నా మాట...
“మనం బ్రతికి ఉండగా మృత్యువు మన దగ్గరకు రాదు. అది వచ్చేసరికి మనం బ్రతికి ఉండము”. ఎవరు చెప్పారో గాని...ఇది అక్షర సత్యం. మృత్యువును కళ్ళతో చూసిన వారు లేరు. ఆ బాధను, భయాన్ని అనుభవించిన వారు తప్ప...! కాని, మరణమంటే మనలో ఉన్న భయానికి ఒక వికృతరూపాన్ని ఇచ్చి ఇదే “మృత్యువు” అంటున్నాము... ఇది ఇలా ఉండొచ్చు అనే ఒక ఊహకు “కాలపురుషుడు” అనే పేరు పెట్టుకుని, దాన్ని చూసి మనకు మనమే భయపడుతున్నాము. “యమధర్మరాజు, యమభటులు, యమలోకమూ” ఇవన్నీ మనం పెట్టుకున్న పేర్లే...! ఇందులో వాస్తవమెంతో సజీవులైన ఎవరికీ తెలియదు. నిర్జీవులెవరూ లేచి వచ్చి మనకు చెప్పనూ లేరు.
మరణం సంభవించడం పట్ల మన పెద్దలు చెప్పిన చాలా కథలు వాడుకలో ఉన్నాయి. కొన్ని వాస్తవానికి, మనిషి నమ్మకానికి దగ్గరగా అనిపిస్తాయి. ఒక మనిషి మరణించడానికి ముందు మృత్యువు అతనికి అత్యంత చేరువలోనే నిలబడి, అతడికి ఏదో ఒకరూపంలో కనబడుతుందని, అది కనబడినపుడు... ఎవరూ చెప్పకనే ఆ వ్యక్తికి తన మరణం ఆసన్నమైందనే విషయం అర్ధమైపోతుందనే మాట... నమ్మలేకపోయినా నిజమనే అనిపిస్తుంది. జాగ్రత్తగా పరిశీలిస్తే... తన మరణానికి అందాల్సిన సూచనలు అందుతూనే ఉంటాయి.
సహజ, అసహజ మరణాలు ఏవైనా కానీ... కాలం తీరిపోబోతున్న వ్యక్తిని తనతో తీసుకెళ్ళెందుకు మృత్యువు ఆ పరిసరాలలోనే సంచరిస్తూ ఉంటుందని, మరణించబోతున్న వ్యక్తిని తనవైపు మళ్ళించుకుని, తానంతట తానే... మరణాన్నిస్వీకరించేలా ప్రభోదిస్తుందని, అదే అతని “విధి” అని వింటున్నపుడు... ఆ క్షణంలో అతని ఆయువు పరిసమాప్తిని ఎవ్వరూ ఆపలేరని చెపుతున్నపుడూ... ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఇది నిజమని చెప్పడానికి సరైన ఆధారాలు ఎవరి దగ్గరా లేవు. కానీ, ఈ మాట వినగానే ఎవరికైనా భయంతో గుండె ఓ క్షణమాగి మళ్ళీ కొట్టుకుంటుంది. తెలియని స్మశానవైరాగ్యమేదో హృదయాన్ని, శరీరాన్ని ఆవరిస్తుంది.
ప్రతిరోజూ... రకరకాల యాక్సిడెంట్స్, హత్యలు, ఆత్మహత్యలు వార్తాపత్రికలలో చదువుతున్నాము. టి.విలలో చూస్తున్నాము. అయితే, వీటన్నింటి వెనుకా ఆ కాలయముడే కాచుకుని ఉండి... మనుషులను మృత్యుముఖం వైపు నడిపిస్తాడని అంటే... అవునని చెప్పలేము, అలా అని కాదని ఒప్పుకోలేము. అటువంటి ఈ సంఘటనలకు ఆ “కాలపురుషుడుని” పాత్రధారిని చేసి, ప్రతి సంఘటనను ఓ కథగా అల్లుకుపోతే, ఏ విధంగా ఉంటుంది...? అనే నా ఊహకు అక్షరరూపమే ఈ “మృత్యుకేళి”.
