( కాంచీపురం )
కిందటి సంచికలో మనం విష్ణుకంచిలోని ‘ వరదరాజు ‘ మందిరం గురించి , 108 దివ్యదేశాలగురించిచెప్పుకున్నాం , అందులో 14 దివ్యదేశాలు కాంచన పురంలో వున్నట్లు కూడా చెప్పుకున్నాం . అందులో ఒకటైన ‘ వరదరాజ పెరుమాళ కోవెల గురించి చెప్పుకున్నాం , యీ సంచికలో మిగిలిన 13 దివ్యదేశాల గురించి తెలుసుకుందాం .వాటిలో రెండు దివ్యదేశాలు ఒకటి ఏకాంబరేశ్వర మందిరంలోను , మరొకటి కామాక్షి మందిరం లోనూ వున్నాయి .
మిగిలిన 11 మందిరాలలో కొన్ని వరదరాజ పెరుమాళ్ కోవెల చుట్టుపక్కల వున్నాయి . మిగతావి కంచిలో వివిధ ప్రాంతాలలో వున్నాయి . ఈ మందిరాలు చాలా చిన్నగా పెద్దగా భక్తుల తాకిడి లేని , కాస్త నిర్లక్ష్యానికి గురైనట్లు కనిపిస్తాయి . సాధారణంగా ప్రతీ వాళ్లూ ముఖ్యమైన మందిరాలను దర్శించుకుంటారు , నిజంగా దివ్యదేశాలను చూడదలచుకుంటే ఓ ఆటోని కుదుర్చుకొంటే అన్నీ ఒకరోజులో తిరిగి చూడొచ్చు .
1) అష్ట భుజ ఆదికేశవ మందిరం —-
ఈ కోవెల ఒక యెకరం విస్తీర్ణంలో నిర్మింపబడ్డ దేవాలయం . మూడంతస్థుల రాజగోపురం , మందిరంలో విష్ణుమూర్తి పడమర ముఖంగా వుంటాడు , ఆది శేషుడు పడగనీడన విష్ణుమూర్తి యెనిమిది భుజాలతో దర్శనమిస్తాడు . ఈ మందిరం వరదరాజ కోవెలకు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో వుంటుంది . అష్ఠభుజి కుడివైపుచేతులలో చక్రం , కత్తి , పువ్వు , బాణం వుంటాయి , ఎడమవైపు నున్న చేతులలో పిండివాలము , విల్లు , డాలు , గద వుంటాయి . మందిర విమానగోపురం కాస్త దెబ్బతిన్నట్లు వుంటుంది . పుష్కరిణి కూడా నిరాదరణకు గరైనట్లు కనిపిస్తుంది . ఈ మందిరాన్ని తొండమాను చక్రవర్తి నిర్మించేడు .
ఇక్కడి పుష్కరిణిని ‘ గజెంద్ర పుష్కరిణి ‘ అని అంటారు . ఇక్కడ విష్ణుమూర్తిని ‘ అష్టభుజ ఆదికేశవుడు అని అంటారు . ఇక్కడి స్థలపురాణం ప్రకారం . ఓ రోజు లక్ష్మి , సరస్వతులకు యెవరు గొప్ప అనే విషయం మీద వాదన వచ్చి యిద్దరూ ఇంద్రుడి దగ్గరకు వెళ్తారు , ఇంద్రుడు లక్ష్మి గొప్పదని చెప్తాడు , కోపించిన సరస్వతి ఇంద్రునకు ‘కరి ‘ గా మారమని శాపమిచ్చి బ్రహ్మ దగ్గరకు వచ్చి బ్రహ్మను యెవరు గొప్పో చెప్పవలసినదిగా అడుగుతారు , బ్రహ్మ కూడా లక్ష్మే గొప్పని చెప్పగా కోపించిన సరస్వతి పాతాళలోకానికి వెళ్లిపోతుంది . బ్రహ్మ అశ్వమేధయాగం తలపెట్టి సరస్వతిలేకుండానే మిగతా సతులతో హోమం వద్ద కూర్చుంటాడు . పాతాళలోక వాసులైన రాక్షసులు దేవతలలో బేధం సృస్ఠించాలని సరస్వతికి బ్రహ్మపైన చాడీలు చెప్తారు .
