Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Book Review - Rayavachakamu

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఊళ్ళోవాళ్ళమీదే బ్రతికేవారు.. - భమిడిపాటి ఫణిబాబు

Depending On others

సాధారణంగా అందరూ, తమ తాహతులోనే జీవితాన్ని గడుపుతూంటారు, చేతిలో డబ్బున్నప్పుడే చూసుకుందాములే అనుకుని. కొంతమందైతే, అప్పోసొప్పో చేసైనా సరే, సమాజంలో తమ స్థోమత చూపించుకోవడానికి తాపత్రయ పడుతూంటారు. ఒకమాట మాత్రం ఒప్పుకోవాలి, అప్పంటే చేశారు కానీ, దాన్ని సక్రమంగా తీర్చే జాగ్రత్త కూడా తీసికుంటారు. ఇంకొంతమందుంటారు, అసలు వాళ్ళకి ఇతరుల ఎదుట చేయి చాపడం అంటే ఎంతో సిగ్గుగా అనిపించి, అసలు వైభోగంగా బ్రతకడం మీదే ఓ వైరాగ్యం లాటిది తెచ్చేసికుని, "పోనిద్దూ, మనకీ జన్మలో యోగం లేదూ, ఆ భగవంతుడు అనుగ్రహిస్తే వచ్చే జన్మలో చూసుకుందాం లెద్దూ.." అనేసి ఊరుకుంటారు.

పైచెప్పిన రకాలను అధిగమించేసి, ఈ ప్రపంచంలో వాళ్ళంత తెలివితేటలు ఇంకెవరికీ లేవనే , ఏకైక అభిప్రాయంతో బ్రతుకుతూ, ఊళ్ళోవాళ్ళందరి మీదా బ్రతికేసే ఘనులు కొంతమందుంటారు. వీళ్ళకి సిగ్గూ, శరమూ అనేవి ఏ కోశానా కనిపించవు. అవతలివాడితో పరిచయం ఉందా లేదా అనేదానితో పనుండదు వీళ్ళకి. వాడివల్ల మన పనౌతుందా లేదా అన్నదే చూస్తారు. అవతలివాడు ఏ గంగలో దిగితే మనకేమిటీ అనే కానీ, పోనీ అంతలా అడిగేస్తే బాగుండదేమో అని మాత్రం ఆలోచించడు. ఇలాటివాళ్ళు ఓ unique రకం ప్రాణులు.

ఇప్పుడంటే ఎలా ఉందో తెలియదు కానీ, ఇదివరకటి రోజుల్లో అంటే జీతాలు డైరెక్టుగా బ్యాంకుల్లోకి వెళ్ళే పధ్ధతి ప్రారంభించక ముందన్నమాట, ఒకటో తారీకుకి ఓ రిజిస్టరులో ఓ రెవెన్యూ స్టాంపు అంటించి, ఓ సంతకం పెడితేనే కానీ, క్యాషియరు డబ్బులిచ్చేవాడుకాదు. మన ఫ్రెండున్నాడే వాడు జీతాలంటే పుచ్చుకునేవాడు కానీ, దానిక్కావలసిన రెవెన్యూ స్టాంపు మాత్రం జీవితంలో ఎప్పుడూ పోస్టాఫీసునుండి కొన్న పాపాన పోలేదు. ప్రతీనెలా ఎవడో ఒకడి దగ్గర చేయి చాపడమే. నెలకొకడి దగ్గర దేబురించినా, ఓ డజనుమందితో ఓ ఏడాదెళ్ళిపోతుంది. రెండో రౌండొచ్చేటప్పటికి ఆ మొదటివాడు ఎలాగూ మర్చిపోతాడు. అయినా to be on the safe side, వీడే మొదలెట్టేస్తాడు- "అరే గురూ, అప్పుడెప్పుడో నువ్వో స్టాంపిచ్చినట్టు గుర్తూ, ఇంకొక్కసారి పుణ్యం కట్టుకుంటే, ఇదిగో రెండురూపాయలూ అంటూ ఓ వందరూపాయల నోటు తీస్తాడు. వాడికీ తెలుసు, మరీ రెండురూపాయలకోసం, వందరూపాయలనోటుని అట్టేపెట్టుకునేటంత కౄరుడు కాడూ అని. బ్యాంకులకీ, పోస్టాఫీసులకీ వెళ్ళినప్పుడు ఛస్తే తన స్వంత పెన్నుమాత్రం తీసికెళ్ళడు. ఇంకోరెవరిదో అడగడం, తన పని కానిచ్చేసికోవడమూనూ. ఆ పెన్నిచ్చిన మహాశయుడు తిరిగి తీసికోవడం మర్చిపోతే, ( సాధారణంగా జరుగుతూనే ఉంటుంది), మన వాడికి ఓ పెన్ను మిగులూ.

