైట్స్ యీ ఆకృతుల మీద పడేటట్టుగా చేసిన యేర్పాట్లవల్ల ఆ చీకటి గుహలు రంగు రంగు కాంతులతో మెరుస్తూ వుంటుంది . ఈ లైట్ల వల్ల గుహల అందం మరింత పెరిగిందనడంలో సందేహం లేదు .

ఈ గుహలున్న ప్రాంతాన్ని ‘ ఖాకి బుకిత్  ‘ అంటారు . బుకిత్ అంటే ‘ గుట్ట ‘ లేక ‘ కొండ ‘ అని అర్దం . ఖాకి అంటే అడుగు భాగం ‘ ఖాకి బుకిత్ అంటే కొండ దిగువ భాగం అని అర్దం .

బయట చిన్న పార్క్ నిర్మాణం చేసి , లోపలి నీరు యిక్కడి చిన్న కొలనులోకి చేరేటట్టుగా చేసేరు . వీకెండ్స్ లో చాలా మంది తమ కుటుంబాలతో వచ్చి సాయంత్రం వరకు యీ కొలనులో యీతలు కొట్టి , ఆడుకొని రిలాక్స్ అవుతారు .

బెంచీలు టేబుల్స్ కట్టి మంచినీరు , బాత్రూము సదుపాయాలు కలుగ జెయ్యడం చాలా బాగుంది . స్వఛ్చ భారత్ అభియాన్ లో జనాలకు అందుబాటులో మంచి మరుగుదొడ్ల నిర్మాణం చేస్తే జనాలు ఆరుబయట పాడు చేసే పనిని మానెస్తారేమో కదా ? మరుగు దొడ్లు అందుబాటులో లేకపోతేనే జనాలు రోడ్ల మీద , రైల్వే లైనుల పక్కన కూర్చోవలసి వస్తోందేమో కదా?

మలేషియా లో ప్రయాణించే టప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి అదేంటంటే ‘ రమదాన్ ‘ మాసం కాకుండా చూసుకోవాలి . రమదాన్ మాసంలో ప్రతీ ముస్లిం ఉపవాస దీక్షలో వుండాలి , కాబట్టి ఆ మాసం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు యెక్కడా తినుబండారాలు గాని పానీయాలుగాని అమ్మకూడదు . నీటి బోటిల్స్ కూడా . కాబట్టి మనకి మంచినీళ్లు కూడా దొరకవు . ఒకవేళ అలా ప్రయాణించవలసి వస్తే నీళ్లతో సహితం పట్టుకొని బయలుదేరితే మంచిది .

చాలా మంది స్థానికులు థాయ్ లాండు బోర్డరు దాటి ఆ దేశం లో అడుగు పెట్టి వచ్చెస్తూ వుంటారు . పాస్ పోర్టు అక్కరలేకుండా అలా వెళ్లి రావొచ్చు .

బోర్డరులో వున్న షాపులలో టాక్స్ లు వుండవని చాలా మంది అక్కడి షాపులలో ఎలక్ట్రానిక్స్ వస్తువులు కొనుక్కొని తెచ్చుకుంటూ వుంటారు .

పినాంగ్ లో ప్రొద్దుట 8 కి బయలుదేరి యీ మూడు ప్రదేశాలు చూసుకొని సాయత్రం 7 , 8 కల్లా తిరిగి పినాంగ్ చేరే వాళ్లం .మన   దేశం నుంచి టూరిస్ట్ లుగా వస్తే యిలాంటివాటికి ప్రాధాన్యత యిచ్చే వాళ్లం కాదుగాని యీ దేశంలో రెండేళ్లు వున్నాం కాబట్టి వీకెండ్స్ లో యిలా తిరగడానికి వెళ్లేవాళ్లం . ఒక్కోవారం ఒక్కో రాష్ట్రం చుట్టి వచ్చేవాళ్లం .

మళ్లా వారం మరికొన్ని మలేషియా వివరాలతో మీ ముందుంటానని మనవి చేస్తూ శలవు .

మరిన్ని శీర్షికలు
chamatkaaram