Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
chamatkaaram

ఈ సంచికలో >> శీర్షికలు >>

చెత్త సినిమా సూసొచ్చ మావా..వాఁ - -ప్రతాప వెంకట సుబ్బారాయుడు

movie

పెద్ద పండక్కి వచ్చిన పెద్ద సినిమా డిసస్టర్.

అభిమానుల ఆశల పాల పొంగుపై ఇన్ని నీళ్ల చుక్కలు... కాదు... కాదు, బిందెడు చల్లని నీళ్లు గుమ్మరించింది.

అర్థం పర్థంలేని కథతో అభిమానులను సైతం విస్తుబోయేలా చేసి గొప్ప షాకిచ్చింది.

ఫేస్ బుక్, వాట్సప్లలో తిట్లు, శాపనార్థాలతో పెడుతున్న కామెంట్లు చూస్తుంటే, మనసు మూగబోతోంది. అయితే ఏం లాభం?

అప్పటికే డబ్బు పెట్టి టిక్కెట్లు కొన్న చేతులు ఆకులు పట్టుకోడానికి వీళ్లేనంత కాలి బొబ్బలెక్కాయి.

ఇదేం మొదటిసారి కాదు. హీరోల మీదా, దర్శకుల మీదా, సినిమాల మీద క్రేజ్ తో ఓవర్ ఎక్స్ పెక్టేషన్ పెంచేసుకుని, ఎన్నిసార్లు మోసపోలేదు?

సినిమాకి పెద్ద హీరో ’ఊ’ అనడం పాపం, ఇహ పేపర్లూ, ఛానల్ టీవీలు- అంతవరకూ చూడని చిత్రం రూపుదిద్దుకోబోతోందని, హీరో అద్భుతమైన వేషం వేస్తున్నాడని, దానికోసం తన బాడీ(లాంగ్వేజ్)లో ఎన్నో చేంజేస్ చేసుకుంటున్నాడని, బయట నుంచి ఇంపొర్ట్ చేసుకున్న అప్సరస ను హీరోయిన్ గా పరిచయం చేస్తున్నామని, మనభాష మీద అభిమానంతో తన డైలాగులు తనే చెబుతోందని, హింది నుంచి దిగుమతి కాబడిన విలన్ సినిమాకు ఆయువుపట్టని, విదేశీ సీన్లని..ఇలా ఒకటనేంటి రోజూ ఊదరగొట్టి తమ భుజాలమీద ఊరేగించడం మొదలెడతాయి. ఫస్ట్ లుక్, టీజర్, థియేట్రికల్ ట్రైలర్ ఇలా ఊరిస్తూ.. ఊరిస్తూంటారు.  ఒకరోజు భారీగా ఆడియోలాంచ్ చేస్తారు. అభిమానులు వెర్రి అభిమానంతో బట్టలూడదీసుకుంటారు. అక్కడ తొక్కిసలాటతో ఒంటికి గాయాలవడం, కాళ్లూ చేతులూ విరగ్గొట్టుకోవడం కొండకచో  ప్రాణాలు కోల్పోవడం షరా మామూలే.

ఆడియో లాంచ్ తర్వాత నుంచి సినిమా ఆన్లైన్ బుకింగ్ ఎప్పుడు ఓపెన్ అవుతుందా అని గోతికాడ నక్కలా కంప్యూటర్ల ముందు రాత్రీ పగలు పడిగాపులు పడుతూ ఎదురుచూస్తూనే ఉంటారు. పాపం. ఒక శుభముహూర్తాన ఓపెనవుతాయి. క్షణాల్లో అన్నీ ఫిల్. దొరికిన వాళ్లు మదగజాలపై స్వారీచేస్తారు, దొరకని వాళ్లు నిరాశా నిస్పృహల్లో కూరుకుపోతారు.

సినిమా విడుదలైన రోజు హాల్లోకి వీరగర్వంతో అడుగెట్టి సినిమా స్టార్ట్ అయి ’పాత కంపు, అదే తంతుగా’ నడుస్తుంటే తట్టుకోలేక సినిమా పరమ సొల్లని మెసేజ్ల మీద మెసేజ్లు పెడతాడు. కాని ఏం లాభం? అప్పటికే బర్నాల్ రాసుకోవడానికి కూడా ఖాలీ లేకుండా చేతులు కాలి బొబ్బలెక్కి ఉంటాయి. అప్పటికే టిక్కెట్లు కొని ఏం చేయలేక థియేటర్లకి వెళ్లేవాళ్లని టీ వీల్లో చూపిస్తూ సూపర్, బంపర్ హిట్, బ్లాక్ బస్టర్ అని పబ్లిసిటీ స్టంట్ చేస్తుంటే, ఏవనాలి?