కథలోనికి వెళదాం...
మృత్యుకేళి
క్రిస్మస్ సెలవులకు ఇంటికని కోయంబత్తూరు నుండి ట్రైన్ లో ఖమ్మంకి బయలుదేరాడు 22 ఏళ్ళ ఫిలోమెన్. ఒక్కగానొక్క కొడుకు. ఎంతో దూరంలో చదువుకుంటున్నాడు. అతని రాక కోసం.... ఇంటి దగ్గర అతని తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. కొడుకు రైల్వే స్టేషన్ లో దిగగానే ఎక్కించుకుని తీసుకు రావడం కోసం... డేవిడ్ కారును ఎక్కడికీ పోనివ్వ లేదు. తనకెన్ని పనులున్నా అన్నీ వాయిదా వేసుకుని కొడుకు కోసం వెయిట్ చేస్తున్నాడు. మాటి మాటికీ కూర్చున్న చోటు నుండి లేచెళ్ళి కారు తుడుస్తూ, పదే పదే చేతి గడియారం వంక చూసుకుంటూ, జేబు లోని సెల్ ఫోన్ ని ప్రతి రెండు నిమిషాలకొకసారి చెక్ చేసుకుంటూ... “రోజీ... రేపు తెల్ల వారి 6.05 కి రైలు కరెక్ట్ గానే చేరుకుంటుందా...?” అని, వంటింట్లో కొడుకు కోసం రక రకాల పిండి వంటలు తయారు చేస్తూ హడావుడి పడుతున్న భార్యను అడుగుతున్నాడు. అప్పటికది ఎన్నోసారో లెక్కెట్టుకుంటూ... రాత్రికి నిద్ర అయినా పోతాడా ఈయన గారూ...? ఏ అర్ధరాత్రో వెళ్ళి రైల్వేస్టేషన్ లో ఓ బెంచి చూసుకుని కూర్చోడు కదా...! అనుకుంటూ తనలోనే ముసి ముసి నవ్వులు నవ్వుకుంటుంది రోజిలీన్.
అంత కన్నా ఎక్కువ ఆత్రంతో ఉన్నాడు ఇక్కడ ఫిలోమెన్. ఎప్పుడెప్పుడు వెళ్ళి అమ్మ నాన్నల ముంగిలిలో వాలి పోవాలా ? అని ఆరాటంగా ఉంది. తన మీదే ఆశలన్నీ పెట్టుకుని బ్రతుకుతూ, తన రాక కోసమే కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూసే అమ్మా నాన్నలను చూడక చాలా రోజులైంది. అంతే కాదు. ఆ ఇంటిలో ఇంకో సర్ ప్రయిజ్ అతని కోసం ఎదురు చూస్తుంది. ఈ సారి సెలవులకు జాన్ అంకుల్ కూతురు నయోమి వస్తుంది. నయోమి తన ఏంజిల్....! నిజం గానే దేవ కన్య... ఆమె తలంపు తోనే... అతని పెదవులపై మధురమైన ఓ దరహాసం.
“హే... ఫిలొమెన్... ఏక్ సాంగ్ సింగ్ భాయ్...!” కిటికీ పక్కన సింగిల్ సీట్ లో కూర్చుని, బయట కనిపించే పచ్చని పైరు పంటలను చూస్తూ... ఊహల్లో తేలియాడుతున్న ఫిలొమెన్, రుధిర్ మాటలకు ఉలిక్కి పడి ఈ లోకం లోకి వచ్చాడు. మిగతా అందరూ గట్టిగా చప్పట్లు చరిచారు. “పాట... పాట....” అంటూ కోరస్ గా అరవ సాగారు.
ఫస్టు క్లాస్ కంపార్ట్ మెంట్ లో ఫ్రెండ్స్ తో ప్రయాణిస్తున్నాడు. వీళ్ల అల్లరికి బోగీ అంతా... సందడిగా ఉంది. ఫిలోమెన్ మంచి సింగర్, డాన్సర్ అతని ప్రెజెన్స్ ని ఫ్రెండ్సంతా బాగా ఎంజాయ్ చేస్తారు.
