బాలీవుడ్ బ్యూటీ తనూశ్రీ దత్తా నటుడు నానా పటేకర్‌పై లైంగిక ఆరోపణలు చేసిన నాటి నుండీ బాలీవుడ్‌లో ఈ లైంగిక ఆరోపణల పేరు చెప్పి ఇంతవరకూ మౌనంగా ఉన్న పలువురు నటీ మణులు మౌనం వీడి తమ తమ అనుభవాలను బయట పెడుతున్నారు. కొందరు తనూశ్రీదత్తాకి సపోర్ట్ చేస్తుంటే, మరికొందరు ఎప్పుడో పదేళ్ల క్రితం జరిగిన ఇష్యూని ఇప్పుడు బయటికి తీసుకురావడంలో తనూశ్రీ దత్తా ఆంతరంగికం ఏంటో అంటూ ఆమెను విమర్శిస్తున్నారు కూడా. ఇదిలా ఉంటే, తాజాగా ఈ లైంగిక ఆరోపణల నిమిత్తం 'మీ టూ' అనే ఓ మూమెంట్ తెర పైకి వచ్చింది. 'మీ టూ' అంటూ ప్రముఖ తారలు ఈ ఉద్యమానికి సపోర్ట్ చేస్తున్నారు.
బాలీవుడ్ నుండి, దీపికా, ఐశ్వర్యారాయ్, అనుష్కా శర్మ, సోనమ్ కపూర్ తదితరులు 'మీ టూ' మూమెంట్‌కి మద్దతు తెలపగా మన టాలీవుడ్ నుండి లేటెస్టుగా సమంత, అనసూయ భరద్వాజ్ తదితరులు సపోర్ట్‌గా నిలిచారు. తనూశ్రీ దత్తా ధైర్యాన్ని మెచ్చుకోవాలనీ సూచించారు. గతంలో శ్రీరెడ్డి 'కాస్టింగ్ కౌచ్' అంటూ సినీ ప్రముఖులపై చేసిన అసభ్యకరమైన ఆరోపణల రచ్చ తెలిసిందే. ఆ టైంలో మాధవీలత తదితర హీరోయిన్లు కూడా ఇలాగే బయటికి వచ్చారు. ఇప్పుడు బాలీవుడ్‌ని దడ దడలాడిస్తున్న ఈ 'మీ టూ' మూమెంట్‌కి సినీ వర్గాలే కాక ఇతర మీడియా సంస్థలు, వ్యాపార సంస్థలు కూడా వణికిపోతున్నాయి. ఓ ఆంగ్ల పత్రికలో పని చేస్తున్న లేడీ జర్నలిస్టు, ఆ పత్రికా సంపాదకునిపై లైంగిక ఆరోపణలు చేయడంతో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసిన సంగతి తాజాగా వెలుగులోకి వచ్చింది. వాడీ వేడిగా సాగుతున్న ఈ 'మీ టూ' ఉద్యమం ఇలా ఇంకెంత దూరం వెళుతుందో ప్రస్తుతానికి తెలియని పరిస్థితి.
|