Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
chamatkaaram

ఈ సంచికలో >> శీర్షికలు >>

ప్రతాపభావాలు! - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

pratapabhavalu

నా చదువు - 3

నేను డిప్లొమా చేస్తున్నప్పుడు, బి టెక్ చదువుతున్నప్పుడూ పరీక్షలు జరుగుతున్నప్పుడు రెండు విచిత్రాలు జరిగాయి. అవేంటంటే డిప్లొమా చేస్తున్నప్పుడు నాకో సబ్జెక్ట్ ‘లైన్ కమ్యూనికేషన్’ అని ఉండేది. అందరూ అది టఫ్ సబ్జెక్ట్ అనుకునేవాళ్లు, కాని నా విషయంలో అది రాంగ్ అవుతుందని నా నమ్మకం. ఎందుకంటే నేను టెలీఫోన్ వ్యవస్థకి పరికరాలు  తయారుచేసే సంస్థలో టెక్నీషియన్ గా పనిచేస్తున్నాను. టెలిఫోన్ ఎక్స్చేంజ్ లు ఎలా పనిచేస్తాయి?

అందులో ఎలాంటి పరికరాలు ఉపయోగిస్తారు? లాంటి వాటిలో నాకు మంచి నాలెడ్జ్ ఉంది. పైగా అప్పటికే ఎన్నో టెలిఫోన్ ఎక్స్చేంజ్ లు చూశాను. అందుచేత ఆ సబ్జెక్ట్ నాకు కరతలామలకమే అనుకున్నాను. మాకు రాత్రిపూట క్లాసుల్లో శ్రీ ప్రతాప్ గారు ఆ సబ్జెక్ట్ బోధించేవారు. ఆయనకి నేనంటే చాలా అభిమానం. ఆ సంవత్సరం ఆయన కొన్ని సబ్జెక్ట్స్ మాత్రమే కవర్ చేశారు. విచిత్రమేమిటంటే నేను నాకున్న ఓవర్ కాన్ఫిడెంట్ తో బుక్ తీ(చూ)సేవాణ్ని కాదు. సరిగ్గా ఫైనల్ ఎగ్జామ్స్ ఇంకో నెల ఉన్నాయనగా బుక్ తెరిస్తే కళ్లు గిర గిరా తిరిగాయి. కారణం, అందులో ఆటోమెటిక్ తోపాటు ఎప్పుడో పురాతన కాలంనాటి మాన్యుయల్ ఎక్సేంజ్ ల రూపురేఖలు, అప్పట్లో వాడిన పరికరాలు.. చదువుతుంటే  ఒక్కముక్కా అర్థం కాలేదు. నాకు కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. రీజన్ ఏదయినా నేను పరీక్ష రాయలేకపోయినా, లేక పరీక్షలో ఫెయిలైనా ఒక సంవత్సరం నా నిర్లక్ష్యంతో పోగొట్టుకున్నట్టే! మా ఇంట్లో నేను చదువుకోడానికి ఐసోలేటెడ్ గా ఒక రూం ఉండేది. అందులో ఒక మూడ్రోజుల పాటు ఆ సబ్జెక్ట్ ఏకబిగిన చదివాను. దాంతో నా కళ్లు ఎర్రబారి, వాటిల్లోంచి నీళ్లు కారడం మొదలెట్టింది. ఒకసారి రాత్రి అందరం కూర్చుని అన్నం తినేప్పుడు మా నాన్నగారు నా వంక చూసి "కళ్లు ఎర్రగా ఉన్నాయి, అంతలా చదవకు నాన్నా, కళ్లకి ప్రాబ్లెం వస్తుంది"అన్నారు. పాపం ఆయనకేం తెలుసు? నేను సంవత్సరమంతా ఆ పుస్తకం ముట్టలేదని, మంచిగా చదివే నేను అన్నీ బాగా ప్రిపేరయి, నా నిర్లక్ష్యంతో ఒక సబ్జెక్ట్ లో ఫెయిలయ్యే పరిస్థితిని చేతులారా తెచ్చుకున్నానని.

సరే, పరీక్షరాసే రోజు రానే వచ్చింది. నేను కాలేజ్ కి వెళ్లగానే మావాళ్లు ముగ్గురు మాత్రమే ఉన్నారు. మిగతావాళ్లెవరూ పరీక్షకి అటెండ్ కాలేదు. ఆ ముగ్గురు కూడా ’ఈ పరీక్ష ఎలాగూ టఫ్ గానే ఉంటుంది. మనం మూడు గంటలు కూర్చోలేం. పద మీరా థియేటర్లో ఏదన్నా సినిమాకెళదాం’ అనుకుని నాకు బై చెప్పి వెళ్లిపోయారు (మీరా థియేటర్ పాలిటెక్నిక్ కాలేజి, మాసాబ్ ట్యాంక్ కి దగ్గరే).చెప్పొద్దూ నాకూ చాలా ఆందోళన కలిగింది. కానీ ఏం చేస్తాం. దాదాపు వణుకుతూ, భయపడుతూ పరీక్షహాల్లోకెళ్లాను.

