Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

ప్రఖ్యాత రంగస్థల, సినీ నటుడు -- శ్రీ బళ్ళారి రాఘవ - టీవీయస్. శాస్త్రి

ballari raghava biography

తొలితరం తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలలో శ్రీ బళ్ళారి రాఘవ ఒకరు. వీరు అలనాటి ప్రఖ్యాత రంగస్థల, సినీ నటులే కాకుండా, చాలామందికి స్ఫూర్తినిచ్చిన మహనీయుడు. నిజమైన నటుడికి భాషా బేధాలుండవు. అది ఏ భాషైనా కావచ్చు, నటించే పాత్ర ఏదైనా కావచ్చు, కేవలం తమ హావభావాలతోనే ప్రేక్షకుల మన్ననలను పొందిన నటులు ఆతి తక్కువ. అలా ప్రేక్షకుల మెప్పు పొంది నేటికీ ప్రజల మనసులో నిలిచిపోయిన మహానటుడు శ్రీ బళ్ళారి రాఘవ. అలాంటి మహానటుడు శ్రీ బళ్ళారి రాఘవ గారిని గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం!

శ్రీ రాఘవ 1880 ఆగస్టు 2న అనంతపురం జిల్లా, తాడిపత్రిలో శేషమ్మ, నరసింహాచార్యులు అనే పుణ్య దంపతకులకు జన్మించారు. వీరి ఇంటి పేరు తాడిపత్రి, కానీ బళ్లారిలో స్థిరనివాసం ఏర్పరచుకోవటం వలన బళ్ళారి రాఘవగా ప్రసిద్ధులయ్యారు. వీరిది శ్రీ వైష్ణవ కుటుంబం. కర్నూల్ కు చెందిన శ్రీ లక్ష్మణాచారి గారి కుమార్తె అయిన కృష్ణమ్మ గారితో వీరికి వివాహం జరిగింది. రాఘవకు తల్లిదండ్రులు పెట్టిన పేరు బసప్ప. వైష్ణవ మతాచారం ప్రకారం పేరు చివర ఆచార్యులుంటుంది. కానీ ఆయనను అందరూ ప్రేమగా రాఘవ అని పిలిచేవారు. అలా ఆయన కాలక్రమేణా బళ్ళారి రాఘవాచార్యులుగా ప్రఖ్యాతి గాంచారు. తండ్రి తెలుగు పండితులు, అష్టావధాని కూడా. తల్లి ఆంధ్ర నాటక పితామహుడైన ధర్మవరం రామకృష్ణమాచార్యులు గారి చెల్లెలు. అలా వంశంలో ఉన్న సాహిత్య, నటనా ప్రతిభా పాటవాలు శ్రీ రాఘవగారికి బాల్యం నుండే ఒంట బట్టాయి.

బళ్ళారి లోనే, Matriculation, ను పూర్తిచేసారు. తదనంతరం, మద్రాసులోని క్రిష్టియన్ కళాశాల నుండి పట్టభద్రులయ్యారు. తర్వాత న్యాయశాస్త్రాన్ని కూడా అభ్యసించారు. మద్రాసులోనే న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. అచిరకాలంలోనే పేరు ప్రఖ్యాతులతో పాటు, విశేష ధనాన్ని కూడా ఆర్జించారు. క్రిమినల్ లాయర్ గా విశేషమైన పేరు సంపాదించుకున్నారు. Cross Examination చేయటంలో వీరి ప్రజ్ఞను గురించి విశేషంగా చెప్పుకునేవారు. ఆ రోజుల్లో ఉన్న ఆంగ్ల ప్రభుత్వం, వీరి ప్రజ్ఞా పాటవాలను గుర్తించి Public Prosecutor గా నియమించటమే కాకుండా 'రావు బహదూర్' అనే బిరుదుతో సత్కరించారు.