కోపోద్రేకాలతో సరస్వతి బ్రహ్మ యాగ భంగానికి పూనుకొన యెందరో రాక్షసులను పంపుతుంది . యాగ రక్షకుడైన విష్ణుమూర్తి రాక్షస సంహారం చెయ్యగా ఆఖరున సరస్వతి అతి భయంకరమైన సర్పాన్ని పంపుతుంది . కాలమేఘం వలె విషం కక్కుతూ వస్తున్న సర్పాన్ని యెదుర్కొనేందుకు విష్ణుమూర్తి అష్టభుజిగా అవతరించి వివిధ ఆయుధాలతో సర్పాన్ని చెండాడేడు , యీ మందిరంలో యాగశాల ప్రక్కన పెద్దపాము రాతి విగ్రహంవుంటుంది .
గజేంద్రమోక్షం యీ కోవెలలోని పుష్కరిణి దగ్గర జరిగిందని అంటారు . గజేంద్రుడు మొసలిబారినుంచి రక్షించమని మొరపెట్టుకున్నప్పుడు గబగబా వచ్చిన విష్ణుమూర్తి గజేంద్రని రక్షించి , గజేంద్రునకు యీ రూపం లో దర్శనమిచ్చేడట .
ఇక్కడ అమ్మవారు అలమేలుమంగ మంగతాయారు లేక పద్మాశిని గా పూజలందుకుంటోంది . ఇక్కడ విష్ణుమూర్తిని ‘ దివ్యాయుధ అళ్వార్ గళ్ ‘ అని కూడా అంటారు .
2)తిరువెక్క - యతోత్కారి మందిరం
ఈ మందిరాన్ని రాజరాజ చోళుని పుతృడైన రాజేంద్రచోళుడు నిర్మించేడు . వరదరాజమందిరానికి ఒక కిలోమీటరు దూరంలో వుంటుంది . గర్భగుడిలో విష్ణుమూర్తి శేషశయనునిగా దర్శనమిస్తాడు . పడమరముఖంగా దక్షిణం వైపు తలపెట్టుకున ఉత్తరంగా శయనిస్తున్నట్లుగా వుంటుంది . ఈ మందిరంలో లక్ష్మీ దేవి ‘ కోమలవల్లి ‘ గా పూజలందుకుంటోంది .
ఈ మందిరం యొక్క స్థలపురాణం కూడా బ్రహ్మదేవుడి అశ్వమేథయాగం , సరస్వతీదేవి ఆటంకాలు కలుగ చెయ్యడంతో ముడిపడివుంది . సరస్వతీ దేవి వేగవతి నదీ ప్రవాహాన్ని యెక్కువచేసి యాగనికి ఆటంకం కలుగజెయ్యాలని చూడగా విష్ణుమూర్తి తన శేషశయనంతో వేగానికి అడ్డుగా నిలిచి ప్రవాహ వేగాన్ని నిరోధించేడట , అందుకని యిక్కడ స్వామిని ‘ ‘ వేగవని ’ , ‘ వేగసేతు ‘ అనికూడా పిలుస్తారు .
స్వామిని భక్తులు భక్తితో ‘ సొన్న వన్నన్ సైత పెరుమాళ్ ‘ అని కూడా పిలుస్తారు . తెలుగులో చెప్పాలంటే చెప్పినట్లు చేసే భగవంతుడు ‘ అని అర్దం , అయితే యీ పేరు యెలా వచ్చిందో తెలుసుకుందాం .
