కొంచెం మానవత్వం
రోడ్డు పక్కన కూరలమ్మి దగ్గరకెళతాం. ఆకు కూర ఎంతని అడుగుతాం. పదిరూపాయలకు ఓ ఐదు కట్టలని చెబుతుంది. మనం వెంటనే ఆరో..ఏడో ఇవ్వమని అడుగుతాం. ఆమె ‘రాదు బాబయ్యా’ అంటుంది. ఎందుకురాదు? అని దబాయించి మరీ అడిగి తీసుకుంటాం.
అదే మనం ఏ మాల్ కో వెళ్లి సరుకులో, కూరలో తీసుకున్నామనుకోండి. మారు మాట్లాడకుండా వాళ్లు బిల్లు రూపంలో ఎంత వడ్డిస్తే అంత వేయించుకుని బయటకు వస్తాం. బేరాలూ సారాలు అక్కడ నై జాంతాహై అని మనకు తెలుసు.
ఆ కూరలమ్మి ఎంత సంపాదించుకుంటుంది? ఒకవేళ సంపాదించినా, కార్పోరేట్ మాల్స్ యజమానులంత కాదుగా! ఒక రూపాయి ఆమెకి ఇవ్వగలిగే పొజిషన్లో మనం లేమా? మనం తీసుకునే దాంట్లో ఒక కట్ట తగ్గితే కూర తక్కువవుతుందా? ఒకవేళ తగ్గుతుందనిపిస్తే మరో పదో, ఐదో పెట్టి తీసుకుంటే సరిపోతుందిగా.
దానాలు, ధర్మాలు, పాప పుణ్యాల గురించి మాట్లాడే మనం అలాంటి చోట్ల ఎంత ఇరుకు మనసు ప్రదర్శిస్తామో.
జీవితం శాశ్వతం కాదు. ఏ క్షణమన్నా పుటుక్కుమనవచ్చు. కనీసం కొన్ని చోట్ల మనం విశాల మనస్తత్వాన్ని ప్రదర్శించినా ఎంత అలౌకికమైన ఆనందానుభూతి కలుగుతుందో చెప్పలేను. అది అనుభవైకవేద్యం.
దీనికి వెనుక ఒక నేపథ్యం ఉంది.
ఒకసారి వినాయక చవితికి మట్టి వినాయకుడి ప్రతిమ తీసుకోడానికి వెళ్లాను. ఆమె ఇరవై చెప్పింది. నేను ‘పది’ అన్నాను. ఆమె ‘పడదు సార్’ అంది. నేను ‘అయితే అక్కర్లేదులే’ అని కోపంగా ముందుకు కదిలాను. కాని ఎక్కడా మట్టితో అచ్చేస్తున్న వాళ్లు కనిపించలేదు. మళ్లీ చచ్చినట్టు అక్కడికే వెళ్లి ఇగో ఫీలింగ్ తో పోనీ ‘పదిహేను’ అన్నాను. ’అట్టె సార్’ అని ఒప్పుకుని కొద్ది దూరంలో స్త్రీట్ లైట్ షాడోలో వినాయకుణ్నీ అచ్చేస్తున్న అమ్మాయితో ’సార్ కి ఒక బొమ్మచ్చేసియ్యి’ అంది.
నేను బొమ్మ కోసం ఆ పిల్ల దగ్గరకు వెళ్లి నుంచున్నాను. పదిహేనేళ్లుంటాయి. కట్టుకోడానికి సరైన బట్టలు లేవు. అక్కడక్కడా చిరుగులు. ఆ అమ్మాయి స్తంబం మాటున ఉన్న నీడలో ఉన్నప్పటికీ, సిగ్గుతో శరీరాన్ని కప్పుకోడానికి పడుతున్న తిప్పలు. నాకెంతో జాలి కలిగింది. బొమ్మను చేతిలోకి తీసుకున్నాక వాళ్లమ్మ దగ్గరకు వెళ్లి ఇరవై నోటిచ్చాను. ఆవిడ చిల్లర కోసం చూస్తుంటే ‘వద్దులే అమ్మా’అన్నాను. పదికి బేరమాడిన నేను పదిహేనుకు ఒప్పుకుని ఇరవై ఇస్తుంటే ఆశ్చర్యమే కదా! మరుసటిరోజు మా ఇంట్లోని కొన్ని దుస్తులు తీసుకెళ్లి ఇచ్చాను. నా మనసుకు ఎంత సంతోషాన్నిచ్చిందో!
అలాగే ఒకసారి సాయంత్రం కారులో వస్తూ రెడ్ సిగ్నల్ దగ్గర ఆపితే, ఒక పిల్లాడు ఈవెనింగ్ ఎడిషన్ పేపర్ తీసుకోమని నన్ను రిక్వెష్ట్ చేశాడు. నేను ‘నువ్వు చదువుకుంటున్నావా? లేక ఇలాగే రకరకాల పనులు చేస్తుంటావా?" అడిగాను.
"పొద్దున్నపూట చదువుతాను సార్, సాయంత్రం పూట ఇలా సంపాదించి ఇంటికి తీసుకెళతా సార్’ అన్నాడు.
అంత చిన్నవయసులోనే ఇంటికి సహాయపడాలన్న తాపత్రయానికి ముచ్చటపడి, నాలుగు పేపర్లు కొని ’చక్కగా చదువుకో’ అన్నాను.
సరిగ్గా గ్రీన్ లైట్ పడి నేను కారును ఉరికిద్దామనుకునే లోపల నాకారు దగ్గరకి ఐదారుమంది పిల్లలు బిల బిల వచ్చి ’సార్, మేమూ చదువుకుంటున్నాం. మా దగ్గరా పేపర్లు కొనండి సార్’ అన్నారు.
అందరికీ న్యాయం చేయలేం కదా ’ ఒరే, అన్ని పేపర్లు నేనేం చేసుకోవాల్రా? ఇందా పంచుకోండి’ అని నవ్వుతూ ఇరవై నోటిచ్చి కారుతో ముందుకు కదిలాను.
***
|