Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sarasadarahasam

ఈ సంచికలో >> శీర్షికలు >>

తమిళనాడు తీర్థయాత్రలు / విహారయాత్రలు - కర్రా నాగలక్ష్మి

( తంజావూరు )

చెన్నై నుంచి సుమారు 320 కిలోమీటర్ల దూరంలో కావేరీ నదీ తీరాన వున్న పట్టణం తంజావూరు .

చరిత్ర కారులకు దొరికిన తమిళ గ్రంథాల ప్రకారం ఈ నగరం క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దానికి చెందినట్లు తెలుస్తోంది .

తంజావూరు అనే పేరు ఎలా వచ్చింది అనడానికి 3 కథలు ప్రచారంలో వున్నాయి, ‘తంజన్ ‘ అంటే అసురులు. వీరిని సంహరించడానికి విష్ణుమూర్తి ‘ నీల మేఘ పెరుమాళ్ ‘ గా వచ్చి సంహరించిన ప్రదేశం కావడం వల్ల ఈ నగరం ‘ తంజనూరు ‘ గా పిలువ బడుతూ కాలాంతరాన తంజావూరుగా మారిందట. మరో కధ ప్రకారం తంజావూరు ప్రాంతాన్ని పరిపాలించిన రాజు ధనంజయుని పేరు మీద యీ వూరుని ధనంజయనూరుగా పిలువ బడి కాలాంతరాలలో అది తంజావూరుగా మారిందని ఓ వాదన. తమిళంలో ‘ తన్ ‘ అంటే చల్లని ‘చై‘ అంటే పంట భూములు అని కాబట్టి తంచైనూరు తంజావూరుగా మారిందని కొందరు చెప్తారు.

6, 7 శతాబ్దాలలో ‘ముథరయ‘ రాజుల పాలనలో వుండి 9 వ శతాబ్దంలో చోళుల పాలనలోకి వచ్చింది.

ఏది ఏమైనప్పటికీ తంజావూరు కి కొన్ని శతాబ్దాల చరిత్ర వుంది. తంజావూరును జయించడానిక చరిత్రలో ఎన్నో యుధ్దాలు జరిగాయి, అందులో కారైకాల్ (పాండిచేరి)ని పరిపాలించిన చోళులకు, తంజావూరును పరిపాలిస్తున్న చేరులకు , పాండ్యులకు యెన్నో యుధ్దాలు జరిగాయి వాటిలో ‘వెన్ని‘ యుధ్దాన్ని ప్రముఖంగా చెప్పుకుంటారు. ఆ ప్రదేశమైన 'కోవెల వెన్ని‘ తంజావూరుకు సుమారు 24 కిలోమీటర్ల దూరంలో వుంది.

కావేరీ నదీ తీరాన వుండటం వల్ల యిక్కడ నేల యెంతో సారవంతమై వరి, అరటి పంటలకు ప్రసిద్ది, గోదావరీ తీరాన వున్న కోనసీమ యెలాంటిదో తమిళనాడు లో తంజావూరు జిల్లా అలాంటిదే , అలాగే వుంటుంది కూడా, తంజావూరును ‘రైస్ బౌల్ ఆఫ్ తమిళనాడు‘ అని అంటారు.

తంజావూరు మందిరాలకు కూడా చాలా పేరు పొందింది. చాలా పెద్ద పెద్ద మందిరాలు యెన్నో మహిమలు గల మందిరాలు యీ జిల్లాలో వున్నాయి.

1674 నుంచి 1855 వరకు తంజావూరు మరాఠా భోస్లేల పరిపాలనలో వుంది.

తంజావూరులో చూడ వలసిన ప్రదేశాలేంటో చూద్దాం.

తంజావూరు నగరం నడి బొడ్డున వున్న బృహధీశ్వరాలయం ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. ఈ ఆలయం గురించి తెలుసుకొనే ముందు మరి కొన్ని పర్యాటక స్థలాల గురించి తెలుసుకుందాం.

మరాఠా భోస్లే రాజులచే నిర్మింప బడ్డ రాజ భవనం, బృహధీశ్వరాలయానికి కుడి వైపున వున్న శివ గంగ పార్కు కూడా చూడదగ్గవి. శివ గంగ పార్కులో వున టాంకు రాజ రాజ చోళుడు నిర్మించినది, యీ మధ్య కాలంలో తంజావూరు మునిసిపాలిటీ వారు దీని చుట్టూ రక రకాలైన వృక్ష జాతులను పెంచుతూ ఉద్యాన వనానికి అదనపు ఆకర్షణలుగా కొన్ని రకాల పక్షులను, జంతువులను కూడా వుంచేరు.

