Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

2.0 చిత్రసమీక్ష

2.0 movie review

చిత్రం: 2.0 
తారాగణం: రజనీకాంత్‌, అక్షయ్‌కుమార్‌, అమీ జాక్సన్‌, సుధాన్షు పాండే, ఆదిల్‌ హుస్సేన్‌ తదితరులు 
సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌ 
సినిమాటోగ్రఫీ: నిరవ్‌ షా 
నిర్మాతలు: ఎ. సుభాస్కరన్‌, రాజు మహాలింగం 
దర్శకత్వం: శంకర్‌ 
నిర్మాణం: లైకా ప్రొడక్షన్స్‌ 
విడుదల తేదీ: 29 నవంబర్‌ 2018

కుప్లంగా చెప్పాలంటే..

చేతిలో వున్న సెల్‌ఫోన్‌, భవనం సీలింగ్‌ని చీల్చుకుని ఆకాశంలోకి వెళ్ళిపోవడమంటే అదెంత షాకింగ్‌ వ్యవహారమో కదా! ఇలాంటి వింతలెన్నో జరుగుతుంటాయి సెల్‌ఫోన్లకు సంబంధించి. దాంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతుంటారు. అలా మాయమైపోయిన సెల్‌ఫోన్లు అన్నీ కలిసి ఓ పక్షి రూపాన్ని సంతరించుకుంటాయి. ఆ పక్షి ఆకారం, నగరంలోకి వచ్చి విధ్వంసాలకు తెగబడ్తుంది. ఈ పరిస్థితుల్లో వశీకర్‌ (రజనీకాంత్‌), చిట్టి ద రోబోని రంగంలోకి దించుతాడు. మరి ఆ చిట్టి, పక్షి రాజుని ఎదుర్కొంటుందా? ఇంతకీ ఆ పక్షి రాజు ఎవరు.? ఎలా ఆ పక్షి రాజు అవతరించాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

మొత్తంగా చెప్పాలంటే..

ఎలాంటి పాత్రలో అయినా అలవోకగా ఒదిగిపోవడం రజనీకాంత్‌కి వెన్నతో పెట్టిన విద్య. అత్యంత సాహసోపేతమైన పాత్ర ఇది రజనీకాంత్‌కి. ఎందుకంటే, ఇటీవలి కాలంలో ఆయన కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. 'రోబో' గెటప్‌ కోసం బరువైన బాడీ సూట్‌ ధరించాల్సి వస్తుంది. ఇంత కష్టాన్నీ చాలా ఇష్టంగా భరించి, తెరపై సత్తా చాటారు రజనీకాంత్‌. ఆయన మాత్రమే ఆ పాత్రలో రాణించగలరని ఇంకోసారి నిరూపితమయ్యింది.

పక్షిరాజు పాత్రలో అక్షయ్‌కుమార్‌ అదరగొట్టేశాడని చెప్పక తప్పదు. ఈ సినిమాకి అక్షయ్‌కుమార్‌ పాత్ర ఎంత ప్రాముఖ్యమైనదంటే, ఓ దశలో రజనీకాంత్‌ పాత్రల్ని కూడా డామినేట్‌ చేస్తుందది. హీరోయిన్‌ అమీ జాక్సన్‌ బాగానే చేసింది. శంకర్‌ సినిమాల్లో అమీ జాక్సన్‌ అందంగా కన్పించడమే కాదు, నటనలోనూ మెరిసిపోతుంటుంది. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర బాగానే చేసి మెప్పించారు. 
కథ పరంగా చెప్పుకోవాలంటే ఇదొక కొత్త పాయింట్‌. అయితే కథ కంటే కూడా దర్శకుడు శంకర్‌, సాంకేతిక అంశాలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చినట్లు కన్పిస్తుంది. ఎడిటింగ్‌ చాలా బాగుంది. అయితే అక్కడక్కడా ఇంకాస్త కత్తెర పదును చూపించి వుంటే బావుండేదేమో. సాంకేతిక అంశాల్లో ఫస్ట్‌ ప్లేస్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌దే. త్రీడీ టెక్నాలజీలో సినిమాని అత్యద్భుతంగా తెరకెక్కించారు. రెహమాన్‌ సంగీతంలో బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌కి ఎక్కువ మార్కులు పడతాయి. సినిమాటోగ్రఫీ చాలా చాలా బాగుంది. యాక్షన్‌ ఎపిసోడ్స్‌ హాలీవుడ్‌ స్థాయిలో రూపొందాయి.

ఫస్టాఫ్‌ అంతా ఇంట్రెస్టింగ్‌గా సాగిపోతుంది. పాత్రల పరిచయం, సెల్‌ఫోన్ల మాయం, పక్షిరాజు సందడి కన్పిస్తుంది. సెకెండాఫ్‌లో పక్షిరాజుతో చిట్టి తలపడే సన్నివేశాలు ఎక్కువగా కన్పిస్తాయి. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఎపిసోడ్‌ ఎమోషనల్‌ టచ్‌తో వుంటుంది. క్లయిమాక్స్‌లో వచ్చే సన్నివేశాలు అయితే అత్యద్భుతం అని చెప్పక తప్పదు. అయితే అక్కడక్కడా 'రోబో' సినిమా చూస్తున్నామనే ఫీలింగ్‌ కలుగుతుంటుంది. 'రోబో'కి సీక్వెల్‌గా రూపొందిన సినిమానే అయినా, పాత వాసనలు పాత ఫీలింగ్‌ని కల్పిస్తాయి. త్రీడీలో సినిమా చూడటం, అదీ హాలీవుడ్‌ స్థాయి యాక్షన్‌ ఘట్టాల్ని తెరపై చూస్తుండడం ఇవన్నీ కొత్త అనుభూతినిస్తాయి. ఓవరాల్‌గా ఈ సినిమా శంకర్‌ అభిమానుల్ని నిరాశపర్చదుగానీ, ఇంకేదో వుండి వుంటే బావుండేదన్న భావన అయితే కల్పిస్తుంది.

అంకెల్లో చెప్పాలంటే..

3.25/5

ఒక్క మాటలో చెప్పాలంటే

2.0 రీలోడెడ్‌

మరిన్ని సినిమా కబుర్లు
churaka