చిన్నతనం నుండి వీరికి నటన పట్ల అభిరుచి ఎక్కువ. తన పన్నెండవ ఏటనుండే నటనను ప్రారంభించారు. ఆ చిన్నతనంలోనే, బళ్లారిలో వీరు Shakespeare Club అనే సంస్థను స్థాపించి, పెక్కు ఆంగ్ల నాటక ప్రదర్శనలను జనరంజకంగా ప్రదర్శించారు. ఆ రోజుల్లో శ్రీ కోలాచలం శ్రీనివాసరావు గారికి బళ్లారిలో 'సుమనోరమ'అనే నాటక సంస్థ ఉండేది. మొదట్లో, శ్రీ రాఘవ గారు వీరి సంస్థలోనే నాటక ప్రదర్శనలు ఇచ్చేవారు. ఆ సంస్థ తరపున రాఘవ నటించిన మొదటి నాటకం "సునందినీ పరిణయం" దానిలో రాఘవది 70 ఏళ్ల వృద్ధుని పాత్ర. అప్పటికి రాఘవ వయస్సు 27 ఏళ్లు మాత్రమే. ఆ ముదుసలి పాత్రలో చక్కగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు హరిశ్చంద్ర, బృహన్నల, పాదుకా పట్టాభిషేకం, సావిత్రి, రామరాజు చరిత్ర, రామదాసు, తప్పెవరిదీ?, సరిపడని సంగతులు మొదలైన వీరి నాటకాలను ప్రజలు విరగబడి చూసేవారు. ప్రతినాయక పాత్రలైన హిరణ్యకశిప, దుర్యోధన, మాయలఫకీర్ మున్నగు పాత్రలను అత్యత్భుతంగా పోషించేవారు. నవరసాలనూ ఒకేసారి ముఖంలో చూపించగల దిట్ట. ప్రహ్లాద నాటకంలో ఆచార్యుల వారి హిరణ్యకశిప పాత్ర నిర్వహణ అమోఘం అంటారు. ప్రహ్లాదుడి చేత విషం తాగించే సన్నివేశంలో ఓ కంట కోపాన్నీ, మరో కంట ప్రేమనీ ఆయన అద్భుతంగా చూపించేవారట ! అలాగే దర్శకుడు పి. పుల్లయ్య గారికి ఆయనంటే అపారమైన గౌరవం . పుల్లయ్య గారు చదువుకుంటున్న రోజుల్లో మద్రాసులో ఓ లండన్ థియేటర్ వారితో కలసి రాఘవ గారు షేక్స్పియర్ డ్రామాలో నటించారట. అప్పటికి స్టూడెంట్ అయిన పుల్లయ్యగారు ఆ నాటకాన్ని చూసారట. సగం నాటకం పూర్తికాగానే గ్రీన్ రూంలోకి వెళ్లి, తనను తాను పరిచయం చేసుకొని,'అయ్యా ఈ నాటకం నిండా బ్రిటిష్ నటుల హవాయే కనిపిస్తోంది , మీ పాత్ర తేలిపోతోందేమిటి?' అని రాఘవ గారిని అడిగారట. అప్పుడు రాఘవ గారు ' ఆఖరి సీన్ చూసి అప్పుడు రా!' అన్నారట. చివరి సీన్ పూర్తయింది. తెరపడింది. పుల్లయ్య గారు నేరుగా పోయి రాఘవాచార్యుల వారి పాదాలకు నమస్కరించారట! 

