Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sira chukkalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

తమిళనాడు తీర్థయాత్రలు - కర్రా నాగలక్ష్మి

tamilnadu

( మధురాంతకం)

మధురాంతకం తమిళనాడు రాష్ట్రం లో కాంచీపురం జిల్లాలో వున్న చిన్న పట్టణం . ఈ వూరు యిక్కడవున్న ‘ కోదండరామాలయం ‘ వల్ల ప్రసిధ్ద పొందింది .

కాంచీపురానికి 45 కిలోమీటర్ల దూరంలోనూ , చెన్నై కి సుమారు 85 కిలోమీటర్ల దూరంలో NH 45 కి దగ్గరగా వుంది .

ఈ పట్టణాన్ని చోళ వంశానికి చెందిన ‘ మధురాంతకం ఉత్తమ చోళ ‘ రాజు 10 వ శతాబ్దం లో నిర్మించి నాలుగు వేదాలలో దిట్టలయిన బ్రాహ్మణులకు కానుకగా యిచ్చేడు అప్పటినుండి యీ పట్టణం  ‘ మధురాంతక చతుర్వేద మంగలం ‘ గా పేరు పొందింది , అది కాలక్రమేణా మధురాంతకంగా మారిపోయింది  .

ఈ వూరులో వున్న రామాలయం గురించి తెలుసుకుందాం .

కోదండరామాలయాన్ని పల్లవులు కట్టించినట్లు శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది , చోళవంశపురాజైన ‘ పరాంతక చోళుడు ‘ యీ మందిరానికి యెన్నో విలువైన కానుకలు యిచ్చినట్లుగా కూడా శిలాశాసనాలు వున్నాయి .

ఓ మోస్తరుగ వుండే కోవెల , 5 అంతస్థుల గోపురంతో వున్న కోవెల . పెద్దపెద్ద మందిరాలు చూసిన మనకు యింత చిన్న మందిరం లో యేముంది ప్రత్యేకత అని అని పిస్తుంది . ముఖద్వారం దగ్గర వున్న దాతల సూచీలో బ్రిటష్ కలెక్టర్ కల్నల్ బ్లేజ్ పేరు ముందుగా వుండి ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది .

లోపల చిన్న మందిరాలు వినాయకునికి , గరుడునికి , ఆళ్వారులకు వున్నాయి , లక్ష్మీనారాయణులు , ఆండాళ్ , పెరియనంబి , సుదర్శనం , వేదాంతదేశిక , ల మందిరాలు వున్నాయి . రామానుజునికి వేరే మందిరం వుంది , అందులో అభిషేకానంతరం రామానుజునికి తెల్ల పంచ కడుతూ వుంటారు . 

వెలుపలి ప్రాకారంలో వున్న చిన్న మంటపంలో రామానుజలవారికి పెరియనంబి ఆళ్వార్ ‘ పంచసంస్కారం ‘ చేసినట్లుగా చిత్రించి వుంటుంది .

లోపల గర్భగుడిలో సీతా లక్ష్మణ సమేత కోదండాన్ని ధరించిన రాములవారి 8 అడుగుల విగ్రహం మూల విరాట్టుగా పూజలందుకుంటోంది . అయితే యిక్కడ కోవెలలో రామభక్త హనుమ విగ్రహం లేకపోవడం ఆశ్చర్యాన్ని కలుగ చేసింది .

కోవెలలో వున్న పుష్కరిణి దగ్గర ఆంజనేయుడికి మందిరం వుంది , యిలా ఆంజనేయుడు దూరంగా వుండడం వెనుక వున్న కథ తెలియరాలేదు . ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు బాగా జరుపుకుంటారు , ఆషాఢమాసంలో బ్రహ్మోత్సవాలు ప్రతీ సంవత్సరం గొప్పగా చేసుకుంటారు . 

అయితే యిక్కడ వున్న రామానుజుని మంటపం వెనుక వున్న కథ తెలుసుకుందాం .