కష్టపడి సంపాదించింది రూపాయి, రూపాయిగా పొదుపు చేస్తూ దాచుకుంటాడు సగటు మనిషి. కూరలు కొనేటప్పుడు బేరాలాడతాడు. నిత్యావసరాలు వాయిదావేసుకుంటూ మరీ పొదుపుచేస్తాడు. అలాంటిది సినిమా మత్తుకు, పిచ్చికి లోనై టికెట్లకు (భ్లాకులో కొనడానికీ సిద్ధపడి) పెద్దమొత్తంలో జేబు ఖాలీ చేసుకుంటాడు. చిట్లను, ప్రైవేట్ బ్యాంకులను నమ్మి మోసపోడానికి, దీనికీ పెద్ద తేడా ఏం లేదు.

వెనకటి రోజుల్లో సినిమాకోసం థియేటర్లలో క్యూల్లో నుంచుని, దొరక్కపోతే నిరాశగా ఇంటికెళ్లిపోయేవారు. సినిమా టాక్ సరిగ్గా లేకపోతే ’హమ్మయ్యా’ అని డబ్బు ఆదా అయినందుకు ఆనందించేవారు. ఇప్పుడు ఆన్ లైన్ బుకింగ్ సిస్టం వచ్చాక ఏ థియేటర్ పడితే ఆ థియేటర్, ఏ ధర పడితే ఆ ధరకి టికెట్ కొనుక్కుని, సినిమా చూశాక విచారిస్తున్నారు. పైగా మల్టి ప్లెక్స్ లో ఫ్యామ్లీతో సినిమాకెళితే ఇంటర్వెల్లో స్నాక్స్ తీసుకోవడం వల్ల జేబుకి పెద్ద చిల్లే. గుల్లే.

సినిమా విడుదలకు ముందే మనదేశంలోనూ, ఓవర్సీస్ లోనూ టిక్కెట్లు అమ్ముకుని వాళ్లు బాగానే లాభిస్తున్నారు. ఎటొచ్చి సగటు ప్రేక్షకుడి పర్స్ కే గండి పడుతోంది.

నాణ్యమైన వస్తువులు పొందలేకపోతే కన్జ్యూమర్ ఫోరం ఉంది, తూణికల్లో తేడాలు పట్టుకోవడానికి తూణికలు, కొలతల శాఖ ఉంది. కల్తీ నిరోధక చట్టముంది. ధూమపానం, మధ్యపానం వద్దనీ, స్పీడ్ గా వెళ్లొద్దనీ, జంతువులకు కీడు చేయొద్దనీ ఎన్నో జాగ్రత్తలు చెబుతారు. కాని సినిమాల వల్ల ప్రజలపై ఎలాంటి ప్రభావం పడుతోందో, ఎంత డబ్బు చేతులు మారుతోందో ఎవరికీ పట్టదు. ప్రభుత్వం నడవడానికి అవసరమని మద్యపానం నిషేదించకుండా ప్రభుత్వం ఎలా ప్రోత్సహిస్తుందో, సినిమాని కూడా అంతేనేమో? షేర్ మార్కెట్లో పెద్దమొత్తంలో పోగొట్టుకుంటాడు. సినిమా టిక్కెట్లతో చిన్న మొత్తం పోగొట్టుకుంటాడు. షేర్స్ లో లాస్ అయితే టీ వీ వార్తల్లో చూపించి మదుపర్ల సంపద ఆవిరయిపోయిందని విచారం వ్యక్తం చేస్తారు. చెత్త సినిమాల వల్ల డబ్బు పోగొట్టుకున్న వాళ్ల గోడు ఎవరికీ పట్టదు.

పెద్ద సినిమాల ధాటికి అప్పుడప్పుడూ సృజనాత్మకతతో చిన్న సినిమాలు వచ్చినా, పెద్ద సినిమాల ప్రభంజనానికి నేలవాలిపోతాయి.

ప్రేక్షకుల పట్ల సినీ పెద్దల దృక్పథం మారాలి. ఫార్ములాతో, మసాలాతో ఏది చూపించినా మనవాళ్లు జేబులు చింపుకు మరీ చూస్తారు అన్న ఆలోచనలు మానుకోవాలి. డబ్బు పెట్టడం కాదు, మంచి సినిమా అందివ్వాలన్న  తపన వాళ్లకుండాలి. అలాంటి ఆలోచన వాళ్లకొచ్చేలా ప్రేక్షకులు సినిమాలకు ఎగబడడం మానుకుని, కాస్త సంయమనం పాటించడం అలవర్చుకోవాలి. అసలు హీరోలు, దర్శకుల పట్ల కాకుండా మంచి సినిమాల పట్ల అభిరుచి, అభిమానం పెంచుకోవాలి. ఇది సినీ పరిశ్రమకు జవసత్వాలనిచ్చి, పదికాలాల పాటు నిలబడేలా చేస్తుంది.

ఇదంతా సొల్లు. మా డబ్బు, మా ఇష్టం. రేపు మళ్లీ మా హీరో సినిమా వస్తే ఇలాగే చొక్కాలు చింపుకుంటాం అంటారా. ఖర్మ, అంతే!*

 

మరిన్ని శీర్షికలు
weekly horoscope january 19th to january 25th