క్వశ్చన్ పేపరు తీసుకుని చూస్తే ఫర్వాలేదు నేను రాయగలననిపించింది. రాయడం మొదలెట్టగానే ప్రతాప్ గారు గదిలోకొచ్చి, ఏ గదిలోనూ మనవాళ్లు కనిపించలేదు. నువ్వు మాత్రం ఉంటావనే అనుకున్నాను రాయుడూ, మంచిగా రాసి పరువు నిలబెట్టు’ అన్నాడు.

నాకో పక్క ఆనందంగా, మరో పక్క నేనాయన నమ్మకాన్ని నిలబెట్టగలనా? అన్న సందేహం వెంట వెంటనే కలిగాయి. మా క్లాస్ లో నేను ఒక్కణ్నే ఆ ఎగ్జామ్ మంచి మార్కులతో పాస్ అయ్యాను. అప్పటి నుంచి ఒక్క చదువు విషయంలోనే కాదు ఏ విషయంలోనూ అశ్రద్ధ చేయడం లేదు. ఎందుకంటే అంతా అయింతర్వాత విచారించి ప్రయోజనం ఉండదు కాబట్టి.

బి టెక్ చదువుతున్నప్పుడు జరిగిన విచిత్రమేంటంటే-

మాకు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ జరిగే ముందు ఇచ్చే ఎగ్జామ్ టైం టేబుల్ ను ఇంట్లో గోడలకు అతికించి ఒక్కో సబ్జెక్ట్ కి ప్రయార్టీ ఇస్తూ చదివేవాడిని. టైం టేబుల్ ను మనసులోనూ ఫిక్స్ చేసుకునేవాడిని, కాని గోడలకు అతికించడం ఎందుకంటే ఉద్యోగ బాధ్యతతో తలమునకలయ్యే నన్ను ఎగ్జామ్స్ ను గుర్తుచేస్తూ అలర్ట్ చేస్తుందని.

ఒకసారి ఎందుకో కాని చివరిదాకా టైం టేబుల్ చూడలేదు.

ఎగ్జాం కి చక్కగా ప్రిపేరై గంట ముందే ఎగ్జాం సెంటర్ జె ఎన్ టీ యూ, కూకట్ పల్లికి వెళ్లాను. అక్కడ ఉన్న లాన్లో కూడా చదువుకుని, సరిగ్గా 10 నిముషాల ముందు ఎగ్జాం జరిగే హాల్లోకి వెళ్లాను. మాకు టేబుల్స్ మీద హాల్ టికెట్ నంబర్లు వేసి ఉండవు. బెంచికి ఒకళ్లు చొప్పున ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోవచ్చు. బహుశా డిగ్రీ చేస్తున్నాం కాబట్టి డీసెంట్ గా, కాపీలు కొట్టకుండా ఎగ్జాం రాస్తామని కాబోలు. నేను సాధారణంగా ముందు బెంచిలోనే కూర్చునేవాణ్ని, కారణం- ఎగ్జాం రాసేప్పుడు నన్నెవ్వరూ డిస్టర్బ్ చేయకూడదని.  అన్నట్టు నేను బాగా చదువుతాను, డిసిప్లీన్డ్ గా ఉంటానని నాకు కాలేజ్ లో స్టూడెంట్ నెంబరు వన్ అని పేరు పెట్టారు. నేను నా సీట్లో కూర్చున్నానంటే సాధారణంగా అటూ ఇటూ చూడను. అలాంటిది నా వెనక నుంచి ఇండియన్ ఎయిర్ లైన్స్, ఎన్ ఆర్ ఎస్ ఎ లో జాబ్ చేస్తూ నాతో పాటూ చదివే చేసే  క్లాస్ మేట్స్ విష్ చేశారు. నాకూ వాళ్ల దగ్గరకి వెళ్లి విష్ చేద్దామనిపించి, వాళ్లదగ్గరకి వెళ్లాను. వాళ్లూ ఇంకా ఎగ్జాం టైం కాలేదు కాబట్టి టెక్స్ట్ బుక్ పెట్టుకుని చదువుతున్నారు. ఆ బుక్ చూసి ‘ఇవాళ్టి ఎగ్జాం ఏంటి? మీరేం చదువుతున్నారు?’ అన్నాను ఆశ్చర్యంగా.

