Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
tamilnadu

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఎందరో మహానుభావులు… అందరికీ వందనాలు - భమిడిపాటిఫణిబాబు

( 25 జనవరి – 31 జనవరి )  మహానుభావులు… జయంతులు …

జనవరి 27
శ్రీ పోతుకుచి సాంబశివరావు : వీరు జనవరి 27,  1927 న  ఆలమూరు లో జన్మించారు. వీరు కథారచయిత గా దాదాపు 350 కథలు రాసారు. వీరు రాసిన నవల “ అన్వేషణ “ , మద్రాసు విశ్వవిద్యాలయం వారు   B.A.  ఉపవాచకంగా  నిర్ణయించారు. మరో నవల, “ ఉదయకిరణాలు “  రష్యన్ భాషలోకి అనువదించారు. మరెన్నో నాటకములు కూడా రచించారు.

శ్రీమతి కోడూరు కౌసల్యాదేవి :  సుప్రసిధ్ధ నవలా రచయిత్రి. 35 నవలలు రాసారు. ఎన్నో నవలలు సినిమాలగా కూడా తీయబడ్డాయి. సుమారు 45 కథలు కూడా రాసారు. 60.70 దశకాల్లో, తెలుగు వార మాస పత్రికల్లో ధారావాహికంగా ప్రచురించబడ్డాయి.

జనవరి 28
శ్రీ గిడుగు సీతాపతి  :      వీరు జనవరి 28 , 1885 న భీమునిపట్నం లో జన్మించారు. తెలుగు వ్యావహారిక భాషా సారధి, శ్రీ గిడుగు రామ్మూర్తి గారి  కుమారుడు. వీరు సుప్రసిధ్ధ  భాషా పరిశోధకులు, విజ్ఞాన సర్వస్వ నిర్మాత. వీరు ఎన్నో గేయాలను పిల్లలకోసం రాసారు.  వీరి బాలసాహిత్యంలో  “ చిలకమ్మ పెళ్ళి “ ఎంతో ప్రసిధ్ధి చెందింది.

జనవరి 29
 శ్రీ వేటూరి సుందరరామ్మూర్తి  :   వీరు జనవరి 29 , 1936 న  పెదకళ్ళేపల్లి లో జన్మించారు. సుప్రసిధ్ధ సినీ గేయరచయిత. కొన్నివేల సినిమాపాటలు రాసారు. బాణీలను స్పష్టంగా వంటబట్టించుకుని ఆ పాటలకు వోణీలు వేయించారు. సంప్రదాయ సంగీతం నుండి, జానపద గీతాలవరకూ, అన్నిటిలోనూ  తన ప్రతిభ చూపారు. 8 నంది ఎవార్డులతో మొత్తం 14 ఎవార్డులూ, ఒక జాతీయపురస్కారం అందుకున్నారు.

జనవరి 31
శ్రీ రావెళ్ళ వెంకట రామారావు :  వీరు జనవరి 31,  1927 న గోకినేపల్లిలో జన్మించారు.vతెలంగాణ తొలితరం కవి, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించడంతో పాటు, తన రచనలు, పాటల ద్వారా ప్రజలను చైతన్య పరిచారు.
పద్యరచనతో పాటు అనేక వ చన రచనలు సైతం చేశారు.తెలుగు, ఉర్దూల్లో అద్భుతంగా రాయడంతోపాటు అనర్గళంగా మాట్లాడగలిగేవారు.

వర్ధంతులు :

జనవరి 25
శ్రీ పెనుపాత్రుని ఆదినారాయణరావు. :  ప్రముఖ తెలుగు సినిమా సంగీతదర్శకుడు, నిర్మాత. తనభార్య శ్రీమతి అంజలీదేవి పేర నిర్మించిన అంజలి పిక్చర్స్ అధినేత.  “ పల్లెటూరి పిల్ల “ చిత్రంతో మొదలయిన  సంగీత దర్శకత్వం, తరువాతిరోజుల్లో ఎన్నోఎన్నెన్నో మధుర గీతాలకి  బాణీలు  రూపుదిద్దుకున్నాయి. “ అనార్కలి “ “ సువర్ణసుందరి “ వంటి ఎన్నో సినిమాలు నిర్మించారు.
వీరు జనవరి 25, 1991 న స్వర్గస్థులయారు.

జనవరి 26
శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు :  తెలుగు చలనచిత్రరంగంలో అయిదు దశాబ్దాలపాటు , వివిధ రకాల పాత్రలలో తన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించిన నటుదు. 500 కి పైగా చిత్రాలలో నటించి ఎన్నో మన్ననలు పొందారు. రాష్ట్రప్రభుత్వ “ రఘుపతి వెంకయ్య “ అవార్డు గ్రహీత.
వీరు జనవరి 26,  2010 న స్వర్గస్థులయారు.

జనవరి 27
శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం :  ప్రముఖ బాలలమాసపత్రిక  “ చందమామ ‘  కథారచయిత. 55 సంవత్సరాలపాటు ఎన్నొ ఎన్నెన్నో కథలు రాసి, బాలలకు, పెద్దలకూ కూడా ప్రీతిపాత్రుడయిన మహామనిషి. ధారావాహికల రచనలో మంచి ప్రతిభ కలిగిన దాసరి 12 ధారావాహికలను రాశారు.. ఆయన సృష్టించిన ఖడ్గవర్మ, జీవదత్తుడు, పింగళుడు, శిఖిముఖి, విక్రమ కేసరి, మౌగ్లీ, కాలశంబరుడు మొదలైన పాత్రలు తెలుగు వారికి సుపరిచితాలు. వీరు జనవరి 27, 2010 న స్వర్గస్థులయారు.

జనవరి 30
శ్రీ చెరుకూరి సుబ్రహ్మణ్యేశ్వర రావు :  “ వడ్డెర చండీ దాసు “  గా ప్రసిధ్ధిచెందిన, ప్రముఖ తెలుగు నవలా రచయిత..
 వీరి నవలలో హిమజ్వాల, అనుక్షణికం, చీకట్లోంచి చీకటిలోకి, ప్రేమతో ప్రముఖమైనవి. చైతన్య స్రవంతి కథన రీతిని ఎంచుకుని రాసిన చండీదాస్‌ రచనలు విశేష ప్రజాదరణ పొందడమే కాకుండా సాహిత్యవేత్తల మన్ననలు కూడా పొందాయి..
వీరు జనవరి 30, 2005 న స్వర్గస్థులయారు.

శ్రీ కోటికాలపూడి వెంకటకృష్ణారావు :  జనరల్  కే.వీ. కృష్ణారావుగా సుపరిచితులు. భారత సైన్యాధ్యక్షుడిగా 1981 నుండి 1983  వరకూ పనిచేసిన మొట్టమొదటి తెలుగుబిడ్డ. ఆతరవాత   గవర్నర్ గా కూడా పనిచేసారు. భారతసైన్య ఆధురీకరణలో ప్రముఖ పాత్ర వహించారు.
వీరు జనవరి 30, 2016 న స్వర్గస్థులయారు.

మరిన్ని శీర్షికలు
pratapabhavalu