“ తిరుమిళిసై ఆళ్వారు “ ఈ మందిరంలో తన శిష్యుడైన కణికణ్నన్ తో వుండి ఆలయంలో పూజా కైంకర్యాలు నిర్వహించేవాడు . ఓ దిక్కులేని వృద్ద స్త్రీ ఆళ్వారుకి సేవలు చేస్తూ వుంటుంది . నిశ్వార్ధమైన ఆమె సేవలకు మెచ్చి ఆళ్వారు ఆమెనుసౌందర్యవంతురాలైన కన్నెగా మారుస్తాడు . ఆ ప్రాంతాన్ని పరిపాలించేరాజు ఆమె సౌందర్యానికి మెచ్చి వలచి ఆమెను వివాహమాడి ఆమెను పట్టమహిషిని చేస్తాడు . ఆమె సౌందర్య రహస్యం తెలుసుకున్న రాజు ఆళ్వారు శిష్యడైన కణికణ్నన్ పిలచి ఆళ్వారును తీసుకొని రాజదర్బారుకి వచ్చి తనపైన కవిత్వం చెప్పించ వలసినదిగా కోరుతాడు . ఆళ్వారు స్వామి సన్నిధిని వదలి రాడని , విష్ణుమూర్తి ని తప్ప వేరెవరి పైనా కవిత్వం చెప్పడని చెప్తాడు కణికణ్న న్ . ఆళ్వారు చెప్పకపోతే నీవు చెప్పు కోరినంత ధనమిస్తానని ఆశచూపుతాడు రాజు . ఎన్ని ప్రలోభాలు చూపినా కరగని కణి కణ్ణన్ కి దేశభహిష్కరణ శిక్ష విధిస్తాడు రాజు .
కణి కణ్ణన్ మందిరానికి వచ్చి జరిగిన వృత్తాంతం ఆళ్వారుకు విన్నవించి తాను కాంచీపురాన్ని విడిచిపెట్టేందుకు బయలుదేరుతాడు . ఆళ్వారుకూడా శిష్యున వెంటనే బయలుదేరుతూ గర్భగుడిలోని స్వామిని ‘ నీవు మాత్రం యిక్కడ యెందుకు , లేచిరావయ్యా ‘ అని అనగా స్వామి శేషశయనంమీంచి లేచి వీరివెంట నడవసాగేడట , కాంచీపురవాసులు ఆళ్వారు వెనుకన కాంచీపురం నుంచి వెళిపోతున్న స్వామిని చూసి రాజుగారికి చెప్పగా రాజుగారు వచ్చి యీ వింతను కళ్లారా చూసి ఆళ్వారు కాళ్లపై పడి తన మూర్ఖత్వానికి క్షమార్పణలు చెప్పి కాంచీపురంలోకి రావలసినదిగా వేడుకుంటాడు . రాజుని మన్నించిన ఆళ్వారు మందిరానికి వచ్చి గర్భగుడిలోని శేషశయనం చూపించి ‘ స్వామీ నడచి అలసిపోయేవు , విశ్రమించవయ్యా ‘ అన్నాడట . స్వామి అందరూ చూస్తూవుండగా గర్భగుడిలోనికి వెళ్లిపోయేడట . అందుకే యీ స్వామిని ‘ సొన్న వన్న సైత పెరుమాళ్ ‘ అని పిలుస్తారు .
3)తిరు ఉరగం ——— ఉరగనాథ మందిరం
ఈ మందిరం కామాక్షి మందిరానికి దగ్గరగా వుంటుంది . ఈ మందిరాన్ని వామనావతార మందిరం అని ఉరగనాథ మందిరం అని అంటారు . ఇక్కడ విష్ణుమూర్తి శేషుని అవతారంలో పూజలందుకుంటున్నాడు .
