Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Detain Short Film

ఈ సంచికలో >> శీర్షికలు >>

శ్రీ స్వామి వివేకానంద - సుధారాణి మన్నె

Sri Swamy Vivekananda biography

పర్యటనానంతరం మఠానికి తిరిగివచ్చిన వివేకానందుడు మిస్ మార్గనెట్ నోబుల్ కు బ్రహ్మ చర్య దీక్షను ప్రసాదించి ఆమెకు "నివేదిత" అని పేరు పెట్టాడు. ఇంకా చాలా మందితో సన్యాసాశ్రమాన్ని స్వీకరింపచేశాడు.

మళ్లీ ఆయన ఆరోగ్యం దెబ్బతినడంతో విశ్రాంతికై డార్జిలింగ్ వెళ్లాడు. కానీ పూర్తిగా కోలుకొనకముందే కలకత్తాలో ప్లేగు వ్యాధి వ్యాపించి ప్రజల్ని నాశనం చేస్తున్నదని తెలుసుకుని ప్రజాసేవకై కలకత్తా తిరిగివచ్చాడు. సహాయం కోసం విజ్ఞప్తి చేయగా దేశం నలుమూలల నుండీ కావలసిన ఆర్ధిక సహాయం లబించింది. వేలకొద్దీ స్వయం సేవకులు కూడా సిద్ధమయ్యారు. ఆ సహాయంతో ఆయన కలకత్తా ప్రజలకు అద్వితీయమైన సేవ చేశాడు. ఆ మహనీయుని మహాత్తర త్యాగ శక్తి ప్రజానీకానికి ఆశ్చర్యాన్ని కలిగించింది.

మఠ ప్రతిష్టాపన

1898 వ సంవత్సరం డిసెంబరు 9 వ తేదీన స్వామీజీ శాస్త్రోక్తంగాచేలూరులో శ్రీ రామకృష్ణ మఠానికి ప్రతిష్టాపన జరిపాడు. మఠ ప్రదేశంలో ఒక దివ్యాసనం పై పరమహంస చిత్ర సమన్విత పాత్ర నుంచి స్వామి, ఇతర భక్తులు సాష్టాంగ వందనం సమర్పించారు. తర్వాత పూజా కార్యక్రమాన్ని జరిపించి స్వయంగా వివేకానందుడు తాను వండిన పాయసాన్ని రామకృష్ణునికి కర్పించాడు. అప్పుడాయన ఇలా అన్నాడు.

"అవతార పురుషుడైన రామకృష్ణ గురుదేవుడు శాశ్వతంగా ఇక్కడ వెలసి బహుజన హితార్ధంతో ఈస్థలాన్ని సర్వమత సామరస్య నిలయం చేయుగాక! అని మీరంతా ప్రార్ధించండి. భగవత్సంకల్పంవల్ల ఈరోజున ఆయన ధర్మక్షేత్రం ప్రతిష్టాపితమైనది. 12 సంవత్సరాల నుంచి నేను తలదాల్చిన భారం నుంచి నేడు విముక్తుడనయ్యాను. ఈ మఠం సకల విద్యలకు, సాధనలకు నిలయమవుతుంది." ఇక్కడ బయలుదేరే ఆధ్యాత్మిక శక్తి ప్రపంచమంతటా వ్యాపించి ప్రజలకు నూతనాశయాలనూ, కొత్త దృక్పధాన్ని కలిగిస్తుంది. భక్తి, జ్ఞాన, కర్మ యోగాలను సమన్వయించే మహాధర్మాలు ఇక్కడ నుంచి వెలువడి విశ్వమంతా వ్యాపిస్తాయి. చైతన్య రహితులైన ప్రజలు ఇక్కడున్న సన్యాసుల సంకల్పం చేతనే చైతన్య వంతులు కాగలరు. ప్రాచీన గురుకుల విధానాన్ని అనుసరించి యిక్కడ ఒక విద్యాలయం నెలకొల్పుదాం. అందులో కళలు - వేదాంతం, వ్యాకరణం, సాహిత్యం, ఆంగ్లం భోధించబడతాయి. బ్రహ్మచారులిక్కడ విద్యార్ధులుగా వుంటారు. వారికి భోజనాది సౌకర్యాలు ఏర్పాటు చేయబడగలవు. 5 సంవత్సరాల తర్వాత ఈ బ్రహ్మచారులు తమ ఇళ్ళకు వెళ్ళి గృహస్థ జీవితాన్ని ప్రారంభించడానికి గానీ, యిక్కడ పెద్దల అనుమతితో సన్యాసాన్ని స్వీకరించడానికి కానీ స్వతంత్రులై వుంటారు. అవిధేయులుగానూ, దుష్టవర్తనులు గానూ వున్న విద్యార్ధులను మఠాధికారులు వెళ్ళగొడతారు. విధ్యావిషయాలలో జాతిబేధాలు పాటించబడవు.

శ్రీ రామకృష్ణ పరమహంస పేరున ఇక్కడ ఒక అన్నదాన సత్రమును నెలకొల్పి బిచ్చమెత్తి అయినా దరిద్రులకు సంతృప్తి కరంగా భోజనం పెట్టాలి. మొదటి కర్తవ్యం అన్నదానం, తర్వాత కర్తవ్యం విద్యాదానం. ఆపైన జ్ఞానదానం. అన్న సత్రములందు, ఆశ్రమములందు రోగులుగానీ, పేదవారు కాని వుండడానికి అనువైన గదులు కావాలి. వైధ్యుల్ని ఏర్పాటు చేయాలి. ఎవరెప్పుడు ఆకలితో వచ్చినా లేదనే మాట రాకూడదు."

"స్వీయమోక్ష ప్రాప్తిచే ప్రయోజనమేమిటి? విశేషంగా తీయని ఆహారాన్ని అనుభవించే వాడెవడు? అంతా తానే తినేవాడా? లేక యితరులతో కలిసి భోజనం చేసేవాడా? యావత్ప్రపంచాన్నీ మనతో ముందుకు తీసుకుపోవాలి?"

ఈ ప్రబోధం ఆశ్రమవాసులందర్నీ ఉత్తేజపరచి కార్యదీక్షా పరులను చేసింది.

మరిన్ని శీర్షికలు
weekly horoscope October 18 - October 24