Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
mrutyukeli

ఈ సంచికలో >> శీర్షికలు >>

ప్రతాపభావాలు - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

pratapabhavalu


లాట్రీ!

ఆదివారం!

మా ఆవిడపెట్టిన టిఫిన్ తిని పేపర్ పట్టుకుని కూర్చున్నాను.

మొదటి పేజీ అలా చదివి రెండో పేజీలోకి ఇలా వెళ్లానో లేదో "ఏవండీ..బయట ఒకామె లాట్రీ అంటూ వచ్చింది. పది రూపాయలట. లాట్రీలో రెండు సబ్బులు వస్తాయట. అందులో గనక ఒక గిఫ్ట్ కూపన్ ఉంటే..బహుమతులు కూడానట! ఒక పది ఇవ్వరూ అంది" అంది. నాకలాంటివి చిరాకు. మా ఆవిడను ఎందుకు నిరుత్సాహపరచడమని, చొక్కాజేబులోంచి మోదీ దయవల్ల కొత్త రూపుతో బయటకొచ్చిన పదినోటు ఇచ్చాను.

పదంటే పది నిముషాల్లో మావిడ పున్నమి చంద్రబింబ ముఖంతో "ఏవండీ ఇదిగో రెండు సబ్బులు గిఫ్ట్ గా వచ్చాయి, పైగా ఒక సబ్బురేపర్ లోపల గిఫ్ట్ కూపన్ కూడా ఉంది. ఇంతవరకు ఎవరికీ అలా రాలేదుట. నేను భలే అదృష్టవంతురాల్నని తెగ పొగిడింది ఆ అమ్మి. ఇంతకు అసలు విషయం ఏంటంటే- ఆ గిఫ్ట్ కూపన్ ప్రకారం ఏడు వేలు ఖరీదు చేసే కిచెన్ లో ఉపయోగపడే వస్తువులు మూడువేల అయిదు వందలకే ఇస్తుందట. ఎంత లక్కో కదా" అంది కళ్లు ఆనందంతో గుండ్రంగా తిప్పుతూ.

నేను ఒకసారి నింపాదిగా మావిడ వంక చూసి"చూడు లక్ష్మీ! నిజానికి వాళ్లు అమ్మాల్సింది ఆ వస్తువులని..కాని లాట్రి అనే పేరుతో మన బలహీనతకి ఒక ఎర వేస్తారు. వాళ్లేమన్నా తెలివి తక్కువ వాళ్లా పదిరూపాయల లాట్రీతో ఖరీదయిన వస్తువులు సగం ధరకు ఇవ్వడానికి. నువ్విచ్చిన పదికి రెండు సబ్బులొచ్చాయిగా దానికి అది సరిపోయింది ఎందుకంటే ఒక్కోసబ్బు అయిదు రూపాయలుంటుంది కాబట్టి. ఇహ ఊర్కో" అన్నాను.

మావిడ నిరుత్సాహంగా ముఖంపెట్టింది. నేను మావిడ చేత ఆ వచ్చినామెకి ‘మేము ఆ వస్తువులు కొనమని’ చెప్పించి, పంపించేశాను.

మాది ఫస్ట్ ఫ్లోర్ ఆమె కిందకి వెళ్లగానే నేను దిగులుగా ఉన్న మా ఆవిడకి సంజ్ఞ చేసి టెర్రెస్ మీదకి తీసుకెళ్లాను. ఆ లాట్రీ ఆమె గ్రౌండ్ ఫ్లోర్లో ఒకావిడ పిలిస్తే బుట్టతో ఆమె ముందు కూర్చుంది. నేను మావిడను జరిగేది శ్రద్ధగా చూడమని చెప్పి" చూశావా ఆ బుట్టలోని వస్తువులు ఎంత నాసిరకంగా ఉన్నాయో?" మావిడ ఆశ్చర్యపోతూ తలూపింది. కిందామె కూడా లాట్రీ తీస్తే రెండు సబ్బులు వచ్చాయి. హాశ్చర్యంగా అందులో ఒక సబ్బులో కూపన్ వచ్చింది. ఆమె మావిడకి చెప్పినట్టే ఆవిడతో"మీరెంతో అదృష్టవంతులమ్మగారూ..ఇప్పటిదాకా ఇలా ఎవరికి అద్రుట్టం రాలేదు" అంది. ఆమె ఉబ్బితబ్బిబ్బవుతూ లోపలికి వెళ్లి మూడువేల అయిదొందలు తెచ్చిచ్చి ఆ వస్తువులు తీసుకుంది.

మావిడ "నిజమేనండోయ్. ఆమె మాటలగారడీకి నేను పడిపోయేదాన్ని. మీరు చెప్పారు కాబట్టి డబ్బు సేవ్ అయింది"అంది.

"ఇవాళంటే ఆదివారం. నేనున్నా కాబట్టి సరిపోయింది. అదే నేను ఆఫీసుకెళితే..నువ్విలాగే ప్రలోభానికి లోనయితే, మన కష్టార్జీతం మట్టిపాలే! ఇంటికొచ్చి ఇలాంటి నాసిరకం వస్తువులను అమ్మే వాళ్లపట్ల అప్రమత్తంగా ఉండాలి. ఒక్కసారి వస్తువులు తీసుకున్నాక ఇంక అంతే సంగతులు. కాస్త ఖరీదు ఎక్కువయినా ఆథరైజ్డ్ షోరూంకెళ్లి గ్యారంటీతో మన్నికనిచ్చే వస్తువులు కోంటే గుండెల మీద చెయ్యేసుకుని పడుకోవచ్చు ఏవంటావు?" అన్నాను.

"నిజమేనండి"అండి.

"ఇప్పుడు నువ్వు అదృష్టవంతురాలివి..పదా"అని ఇంట్లోకి దారి తీశాను.

*****   

మరిన్ని శీర్షికలు
weekly horoscope7th december to 13th december