కొత్త సంవత్సరంలో కొత్త కాంబినేషన్ అయిన నాగార్జున - నాని మల్టీ స్టారర్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. నూతన సంవత్సరం ఉగాది రోజు అనగా ఈ నెల 18 నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. నాగార్జున - నాని మల్టీస్టారర్ అనౌన్స్‌మెంట్ రోజు నుండే అంచనాలు పెంచుతోంది. ఇక సెట్స్ మీదికెళ్లిందంటే, ఈ సినిమాకి సంబంధించిన ప్రతీ చిన్న న్యూస్ ఓ సెన్సేషనే కానుంది. ఈ సినిమాని యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్యత తెరకెక్కిస్తున్నారు. అభిరుచి గల నిర్మాత సి. అశ్వనీదత్ ఈ మల్టీస్టారర్‌ని నిర్మిస్తున్నారు. ఎన్నో సక్సెస్‌ఫుల్ మూవీస్‌ని రూపొందించిన సంస్థ వైజయంతీ మూవీస్. ఈ బ్యానర్‌లో ఈ క్రేజీ మూవీ తెరకెక్కడం ఆనందదాయకం. వినోదంతో పాటు. అన్ని రకాల ఎమోషన్స్ కలగలిపిన విభిన్న కథా చిత్రంగా ఈ సినిమా ఉండబోతోందని చిత్ర యూనిట్ చెబుతోంది.
ఇకపోతే, నాగార్జున ఇటీవలే వర్మ దర్శకత్వంలో చేస్తున్న 'ఆఫీసర్' సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ముంబయ్ నుండి హైద్రాబాద్‌కి వచ్చారు. హైద్రాబాద్‌లోనే తాజా చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. మరో పక్క నేచురల్ స్టార్ నాని 'కృష్ణార్జునయుద్ధం' సినిమాలో నటిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాతో పాటు, ఏకకాలంలో నాని ఈ తాజా మల్టీ స్టారర్‌లో నటించనున్నాడు. ఈ మల్టీ స్టారర్‌కి సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ బాణీలందిస్తున్నారు. ఈ చిత్రంలో నాగ్, నాని క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయనే అంశంపై పలు రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. నాగ్, నాని తండ్రీ కొడుకుల్లా నటిస్తున్నారనీ, లేదు అన్నాదమ్ములుగా కనిపించనున్నారనీ, కాదు ఫ్రెండ్స్ అనీ, కాదు కాదు గురు శిష్యులనీ ఈ రకంగా ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి నాగ్, నాని క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయో!
|