Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Saying poetry is not lost

ఈ సంచికలో >> శీర్షికలు >>

కవితలు - కాకరపర్తి పద్మజ

మగువలు


పుట్టిన రోజుకు ప్రాయమొచ్చిందని
భయాన్ని కవచంగా ఇచ్చిన పెద్దవారు 
పెదవులకు మూగనోము పట్టిస్తే
ఎన్ని కన్నీళ్ళు మది గదులలో
వంటగదులలో దాచేస్తూ

మూడు రోజుల రక్త ప్రవాహానికి తెరచాటంటూ
కనులు తెరిచి రెప్పలను మూసి
అలుపు బాటపై ఓర్పును పరిచి
కానరాని ఆంక్షల ముళ్ళతో
తమను గులాబీలుగా మార్చినా
గంభనంగా పరిమళిస్తూ

వారి ఆచారాలకు మెరుపులద్దుకోవాలని
పట్టు పురుగులా పెంచుతూ
స్వేచ్ఛ అనే పట్టుకోసం ప్రాణం తీస్తున్నా
నీడను ఆసరాగా మలుచుకుని
చీకటిని దీపంగా మలుచుకుంటూ

విరామమెరుగని నింగిలా మారి
మేఘాల మద్య తన దరహాసాలను
చుక్కలుగా మార్చుకుంటూ
మౌనాన్ని జాబిలి చేస్తూ
పలుకులలో వెన్నెల పంచుతూ

మగువనంటూ మనసును
అతివనంటూ అవనిని
ఆడదానినంటూ ఆదిమూలాన్ని
పడతినంటూ పతిని
మహిళనంటూ మహిని
అమ్మనంటూ ప్రేమ సామ్రాజ్యాన్ని ఏలేస్తూ

సుదతినంటూ సతిగానూ
అబలనంటూ సబలగానూ
భామనంటూ సత్యభామగానూ
నవరస కధానాయకగానూ
కాలం వేదికపై నటిస్తూ

కవుల ఊహాగానాలలో జీవిస్తూ
సంసార సాగరాన్ని ఈదుతూ
అంతరిక్షాన విహంగమై
అంతర్జాలంతో మమేకమై
ఆకాశాన ఊగేటి వెన్నెల కొమ్మలే
చిరునవ్వుల సెలయేటిలో
విరిసిన కలువలే మా మగువలు..!!
మరిన్ని శీర్షికలు
endaro mahanubhavulu andarikee vandanaalu