ఇక ఆయన వాచకం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరు, శ్రీ లంక, ఇంగ్లాండ్, ఫ్రాన్సు, జర్మనీ, స్విట్జర్ లాండ్ లాంటి పలు విదేశాలను దర్శించి ఆయా దేశాల్లో భారతీయ రంగస్థల వైభవాన్ని గురించి పెక్కు ప్రసంగాలను చేసారు. అమెరికా, రష్యా లాంటి దేశాలు కూడా వీరిని ఆహ్వానించాయి, కానీ కొన్ని అవాంతరాలవల్ల ఆ దేశాలను సందర్శించ లేకపోయారు. 1928లో రాఘవ గారి ఇంగ్లాండ్ పర్యటనలో ఆయనకు జార్జిబెర్నార్డ్ షాతో పరిచయమైంది. రాఘవ ప్రతిభను కొనియాడుతూ బెర్నార్డ్ షా అన్న మాటలు, "మీరు భారత దేశంలో పుట్టారు, ఇంగ్లాడ్లో పుట్టివుంటే షేక్స్ పియర్ అంత గొప్ప కీర్తిని పొందేవారు" అన్న మాటలు తలచుకుంటేనే తన్మయత్వం కలుగుతుంది.

1919లో బెంగుళూరులో రాఘవ నటించిన 'పఠాన్ రుస్తుం' నాటకాన్ని రవీంధ్రనాధ్ ఠాగూర్ చూసి తన్మయత్వం చెందారట! అంతే కాకుండా, శ్రీ రాఘవ నటనా ప్రతిభను కొనియాడారు. 1927లో జాతిపత మహాత్మా గాంధీ రాఘవ నటించిన నాటకాన్ని చూసి, ఆనందాన్ని పట్టలేక 'రాఘవ మహరాజ్ కి జై' అని పొగిరారట! గాంధీ, ఠాగూర్ లాంటి మహనీయుల మన్ననలను పొందటమే కాకుండా, వారికి ఈయన అభిమాన నటుడు కూడా! బళ్ళారి రాఘవ నటుడిగా తెలుగులో ఎంత ఖ్యాతి గడించారో, కన్నడంలో కూడా అంత ప్రఖ్యాతిని గడించారు. రాఘవ నటించిన ఇంగ్లీషు నాటకాలను చూసినవారు ఆయన తెలుగు నటుడంటే ఎవరూ నమ్మలేరు. భాషలపై, భావ ప్రకటనలపై, హావభావాలలో ఆయనకున్న పట్టు అటువంటిది. ఆ రోజుల్లో స్త్రీలు రంగస్థల ప్రదర్శనలు ఇవ్వటానికి జంకేవారు. కారణాలు అనేకం ఉన్నాయి. వీరు స్త్రీలను రంగస్థలంపైన అభినయించటానికి ప్రోత్సహించారు. శ్రీమతి కొప్పరపు సరోజినీ, శ్రీమతి కొమ్మూరి పద్మావతి, శ్రీమతి కాకినాడ అన్నపూర్ణ లాంటి పలువురు స్త్రీ ప్రముఖులను రంగస్థలానికి పరిచయం చేసారు.

అలా ఆయన ద్వారా పరిచయమయిన స్త్రీ నటీమణులలో, ఆంద్ర పితామహుడు శ్రీ మాడపాటి హనుమంతరావు గారి మనవరాలైన శ్రీమతి మాడపాటి సరోజినీ గారు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని, ఆమె మనవరాలు, చెన్నైలో స్థిరపడిన ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి సరోజినీ ప్రేమ్ చంద్ గారు నాకు స్వయంగా తెలియచేసారు. అలాగే, వీరు పరిచయం చేసిన కే. యస్. వాసుదేవరావు, బసవరాజు అప్పారావు, బందా కనకలింగేశ్వరరావు గార్లు తర్వాతి రోజుల్లో ప్రఖ్యాత నటులుగా పేరు తెచ్చుకున్నారు. సినీరంగంలో కూడా ప్రవేశించారు. కానీ, నాటకాలకే ఎక్కువ కాలం వినియోగించేవారు. 1936 లో శ్రీ హెచ్. యమ్. రెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన 'ద్రౌపదీ మాన సంరక్షణం' అనే సినిమాలో దుర్యోధన పాత్రను పోషించారు. ఆ పాత్రను అద్భుతంగా పోషించి ప్రజాబాహుళ్యంలో మరింత ఖ్యాతిని గడించుకున్నారు. కొన్ని సాంఘీక చిత్రాలలో కూడా నటించారు. వాటిలో ముఖ్యమైనవి, రైతుబిడ్డ, చండిక మొదలైనవి. సినీరంగం పైన వారి మక్కువ తగ్గింది. వెంటనే దానిని వదలివేసారు.

