Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sarasadarahasam

ఈ సంచికలో >> శీర్షికలు >>

లంఖణం పరమౌషధం - భమిడిపాటిఫణిబాబు

fasting is better medicine for good health

మా చిన్నప్పుడే హాయిగా  ఉండేది…పుష్టుగా భోజనం చేయడం, ఎవరిపనులు వాళ్ళు చేసుకోవడం, మహా అయితే ఒంట్లో ఏదైనా సుస్థీచేస్తే,  “ లంఖణం పరమౌషధం “ అని నచ్చచెప్పేసి, ఓ పూటో, పరిస్థితినిబట్టి ఓ రెండు పూటలో తిండి పెట్టడం మానేసి, మూడో రోజుకి పథ్యం పెట్టేసేవారు. ఈ మూడు రోజులూ స్కూలుకి వెళ్ళక్కర్లేదు,  అడిగినప్పుడల్లా, ఏ బార్లీ గింజల నీళ్ళో, జావో ఇచ్చేవారు. ఇంక పథ్యమంటారా,  బీరకాయ కూరా, తాజా కరి వేపాకుతో చేసిన కారప్పొడీ, మిరియాలు దట్టంగా పట్టించేసిన చారూ.. శుభ్రంగా వెన్నకాచిన నెయ్యితో పెట్టేవారు.. ఎప్పుడూ జ్వరం వస్తే బావుండునూ అనిపించేది.

పైగా ఇరుగు పొరుగుల్లో ఉండే పిన్నిలూ, అత్తయ్యలూ వచ్చి పరామర్శించడం.. “ అయ్యో పాపం బిడ్డ ఎలా నీరసించి పోయాడో.. అంటూ…పథ్యం తిన్నతరువాత నిద్ర పోకుందా కాపలా ఓటీ… బతుకంటే అలా ఉండాలీ ..అనుకుంటూనే పెరిగి పెద్దయాము.. పెద్దగా అనారోగ్య సమస్యలు కూడా ఉండేవి కావు.  పెద్ద వాళ్ళ పలకరింపులు కూడా “ ఏరా చదువెలా ఉందీ… “ అనే కానీ, “ ఆరోగ్యం ఎలా ఉందీ..” అని అడిగేవారు కాదు. వేళకి తిండీ, కంటినిండా  కునుకూ ఉంటే రోగమేవిటీ? వాతావరణంలో మార్పులాగే, ఈ రోజుల్లో ఎవరైనా సరే, వయసుతో నిమిత్తం లేకుండా, అడిగే మొదటి ప్రశ్న.. “  సుగరుందాండీ… “.. ఉందనాలో, లేదనాలో ఛస్తే తెలియదు.  ఉందనంటే.. “ అయ్యో పాపం..” తో మొదలై, వాళ్ళకి ఉన్న పరిజ్ఞానమంతా మన నెత్తిమీద రుద్దేయడం… అసలు గొడవేమిటంటే, ఆ అడిగినవాడికి ఆ మాయదారి సుగర్ లెవెల్స్ కొద్దిగా ఎక్కువా, ఇంట్లో వాళ్ళు సరీగ్గా తిండి పెట్టడం లేదు,  ఇంకోడెందుకు సుఖపడాలీ అనుకుని  ఈ వైద్యాలు చెప్పడం, అదో పైశాచికానందం. వచ్చిన గొడవల్లా ఎక్కడంటే, ఈరోజుల్లో ప్రతీఇంట్లోనూ, కార్పొరేట్ ఉద్యోగాలే.. వాళ్ళకి వైద్య సదుపాయాలకి విడిగా ఇన్స్యూరెన్సులూ అవీ ఉంటాయి.. అదేదో యాన్యువల్ చెక్ అప్  Annual Check up) అని పేరు పెట్టి, ముందర ఇంట్లో ఉన్న పెద్ద వాళ్ళని పంపుతారు.. అదేదో చేయించేస్తే,,

పేరెంట్స్ మీద భక్తి ఉన్నట్టు కొలమానం కదా.. ఇంక ఆ డాక్టరు గారు కూడా, ఎక్కడ లేని పరీక్షలూ చేసేసి,  లక్షణంగా ఉన్నారూ ఈ వయసులో కూడా అంటే దిష్టి కొడుతుందేమోనని, ఆ సుగర్ లెవెల్స్ మరీ బోర్డర్ లైన్లో ఉన్నాయంటాడు… ఏవేవో  పంచ రంగుల్లో ఉండే మాత్రలూ,  అవి కూడా, ఏ మెడికల్ రిప్రజెంటేటివ్   Freebies గా ఇచ్చినవి మాత్రమే రాసేసి, కొంపకు పంపేస్తాడు. ఈ రిపోర్టులూ అవీ, ఏ కొడుకో, కోడలో  గూగులమ్మని అడిగేసి.. ఈ పెద్దాయన తిండికి గండి కొట్టేస్తారు.. ఫలానాది తిన కూడదంటారు…