కాంచీపురంలో ‘ వరదరాజ పెరుమాళ్ మందిరంలో వున్న రామానుజునికి వరదరాజస్వామి తిరుకచ్చినంబి ద్వారా శ్రీరంగం లో వున్న పెరియనంబి దగ్గరకు వెళ్లమని ఆదేశం లభిస్తుంది , ఆ ప్రకారంగా రామానుజులు శ్రీరంగానికి బయలుదేరుతాడు , పెరియనంబికి స్వామి కలలో కనిపించి రామానుజులని తరువాతి ఆళ్వారుగా చెయ్యమని ఆదేశిస్తారు , స్వామి ఆదేశానుసారం పెరియనంబి కాంచీపురానికి బయలుదేరుతాడు . ఇద్దరూ మధురాంతకం కోదండ స్వామి కోవెలలో విడిది చేస్తారు , రామానుజులకు శ్రావణ శుక్ల పంచమినాడు పెరియనంబి పంచసంస్కారం చేసి దివ్యమంత్రోపదేశం చేస్తాడు . అందుకనే రామానుచార్యుల యీమందిరంలో అతను గృహస్తాశ్రమంలో వున్నట్లుగా ప్రజలు పూజలు చేసుకుంటున్నారు . 

రామానుజులు యీ మందిరాన్ని ‘ దివ్యం విళింద తిరుపతి ‘ అని పేర్కొన్నారు .

ఈ మందిరానికి సంబంధించిన మరోనిజం కూడా తెలుసుకుందాం . కథ అని యెందుకనలేదంటే దీనికి సంబంధించిన విషయాలు చరిత్రలో గ్రంథస్థం చెయ్యబడ్డాయి . అదేంటో తెలుసుకుందాం .

1795 నుంచి 1799 వరకు బ్రిటష్ పరిపాలనలో చంగల్పట్టు కి కలెక్టర్ గా వచ్చిన ‘కల్నల్ లియొనెల్ బ్లేజ్ ‘ ఒకసారి యీ చుట్టుపక్కల గ్రామాల తనిఖీ కి వచ్చి యీ పట్టణంలో బసచేసి , వూరిలో వున్న రెండు చెరువులను తణిఖీ చెసేడట , చెరువులు రెండు గట్లు తెగి వర్షాకాలంలో యేపాటి వర్షం పడ్డా చెరువులకు గండిపడి వూరు మునిగిపోయే పరిస్థితిని గుర్తించి గ్రామస్థులను హెచ్చరించి వర్షాకాలం అతి దగ్గరలో వుండడంతో త్వరగా పనులు చేపట్టాలని హెచ్చరించేడు . చెరువు గట్లు కట్టడానికి కావలసిన రాళ్లు తెప్పించేంత వ్యవధి లేకపోవడంతో కోదండరామాలయంలో ఓ పక్కగా పడివున్న రాళ్లను వుపయోగించ వలసినదిగా చెప్పేడు . ఆ రాళ్లు రామాలయంలో జానకమ్మ కోవెల నిర్మించడానికి వుపయోగించడానికి తెచ్చిన రాళ్లను వాటిని చెరువుకి వినియోగించడానికి వ్యతిరేకిస్తారు గ్రామస్థులు . పూజార్లు కూడా గట్టిగా వ్యతిరేకించడంతో బ్లేజ్ ఒక కోవెల చాలదా ? మీ దేవునికి , ముంపు వస్తే మీ రాముడొచ్చి గ్రామాన్ని కాపాడతాడా ? అని ప్రశ్నిస్తాడు . దానికి ప్రజలంత ఏక కంఠంతో మా దేవుడు భక్తులను రక్షించడానికి తప్పక వస్తాడు అని అంటారు . చేసేది లేక బ్లేజ్ వెళ్లిపోతాడు . 

వర్షాకాలం ఉరుములు మెరుపులతో రానే వచ్చింది , కలెక్టర్  బ్లేజ్ కి రాబోయే వుపద్రవం కళ్లముందు కనబడసాగింది , వెంటనే మధురాంతకం బయలుదేరి వచ్చి చెరువు వద్ బస చేసేడు . పగలంతా కురిసిన వానతో ఊరంతా జలమయమయింది , ఏనిముషం లోనైనా చెరువులు గండి పడొచ్చు , గ్రామం యేమౌతుందో అనే భయం బ్లేజ్ మహాశయునిలో , దేవుని మీది నమ్మకంతో వూరు గాఢ నిద్రలో పడింది . ఆందోళనతో నిద్ర పట్టని బ్లేజ్ అర్దరాత్రి చెరువు గట్లను పరీక్షించడానికి వెళ్లేడు . అక్కడ యిద్దరు రాజకుమారులు చెరువు గండిని పూడుస్తూ కనిపించేరు , బ్లేజ్ అలా కలని చూస్తున్నట్లుగా చూస్తూనే వున్నాడు , చెరువుల పని పూర్తవగాన యిద్దరూ అదృష్యమైపోయేరు , మరునాడు వర్షం నిలిచి పోయింది .