వాళ్ళ గోలకు చెవులు మూసుకుంటూ... ”నో...నో... ఇప్పుడు కాదు. నన్నొదిలేయండీ...ప్లీజ్...” ప్రాధేయ పడ్డాడు. వాళ్ళెవ్వరూ ఒప్పుకో లేదు. ఇంకా ఎక్కువ అల్లరి చేయ సాగారు. ఏదో ఒకటి చేయనిది వాళ్ళు వదలరని అర్ధమైంది. “వెయిట్... వెయిట్... పాట కాదు. జోక్స్ చెపుతాను. ఓకేనా...?” అన్నాడు. “సరే...!” అన్నారంతా...
సీట్ లోంచి లేచి వారందరికీ అభిముఖంగా నిలబడి ఏదో చెప్పబోతున్న ఫిలోమెన్.... ఒక్కసారి ఎవరో ఆపినట్లు... ఆగిపోయాడు. మైండ్ అంతా కొన్ని సెకన్లపాటు మొద్దుబారి పోయింది. చెవులకు ఏమీ వినబడనట్లు, కళ్ళకు ఎవరూ కనబడనట్లు.... తను ఎప్పుడూ ఎరుగని ఏదో మగత...!
ఈ విచిత్రమైన స్థితి నుండి తేరుకునే లోపే... ఎవరో అజ్ఞాత వ్యక్తి.... తనను రాసుకుంటూ ముందుకు పోయినట్లు అనిపించింది. ఉలిక్కి పడి వెను తిరిగి చూసాడు. అతను ఆగకుండా వెళ్ళి పోతున్నాడు. మంచు పొరల లోకి నడచి వెళుతున్న ఎత్తైన మేలిమి బంగారు విగ్రహంలా మసకగా, అస్పష్టంగా కనబడుతున్నాడు.
“ఎవరతనూ...?”
ఆలోచించే లోపే... “హే మ్యాన్ ఏమైంది...?” రుధిర్ అరిచే సరికి మళ్ళీ మామూలై పోయాడు. ఓ గంట ప్రయాణం ఫిలోమెన్ జోకులతో, రుధిర్ సెటైర్లతో, జియా కవితలతో, సిద్ధూ పాటలతో, ఆడపిల్లల నవ్వులతో సరదాగా గడచి పోయింది.
అమ్మాయిలు అలసటగా అన్నారు “ఇంక చాలు. ఏమైనా తిందాం. ఆకలిగా ఉంది.”
సరే అని అందరూ బ్యాగుల్లోంచి బాక్స్ లు, టిఫిన్ ప్యాకెట్స్ తెరిచారు. వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ దగ్గర పెట్టుకుని, ఒకరికొకరు షేర్ చేసుకుంటూ తింటూ మళ్ళీ కబుర్లలో పడ్డారు.
“ఫిలోమెన్... ఇంటికి వెళ్ళాక ఈ సెలవుల్లో ఏం చేద్దామనుకుంటున్నావ్...?” మృదుల అడిగింది.
అతడు నవ్వాడు. “ ఏం లేదు. ఫుల్ గా అమ్మా నాన్నలతో గడిపేయడమే...!” చెప్పాడు.
“నయోమితో నిశ్చితార్ధం లాంటి ప్రోగ్రామ్స్ ఏమీ లేవా...?” మళ్ళీ అడిగింది నవ్వుతూ.
“అప్పుడేనా...? దానికింకా చాలా టైమ్ ఉంది. మా ఇద్దరి చదువులూ పూర్తవ్వాలి ” దీర్ఘంగా నిట్టూర్చుతూ చెప్పాడు. “దానికింకా 18 సంవత్సరాలే... ఇంకా రెండేళ్ళు పోతే తప్ప... ఆ ఆలోచనే ఇంట్లో చేయరు” నయోమిని తలచుకుంటూ బాధగా అన్నాడు.