తంజావూర్ పేలస్

ఈ భవనాన్ని మరాఠా రాజ భవనం అని అంటారు, కాని నిజానికి దీని నిర్మాణం తంజావూరును పరిపాలించిన నాయక రాజుల కాలంలో నిర్మించేరు. నాయకులు సామ్రాజ్యం కోల్పోవడంతో యీ భవనం మరాఠా భోస్లే పరిపాలన లోకి వచ్చింది. ఆంగ్లేయుల పాలనలోనూ, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా భోస్లేల ఆధిపథ్యం యిక్కడ కొన సాగడంతో యిప్పటికీ యీ భవనాన్ని మరాఠా రాజ భవనం గానే వ్యవహరిస్తున్నారు.

ఈ రాజ భవనం చాలా మటుకు నిర్లక్ష్యానికి గురైనట్లు కనబడుతుంది. లోపల సుమారు 190 అడుగుల యెత్తుగల స్థంబంలా కట్టిన భవనం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. రాజ భవనంలో సదర్ మహల్ పేలస్, అంతఃపురం చూడదగ్గవి. రోయల్ పేలస్ మ్యూజియంలో రాజులకు సంబంధించిన వస్తువుల తో పాటు చోళ రాజుల కాలానికి చెందిన కంచు, రాతి విగ్రహాలను చూడొచ్చు. రాజా సర్ఫోజి మహల్, గంట స్థంభం కూడా వున్నాయి .

ఈ రాజ భవనంలో సుమారు 1700 సంవత్సరంలో స్థాపించిన సరస్వతీ పుస్తక భండాగారం చూడ దగ్గది. హిందూ, పాశ్చాత్య దేశాల అనేక దుర్లభమైన తాళ పత్ర గ్రంధాలు వున్నాయి. తాళ పత్ర గ్రంథాలు మిగతా పుస్తకాలు సుమారు 30 వేలు వున్నట్లుగా చెప్తారు. వివిధ విద్యలకు సంబంధించిన పుస్తకాలు సర్ది వుంచేరు.

ఇవి కాక యింకా మ్యూజియంలు వున్నాయి. 1)ఆర్కియాలజీ మ్యూజియం, 2)తమిళ యూనివర్సిటీ మ్యూజియం 3)నాయక్ దర్బారు హాలు ఆర్ట్ మ్యూజియం 4)రాజ రాజ చోళ మ్యూజియంలు వున్నాయి.

1991 లో కట్టిన సంగీత మహల్ లో హాండీ క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ యెప్పుడూ వుంటుంది. తంజావూరు పెయింటింగ్ ప్రపంచంలో పేరు సంపాదించుకుంది, వీటి తయారీలో 24 కేరట్ల బంగారు పేపరు, రత్నాలు పచ్చలు, ముత్యాలు ఉపయోగిస్తారు.

హధీశ్వరాలయం

ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన బృహధీశ్వరాలయం తంజావూరు పట్టణ నడిబొడ్డున వుంది. దేశ విదేశీ పర్యటకులలో యీ మందిరం గురించి కుతూహలం వుంది, దీన్ని ఒక  అద్భుతంగా చెప్తారు. సూర్యుడు యెటు వైపున వున్నా కూడా యీ మందిరం నీడ నేలపై పడదని, మందిర నిర్మాణంలో చూపించిన నైపుణ్యం ప్రస్తుత శిల్పులు కనుగొన లేక పోయేరని అంటారు.

బృహత్ అంటే విశాలమైన లేక పెద్ద అని అర్ధం. 1003, 1010 సంత్సరాల మధ్య రాజ రాజ చోళునిచే నిర్మింప బడింది. బయట నుంచే  యెత్తైన ప్రహారీ గోడల మధ్య విశాలమైన మందిరం పర్యాటకులను యిట్టే ఆకట్టుకుంటుంది. ప్రహారీ గోడకు చుట్టూరా పెద్ద కందకం (రాజ కోటలను శతృ రాజుల నుంచి కాపాడ్డం కోసం లోతైన కాలువలు తవ్వి వాటిని నీటితో నింపి వుంచేవారు) కందకం పైన వేసిన రోడ్డు మీదుగా లోపలకి వెళితే 30 మీటర్ల యెత్తు అయిదంతస్థుల  ‘ కేరలాంతరన్ తిరు వాసల్ ‘ద్వారం' యిరు వైపులా పెద్ద పెద్ద రాతి ద్వార పాలకులు స్వాగతం పలుకుతూ వుంటారు. సుమారు మరో 300 అడుగుల దూరంలో మరో ద్వారం మొదటి ద్వారం కన్నా యెక్కువ శిల్పాలతో వుంటుంది  దీనిని ‘రాజరాజ తిరువాసల్‘ అంటారు. ఈ ద్వారానికి కూడా యిరు వైపులా ద్వార పాలకుల శిల్పాలు స్వాగతం పలుకుతూ వుంటాయి.

