బీఏ, బీకాం, బీఎస్సీలే కాదు, బీటెక్ చేసేశాం, ఎమ్‌టెక్ కూడా చేసేశాం, వాటితోపాటు స్పెషలేజేషన్స్‌లో కూడా మాస్టర్ డిగ్రీలు పొందాం. కానీ.. జాబ్ రావడానికే తిప్పలు పడుతున్నాం. ఇవీ నేటి యువత చెప్పే మాటలు. ఎంతో ప్రయత్నిస్తున్నాం కానీ క్వాలిఫికేషన్‌కి తగ్గ జాబ్ రావడం లేదు ఏం చేయాలి..? అనే ప్రశ్న నేటి తరం యువతలో చాలామందిని వెంటాడుతోంది. బోలెడన్ని డబ్బులు ఖర్చుపెట్టి చదివిన చదువులు చదవాల్సి వస్తోంది. కానీ ఏం లాభం. ప్రస్తుతానికి ఖాళీ జేబులే.. అందుకే ఒక్కసారి కొత్త యాంగిల్‌లో ట్రై చేసి చూడండి. రెగ్యులర్ ఉద్యోగాలు కాదు కొంచెం భిన్నంగా, కొత్తగా ఆలోచించండి. బెటర్ కెరీర్‌ని బిల్డప్ చేసుకోండి. ముఖ్యంగా క్రియేటివ్ ఫీల్డ్‌లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు వీటిపై ఆలోచన చేయొచ్చు. ఫస్ట్ చేయాల్సిందల్లా కీలకమైన కొత్త సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి పెట్టాలి. క్లౌడ్, డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ స్కిల్స్, ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్‌వేర్ స్కిల్స్, నెట్‌వర్కింగ్ ఇన్‌ఫర్మేషన్ సెక్యూరిటీ ఇలా పలు అంశాలకు సంబంధించిన అత్యంత కీలక కోర్సుల్లో ట్రైనింగ్ తీసుకునే ప్రయత్నం చేయండి.
మరో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అనుభవాన్ని మించింది, ఈ ఎక్స్‌ట్రా సాంకేతిక పరిజ్ఞానంలో పట్టు సాధించడం. సో లాంగ్ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఉద్యోగుల కన్నా, అప్ కమింగ్ అండ్ అప్ గ్రేడింగ్ టాలెంట్ ఉన్నవారినే పరిగణలోనికి తీసుకుంటున్నారు. దాంతో నాలెడ్జ్‌ని బట్టే ఇప్పుడు ఉద్యోగాలకు ఎక్కువ అవకాశాలున్నాయి. నాలెడ్జ్‌తో పోల్చితే మంచి టైమింగ్‌తో ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా నెగ్గుకురాగలిగే తత్వం ఉన్నవారికి అవకాశాలు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. ఈ మధ్య చూస్తూనే ఉన్నాం. కొన్ని ఐటీ సంస్థల్లో సంవత్సరాల తరబడి ఎక్స్‌పీరియన్స్ ఉద్యోగుల్ని ఈజీగా తొలగించేసి కొత్తవారికి అవకాశం కల్పిస్తున్నారు. అంటే 'కొత్త ఒక వింత పాత ఒక రోత' అనే నానుడి ఉద్యోగాల విషయంలో కూడా నిజమైపోయిందనే భావించాలిప్పుడు. ఈ విషయాన్ని ఎందుకింత నొక్కి వక్కాణించాల్సి వస్తుందంటే, పరిస్థితులు మారాయి. అనుభవం కన్నా వారి మేధా శక్తి నుండి ఉద్భవించే కొత్త ఆవిర్భావాలకే ఎక్కువ ప్రోత్సాహకాలు అందుతున్నాయి.
ఇదే కాదు, సాఫ్ట్‌వేర్ నియామకాల విషయంలో కూడా క్రియేటివ్ పరిజ్ఞానానికే ఇంపార్టెన్స్ పెరిగింది. యువత ఉద్యోగాన్వేషణలో ఈ మెలకువలు ఖచ్చితంగా గుర్తించాల్సిన పరిస్థితి ఉంది. ఇంతే కాదు భాష ప్రధానంగా కూడా పలు ఉద్యోగాలకు అవకాలు లేకపోలేదు. ప్రస్తుతం గ్లోబలైజేషన్ కారణంగా పలు బహుళ జాతి సంస్థలు, వివిధ దేశాల్లోనూ తమ తమ కంపెనీల బ్రాంచెస్‌ని ఏర్పాటు చేస్తున్నారు. అందుకోసం యంగ్ అండ్ డైనమిక్ యూత్‌ని ఉద్యోగాల కోసం ఎంచుకుంటున్నారు. ఆకర్షణీయమైన ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నారు. వీటిని పొందాలంటే మీరు చేయాల్సిందల్లా, మీ స్టడీ నాలెడ్జ్‌తో పాటు, పలు రకాల విదేశీ భాషలపై కూడా పట్టు సాధించడమే. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలతో పాటు, స్పానిష్, జపనీస్, జర్మన్, ఫ్రెంచ్ తదితర భాషలపై పట్టు సాధించాలి. ఆయా భాషలపై ఉన్న పరిజ్ఞానాన్ని దృష్టిలోకి తీసుకుని పలు బహుళ జాతి సంస్థలు ఉద్యోగుల్ని ఎంచుకోవడం జరుగుతోంది. సో డియర్ యూత్! పైన చెప్పిన అంశాలలో శిక్షణ పొందే ప్రయత్నాలు చేయండి. తెలివిగా దరఖాస్తులు అప్లై చేయండి. నచ్చిన కెరీర్‌ని ఇంకా బెటర్‌గా డిజైన్ చేసుకుని, అద్భుతాలు సాధించెయ్యండి. ఇందుకోసం మీరు చెయ్యాల్సిందల్లా మీ మెదడుకి మరింత పదును పెట్టడమే. ప్రపంచాన్ని రెగ్యులర్‌గా స్టడీ చేస్తే, సరికొత్త ఆవిష్కరణల గురించి తెలియడమే కాదు, మనం ఎలా మనల్ని కొత్తగా మార్చుకోగలమో కూడా అర్థమవుతుంది.
|