ముఖంలో అతని ఫీలింగ్స్ చూస్తూ... ఫ్రెండ్స్ అంతా... “హే....హే... క్యారే... మామా...!” అంటూ విజిల్ వేస్తూ, నవ్వుతూ ఆట పట్టించ సాగారు. ఫిలోమెన్ సిగ్గుగా లేచి... బాక్స్ మూసి, చేయి కడుక్కోవడానికి సింక్ దగ్గరకు వెళ్ళ బోయాడు. హఠాత్తుగా లేవడం వల్ల అనుకోకుండా అతని చేయి తాకి బెర్త్ పై పెట్టిన మృదుల వాటర్ బాటిల్ క్రింద పడి, నీళ్ళన్నీ ఒలికి పోయాయి. “ఓ... సారీ... సారీ....మృదులా...!” నొచ్చుకున్నాడు.
“హయ్యో... ఫర్వాలేదు. నెక్స్ట్ స్టేషన్ లో పట్టుకుందాం. లేదా ఇంకో బాటిల్ కొనుక్కుందాం... యూ గో...” చెప్పింది నవ్వుతూ మృదుల.
మరో సారి “సారి” చెపుతూ... ఫిలోమెన్ సింక్ దగ్గరకు వెళ్ళాడు. మళ్ళీ ఇందాకటి ఫీలింగ్... కళ్ళ ముందు ఏవో మసక తెరలు...! ఏదో తెలియని అనీజీ... ఎప్పుడూ ఇలా లేదు. ఈ రోజేంటి ఇలా అవుతుంది...? కణతలు రుద్దుకుంటూ వెనుతిరిగాడు. “కాస్సేపు పడుకుని నిద్ర పోతే సెట్ అవుతుందేమో... పైకెక్కి పడుకోవాలి” అనుకుంటూ తన సీట్ దగ్గరకు వచ్చాడు. ఇందాక ఒలికిన వాటర్ అప్పటికే... అతని సీట్ వరకూ వచ్చి పేరుకు పోయి, అతని కోసమే ఎదురు చూస్తున్నట్లు సిద్ధంగా ఉంది.
“నేను కాస్సేపు పడుకుంటాను.” ఫ్రెండ్స్ తో చెప్పి, అప్పర్ బెర్త్ పైకి ఎక్కడం కోసం ఒక కాలు నేలపై ఉంచి, ఇంకోకాలు బెర్త్ పై పెడుతూ పైకి ఎక్క బోయాడు. కానీ క్రింద ఉన్న కాలు ఇందాకటి నీటిలో ఉండడంతో ఒక్క సారిగా జారింది. అది అతనికి తెలిసే లోపే వెల్లకిల్లా విరుచుకు పడి పోయాడు ఫిలోమేన్. పడబోతూండగా అప్పుడు కనిపించాడతను. మసకగా... చాలా దగ్గరగా... భావ రహితమైన చూపుతో...
*****
“ఒరేయ్.....నీకేమైంది...? క్రింద నీళ్ళున్నాయి. చూసుకునేది లేదా...? సమయానికి మేం పట్టుకున్నాము కాబట్టి సరి పోయింది. లేకుంటే ఎంత పని జరిగేది...?” ఫ్రెండ్స్ అంతా గట్టిగా తిట్టేశారు. ఫిలొమెన్ ని.
“ఓకే... ఓకే.... కాస్త మగతగా ఉందిరా... పడుకుంటాను.” ఈ సారి జాగ్రత్తగా పైకి ఎక్కి పడుకున్నాడు. ఇందాక, మసకగా కనబడిన ఆ వ్యక్తిని గుర్తు పట్టాడు. అతడు కోయంబత్తూర్ లో రైలు ఎక్కుతున్నపుడే చూసాడు. ఎందుకని అతడు పదే పదే తనకు కనబడుతున్నాడు...? అతడెందుకో తనను ఫాలో అవుతున్నట్లనిపించింది. ఆలోచిస్తుండగానే... ఫిలోమెన్ కళ్ళు మూతలు పడ్డాయి నిద్రలోకి జారుకున్న ఫిలోమెన్ కళ్ళ ముందు ఏవేవో పీఢ కలలు...
