Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
heels protection

ఈ సంచికలో >> శీర్షికలు >>

వారంవారం వారివారి వార ఫలాలు - ఈడూరి

horoscope

వారంవారం వారివారి వార ఫలాలు శీర్షికలో ఒకో వారం ఒకో అంశం తీసుకుని సరదా వారఫలాలు అందించే ఈ శీర్షికలో ఈ వారం జంతువులు, పక్షుల వారఫలాలు తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రాన్ని కించపరచడం కాకుండా ఆ శాస్త్రాన్ని లేనివాటికి ఆపాదించడం ద్వారా హాస్యం పుట్టించడానికి  మాత్రమే ఈ ప్రక్రియ.  
 

మేషం:
ఈరాశి జంతువులకి ఈ వారం చాలా బాగుంటుంది. ప్లాస్టిక్ వ్యర్ధాలు లేని మేత దొరికి కడుపు సాఫీగా వుంటుంది. ఈరాశిలో జన్మించిన పక్షులకి కూడా యిది బాగా కలిసొచ్చే వారమే. వాటికి గూడు కట్టుకోడానికి చెట్టు దొరకడం విశేషం. జంతువులు నంది విగ్రహం చుట్టూనూ, పక్షులు గరుత్మంతుడి విగ్రహం చుట్టూనూ 11 ప్రదక్షిణలు చెయ్యాలి.  
 

వృషభం:
అనుకున్న కోర్కెలు నెరవేరతాయి మీరు కోరుకున్న చిలకతో కాపురం పెడతారు. మీ గుడ్లు ఏ పామూ తినెయ్యకుండా కాపాడుకుంటారు. గేదెలు ఆక్సో టోసిన్ లాంటి కెమికల్స్ లేకుండానే మంచి పాలు ఇస్తాయి. తద్వారా వాటి ఆరోగ్యమూ బాగుంటుంది, పాల వ్యాపారుల లాభాలూ బాగుంటాయి. ఈవారం మారం గడ్డి తినడంలో మీరు కొందరు నాయకులకన్నా మెరుగనిపిస్తారు.  

మిధునం:
పనులు చప్పగా సాగుతుండడంతో ఈవారం కొన్ని పశువులు, పక్షులు కూడా చాలా ఇబ్బందులకు గురి కావాల్సివస్తుంది. సెల్ టవర్స్ రేడియేషన్ వలన చాలా పక్షుల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈరాశి పక్షులు ఏదైనా గుళ్ళో కానీ ఇంట్లో కానీ మృత్యుంజయ హోమం జరుగుతుంటే కొంత ప్రసాదం ముక్కున కరుచుకోవడం మంచిది. పశువులు పచ్చగడ్డి దొరకక ఎండుగడ్డితో సరిపెట్టుకురావాల్సివస్తుంది.

కర్కాటకం:
ఈవారం ఈ రాశి కాకులు మరీ ఎక్కువగా వాయసపిండాలు ఆరగించడం వల్ల ప్రతికూల ఫలితాలు ఏర్పడతాయి. కాస్త డైటింగ్ చేస్తే మంచిది. జూలో వున్న జంతువులు తమ జీవితం జూలకే పరిమితమా అని రోదిస్తాయి కానీ రోజూ తమని చూడటానికి వచ్చేవాళ్ళని చూసినప్పుడు వీళ్ళకన్నా మనమే బాగున్నాం అని సంతృప్తి పొందుతాయి. ఈరాశి పులులకి ఈవారం సెల్ఫీ దిగుతూ ఆహారంగా దొరికేవాళ్ళకి కొదవ వుండదు. ఒకటి రెండు అవయవాలని నక్కలకి  దానమివ్వడం ద్వారా తమ ఔదార్యాన్ని ఈ పులులు చాటుకుంటాయి.    

సింహం:
పేరుకి సింహ రాశే అయినా ఈరాశి సింహాలకి పెద్దగా కలిసిరాదు మరీ ముఖ్యంగా మగసింహాలకి. ఎప్పుడూ గుహపట్టునే వుంటావు ఏమీ వేటాడవు ఈమధ్య జింక బిర్యాని తిని ఎన్నేళ్ళయిందో గుర్తుందా అంటూ ఆడ సింహాలు పెట్టే వేధింపులు తట్టుకోలేక అలా పక్క గుహవైపు కన్నేస్తే ఆ పక్కింటి ఆడసింహం కూడా పట్టించుకోక చిరాకు కలిగి ఏదో ఒకటి వేటాడనిదే ఇంటికి రావొద్దు అనుకుని బయటికెళ్ళిన సింహాలు గ్రామస్తుల చేతికి చిక్కి జూ అధికారుల బారిన పడే అవకాశముంది కాబట్టి పెళ్ళాలేమి తిట్టినా పడుంటూ పిల్ల సింహాలకి నరసింహావతారం స్టోరీ చెప్పుకోడం బెటర్.    

కన్య:
ఈరాశిలోని జంతువులు, పక్షులు కూడా మంచి ఆనందాన్ని పొందే వారం యిది. ఇంకా జతకట్టని పక్షులు ఈవారం ఒకగూటివారయ్యే అవకాశాలు మెండుగా వున్నాయి. రోజూ తెల్లవారగానే కుంతీదేవిని స్మరిస్తూ సూర్యుడిని ప్రార్ధిస్తే మంచి ఫలితాలుంటాయి.

