Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
thailand

ఈ సంచికలో >> శీర్షికలు >>

వారంవారం వారివారి వార ఫలాలు - ఈడూరి

varam varam vari vari phalalu

వారంవారం వారివారి వార ఫలాలు శీర్షికలో ఒకో వారం ఒకో అంశం తీసుకుని సరదా వారఫలాలు అందించే ఈ శీర్షికలో ఈ వారం దొంగల వారఫలాలు తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రాన్ని కించపరచడం కాకుండా ఆ శాస్త్రాన్ని లేనివాటికి ఆపాదించడం ద్వారా హాస్యం పుట్టించడానికి  మాత్రమే ఈ ప్రక్రియ. 

మేషం:
ఈవారం మీరు దొంగ్ల చేతిలో చిక్కే అవకాశం వుంది, జాగ్రత్త వహించండి. నేనే దొంగని నన్ను ఏ దొంగ పట్టుకంటాడు అని ఎదురు ప్రశ్న వెయ్యకండి. తాడిని తన్నే వాడుంటే వాడి తలదన్నే వాడుంటాడు అని సామెత. కాబట్టి జాగ్రత్తగా వుండండి. వారం రోజులపాటు కృష్ణుడి గుడికి వెళ్ళి ఏదో ఒకటి దొంగిలించడం ద్వారా ప్రాక్టీసు పోకుండా చూసుకోండి

వృషభం:
ఈరాశివారికి ఈవారం బాగా కలిసొస్తుంది. కొత్తగా ఈ వృత్తిలోకి వచ్చినవారు కూడా ఇబ్బడిముబ్బడిగా దొంగతనాలు చేయగలుగుతారు. మీరు దోచిందల్లా బంగారం అవుతుంది. అలాగని పెద్ద పెద్ద దొంగతనాలు ప్లాన్ చెయ్యకండి, చిన్న దొంగతనాల్లోనే పెద్ద లాభాలు పొందగలుగుతారు. శ్రీమతికి కొత్త నగలు సమకూరుతాయి 

మిధునం:
చాలాకాలం నుండీ పెద్ద దొంగతనం చెయ్యాలన్న మీ కోరిక ఈవారం నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి. ఐతే జాగ్రత్తలు కూడా బాగా తీసుకోవాల్సివుంటుంది. ఏ మాత్రం ఏమరుపాటుగా వున్నా దొరికిపోయే ప్రమాదం కనిపిస్తోంది. మీ తోటి దొంగల దిష్టి మీమీద బాగా వుంది. మీరు దొంగతనానికి వెళ్ళేముందు ఫేసుబుక్కులాంటి మాధ్యమాలలో మీరు కానీ మీ పిల్లలు కానీ వివరాలు ప్రకటించకుండా చూసుకోండి లేదంటే అడ్డంగా దొరికిపోయే అవకాశముంది. దొంగతనం చేసేచోట ఎట్టిపరిస్థితుల్లో సెల్ఫీలు దిగకండి

కర్కాటకం:
మీతో పాటు ఈ వృత్తిలోకి వచ్చి మీకన్నా ఎక్కువగా సంపాదిస్తున్నవారిని చూసి మీకు కడుపు తరుక్కుపోతుంది. అడపాదడపా ఇంట్లో కూడా మీకు చివాట్లు పడుతుంటాయి. ఇలా ఎందుకు జరుగుతోందో ఎంతకీ అర్ధంకాదు మీకు. మీరేమి తక్కువ తిన్నారు? ఎంత కష్టపడినా ఫలితం దక్కట్లేదు అని బాధ కలుగుతుంది కానీ మీరే పైచేయి సాధిస్తారు. మీతో పోటీపడేవారందరివీ తాటాకు చప్పుళ్ళే. మీ ప్రగతి ఒక క్రమపధ్ధతిలో వుండి చాలాకాలం కొనసాగుతుంది. భయపడాల్సిన పని లేదు.   

సింహం:
దొంగల కళాశాల పెట్టాలన్న మీ చిరకాల వాంఛ త్వరలో నెరవేరబోతోంది. మీ శిక్షణలో మెరికలు తిరిగిన దొంగలు దేశానికి అందుతారు. ఆ రంగంలో దేశప్రగతిని పెంచడంలో మీరు కృతకృత్యులవ్వడం మీవాళ్ళనందరినీ ఆనందానికి గురి చేస్తుంది. నాసిరకం పాతపధ్ధతులు కాకుండా లేటేస్ట్ టెక్నిక్కులు కనుక్కుని ఆవిధంగా ముందుకుపోతారు మీరు.