రాజ రాజ తిరు వాసల్ లోపలకి వెళ్లేక ప్రహారీ గోడకు ఆనుకొని వున్న పొడ వాటి మండపాలు దూరంగా కనిపిస్తూ వుంటాయి, కొన్ని సంవత్సరాల కిందట చుట్టూర యిసుక నేల నడవటానికి వీలుగా రాళ్లు పరచిన చప్టా వుండేది. ఇప్పుడు యిసుక నేలను వుద్యాన వనంగా మార్చేరు.

మందిరంలో అడుగు పెట్టగానే యెటు వైపు వెళ్లాలో తెలీని అయోమయం, యెత్తుగా వున్న విమాన గోపురం వైపు వెళ్లాలా? నంది మండపం వైపు వెళ్లాలా? లేక పోతే దాటుకు వచ్చిన ద్వారాలపై తీర్చిన శిల్పాలను చూడాలా? ఎటు చూసినా కళ్లు తిప్పుకోనివ్వని శిల్ప సంపద. ఉలి, సుత్తి తప్ప వేరే పరికరాలు లేని కాలంలో యింత పెద్ద మందిరం, కొన్ని వందల శిల్పాలు అతి కొద్ది కాలంలో నిర్మించారంటే నమ్మ శక్యం కాదు.

ఈ మందిర నిర్మాణం గురించి ఓ చిన్న కథ వాడుకలో వుంది అదేంటంటే రాజ రాజ చోళుడు యీ మందిర నిర్మాణం తల పెట్టాక వంద యేనుగలు శిల్పులకు యిచ్చేడట, అవి శిల్పులు కొండలలో చెక్కిన శిల్పాలను పెట్టిన బళ్లను లాగడానికి యీ యేనుగలు వుపయోగించే వారట. విమాన గోపురం నిలబెట్టేటప్పుడు అప్పటి వరకు కట్టిన గోపురం యెత్తున యిసుక పోసి దాని పైకి గోపుర భాగాన్ని యేనుగులచే లాగించి అక్కడ నుంచి పైకి యెక్కించే వారట అలా పదహారంతస్థులు పూర్తి చేసిన తరువాత శిఖర నిర్మాణానికి చాలా కాలం పట్టిందట, పూర్తయిన శిఖరం యేనుగులచే లాగించి తెచ్చి పైకి లాగేటప్పుడు ఖండితమై పోయేదట, ఖండితమైనది మందిర నిర్మాణం లో వాడకూడదనే నియమం వుండడం వల్ల కొత్త విమాన గోపురం చెక్కించ వలసి వచ్చేదట. అంతంత పెద్ద శిల్పాలను అంత తక్కువ కాలంలో నిర్మించేరంటే గొప్పే మరి.

ముందుగా మందిరం గురించి వివరాలు రాసిన బోర్డు దగ్గరకు వెళ్లి అందు లోని వివరాలు చదివి తర్వాత మందిరం చూద్దామని నిర్ణయించుకున్నాం.

రాజ రాజ చోళుని కాలంలో చాలా మందిరాలు నిర్మింప బడ్డాయి, రాజుల సొమ్ము రాళ్ల పాలు అంటే యిదేనెమో అని అనిపించక మానదు, అదే సమయంలో అప్పటి శిల్ప కళ తెలియాలంటే యిలాంటి కట్టడాలు వుండాలి కదా? యిలాంటివి కట్టించేడు కనుకనే రాజ రాజ చోళుడు యింకా మన గుండెలలో సజీవంగా వున్నాడు కదా... అని అనిపించక మానదు. అంతంత కట్టడాలు నిర్మించడానికి ధనం, సమయం యెంతో ఖర్చయి వుంటుంది కదా? ఆ కాలంలో శిల్పులలో అంత నైపుణ్యం వుందనేది మాత్రం యెవ్వరూ కాదన లేని నిజం.

ఈ మందిరం యునెస్కో వారు వరల్డ్ వుంది. హెరిటేజ్ సైట్ గా గుర్తించేరు.

మిగతా వివరాలు వచ్చే సంచికలో చదువుదాం, అంత వరకు శలవు.

మరిన్ని శీర్షికలు
A decline to reduce the population