రామ నామ మాధుర్యం.
చక్కెరకంటె తీపి దధిసారముకంటెను రుచ్యమౌను పెం
పెక్కిన తేనెకన్న అతి రుచ్యము నోటను పల్క పల్కగా
మిక్కిలి కమ్మనౌ అమృతమే అనిపించును కాన నిత్యమున్
చక్కగ దాని మీరు మనసా స్మరియింపుడు రామనామమున్! - బాబా
అనాదికాల మునుండి ఈనాటివరకు ‘రామనామ’మనేది అందరికీ తారక మంత్రముగా తనరారుచున్నది.ఈనాడు పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అందరూ రామనామాన్ని స్మరిస్తూనే ఉన్నారు. రామనామమాధు ర్యాన్ని అనుభవించ డానికి వయస్సుతో నిమిత్తం లేదు. 'రామ' అనే రెండ క్షరాలలో ఎంతో మాధుర్యము ఇమిడియున్నది. ఇటువంటి మధుర మైన, అమృతమయమైన, ఆనంద మయమైన రామనామాన్ని మనము క్షణమై నా విడిచిపెట్టకూడదుకాని, కాని ఈనాడు కొందరు మానవులు దివ్య మైన రామనామాన్ని అలక్ష్యం చేస్తున్నారు. అది వారి దురదృష్టమనే చెప్పవ చ్చు..
పరమేష్ఠినుండి ఆవిర్భవించినది సృష్టి. సృష్టినుండి ఏర్పడినది సమష్టి. సమష్టిలో అంతర్భాగం వ్యక్తి. కాబట్టి, సమాజానికి నిస్వార్థంగా సేవలందిం చడం ప్రతి వ్యక్తియొక్క కర్తవ్యం. అటువంటి వ్యక్తుల సమూహమే నిజమైన సమాజము. మానవునియొక్క సమస్త కర్మలూ సమాజ సేవయే లక్ష్యంగా కలిగి ఉండాలి. అందరూ ఒకే సమాజముయొక్క సభ్యులే. వ్యక్తులు వేరు వేరైనా అందరిలో ఉన్న హృదయం ఒక్కటే.
''ఏకం సత్ విప్రాః బహుధా వదన్తి'', ''ఏకాత్మా సర్వ భూతాంతరాత్మా''.
ఒక కాగితం లో కూరగాయలు పొట్లం కడితే కాగితం కూరగాయల వాసన వస్తుంది; అరటి పళ్ళు పొట్లం కడి తే అరటి పళ్ళ వాసన వస్తుంది; ఎండు చేపలు పొట్లం కడితే ఎండు చేపల వాసన వస్తుంది. పకోడీ పొట్లంకడితే పకోడీ వాసన వస్తుంది.పేపరుకు సహజంగా ఎటువంటి వాసనా లేదు. ఇందులో ఏ వస్తువు పొట్లం కడితే ఆ వాసన వెదజల్లుతుంది.
అదేవిధంగా మనిషి స్వభావరీత్యా పవిత్రమైన వాడు. కానీ, దుస్సంగంలో చేరడంచేత దుర్గుణాలను అలవర్చుకుంటున్నాడు.
'టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యు వాట్ యు ఆర్'. నీ స్నేహితు లెవరో చెపితే నీవెటువంటివాడవో చెప్పవచ్చును.
కనుకనే, సత్సంగంలో ప్రవేశించాలి. సాంగత్య ప్రభావం వల్లనే మనలో మంచి, చెడ్డలు ఏర్పడుతున్నాయి. కాబట్టి, దుస్సంగానికి దూరంగా ఉండి, పవిత్రమైన హృదయం, నిర్మలమైన భావాలు గలవారితో స్నేహం చేయా లి .మనం సంఘంలో సభ్యులం. ఈనాడు సమాజంలో ఉన్న దురాచారా లన్నింటికీ మూలం మన దుర్గుణాలు, దురాలోచనలు, దుశ్చింతనలే. వీటి ప్రభావం ప్రతి వ్యక్తిపైనా పడుతుంది. ఒక ఊదుకడ్డీ వెలిగిస్తే అక్కడు న్నవారంతా దాని సుమధుర సువాసనను పీల్చుకుని ఆనందిస్తారు. ఒక కుళ్ళిన దుర్గ్మంధ భరితమైన పండు ఉంచితే అంతా ముక్కు మూసుకుం టారు.