ఎవరైనా అడిగారనుకోండి, మాస్టారూ మీకేమైనా "మధ్య మధ్య..పానీయం.." లాటిదేమైనా ఉందా ఏమిటీ అని. "అలాగని మరీ అలవాటనకూడదనుకోండి, ఎవరైనా కంపెనీ ఇస్తే అప్పుడప్పుడు కొద్దిగా .. ఏదో.." అని నసుగుతాడు.అసలు విషయం ఏమిటంటే ఎక్కడ, నోరు "తడుపు"కుంటున్నారని తెలిసినా, ఠంచనుగా అక్కడ హాజరైపోతూంటాడు. పైగా ఈ "తీర్థం" పుచ్చుకునేవాళ్ళకి, ఎంతమందుంటే అంత కిక్కుట. వద్దుమొర్రో అన్నా సరే బలవంతంగా కూడా పట్టించేస్తూంటారు. డబ్బులిచ్చి కొనుక్కునే వాడికైతే పౌర్ణమికీ, అమావాశ్యకీనూ, ఇలా ఊళ్ళోవాళ్ళమీద బ్రతికే వాళ్ళకేమిటీ, హాయిగా ఎప్పుడూ పండగే, పైగా ఏ బ్రాండుది ఎంత కిక్కిస్తుందో కూడా అలవోగ్గా చెప్పేస్తూంటారు. అలాగే సిగరెట్ల వ్యవహారంలోనూ అలాగే. సిగరెట్లూ, బీడీలూ కాల్చేవారికి ఎదుటివారికి కూడా offer చేసే ఓ పాడలవాటోటుంది. ఫలానా బ్రాండే కాల్చాలని లేదు, ఎవడిదగ్గర అప్పనంగా దొరికితే ఊదేయడమే.

ఇంక తాను పనిచేసే ఆఫీసుకి ఒక్కరోజైనా స్వంత బండిమీద వెళ్ళినవాడు కాదు.బస్సెక్కితే మళ్ళీ టిక్కెట్టూ అదీ ఓ గోలాయె. అథవా ఏ బస్సులోనో వెళ్ళాల్సొచ్చినా, నెలరోజులూ జేబిలో ఓ వందరూపాయల నోటు పెట్టుకునే ఉంటూంటాడు. కండక్టరేమో చిల్లరివ్వండీ అంటాడు, వీడిదగ్గర పుటమేసినా చిల్లరుండదు. కానీ తోటి ఉద్యోగస్థుడొక "బక్రా" ఉంటాడుగా, "బాస్ కొద్దిగా చేంజ్ ఉంటే ఇస్తావేమిటీ, ఆ ఏటీఎం లోనేమో ఎప్పుడూ పెద్దనోట్లే ఇస్తారూ, వీళ్ళేమో చిల్లరో చిల్లరో అని అడుగుతూంటారూ, అసలు మన ఆర్ధికవ్యవస్థ బ్రష్టు పడిపోతోందోయ్.." మాయదారి చిల్లరకోసం వీడి లెక్చరు వినేకన్నా, ఆ టిక్కెట్టేదో కోయించి, వీడి మొహాన్న కొట్టేస్తే హాయీ అనుకుని ఆ చిల్లరేదో తనే పెట్టుకుంటాడు. ఆ పూటకి గడిచిపోయినట్టే. హాయిగా ఆఫీసుకెళ్ళే దోవలో, ఏ పాపాలభైరవుడో దొరుకుతాడు. ట్రాఫిక్కు పోలీసులా చేతులూపేస్తూ, ఆ ద్విచక్రవాహన చోదకుణ్ణి ఆపి, ఆ పూటకి లాగించేస్తాడు. ఇంక సాయంత్రం మాటంటారా, ఏ తల మాసినవాడో దొరక్క మానడు. ఇలా ప్రతీరోజూ ఎవరో ఒకరు బలైపోతూంటారు. ఈ గొడవ భరించలేక, కొంతమందైతే వారి వాహనాల వెనక్కాలఉండే పిలియన్ సీట్లు కూడా తీయించేసికున్న ఉదంతాలు కోకొల్లలు. ఇంకొంతమంది, "మాస్టారూ, నాకు మార్కెట్ లో పనుందండీ, కొద్దిగా ఆలశ్యం అవుతుందేమో, ఈ రోజుకి క్షమించేయండీ" అని లౌక్యంగా చెప్పినా సరే, మనవాడినా టొకరాకొట్టించేదీ, "ఫరవాలేదండీ, నాక్కూడా బజారులోనే పనుందీ" అంటాడే కానీ, అయ్యో ఆయన నన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడేమో అని కూడా తట్టదు, తట్టినా దులిపేసికుంటే సరీ.

ఇలాటి పక్షులతో హొటళ్ళకి కానీ, సినిమాలకి కానీ వెళ్ళాల్సిన పరిస్థితి కలిగిందా అసలు చెప్పఖ్ఖర్లేదు. పీకలదాకా తినేసి, సరీగ్గా వెయిటరు బిల్లు తెచ్చేసమయానికి ఏ చేయి కడుక్కోవాలనే వంకతోనో వాష్ బేసిన్ దగ్గరకి పరిగెత్తేస్తాడు. సినిమాల విషయంలో మరీ వీధిన పడిపోకుండగా, ఎక్కడ జనం ఎక్కువగా ఉంటే ఆ క్యూలో నుంచోవడం ఉభయతారకం.