“చర్చిలో ఏదో ప్రేయర్ మీటింగ్ పెట్టారు. అది చిన్నప్పటి నుండి తను, తన కుటుంబం వెళ్ళే చర్చి. అమ్మా, నాన్న, నయోమీ తెల్లటి దుస్తులతో నిలబడి ప్రార్ధనలో ఉన్నారు. ఎవరెవరో చాలా మంది చర్చిలోకి వస్తున్నారు. వెళ్ళే వాళ్ళు వెళుతున్నారు. తను అక్కడే ఉన్నాడు. ఏం జరుగుతుందో తెలియడం లేదు. అమ్మ ఏడుస్తుంది. నాన్న వడలి పోయిన ముఖంతో నిర్లిప్తంగా నిలబడి ఉన్నాడు. అప్పటి వరకూ అమ్మా నాన్నల పక్కనే నిలబడిన నయోమి, వాళ్ళ వాళ్ళెవరో తీసుకెళుతుంటే వెళ్ళి పోతుంది. తను అరచి పిలుస్తున్నా వెనుతిరిగి చూడటం లేదు.
ఫిలొమెన్ కి మెలకువ వచ్చేసింది. లేచి కూర్చున్నాడు “ఏమిటీ కల...? దీని అర్ధమేమిటీ...??” సమయం రాత్రి గం.8.52లు. రేణిగుంటలో ట్రైన్ ఆగింది. వాష్ రూమ్ కి వెళ్ళొచ్చి క్రింద తన సీట్ లో కూర్చున్నాడు. తెల్లవారి గం.6.05లకు ఖమ్మం చేరుకుంటాడు. నాన్న తన కోసం కారుతో రెడీగా ఉంటాడు. అమ్మ తన కోసం ఏవేవో వంటలు చేయడం కోసం, అన్నీ సిద్ధం చేసుకుని ఎదురు చూస్తూ ఉంటుంది. రేపు ఆదివారం. ఇంటికి వెళుతూనే చర్చికి వెళ్ళాలి. అక్కడికి నయోమి వస్తుంది. చూపుల తోనే సైగలు చేస్తూ... యోగ క్షేమాలు కనుక్కుంటుంది.
ఫిలొమెన్ పెదవుల మీదకు నవ్వు వచ్చి చేరింది. అతని ఆలోచనను భంగపరుస్తూ...
“ఎక్...ఎక్....”
హఠాత్తుగా మృదులకు వెక్కిళ్ళు రావడం ప్రారంభమయ్యాయి.
ఆమె బాటిల్ లోని వాటర్ తనే పోగొట్టాడని గుర్తొచ్చింది. సిద్ధు వెళుతుంటే... “ఆగు నేను వాటర్ తెస్తాను." అంటూ గబ గబా ట్రైన్ దిగాడు. ప్లాట్ ఫాం మీద అతడు దిగిన బోగీకి కొంచెం దూరంలో ఉంది ట్యాప్. అక్కడికి వెళ్లాడు ఫిలొమెన్. చల్లటి వాటర్.... తగల గానే... గబ గబా... దోసిలితో నీళ్ళు పట్టి ముందు ముఖం కడుక్కున్నాడు. బాటిల్ పడుతున్నాడు.