సృష్టి అంతా భగవన్మయమే. అందరూ పవిత్ర హృదయులే. కానీ, పరిస రాల ప్రభావంచేత మనయొక్క ప్రవర్తన మారుతుంటుంది. మనకు కలిగే అనుభవాలు మనం అనుసరించే మార్గంపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి, మంచివారితో చేరి, పవిత్రమైన జీవితాన్ని గడిపి, మంచి పేరు తెచ్చుకోను మనంప్రయత్నించాలి. మన హృదయాన్ని పవిత్రమైన, దివ్యమైన భావా లతో నింపుకోవాలి.
బుద్ధుడు “ధర్మం శరణం గచ్ఛామి. సంఘం శరణం గచ్ఛామి”అని బోధిం చాడు. మనం ఆచరించే సమస్త కర్మలు సత్య ధర్మాలను ఆధారం చేసు కొని ఉండాలి. చెడ్డవారు ఎదురైనా వారిలో మంచినే చూడడానికి ప్రయ త్నించాలి. అందరిలోనూ ఉన్నది భగవంతుడొక్కడే. అల్లా అనీ, జీసస్ అనీ, రామా అనీ, కృష్ణా అనీ వేరువేరు పేర్లతో పిలిచినా దైవం ఒక్కడే. పేర్లు వేరైనంతమాత్రాన దివ్యత్వం వేరుకాదు.
లడ్డూ, మిఠాయి, మైసూరుపాక్ మొదలైన స్వీట్లు వేరువేరుగానీ అన్నింటి లోనూ ఉన్న చక్కెర ఒక్కటే కదా! చింతపడుతో చారు, సాంబారు, పులి హోర, పచ్చడి చేస్తాం, అన్నింటిలో చింతపండు ఒక్కటే.
కనుక నిరంతరం రామనామాన్ని లేదా మనకు నచ్చిన భగవన్నామాన్ని శ్వస పీల్చుకున్నట్లు జపించడం అలవర్చుకోవాలి.ఒక ఊర్లో ఇరువురు భార్యాభర్తలుండేవారు. భార్య నిరంతరం భగవన్నామాన్ని స్మరిస్తూ, పూజలుచేస్తూవుండేది. కాని, భర్త మాత్రం భగవ న్నామస్మరణగాని, పూజలుగాని చేయకుండా తన పనేదో తాను చేసు కుంటూ వుండేవాడు. ''అయ్యో, నా భర్త ఒక్క నాడైనా 'రామా, కృష్ణా' అని ఉచ్చరించడం లేదే!'' అని భార్య చాలా బాధపడుతూ వుండేది. ఒకనాటి రాత్రి నిద్రపట్ట క అటూ ఇటూ దొర్లుతూ అతను 'రామా', అన్నాడు. భర్త నోటినుండి ఆ మాట రావడం విని భార్య ఎంతగానో పొంగిపోయింది. తెల్ల వారి లేస్తూనే ఆమె ఇంట్లో ఉన్న బియ్యమునంతా వండి, బీదవారికి అన్న దానం చేసింది. అది చూసి భర్త, ''ఏమిటే? ఇంట్లో ఉన్న బియ్యమునంతా వండి పేదలకు పెడుతున్నావు. ఏమిటీ రోజు విశేషం?'' అని అడిగాడు. ''నిన్నటి రాత్రి మీనోటి నుండి 'రామా' అనే పదాన్ని నేను విన్నాను. అది విని నా హృదయం ఉప్పొంగిపోయింది'', అన్నది. ''అయ్యో, ఇంతకాలం నేను రాము ణ్ణి నా హృదయంలో పదిలంగా దాచుకున్నాను. నా రాముడు నాలోనుండి బయటికి వెళ్ళిపోయాడా!'' అని అతను చాలా బాధ పడ్డాడు. చాలామంది తమ భక్తిప్రపత్తులను బయటికి వ్యక్తం చేయరు; హృదయం లోనే దాచుకుంటారు. కాని, ఏదో ఒకనాటికి అది బయట పడిపోతుంది.
|