ఇలా ఊళ్ళోవాళ్ళమీదే బ్రతికే ఘనులు ఒక్కొక్కప్పుడు మనముండే సొసైటీల్లో కూడా కనిపిస్తూంటారు. నెలనెలా పెన్షనయిదంకెల్లో వస్తున్నా సరే, ఓ న్యూసుపేపరుకోసం నాలుగురూపాయలు ఖర్చుపెట్టాలంటే ప్రాణం మీదకొచ్చేస్తూంటుంది. అదే సొసైటీలో పేపరు తెప్పించుకుంటున్న ఇంకో పెద్దమనిషితో పరిచయం చేసికుంటాడు. మార్నింగు వాక్కులో ఓసారి కలిసేసికుని, వీళ్ళింటికి వచ్చేస్తాడు. ఏదో మొదటిసారి వచ్చాడుకదా అని , భార్యతో " ఏమోయ్ మాకు కాఫీ ఇస్తావటోయ్.." అని అడిగి, "కొద్దిగా ఫ్రెష్ అయి వస్తాను మాస్టారూ ఈలోపులో పేపరు చూస్తూండండీ.." అంటాడు. అసలు వచ్చిందే అందుకు కదా, పైగా కాఫీకూడా దొరుకుతోందీ అని, ప్రతీరోజూ ఠంచనుగా వీళ్ళింటికి వచ్చేస్తూంటాడు. ఏ రోజైనా పేపరు రావడం ఆలశ్యం అయిందంటే చాలు, ఎక్కడలేని అభిమానం చూపించేసి, "ఏమిటోనండీ, లేనిపోని అలవాటోటి చేసేశారు, పైగా చెల్లెమ్మ కాఫీ ఒకటీ.. అసలు ఈ పేపరిచ్చేవాళ్ళకి వేళాపాళా లేదు, టైముకి ఛస్తే రారు.." ఈయనగారు చేస్తున్నదేమిటో?

ఈ ఊళ్ళోవాళ్ళమీదే బ్రతికే ఘనులు, వాళ్ళ పిల్లల్ని, ఎదురింటివారింటికి పంపించేసి, తనూ, భార్యా హాయిగా ఏ సినిమాకో చెక్కేయడం. పిల్లలూ క్షేమంగా ఉంటారు, కావలిసినంత కాలక్షేపమాయె. అలాగే ఏ దీపావళి పండక్కో , దీపాలు పెట్టేవేళకి, పిల్లలని తీసికుని, ఏ బాణాసంచా కాల్చేవాడి పిల్లలదగ్గరకో తీసికెళ్ళి దేర్భ్యంలా నుంచోడం. పాపం వాళ్ళుకూడా ఏ మతాబాయో. కాకరపూవొత్తో, చిచ్చుబుడ్డో కాల్చుకోమని ఇస్తారుగా, హాయిగా కాల్చేసికుని, వీళ్ళ బుట్టంతా ఖాళీచేసేసి, తీరిగ్గా తనింట్లో ఉన్నవేవో కాల్చుకోవడం. పైగా, మనం కొన్న బాణాసంచామీద ఓ వ్యాఖ్యకూడానూ.."క్వాలిటీ చూసుకుని తెచ్చుకోవాలి మాస్టారూ.." అంటూ.

మన చిన్నప్పుడు చూసేఉంటాం, పక్కింటివారింటికి వెళ్ళి, కొంచం కాఫీ పొడుం ఉంటే ఓ గ్లాసుడివ్వమ్మా అనో, ఓ సోలడు బియ్యం ఇవ్వమనో, ఇలా ఇది అడగొచ్చూ, అది అడక్కూడదూ అనుండదు. చుట్టుపక్కలుండే ఓ పదిళ్ళల్లో అడుక్కున్నా నెలెళిపోతుంది. చిన్నా చితుకూ బదులు ఇచ్చిన వాళ్ళెవరూ అడగనూ అడగరూ, మరీ అడిగినా ," అదేమిటమ్మోయ్ మీ ఆస్థంతా దోచేసికున్నట్టడుగుతావేమిటీ, ఇంకా చెయ్యూరుకోలేదుకానీ, ఎప్పుడో ఇచ్చేసేదాన్ని.." అని ఝణాయించగల నేర్పు కూడా వీరికి నరనరాలా ఉంటూనే ఉంటుంది.

ఇలా వీళ్ళు ఊళ్ళోవాళ్ళమీదే బ్రతుకుతూంటారు. అమాయక ప్రాణులు ఇలాటివారి దాష్టీకాలకి బలైపోతూనే ఉంటారు.

మరిన్ని శీర్షికలు
Movie Piracy Prevention Program