Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
chamatkaaram

ఈ సంచికలో >> శీర్షికలు >>

హైదరాబాదు పుస్తక ప్రదర్శన 2018 - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

Hyderabad Book Fair

N T R స్టేడియం చదువరుల సముద్రమైంది.

సాహిత్యాభిమానులకు సంక్రాంతి, దసరాలాంటి పెద్ద పండగ హైదరాబాద్ బుక్ ఫెయిర్.

డిసెంబరు 18 నుంచి 28 వరకు పది రోజుల పాటూ జరిగే ఈ ఉత్సవం, సోమవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 8.30 వరకు, శని, ఆదివారాల్లో మరియు సెలవు దినాల్లో మధ్యాహ్నం 12.00 నుంచి రాత్రి 8.30 వరకు అలరిస్తుంది. బోలెడన్ని పుస్తకాలతో కొలువుదీరిన 331 బుక్ స్టాల్స్ పాఠకులకు కనువిందు చేస్తున్నాయి.

నిర్వాహకులు ఎంత శ్రద్ధ వహించారంటే-

1. ఎవరి స్టాల్స్ ఏ నంబరులో ఉన్నాయో ఎంట్రెన్స్ లోనే ప్రదర్శించడం ఎంతో ఉపయుక్తంగా ఉంది.

2. స్టాల్స్ అన్నీ వరస క్రమంలో కొలువుదీరాయి
(కొంతమంది తామెక్కడున్నామో తమవాళ్లకి చెప్పడం కోసం, ఫలాన స్టాల్ దగ్గర ఉన్నామని సెల్ ఫోన్లో చెప్పడం కనిపించింది)

3. నేల మొత్తం గ్రీన్ కార్పెట్ పరచి మట్టి అనేది లేకుండా చే(చూ)సి ఆహూతులను ఆహ్లాదపరచారు.

4. తాగేందుకు మంచి నీళ్లు ఏర్పాటు చేశారు.

5. కొన్ని స్టాల్లు 10 నుంచి 50% వరకూ డిస్కౌంట్ ఇవ్వగా, మరికొన్ని సగం రేటుకు పాత నవల్స్ ఇవ్వడంతో, కొద్ది సేపట్లోనే అన్నీ అమ్మూడుపోవడం కనిపించింది.

6. సాయంకాలం అవ్వొస్తుంటే, లైట్లు చక్కగా అన్ని వైపులా ఏర్పాటు చేయడం వల్ల పట్టపగల్లా ఉన్న వాతావరణంలో స్టాల్స్ మెరిసిపోతున్నాయి. పుస్తకాలు చూడ్డానికి పాఠకులకూ సౌకర్యవంతంగా ఉంది.

యథాప్రకారం ఆబాలగోపాలానికీ కావలసిన పుస్తకాలు ప్రతి స్టాల్లో చక్కగా అమర్చారు. అన్ని అంశాలకు సంబంధించిన పుస్తకాలు ఒక్క చోటే దొరికే వెసులుబాటు కల్పించడం వల్ల, నగరం నలువైపుల నుంచే కాకుండా శివారు ప్రాంతాలు, సిటీకి దగ్గరగా ఉండే ఊళ్లనుంచీ చదువరులు పెద్ద ఎత్తున రావడం గమనార్హం.

సభలూ సమావేశాలకోసం అందరికీ కనిపించేలా చక్కటి వేదికలేర్పరచి పుస్తకావీష్కరణలూ జరిపించారు. వక్తలు తమ రచన అనుభవాలు అందరితో పంచుకున్నారు. పిల్లలకు రక రకాల పోటీలనేర్పరచి బహుమతులనిచ్చి ప్రోత్సహించారు.

రచయితలను కళ్లారా చూసే భాగ్యం కొన్ని స్టాల్లు కల్పించాయి. పాఠకులు తమ మనసులోని ప్రశ్నలను రచయితలను అడిగి మరీ సంతృప్తికరమైన సమాధానాలు పొందడం కనిపించింది.

ఈసారి తల్లిదండ్రులు తమ పిల్లలకు డబ్బులిచ్చి మీక్కావలసిన పుస్తకాలు కొనుక్కోమనడం, వాళ్ల ముఖాలు మతాబాల్లా వెలగడం కనిపించింది.

అన్నట్టు ఇవాళ, రేపు, ఎల్లుండి ఈ పండగకు, ఈ సంవత్సరానికి చివరి మూడు రోజులు. హాలిడేస్ కాబట్టి వెళ్లకపోతే వెళ్లండి. వెళ్లినా మళ్లీ వెళ్లండి. ఎందుకంటే మళ్లీ వచ్చే సంవత్సరమే పునర్దర్శనం కాబట్టి.

కొసమెరుపు:

బండెడు పుస్తకాలు కొన్నందుకు ఆనందిస్తూ మోసుకెళుతున్నారు తప్ప, డబ్బు కర్చయిందని ఒక్కరూ బాధ పడడం కనిపించలేదు. దటీజ్ హైద్రాబాదు బుక్ ఫెస్టివల్. ఎ మెమొరబుల్ ఈవెంట్!

మరిన్ని శీర్షికలు
maleshiya