Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

అమ్మో ఆరేళ్ళా ...అప్పుడే ఆరేళ్ళా... - బన్ను

go telugu

స్వస్తిశ్రీ విజయనామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి...గురువారం 11 ఏప్రిల్ 2013...తెలుగువారి సంవత్సరాది ఉగాది పర్వదినం...తెలుగు పాఠకుల లోగిళ్ళలోకి ఒకరోజు ముందే వచ్చింది. సాహితీ సౌరభాలను మోసుకుని గోతెలుగు రూపంలో....పత్రికా ప్రపంచంలో ఒక సరికొత్త శకానికి ఉగాది పర్వదినం నాంది పలికింది. స్వర్గీయ బాపుగారి చేతుల్లో రూపుదిద్దుకున్న అద్భుతమైన ముఖ చిత్రం చూపరులకు కనువిందు చేసింది...ప్రతి పేజీ అలరించింది....ఎందరో కవులు, కళాకారులు...రచయిత(త్రు)లు అతిరథ మహారథులైన ఆహూతుల మధ్య ఆరంభం అదిరింది......ఇకనుంచీ క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం మీకిష్టమైన రచనలను ఒక్కచోట చేర్చుకుని మీకందిస్తామంటూ కోయిల కుహుకుహూల మధ్య...ఉగాది పచ్చడి సాక్షిగా వాగ్దానం చేసింది గోతెలుగు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు పాఠకులెక్కడున్నా ప్రతి ఇంటికీ చేరింది...ప్రతి మనసునీ మురిపించింది...నాటి నుంచి నేటికి మాట తప్పలేదు...మడమ తిప్పలేదు...వచ్చి చేరుతున్న కొత్త కలాలను స్వాగతిస్తూ, పాతవారిని గౌరవించుకుంటూ, అందరినీ కలుపుకొంటూ ఒక జీవనదిలా..అలుపెరుగని బాటసారిలా సాగిపోతూనే ఉంది...అనేక వ్యవహారాల మధ్య క్షణం తీరిక లేని నాకు గోతెలుగు ఒక సాంత్వన..నా సాహిత్యాభిలాషకి ఒక రూపం..ఆరేళ్ళ ప్రస్థానాన్ని దాటి ఏడో వసంతం లోకి అడుగిడుతోన్న గోతెలుగు విజయవంతంగా 312 సంచికలు వెలువడి, 313వ సంచిక మీచేతుల్లో ఉంది...ఆరంభ వేడుక తలచుకొంటే అప్పుడే ఆరేళ్ళయిందా అని ఆశ్చర్యం...అమ్మో ఆరేళ్ళయిందా అని సంభ్రమం...సరస్వతీపుత్రుల సహకారం ఉన్నంతకాలం...పాఠకుల ఆదరాభిమానాలున్నంత కాలం...ఆరేళ్ళయినా, అరవై ఏళ్ళయినా ఈ పరుగు ఆగదు..ఈ సాహితీ మహోత్సవం కళ తప్పదు...అదే ఆత్మవిశ్వాసంతో అలుపెరుగకుండా శ్రమిస్తూనే ఉంటామని సంతోషంగా తెలియజేసుకుంటున్నాం....ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతాభివందనాలు సమర్పిస్తున్నాం.

- బన్ను

మరిన్ని శీర్షికలు
I love you Mommy -