తుల:
ఈవారం అంతా సవ్యంగానే వుంటుంది. ఎన్నాళ్ళగానో మీరు తింటున్న గడ్డి మీకు మంచి సక్తినిచ్చి చక్కటి ఆరొగ్యం ప్రసాదిస్తుంది.  గాడిదలు పనిభారం తగ్గి కాస్త బరువు పెరుగుతాయి. మనుషుల్లా సోమరితనం పాలుగాకుండా వాషింగ్ మెషీన చుట్టూ రోజుకి 108 ప్రదక్షిణలు చేసి వాటి ఋణం కొంతైనా తీర్చుకోవడం మంచిది. వుగాది పండుగ దగ్గరలోనే వుంది కాబట్టి కోకిలలు ఫిల్టర్ వాటర్ మాత్రమే తాగుతూ గొంతుని కాపాడుకుంటే మంచిది. 

వృశ్చికం:
ప్రభుత్వం కొత్త జంతుప్రదర్శన శాలలు తెరవాలి అనుకుంటోంది అన్న సమాచాం మీలో ఆందోళనకి కారణమౌతుంది కానీ అవన్నీ వుత్తుత్తి హామీలే అని త్వరలోనే తెలుసుకుంటారు. చెట్లు దొరకక కొత్త కాపురం పెట్టలేని పక్షులు తామ తల్లిదండ్రుల గూట్లోనే కాలక్షేపం చెయ్యడంతో కాపురాల్లో కలతలు ఏర్పడుతాయి. ఈడొచ్చిన పిల్లలు ఎగిరిపోయే సాంప్రదాయం దెబ్బతిందని వృధ్ధ పక్షులు విలవిలలాడుతాయి. మనుషజాతిని చూసి పక్షుల్లో కూడా యువత పాడైపోతోందన్న చేదు నిజం అటు పక్షి జాతినీ యిటు పశుజాతినీ కలవరపెడుతుంది. ఈ దోషానికి ఏ పరిష్కారమూ లేదని యిది ఒక జీవపరిణామ సిధ్ధాంతమని శుకమహర్షి మనుమండు శివాలయం పక్కన మర్రిచెట్టుమీద తన ప్రవచనంలో తెలియజేశారు.   

ధనుస్సు:
మీరు మకుటంలేని మహాశునకంలా వెలుగుతున్న ఇంట్లో కొత్తగా ఒక హచ్ కుక్కపిల్ల వచ్చిచేరడంతో మీ అహం దెబ్బతింటుంది. యజామానురాలి ఒళ్ళంతా నాకేసే మీరు ఆ పని మరో కుక్క చేస్తుండటం చూసి తట్టుకోలేక పక్కింటివాళ్ళ పప్పీతో లేచిపోదామనుకుని చేసే ప్రయత్నాలు విఫలమౌతాయి. ఆ సమయంలోనే మీదెంత కుక్క బతుకో మీకర్ధమౌతుంది. ఏడుమంగళవారాలు కాలభైరవ గుడిచుట్టూ మూడుకాళ్ళతో నాలుగు ప్రదక్షిణలు చేయాల్సివుంటుంది

మకరం:
నీటికాలుష్యం పుణ్యమా అని మొసలి కూడా బల్లి అంత బలహీనంగా ఐపోయిన విషయాన్ని గుర్తెరిగి నీటికోసం వచ్చే గజరాజులని కెలుక్కోకుండా వుంటే మీకు ఈవారం బాగుంటుంది. కావాలంటే సెల్ఫీ దిగే అమ్మాయిల్ని నీటిలోకి లాక్కుని భోంచెయ్యండి మీకెవరూ అడ్డుచెప్పరు, వారివారి ఫొన్లలో వీడియోలు తీసుకుంటారు తప్ప మీకేమీ ఇబ్బంది కలిగించరు. మారుతున్న కాలాన్ని బట్టి మనమూ మారాలి అన్న నీతిని గ్రహిస్తారు 

కుంభం:
ఈరాశి జంతువులకి ఈవారం బాగా కలిసొస్తుంది. ఏమాత్రం శ్రమలేకుండానే తిండి దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూఢాలు వెళ్ళిపోయి శుభకార్యాలు మొదలయ్యే సమయం కాబట్టి చెత్తలో బోలెడు ఆహారం దొరుకుతుంది.  ఏదిఏమైనా ఈవారం ఈ రాశిలోని పక్షులు సెల్ టవర్లకి దూరంగా వుండటం మంచిది. వ్యవసాయ భూములకి ఇరవైనాలుగు గంటల కరెంటు ఇస్తున్నారు గనుక ఏదైనా పొలంలో బోరు దగ్గర మూడుముంకలు వెయ్యడం ద్వారా కొంత ఉపశమనం కలుగవచ్చు.   

మీనం:
ఈరాశి చేపలకి ఈవారం చాలా అనుకూలంగా ఉంటుంది. మామూలుగా వుట్టిమీద చేపపులుసులా మిగిలిపోవాల్సిన మీరు ఫైవ్ స్టార్ హోటల్లో ఫిష్ కర్రీగా పిలవబడటంతో మీ గొప్పతనం ఇనుమడిస్తుంది. జాలర్లకి దొరికిపోయి డాలర్లకి అమ్ముడూపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే మత్సావతారం మనసులో స్మరిస్తూ ఈదటం ఎంతైనా అవసరం   

మరిన్ని శీర్షికలు
dilouge in the dark Short film review