ఈ మధ్యన కొన్ని మరమ్మత్తులు జరిగిన , జరుగుతున్న మందిరం , రాజగోపురంపైన యేడు కలశాలువుంటాయి , యీ మందిరాన్ని 6 వ శతాబ్దం నుంచి 9 వ శతాబ్దం వరకు కాంచీపురాన్ని పరిపాలించిన పల్లవ రాజులు నిర్మించేరు . ఈ మందిరం యొక్క పుష్కరిణి కోవెల బయట వుంటుంది . దీనిని నాగతీర్థం లేక శేషతీర్థం అని అంటారు . ఈ కోవెల విమానగోపురాన్ని ‘ సార శ్రీకర విమానం ‘ అంటారు . పడమర ముఖంగా విశ్వరూపంలో విష్ణమూర్తి , కాళ్ల దగ్గర బలిచక్రవర్తి వున్న విగ్రహం వుంటుంది .
మేం కంచి వెళ్లి కామాక్షి దేవిని దర్శించుకొని అదే వీధిలో వున్న రూముకి వస్తూ వుండగా ఓ వైష్ణవ భక్తుడు తమిళంలో చెప్పిన పేజీలపేజీల కధ లో నాకు బోధపడ్డది మీకు చెప్తాను , అయితే మాకు దర్శనం మూసేసిన తలుపులోంచి జరిగింది . ఎలా అంటే ఆరోజు అతను మావెంటపడి చెప్పిన సమాచారం మా వారికి చెప్పగా రేపుప్రొద్దుట ఆ మందిరానికి వెళ్దామని అనుకున్నాం . మర్నాడు మందిరానికి వెళితే తలుపులు మూసి వున్నాయి , విషయం అడిగితే ఆ వీధిలో యెవరో చనిపోయినట్లు శవదహనానికి వెళ్లేక ఆలయాన్ని కడిగి శుద్ది చేసేక సాయంత్రపు పూజకు తెరుస్తారని చెప్పేరు , అవేళే మా ప్రయాణం అవడం వల్ల మేము మూసిన తలుపుల సందులోంచి విశ్వరూపాన్ని , కాళ్ల దగ్గరవున్న బలి చక్రవర్తి విగ్రహాన్ని చూసేం .
ఇక్కడ స్థలపురాణం గురించి తెలుసుకుందాం .
విష్ణుమూర్తికి పరమభక్తుడైన పహ్లాదుని మనుమడైన బలిచక్రవర్తి యాగాలు యెన్నోచేసి ఇంద్రపదవిని సొంతం చేసుకోవాలనే తలంపులో వుండగా యాగ పరిసమాప్తికి ముందు బలి చక్రవర్తి బ్రాహ్మణులకు దానాలు యిస్తూ వుండగా విష్ణుమూర్తి వామనావతారంలో వచ్చి మూడడుగుల భూమి దానంగా కావాలని అడుగుతాడు . గురవైన శుక్రుడు వారిస్తున్నావినక బలి చక్రవర్తి దానం యిస్తాడు . మొదటి అడుగుతో ఆకాశాన్ని రెండవ అడుగుతో పాతాళాన్ని ఆక్రమించిన వామనుడు మూడో అడుగు యెక్కడ వెయ్యాలని అడుగగా బలిచక్రవర్త తన శిరస్సున చూపుతాడు మూడవపాదంతో వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి అదిమెస్తాడు . ప్రహ్లాదుని కోరికమేరకు విష్ణుమూర్తి తన విశ్వరూపాన్ని చూపుతాడు . పాతాళానికి అదిమివెయ్యబడ్డ బలి విశ్వరూపం చూడలేకపోవడంతో తనకు విష్ణుమూర్తి దర్శనం కలుగజెయ్యవలసినదిగా ప్రార్ధిస్తాడు . విష్ణుమూర్తి పాతాళవాసులకు శేషుని అవతారంలో దర్శనం యిస్తాడు . ముఖ్య మందిరానికి పక్కగా వుంటుంది శేషుని మందిరం .
ఇక్కడ శేషుడికి పూజలు చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందట . అలాగే యిక్కడ అభిషేకాదులు చేసుకుంటే సర్పదోషనివారణ , రాహుకేతు గ్రహ దోషాలు పోతాయని అంటారు .
