ఇదివరకటి రోజుల్లో, ఇంట్లో బట్టలు ఉతికి ఇస్త్రీ చేసి తీసుకురావడానికి, ఓ ఆస్థాన చాకలి ఉండేవాడు. పెద్ద బట్టలకింతా, చిన్నబట్టలకింతా అని ఓ రేటు పెట్టి , వారానికో, పదిహేను రోజులకో తీసుకొచ్చేవాడు. ఇంకో పధ్ధతేమంటే, రేవుకింతా అని రేటుండేది. ఇలాటప్పుడు, ఎన్ని రేవులుంటే అన్ని డబ్బులొస్తాయని, వారం వారం తెచ్చేవాడు… ఇందులో కొంత ఖర్చెక్కువే మరి – ఒక్కోసారి చాలా బట్టలుంటే పరవాలేదు కానీ, మరీ బిక్కుబిక్కుమంటూ ఓ అరడజను బట్టలే ఉన్నప్పుడు, “ అయ్యో..ఈమాత్రందానికి ఎంతడబ్బో.. “ అని బాధపడే సందర్భాలు ఎన్నో ఉండేవి… ఇంటినిండా మనుషులుంటే పరవాలెదు, కిట్టుబాటయ్యేది..ఆబట్టలుకూడా, ఏ కాలవగట్టుకో, చెరువుకో వెళ్ళి, ఓ కాగునిండా ఏ సోడాయో వేసి ఉడకపెట్టడమూ, ఆ తరవాత ఓ బండకేసి కొట్టి ఉతికేవారు. ఇలాటి ఆటుపోట్లకి తట్టుకుని, మన బట్టల మన్నికకూడా అలాగే ఉండి కొద్దికాలానికే చిరుగుపట్టేసేవి.
కాలక్రమేణా, అంతంత ఖర్చులు భరించలేకపోవడమైతేనేమిటి, బట్టలు సరైన టైములో తేకపోవడమైతేనేమిటీ, ఇళ్ళల్లోనే బట్టలు ఉతికేసి, జస్ట్ ఇస్త్రీకి ఇవ్వడం మొదలయింది… ఇళ్ళల్లో బట్టలుతకడమంటే అంత సులభమా, ఆరోజుల్లో బట్టల సబ్బు అనేదొకటుండేది. బట్టకి సబ్బుపెట్టేసి, కొంతసేపు నానపెట్టి, ఆ తరవాత ఓసారి ఉతికేసి, ఝాడించి ఎండబెట్టేవారు. ఆరోజుల్లో జనాలకి టైమూ ఉండేదీ, కాకపోతే ఏ పనిమనిషికో చెప్పినా పనైపోయేది. కానీ ఈ పనిమనుషులతో ఒక ఇబ్బందుండేది—మనబట్టలతోపాటు, వాళ్ళ బట్టలుకూడా, మన సబ్బుతోనే ఉతికేసుకునేవారు. 10 రోజులు రావాల్సిన బట్టలసబ్బు, రెండురోజులకే అరిగిపోయేది.. అడిగితే, “ ఏం చేయమంటారమ్మగారూ.. మీ బట్టలకే మురికి ఎక్కువగా ఉండడంతో రెండేసిసార్లు సబ్బు పట్టాల్సొచ్చిందీ.. “ అనేవారు… మొత్తానికి ఈ బట్టలు ఉతకడమనే ( సబ్బు పెట్టి విడిగా ) కార్యక్రమానికి తెర పడింది.