కన్య:
దొంగలంటే చారల బనీన్లూ, కళ్ళకి నల్ల పట్టీలు కట్టుకుని ఒళ్ళంతా నూనె పూసుకుని రాత్రంతా దొంగతనాలు చేసేవాడు అన్న అపప్రధ తొలగించి సూటూ బూటూ వేసుకుని కంప్యూటర్ మీద కూచుని కూడా దొంగతనాలు చేయ్యగలడని నిరూపిస్తారు మీరు. మీ చుట్టుపక్కలవాళ్ళు మిమ్మల్ని సాఫ్టువేర్ ప్రొఫెషనల్ అని భ్రమిస్తారంటే మీరెంత గొప్ప నటుడో అర్ధం చేసుకోవచ్చు. కొన్ని గ్రహ కూటములు సరిగా కూడని కారణంగా మీమీద సైబర్ నేరారోపణలు వస్తాయి. ఐనా ధైర్యంగా మీ పని మీరు చేసుకోండి. బ్రహ్మాండమైన లాయర్లు మీ దగ్గర వుండగా మీరు భయపడాల్సిన పనిలేదు. 

తుల:
టెక్నాలజీ బాగా పెరిగిపోయిన యీరోజుల్లో కూడా పాత సాంప్రదాయాలు పాటించడం వలన మీరు సంపాదనలో బాగా వెనుకబడిపోతారు. పదహారు కుక్కపిల్లల వ్రతం చేసుకుంటే మంచిది. వీలైనంత వరకూ ముఖం కవర్ చేసుకుని దొంగతనం చెయ్యండి. కెమేరా కనబడగానే పోజు పెట్టడం తగ్గించుకోవాలి. అన్ని కెమేరాలు పోజుల కోసం కాదు అని గ్రహించాలి.  

వృశ్చికం:
అప్పుడెప్పుడో రాబిన్ హుడ్ గురించి వినడమే కానీ ఎవరూ చూడలేదు మిమ్మల్ని చూస్తే అతడిని చూసినట్టే అని చాలామంది అంటుంటారు. మీలో అంత సేవాగుణం వుంది. మీనుండి సహాయం అందుకున్నవారు అతిత్వరలోనే యితరులకి సాయం చెయ్యగలిగే స్థాయికి ఎదగడం జరుగుతూ వుంటుంది. అందుకనే మీదగ్గరకి సాయం కోసం వచ్చే వారి సంఖ్య పెరగడంతో అనూహ్యంగా మీరు పగలూ రాత్రీ తేడా లేకుండా దొంగతనాలు చెయ్యాల్సివస్తుంది. ఈ క్రమంలో మీరు పట్టుబడితే మీకు సాయం చెయ్యడానికి ఎవరూ రాకపోవడంతొ హతాశులవుతారు. క్రమంగా రాబిన్ హుడ్ అన్న పేరు మీనుండి దూరమౌతుంది.

ధనుస్సు:
ఈవారం మీకస్సలు కలిసిరాదు. గతంలో మిమ్మల్ని కాపాడిన పెద్దలు కూడా ఈసారి మిమ్మల్ని చూసి ముఖం చాటెయ్యడం మీకు బాధని కలిగిస్తుంది. కొత్త దొంగతనాలు ప్లాన్ చెయ్యకుండా చేతిలో వున్న డబ్బుతో కాలక్షేపం చేసి మీ సమయం కోసం ఎదురుచూడటం తెలివైన పని. త్వరలోనే గ్రహాలు అనుకూలిస్తాయి.

మకరం:
దొంగల ప్రపంచంలో మీకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నారు. మంచో చెడో పిల్లలకి చక్కటి సాంప్రదాయ దొంగల కుటుంబాల్లో సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేశారు. ఇక కాలు మీద కాలు వేసుకుని కూచుని మనవలకి దొంగతనాల్లో మెళకువలు నేర్పుతూ శేష జీవితం గడపాల్సిన వయసులో కూడా ఈ కష్టాలేంటి పెద్దాయనకి అని మీ గురించి నలుగురూ వాపోతుంటారు అయినా తుదిశ్వాస వరకూ దొంగ గానే వుండాలి, దొంగతనాలు చెయ్యాలి అన్న మీ కోరిక తప్పక నెరవేరుతుంది. 

కుంభం:
దొంగలంటే ఇంటికి కన్నాలే వెయ్యక్కరలేదని రకరకాల మోసాలతో కూడా దొంగతనాలు చెయ్యొచ్చని నిరూపిస్తారు మీరు. లంకె బిందెలున్నాయంటూ ప్రజల్ని మభ్యపెట్టి మోసం చెయ్యడంలో అందె వెసిన చెయ్యి మీది. ఐదుగురు ఆడ దొంగలకి ఇత్తడి బిందెలు దానమివ్వడం ద్వారా మరింత మంచి ఫలితాలు మీరు సాధించగలరు.

మీనం:
సముద్ర దొంగతనాల్లో మీదైన ముద్ర వేస్తారు. సముద్ర జలాలు వుప్పగా వున్నంత కాలం మీ కీర్తిప్రతిష్టలు దొంగల రాజ్యంలో అజరామరంగా నిలుస్తాయి. ఎంతకాలం యిలా సముద్రాన్ని నమ్ముకుని, అమ్ముకుని బతుకుతాం అని మీకు అనిపించడం సహజమే ఐనా మీ రాశినిబట్టి అదే మీకు సరైన వ్యాపకమని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి, గమనించగలరు.

మరిన్ని శీర్షికలు
BabyCorn Masala!