మళ్ళీ సేమ్ ఫీలింగ్....ఎవరో తనను తాకుతూ వెళ్ళినట్లు... తననే తదేకంగా చూస్తున్నట్లు భావన... తలెత్తితే... తన చుట్టూ పరిసరాలన్నీ మసకగా కనబడుతున్నాయి. ఇలా ఎందుకవుతుందో.. తనకే అర్ధం కావడం లేదు. చాలా ఆశ్చర్యమేసింది. ఇదివరకెపుడూ లేనిది ఇపుడే ఎందుకిలా...? ఎక్కడో లీలగా అరుపులు... "ఫిలో మెన్ వచ్చేయ్....ట్రైన్ కదులుతుంది...." తల తిప్పి అటు చూసాడు... ట్రైన్ మూవ్ అవుతుంది... ఫ్రెండ్స్ గుమ్మంలో నిల్చుని కంగారుగా పిలుస్తున్నారు. చేతిలో ఉన్న బాటిల్ కేసి చూసాడు. బాటిల్ నిండి పోతుంది. కాని, ట్యాప్ క్రింద నుండి బాటిల్ ని తీయ లేక పోతున్నాడు. అతని మెదడు స్థంబించి పోయినట్లు... అతని శరీరం లోని ఏ అవయవానికి... ఎలాంటి ఆదేశాలివ్వ లేక పోతుంది.
ఎందుకో అతి కష్టం మీద తలెత్తి చూసాడు. అతని ఎదురుగా ఒక వ్యక్తి చేతులు కట్టుకుని నిలబడి ఉన్నాడు. అతనొక్కడే స్పష్టంగా కనబడుతున్నాడు. ఎత్తుగా, బలంగా, ప్రత్యేకంగా ఉన్నాడు. అతడే.... కోయంబత్తూర్ లో రైలు ఎక్కుతున్నపుడు తను చూసింది. ట్రైన్ లో మసగ్గ కనబడింది. రైలులో తను క్రింద పడబోతున్నపుడు. నిర్వికారమైన చూపులతో.... తనకు కనబడింది అతడే...! అతడే...!!
అతని కళ్ళు వాడిగా, సూటిగా ఉన్నాయి. అతని పెదవుల మీద ఏదో భావ గర్భితమైన నవ్వు... బలవంతంగా తల విదిల్చాడు. ఇందాకటి స్థితి నుండి బయట పడ్డట్లు... అన్నీ మళ్ళీ యధావిధిగా కనబడ సాగాయి. ఓ మైగాడ్ రైలు వెళ్ళి పోతుంది... ఇంకేం ఆలోచించ లేదు. బాటిల్ తీసుకుని కదులుతున్న రైలు కేసి పరుగెత్తాడు. అప్పటికే అది చాలా ప్లాట్ ఫాం దాట బోతుంది. ఫ్రెండ్స్ చేయి చాపి అతని చేతిని అందుకో బోయారు. ఆల్రెడీ తనది తడి చేయి అయి ఉండడం వలన... అందుకున్న చేయి ఓసారి జారి పోయింది. రైలుతో పాటు పరుగెత్తుతూనే మరోసారి ఫ్రెండ్స్ కేసి చేయిచాపాడు. లాస్ట్ సెకండ్ లో... ఆ ఫ్రెండ్స్ మధ్య... అతను మళ్ళీ కనబడ్డాడు. తను కూడా వాళ్లతో పాటు అతడిని అందుకోవడం కోసం చేయి చాపి... ఉన్నాడు. ఫిలోమెన్ చాచిన చేయిని... ఈసారి అతడే అందుకున్నాడు. ఒక చల్లని స్పర్శ. వేగంగా శరీరమంతా పాకినట్లనిపించింది. ఆ ఫీలింగ్ ని పూర్తిగా అనుభవించక ముందే... ఫిలోమెన్.... రైలు క్రిందకి జారి పోయాడు... రైలు కమ్మీ అతని పై నుండి వెళ్ళి పోయింది.
ఎన్నో ఆశలతో తల్లిదండ్రుల దగ్గరికి పరుగులు పెడుతున్న అతని ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి.... ఆ వ్యక్తి....తను వచ్చిన పని పూర్తయినట్లుగా... తనకు నిర్ణయింప బడిన విధిని ముగించినట్లుగా అక్కడ నుండి నిష్క్రమించాడు... నిశ్శబ్ధంగా శూన్యంలో కలిసి పోయాడు.
ఆనాయెసేన మరనం, వినా ధైన్యేన జీవనం,
డేహి మే ఖ్రిపయా షంభొ, ఠవయ భక్థిం అచంచలం...
|