Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscopeseptember 21st to 27th september

ఈ సంచికలో >> శీర్షికలు >>

ప్రతాప భావాలు - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

pratapabhavalu

ఉన్నత వ్యక్తిత్వం

మనం ఒక పార్క్ కి వెళతాం. రంగు రంగుల పూలని, అందంగా మలచిన క్రోటన్స్ ను చూసి అలౌకికానందంతో మురిసి పోతాం. అక్కడ పచ్చగా తివాచీ పరచినట్టున్న గడ్డిపై కూర్చుని, కొద్ది దూరంలో ఆడుకునే పిల్లల్ని, సరస సల్లాపాలు జరిపే కుర్ర జంటలను, అనుభవాలను నెమరు వేసుకునే పెద్దలనూ చూస్తాం. నిత్యం సమస్యలతో గడిపే మనకు కాస్త ఆట విడుపు దొరికిందని ఆ ఆహ్లాదాన్ని మనస్ఫూర్తిగా అనుభవిస్తాం. అనుభూతి పొందుతాం. ఇది ఒక వైపయితే, మరో వైపు కొంత మంది పూలను తెంపడం, ఆకులను మొక్కల నుంచి వేరు చేసి అవతల పడేయడం లాంటి వికృత చర్యలు చేస్తారు. అలాంటి వాళ్ల చేతుల్లో పార్క్ తన వైభవాన్ని కోల్పోతుంది. తోటలో ‘దయ చేసి పూలను కోయవద్దు’ అన్న విజ్ఞాపనను పెడ చెవిన పెట్టి తోట మాలికి, అక్కడి సెక్యూరిటీకి తెలియకుండా పూలను కోసి ఏదో ఘన కార్యం చేసినట్టు లోపల్లోపల గర్విస్తారు.

బస్సుల్లో, రైళ్లలో ఉమ్ములేయడం, తిను బండారాల చెత్త వేయడం చేస్తుంటారు. గోడల దగ్గర లఘు శంక తీర్చుకోవడం చేస్తుంటారు.
నేను కొంత కాలం క్రితం ఠంచనుగా ఒక లైబ్రరీకి వెళ్లే వాడిని. అక్కడ నుంచి వార, మాస పత్రికలు ఇంటికి తెచ్చుకుంటే అందులో ఒక్కో సారి కొన్ని పేజీలు ఉండేవి కావు. చదువుతూ.. చదువుతూ ఉండగా అలా పేజీలు మిస్ అయ్యే సరికి ఎంత బాధ కలిగేదో. విషయం లైబ్రేరియన్ దృష్టికి తీసుకెళ్లాను.

‘సార్, ఇంత పెద్ద లైబ్రరీకి నేనొక్కణ్నే లైబ్రేరియన్ ని, ఉన్నవి రెండే కళ్లు ఎంత మందిని చూడ గలను? అటు బుక్స్ ను సబ్ స్క్రైబర్స్ కి ఇవ్వాలా? ఇటు చిన్న పిల్లల్ని చూసినట్టు వీళ్లని గమనించమంటారా. మీరే చెప్పండి’ అన్నాడు బాధగా. నిజమే పాపం అతనేం చేయ గలడు.
నేను సాహిత్యోపాసన విస్తృతంగా చేసి ఇలా ఓ మోస్తారు రచయితగా నిలదొక్కుకున్నానంటే లైబ్రరీ అనబడే దేవాలయాలే కారణం. కానీ అలాంటి ‘చదువుకున్న పామరుల’ సంగతేంటి?

ఎవరు తమని గమనించనప్పుడు హుందాగా, ఎటువంటి తప్పు చేయకుండా ఉంటారో, వాళ్లే ఉత్తమ వ్యక్తిత్వం గల వాళ్లు అంటారు విజ్ఞులు.
’ఈ బస్సు మనందరిదీ, దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవలసిన బాధ్యత మనందరిది’ అని బస్సుల మీద అని రాసి ఉన్నా బంద్ లు, హర్తాళ్లూ జరిగితే అందరూ ప్రతాపం చూపించేది వాటి మీదే! ఒక్క పది నిముషాలు బస్సు రావడం ఆలస్యమైతే బస్టాప్ లో నుంచుని అపసోపాలు పడిపోతాం. అటువంటప్పుడు మనం ఎంత గౌరవంగా చూసుకోవాలి. ఒక్క బస్సులనే కాదు, రైళ్లూ, మన ఊరికి, రాష్ట్రానికి, దేశానికి పేరు తెచ్చే చారిత్రక కట్టడాలను పరిరక్షించుకోవలసిన బాధ్యత మనందరిదీ. మనం జాగ్రత్తగా చూసుకుంటే సరి పోదు, ఎవరన్నా వాటి పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించినా, హాని చేస్తున్నా చోద్యం చూడ కూడదు. వాటి విలువను సున్నితంగా, వారికి అర్థమయ్యేలా చెప్పాలి. ముఖ్యంగా పిల్లలకు దేశ సంపద ప్రాముఖ్యతను తెలియ జేయాలి. అది వాళ్లతో పాటు పెరిగి పెద్దయి, మన భారతాన్ని సుందర వనంగా తీర్చి దిద్దుతుంది. నాలుగు రోజులు విదేశాల్లో గడిపి వచ్చి ఆయా దేశాల శుభ్రతను, సౌందర్యాన్ని ప్రశంసిస్తూ మన దేశ ఔన్నత్యాన్ని కించబరచడం తగ్గుతుంది. అందరం ఒక్కటి గుర్తుంచుకోవాలి చుట్టాలింట్లో ఎంత కాలముంటాం? మన ఇల్లే మనకు చిరునామా. దాన్ని పదిలంగా చూసుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిదీ. మేరా భారత్ మహాన్ పెదాలపై నుంచి నినాదం లా కాకుండా గుండెల్లోంచి తన్నుకు రావాలి. దానికి మనందరి వ్యక్తిత్వం వన్నెలద్దాలి. 

మరిన్ని శీర్షికలు
Only people are suffering ... Why