మన దేశంలో ఓ సౌలభ్యం ఉంది—విద్య, జ్యోతిషం, దేవుడు.- వ్యాపారాత్మకమై పోయాయి..ఈ జాబితా లోకి కొత్తగా ఆరోగ్యం చేరింది… ఎవరో మొదలెట్టడం తరవాయి, వేలం వెర్రనండి, అత్యుత్సాహమనండి, ప్రతీ వాడికీ అదో ఫాషనూ…. వీటికి సాయం మన ప్రసార మాధ్యమాలైతే ఉండనే ఉన్నాయి. రోజుకో పెద్ద మనిషి రంగం లోకి రావడం-.. ఈయన ముందరే ఓ  disclaimer  పెట్టేస్తారు—“ నేను డాక్టర్ని కానూ.. కానీ మా  ఇంట్లో వారికి ఈ సుగర్ లెవెల్స్ వలన, ఎంతో ఖర్చు అవడం మూలాన, తాళపత్ర గ్రంధాలు అధ్యయనం చేస్తే తెలిసిందీ, మనం రోజూ తింటున్నదంతా చెత్తా, పైగా సుగరనే వ్యాధే లేదూ… ఫలానా ఫలానావి రోజూ తింటే మూడు నెలల్లో మీ యౌవ్వనం మీకు తిరిగొచ్చేస్తుందీ..  ఈ ప్రయోగాలన్నీ ఎవరి మీదా కాదూ చేస్తా, నా మీదనేనే చేసుకున్నానూ…  ఎత్చ్..ఎత్చ్..”  ఇందులో సమాజ సేవే నా ధ్యేయమూ, జస్ట్ మీరు తినే తిండిలో స్వల్ప మార్పులు చేస్తే చాలూ..” అని.

ఇంక చూసుకోండి.. లక్షలు పోసి డాక్టర్లైన వాళ్ళందరికీ  తిక్క రేగుతుంది.. “ అరే ఈయనెవడయ్యా బాబూ.. మన పొట్ట కొడుతున్నాడూ..“ అనుకుని, వాళ్ళూ  anti propaganda మొదలెడతారు… చిత్రం ఏమిటంటే, అక్కడికేదో ప్రతీ వారికీ న్యాయం చేకూరుస్తున్నంత స్థాయిలో, ఈ రెండు వర్గాల వారి చర్చల తోనూ మన బుర్ర వేడెక్కించేయడం. ఎవడి మాట వినాలో తెలియదు. పైగా వీటన్నిటికీ విడియోలోటీ.. గుప్పెట్లో ఆకాశం అన్నట్టు , అర చేతిలో అంతర్జాల మాయే ఈ రోజుల్లో..

పనున్నా లేక పోయినా ఆ విడియో ఓసారి చూసేసి, అందులో చెప్పినవన్నీ ఇవేళ  మొదలెట్టేయాలీ అనుకుని, మొదలెట్టేయడం. మన వార ఫలాలు చెప్తూంటారే చూడండి ప్రపంచంలో ఫలానా రాశి వారందరికీ ఒకేలా ఉండదూ, రాశి ఒకటే అయినా, ఇంకా ఎన్నో విషయాలు కూడా  కలవాలీ అని ఓ  disclaimer  పెడుతూంటారు, ఈ  pseudo  జ్యోతిష్కులు.. అలాగే ఆరొగ్యం కూడా, ఎవడి శరీర పధ్ధతిని బట్టి వారికి , విడియోలు చూసి జీవన శైలి మార్చుకుంటే కుదురుతుందా మరీ, అదేదో గుడ్డెద్దు చేలో పడ్డట్టూ?...

ఇంకో చిత్రం గమనించారా… ప్రతీ వాడూ రోగం వస్తే ఏమేం చేయాలో చెప్పే వారే కానీ, అసలు అలాటి రోగాలు రాకుండా ఏమేం చేయాలో అవే తాళ పత్ర గ్రంధాల్లో చెప్పారు కదా, మరి వాటి గురించి విడియోలెందుకు పెట్టరో? తమతమ గిరాయికీలు తగ్గి పోతాయనేమో…

ఎవర్ని చూసినా అదేదో  dieting  ట, అది చేస్తే చాలంటారు.. పైగా అవన్నీ అవేవో కాలరీలో ఏదో అంటారుట.. వీటిని కొల్చుకోడానికి చేతికో రిస్ట్ వాచీ లాటిదీ, అలాగే నడిచినప్పుడు ఎన్ని అడుగులు వేసారో చెప్పే  అప్ప్  లూ.. ఏమిటో అంతా గందర గోళంగా ఉంటుంది.. ఇలాటి అస్త్ర శస్త్రాలు లేనప్పుడూ మనుషులు బతికారూ, పిడుగుల్లా ఉన్నారుకూడా… ఈ కొత్త పధ్ధతులూ, అవీ వచ్చి, మనిషిలో ఆందోళన పెంచుతున్నాయి. జరిగేదేదో జరక్క మానదని తెలుసు.. అయినా  Order of the Day కాబట్టి, ఇంట్లో అవన్నీ ఉండాల్సిందే మరి.

మనుషుల్లో ఒక  positive attitude ఉండి, వేళకు తిండుంటే రోగమూ ఉండదూ, సింగినాదమూ ఉండదూ.. ఇవి లేకే కదా ఈ రోజుల్లో హడావిడి చేస్తూంట…

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
easy diet