తరువాతికాలంలో మాస్టర్ తారానాథ్ అనే ఆధ్యాత్మిక గురువు ప్రభావం చేత, తుంగభద్రా నదీ తీరంలో తారానాథ్ గారు నిర్మించిన ఒక ఆశ్రమానికి భూరిగా విరాళం ఇచ్చారు. వారి శిష్యరికంలో, ఆధ్యాత్మిక జీవనం సాగించారు. సహాయం అర్ధించిన ప్రతివారికీ విరివిగా ధన సహాయం చేసేవారు. అత్యంత ధనవంతుడైనప్పటికీ, నిరాడంబర జీవితాన్ని గడిపారు. ఆనాటి ప్రముఖ రచయితలందరికీ వీరే అభిమాన నటుడు. మహాకవి శ్రీశ్రీ గారికి వీరంటే చాలా ఇష్టం. శ్రీ రాఘవ గారు, ఆఖరి రోజుల్లో అనారోగ్యం చేత చిక్కి శల్యమైపోయారు. వారిని పరామర్శించటానికి ప్రత్యేకంగా శ్రీశ్రీ గారు బళ్ళారి వెళ్ళారు. భోజనానంతరం, కబుర్లు చెప్పుకునే సమయంలో, శ్రీ రాఘవ గారు శ్రీశ్రీని, "ఇంత దూరం వచ్చారు కదా! హంపీ శిధిలాలు కూడా చూసిపోవచ్చు కదా!"అని అన్నారట. అందుకు శ్రీశ్రీ గారు. "మిమల్ని చూశాం కదా! ఇంక వాటిని ప్రత్యేకంగా చూడనవసరంలేదు" అని అన్నదానికి శ్రీ రాఘవ గారు కడుపుబ్బ నవ్వుకున్నారట!

నాటకం అనే దానికి వినోదమే ప్రధాన లక్ష్యం కాదు! సంఘ దురాచారాలు, సంఘ సంస్కరణలను ప్రజలకు తెలియచేయటానికి, సామాజిక చైతన్యానికి ఉపయోగపడే ఒక గొప్ప ప్రక్రియగా నాటకాలను ప్రదర్శించాలని వీరు పెక్కుసార్లు చెప్పారు. అలా చెప్పటమే కాకుండా చేసి చూపించారు కూడా. రాఘవ సేవలకు గుర్తింపుగా ఆంధ్ర కళాప్రపూర్ణ బిరుదుతో ప్రజలు, సంస్థలు ఆయనను సత్కరించాయి. తన ఆఖరి శ్వాసవరకూ నటించి, అనారోగ్యం చేత, వీరు 16-04 -1946 న కళామతల్లి ఒడిలో శాశ్వత విశ్రాంతి తీసుకున్నారు. శ్రీ బళ్ళారి రాఘవ గారి పేర ఒక పురస్కారాన్ని ప్రభుత్వం కొంతకాలం అమలు పరిచింది. తర్వాత ఎందుకో నిలిపివేసింది. ఈ మహనీయుని జీవిత చరిత్ర మాకు చిన్నతనంలో ఒక పాఠ్యాంశంగా ఉండేది. ఒక మహాకళాకారుని జీవిత చరిత్రను మళ్ళీ మీకు పరిచేయం చేయటం నా అదృష్టం.


ఆ మహనీయునికి నా ఘనమైన నివాళి!!!

మరిన్ని శీర్షికలు
Detain Short Film