మరునాడు స్వయంగా కోవెలకు వచ్చిన బ్లేజ్ తన సొంత సొమ్ముతో ‘ జానకి వల్లి ‘ మందిర నిర్మాణాన్ని పూర్తి చేసేడట . అందుకే దాతల సూచీలో అతని పేరు ముందుగా వుంటుంది .

మధురాంతకం లో మరెన్నో మందిరాలు చర్చ్ లు వున్నాయి .

ఇంతవరకు మనం చాలా మందిరాల గురించి చెప్పుకున్నాం కదా ? యిప్పుడు కాస్త మనం ప్రకృతికి దగ్గరగా వెళదాం .

మధురాంతకానికి 12 కిలో మీటర్ల దూరంలో ‘ వేదాంతం గళ్ ‘ పక్షి సంరక్షణా కేంద్రానికి వెళదాం . 30 హెక్టార్ల విస్తీర్ణంలో వుంది , దీనికి అనుబంధంగా వున్న సరస్సులో యెన్నో రకాలైన నీటి పక్షులను చూడొచ్చు . మానవ నిర్మితమైన సరస్సు లో అనేక దేశ , ప్రవాస పక్షులకి నివాసంగా వుంది .

వేదాంతంగళ్ అంటే వేటగాళ్ల నివాసం అని అర్దమట , ఈ పక్షుల సంరక్షణ వేలసంవత్సరాలుగా స్థానికులే చూసుకొనేవారు . పక్షుల వల్ల ప్రకృతి సమతుల్యంగా వుంటుందనే విషయం మన పూర్వీకులు ముందుగానే పసి కట్టేరు , అందుకే యిక్కడ వేటమీద ఆంక్షలు పెట్టి వలస పక్షులను రక్షించేవారు , 1795 నుంచి చెంగల్పట్టు కలెక్టర్ గా వున్న కల్నల్ బ్లేజ్ కి వేట మీద ఆంక్షలు పెట్టి వలస పక్షులను కాపాడవలసినదిగా  యీ గ్రామస్థులు ఆర్జీ పెట్టుకున్నారు , 1936 లో బ్రిటిష్ పాలకులు స్పందించి ఆంక్షలు విధించేరు .

ఇక్కడ సుమారు 40 వేల పక్షులు ప్రతీ యేడు కెనడా , సైబీరియ , ఉత్తర అమెరికా , ఆష్ట్రేలియ లాంటి దూరప్రాంతాలనుంచే కాక శ్రీలంక , బర్మ మొదలయిన పొరుగు దేశాలనుంచి కూడా పక్షులు వస్తూ వుంటాయి . 

1960 లో తమిళనాడు గవర్నమెంటు దీనిని సంరక్షణా కేంద్రంగా గుర్తించి వెయ్యి చెట్లను నాటించి పర్యాటకులకు కావలసిన కనీస సౌకర్యాలను కలుగజేసింది . 

ప్రతీ సంవత్సరం వచ్చే పెలికాన్స్ , పాము మెడ కొంగలు లాంటివ కాక సుమారు 26 వేగంగా లుప్తమౌతున్న జాతుల పక్షులు కూడా వస్తున్నారు గుర్తించేరు . 

నవ్వంబరు నుంచి మార్చి వరకు పక్షులు వస్తాయి , డిసెంబరు , జనవరి నెలలలో యెక్కువ పక్షులను చూడొచ్చు . సీజను లో కాక వెడితే యేదో అడవిలో తిరినట్లు తప్ప పక్షులేవీ వుండవు , జనవరి మొదటి వారంలో పక్షుల గూళ్లు పిల్లల కిచకిచలతో తల్లి పక్షులు పిల్లలకు ఆహారం అందించటం లాంటి వాటితో యీ ప్రాంతమంతా సందడిగా వుంటుంది . ఎప్పుడూ యేవో మందిరాలు , పచ్చిక మైదానాలేకాక యిలాంటి చోట్లకి వెడితే మనస్సుకి ఉల్లాసం కలగడం నిజం .

వచ్చేవారం మనం కుంభకోణం వెడదాం , అంతవరకు శలవు .

మరిన్ని శీర్షికలు
prataapabhavalu