ఉరగనాథ మందిరం లో అమ్మవారిన ‘ అముదవల్లి ‘ అని అంటారు .
ఈ కోవెల ప్రాకారంలోని మరో మూడు దివ్యదేశ క్షేత్రాలు వున్నాయి .
4)తిరు నీరగం———
ఉరగనాథ మందిరంలోని వున్న మరో దివ్యదేశం ‘ తిరునీరగం .
విష్ణ మూర్తి భక్తి భావాన్ని నీరు యెలాగైతే నిరాకారమయినదో , పల్లం వైపు ప్రవహించి గోతిలోకి యెలా చేరుతుందో తానుకూడా నీటివలె భక్తులహృదయలలోకి ప్రవహించి కలసిపోతానని తెలియచెప్పిన ప్రదేశం . ఈ మందిరంలో స్వామిని తిరునీరగనాథుడని , జగధీశ్వరార్ అని అంటారు . అమ్మవారిన ‘ నీలమంగతాయారు ‘ అని అంటారు . ఇక్కడి పుష్కరిణిని ‘ అక్రూరతీర్థం ‘ అని అంటారు .
5)తిరుకారకం -——
ఈ కోవెలని ‘ తిరుకరుణాకర పెరుమాళ్ కోవెల ‘ అని అంటారు . ‘ కర ‘ అంటే మేఘం . మబ్బులు యెలాయైతే భూమినుంచి యేమీ ప్రతిఫలం ఆశించకుండా వర్షాలను యిస్తాయో అదే విధంగా తాను భక్తులనుంచి ప్రతిఫలం ఆశించకుండా కాపాడుతానని విష్ణుమూర్తిఆదిలక్ష్మి కి తెలియజేసేడు . అప్పడప్పుడ మేఘాలు వర్షించకుండా భూమిని పరీక్షిస్తూవుంటాయి , అలాగే పరమాత్మకూడా ఒకొక్కప్పుడు భక్తుల సహనాన్ని పరీక్ష చేస్తాడు , కాని చివరకు భక్తులను రక్షిస్తాడు . పరమాత్ముని కరుణను తెలియజేసే ప్రదేశం కాబట్టి యిక్కడ స్వామిని కరుణాకర పెరుమాళ్ అని పిలుస్తారు . తనని యెవరైతే భక్తితో కొలుస్తారో , యెవరైతే యితరులపట్ల కరుణచూపుతారో వారియందు తాను నివాసముంటానని ఆదిలక్ష్మికి శలవిచ్చేడు విష్ణుమూర్తి .
విష్ణుమూర్తి యిద్దరు దేవేరులతో ప్రసన్నరూపంలో వుంటాడు . అమ్మవార్లను ‘ పద్మమణి నాచియార్ , రమామణి నాచియార్ అని అంటారు . కఛ్చప మునికి యీ ప్రదేశంలో , యీ రూపంలో దర్శనమిచ్చేడట విష్ణుమూర్తి .
6)తిరుక్కారవన్ మందిరం ——-
పడమర ముఖంగా నిలుచొన వున్నట్లుగా వున్న విగ్రహం . గౌరీదేవి కోసం ప్రత్యక్షమైనట్లు స్థలపురాణం .
అమ్మవారిన ‘ కోమలవల్లి ‘ అని అంటారు . పుష్కరిణిని ‘ గౌరీతటాకం ‘ అని అంటారు . గోపురాన్ని ‘ పుష్పక విమానం ‘ అంటారు .
ఈ మందిరాలు ఒకేసారి కట్టబడ్డాయా ? లేక విడివిడిగా వుండేవా ? అనేది నిర్ధారించడానికి యెటువంటి ఆధారాలూ లేవు . ప్రస్తుతం మాత్రం యివన్నీ ఒకే ప్రాకారం లో వున్నాయి .
మిగతా దివ్యదేశాలగురించి వచ్చే సంచికలో చదువుదాం , అంతవరకు శలవు .
|