పూర్వపు రోజులతో పోలిస్తే ఈ రోజుల్లో గమనించిందేమిటంటే, మనుషుల్లో చాలామందికి , సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనబడే “ హార్మోన్ “ తగ్గుముఖం పట్టినట్టనిపిస్తోంది. తగ్గుముఖమనే ఏమిటిలెండి, ఆల్మోస్ట్ డ్రైడ్ అప్ అనుకోవచ్చు.ఇదివరకటి రోజుల్లో , వ్యంగ్య చిత్రాలు ( కార్టూన్ / కార్కేచర్ ) వేసే ఘనా పాఠీలుండేవారు. వారి వ్యంగ్యం నుండి ఏ ప్రముఖ వ్యక్తీ కూడా తప్పించుకోలేదనడంలో ఆశ్చర్యం లేదు. ప్రముఖ కార్టూనిస్టులు మెస్సర్స్. ఆర్.కే. లక్శ్మణ్, అబు అబ్రహం, ఓమెన్, మారియో మరిండా, షంకర్, తెలుగు జాతికి స్వంతమైన శ్రీ బాపు గారూ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో ఎందరెందరో… ఓ గొప్ప రాజకీయ నాయకుడి పైన ఓ కార్టూన్ వేస్తే నవ్వకుండా ఉండలేకపోయేవారు, ఎవరి మీదైతే వేశారో ఆ వ్యక్తి తో సహా…
కానీ ఈరోజుల్లోనో—వ్యంగ్యంగా ఏదైనా వ్యాసం రాసినా, ఓ బొమ్మవేసినా అసలు విషయాన్ని పక్కకుపెట్టి, వాటిమీద వివాదాస్పక చర్చలు మొదలెడతాయి. ఎవరిగురించైతే వేసారొ ఆ వ్యక్తి లోపల్లోపల నవ్వుకున్నా కుదరదు. వారి వందిమాగధులకి పొడుచుకొస్తుంది… “ కందకి లేని దురద… “ సామెతలా. పైగా ఆ కార్టూన్ కి ఓ “ కుల / జాతి “ జెండా తగిలిస్తారు. ఇంక ప్రభుత్వం మీదా, అధికార పక్ష నాయకులమీదా వేస్తే “ దేశద్రోహం “ కింద పరిగణించి జైల్లో వేసినా ఆశ్చర్యపడక్కర్లేదు. అసలు గుమ్మిడికాయదొంగంటే భుజాలు తడుముకోవడం ఎందుకో ? “ఎంత నవ్వితే అంత ఆరోగ్యం “ అన్నది పోయి “ నవ్వు నాలుగువిధాల చేటు “ లోకి వచ్చేసింది.
సామాజిక మాధ్యమం ( సోషల్ మీడియా ) లోకూడా అదే పరిస్థితి… ఎవరో ఏదో రాస్తారు తమ టైమ్ లైన్ మీద—స్పందించకపోతే బావుండదని, ఏదో తెలిసినవారు కదా అని వ్యాఖ్య పెడితే దాన్ని లైట్ గా తీసుకోవచ్చుగా అని స్పందించిన వ్యక్తి అనుకున్నా, మిగిలినవారికి “ దురద “ ఎక్కుతుంది…అంతే వ్యాఖ్యలమీద వ్యాఖ్యలు… తారీక్ పే తారీక్.. తారిక్ పే తారీక్ .. “ ఘాయల్ సినిమాలో సన్నీ డియోల్ లా వచ్చేస్తాయి… అసలు వ్యక్తికి పట్టింపులేకపోయినా, పీర్ ప్రెఝర్ ఎక్కువైపోతుంది… అసలు విషయం పక్కదారి పట్టి అటకెక్కేస్తుంది. కొంతమందుంటారు ఎంతమంది వ్యాఖ్యలు పెట్టినా, స్పందించని ఘనులు. ఏదో ప్రభుత్వంవారి పత్రికా ప్రకటన ధోరణిలో , అందరికీ కలిపి ధన్యవాదాలు చెప్పేవారు…. అలాటప్పుడు వ్యాఖ్యలు పెట్టేవారుకూడా మానేసే ఆస్కారం ఉందని మర్చిపోతారు. చివరకి ఏమౌతోందంటే వ్యాఖ్యలు పెడితే ఓ గొడవా, అసలు పెట్టకపోతే ఇంకో గొడవా..
ఇవన్నీ ఈరోజుల్లో పబ్లిక్ డొమైన్ లో ఈరోజుల్లో చూస్తూన్న మార్పులు… చివరకి ఈ ద్ర్యింగ్ ఉప్ ప్రక్రియ నిజజీవితాల్లోకి కూడా వచ్చేస్తోంది.. మనం సరదాగా అనుకున్న మాట అవతలివారికి అభ్యంతకరంగా అనిపించొచ్చు.. అది స్నేహితుల మధ్య అవొచ్చు, తల్లితండ్రులు- పిల్లల మధ్య కూడా కనిపిస్తోంది… ఏదో చనువులాటిదుంటేనే కదా హాస్యంగా అప్పుడప్పుడు మాట్టాడేదీ? కొత్తగా పరిచయమైన వారితో ఎలాగూ ముభావంగానే ఉంటాము… మరీ మొదటి పరిచయంలోనే లొడలొడా వాగేయం కదా… అవతలివారి మనస్థత్వం ఓసారి అంచనా వేసి , రంగంలోకి దిగడం. .. మన మాట పధ్ధతి నచ్చిందా ఇంకోసారి కలవ్వొచ్చు, నచ్చలేదా, ఓ గొడవొదిలిందని వదిలేయొచ్చు. అలాగని మన లైట్ హార్టెడ్ అటిట్యూడ్ మార్చుకోనవసరం లేదని ఇన్నాళ్ళూ అనుకునేవాడిని…
పై విషయం పక్కకు పెట్టి, అసలు ఈ రోజుల్లో హాస్యం పేరుతో వస్తూన్న సినిమాలు చూస్తూంటే అసహ్యం వేస్తోంది. అలాగే టీవీ ల్లో, వచ్చే కార్యక్రమాలు , మరీ దిగజారిపోతున్నాయి. వెకిలి సంభాషణలు, ద్వందార్ధాలూ,. దీనికి సాయం ఆ కార్యక్రమానికి ఝుద్గెస్ కింద ఎవరినో పిలవడం, వాళ్ళు ప్రతీదానికీ పడి పడి నవ్వడం. అసలెందుకు నవ్వుతున్నారో అర్ధమవదు. అన్నిటిలోకీ దౌర్భాగ్యం ఏమిటంటే, ఈ సినిమాల్లోనూ, టీవీ కార్యక్రమాల్లోనూ వచ్చే సంభాషణలు, మన నిత్యజీవితంలోకి కూడా అడుగెట్టడం. జనాల్లో ఒత్తిడి పెరిగిందీ అంటే పెరగదూ మరి? దానితో జీవితంలో డిప్రెషనూ, ఆత్మహత్యలూ ఎక్కువైపోయాయి.
సర్వేజనా సుఖినోభవంతూ…
|