ఒక్కసారిగా వాళ్ల గుండాగిపోయింది. వాళ్లలో వాళ్లే ‘ఇవాళ్టి ఎగ్జాం ఏంటని’ తర్జనబర్జనలు పడ్డారు. చివరికి వాళ్లు ప్రిపేరవుతున్నదే అని తేల్చిచెప్పారు. ఇప్పుడు గుండె జారిపోవడం నా వంతయింది.

ఒక్కసారిగా కళ్లనీళ్లు వచ్చాయి. టైం టేబుల్ చూడకపోవడం వల్ల ఒకదానికి బదులు మరొకటి ప్రిపేరయ్యాను. ఇంకేం రాస్తాను? "నేను ఎగ్జాం రాయడం లేదు" అని వాళ్లకి చెప్పి మూడంతస్తులు వేగంగా దిగిపోయి నేను పార్క్ చేసిన స్కూటర్ దగ్గరకి వచ్చాను. ఎక్కి స్టార్ట్ చేయబోతుండగా, ఫ్లాష్ లా ఒక ఆలోచన వచ్చింది. అదేమిటంటే ఎగ్జామ్స్ ముందు చదవలేదుగాని సంవత్సరమంతా అప్పుడప్పుడు ఆ సబ్జెక్ట్ టెక్స్ట్ బుక్ తిరగేసే వాణ్ని, కారణం అది మా ఆఫీసు లైబ్రరీలోంచి తీసుకున్నాను. మా లైబ్రేరియన్ సత్యనారాయణగారుకూడా ’రాయుడు గారూ, అది మీ దగ్గరే ఉంచుకుని చదువుకోండి. ఎవరన్నా అడిగితే మీకు చెబుతాను. అప్పుడు తెచ్చిద్దురుగాని’ అని నాకు ఇచ్చేశాడు. అందువల్ల నేను బానే చదివాను. కాకపోతే, ఫార్ములాస్ చూసుకోలేదు కాబట్టి ప్రాబ్లమ్స్ పార్ట్ రాయలేకపోవచ్చు. థీరీవల్ల పాసవుతానన్న నమ్మకం వచ్చింది. మళ్లీ మెట్లెక్కుతూ ఎగ్జాం హాల్లోకి ఎంటర్ అయ్యాను. అప్పటికే హాల్లో ఇన్విజిలేటర్స్ (ఇద్దరుంటారు) ఆన్సర్ షీట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. నేను పేపర్ తీసుకుని రోల్ నెంబర్ ఇతర డిటెయిల్స్ రాద్దామంటే పేపరంతా మసక, చేతులు వణికి పోతున్నాయి. మూడంతస్తులు వేగంగా, ఆందోళనగా ఎక్కి వచ్చాను కదా, అందుకన్నమాట! ఇహ లాభం లేదని, కాసేపు కళ్లు మూసుకుని, మనసును ప్రశాంతం చేసుకుని అప్పుడు ఆ డిటెయిల్స్ రాసి, వాళ్లిచ్చిన క్వశ్చన్ పేపర్ అందుకున్నాను. శ్రద్ధగా ఈజీగానే అనిపించింది. ఒక గంట ఏకాగ్రతతో పరీక్షరాసి తల ఎత్తి చూద్దును కదా, మావాళ్లందరూ అప్పటికే వెళ్లిపోయారు. నేను పరీక్ష సంతృప్తికరంగా రాసి బైటకొచ్చాను.

రిజల్ట్స్ వచ్చాక నాకు తెలిసిందేమిటంటే ఆ ఎగ్జాం కి ప్రిపేరయిన వాళ్లు ఫెయిలయ్యారు, నేను మంచి మార్కులతో పాస్ అయ్యాను. నేను స్కూటర్ ఎక్కి కిక్ కొట్టేముందు ఆ ఫ్లాష్ లాంటి ఆలోచన రాకపోయుంటే, పరీక్ష రాసే అవకాశం కోసం మరో ఆర్నెళ్లు ఎదురుచూడాల్సొచ్చేది. పై నుంచి ఒక సబ్జెక్ట్ మిగిలిపోయిందన్న బాధ, టెన్షన్. నేను మనసా వాచా నమ్మే శ్రీరాముడే నన్ను ఆ గండాల్నుంచి గట్టెక్కించాడు.

మరిన్ని శీర్షికలు
non veg can leads to excess sleep