ఆ రోజుల్లో వచ్చాయి--- కొత్తగా వాషింగ్ మెషీన్లు ( Washing machines ) అని. విద్యుఛ్ఛక్తితో పనిచేసేవి. మొదట్లో ఉతకడమే ప్రధానంగా ఉండేవి… మరీ వాటిల్లో బట్టలసబ్బు ముక్కలుచేసి వేయలేముగా, ఆ లోపలుండేదేదో తిరగడం మానేస్తే ? అదో గొడవా.. క్రమంగా ఆ సబ్బుల్నే పొడిలా చేసి అదేదో Detergent అని పేరెట్టి మార్కెట్ లోకి దింపారు. ఎన్నెన్నో కంపెనీలు చిత్రాతిచిత్రమైన వ్యాపార యాడ్లతో ఆకట్టుకుంటున్నారు. మొదట్లో అంతా బాగానే ఉండేది.. బట్టలుతికినా, ఎండబెట్టడం ఓ పెద్ద కార్యక్రమమాయే.. ఇదివరకటిరోజుల్లో అయితే, ఇళ్ళల్లో ఖాళీ ప్రదేశాలుండేవి కాబట్టి, ఓ రెండు రాటలు పాతి, దానికో డొక్కతాడో ఏదో కట్టేసి దండెంలా చేసి ఆరేసుకునేవారు. ఈరోజుల్లో ఈ ఎపార్ట్మెంటళ్ళలో అంతంత ఖాళీలెక్కడా? అలాగని ఉతికిన బట్టలు తడిముద్దల్లా ఉంటే, అవి ఎండేదెప్పుడూ, ఇస్త్రీచేసి కట్టుకునేదెప్పుడూ? ఈ కొత్తగా వచ్చిన వాషింగ్ మెషీన్లకి అదేదో DRYER అని ఒకటి జోడించారు… ఓ గంటసేపు ఆమెషీనేదో తిరిగి, మధ్యలో ఆగి , మళ్ళీ నీళ్ళోసుకుని, చివరకి పిడచగట్టి సగంసగం దాకా బట్టలు ఆరడం మొదలయింది. మళ్ళీ వీటిల్లో కొత్తకొత్త మోడళ్ళూ .. ఒకడెమో Top Loading అంటాడు, ఇంకోడేమో Side Loading అంటాడు….అలాగని మరీ పూర్తిగా ఆరిపోవడం కాకపోయినా, కనీసం బయట గాలికైనా, ఏ వర్షమైనా వస్తే, ఇంట్లో ఫాన్ కిందపెట్టైనా మొత్తానికి ఆరడం, ఆ బట్టల్ని ఇస్త్రీకి ఇవ్వడంతో పనైపోతోంది ఈరోజుల్లో.
హాస్పిటళ్ళలో బట్టల వాడకం ఎక్కువా, ఆ బట్టలన్నీ మరీ చిన్నచిన్న మెషీన్లలో ఉతకడమంటే శ్రమతో కూడుకున్న పని. దానితో అవేవో Industrial Washing Machines అని వచ్చాయి.. బట్టల వాడకం ఎక్కువగా ఉండే, రైల్వే వారుకూడా ఇదే పధ్ధతి మొదలెట్టారు, వాళ్ళు రైళ్ళలో సరఫరా చేసే దుప్పట్లకోసం..
నగరాల్లోనూ, పట్టణాల్లోనూ Dry Cleaners అయితే ఉండనే ఉంటాయి.. చిన్నచిన్న ఊళ్ళలో లాండిరీల్లాటివి. ఇవేకాకుండా ఓ బండిమీద బొగ్గుల ఇస్త్రీ పెట్టి తో ఒకడొద్తూంటాడు, చుట్టుపక్కల ఉన్న ఇళ్ళవాళ్ళందరి బట్టలన్నీ ఇస్త్రీ చేసుకుంటూ బతికేవాడు. ఈరొజుల్లో సొసైటీలో ఉండే వాచ్ మన్ కైతే ఇదో పార్ట్ టైమ్ జాబ్ అయిపోయింది…
మొత్తానికి బట్టలు ఉతుక్కోడానికి ఇళ్ళలో వాషింగ్ మెషీన్లూ, ఇస్త్రీ చేయడానికి ఇస్త్రీ పెట్టెల ధర్మమా అని, మొత్తానికి రేవులెక్కలూ, చాకళ్ళూ, , విడిచినబట్టలు పెట్టుకోడానికి, గాలి ఆడ్డానికి ఖాళీలుండే బట్టల పెట్టెలూ, కనుమరుగైపోయినట్టే కదా మరి….
సర్వేజనా సుఖినోభవంతూ…
|