ఈ వారం ( 5/4 –11/4 ) మహానుభావులు
జయంతులు
ఏప్రిల్ 6
శ్రీ శ్రీభాష్యం అప్పలాచార్యులు : వీరు, ఏప్రిల్ 6, 1922 న , విశాఖ జిల్లా, పద్మనాభం గ్రామంలో జన్మించారు. మహామహోపాధ్యాయ బిరుదాంకితులు. అభిజ్ఞానశాకుంతలం, మేఘసందేశం వంటి కాళిదాసుమహాకావ్యాలపై యాభై వరకు ఉపన్యాసాలందించారు. ఉపనిషత్తులు, రామాయణం, తిరుప్పావై, భగవద్గీత, ద్రవిడ ప్రబంధాలపై ఉపన్యాసాలు చేసారు.
ఏప్రిల్ 7
శ్రీ గడియారం వెంకటశాస్త్రి : వీరు ఏప్రిల్ 7, 1894 న , నెమళ్ళదిన్నె లో జన్మించారు. ఆధునికాంధ్ర కవుల్లో ప్రముఖులు. పరాయిపాలనను నిరసించి స్వాతంత్య్రకాంక్షను అణువణువునా రగుల్చుతూ రచించిన మహాకావ్యం 'శ్రీశివభారతం” రచయిత వీరే.
దుర్భాక శతావధాని గారితో కలిసి కొన్ని కావ్యనాటకాలు రాసారు.
ఏప్రిల్ 8
శ్రీ దాసు శ్రీరాములు : వీరు ఏప్రిల్ 8, 1846 న కూరాడ లో జన్మించారు. తర్క, వ్యాకరణ, సంగీత, సాహిత్య, వేదాంతాలలో పాండిత్యాన్ని పొందారు. జీవితంలో ఎక్కువభాగం సాహిత్య సేవకు వినియోగించారు. ఏలూరులో సంగీత నృత్య కళాశాల స్థాపించి ఎందరో స్త్రీలకు నేర్పించారు.
వర్ధంతులు
ఏప్రిల్ 5
శ్రీ శ్రీపతి పండితారాధ్యుల కోదండపాణి : సుప్రసిధ్ధ తెలుగు సినిమా సంగీత దర్శకుడు. ప్రారంభంలో నాటకాలకు సంగితం కూర్చి, క్రమక్రమంగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. తాను బాణిలు కట్టిన 101 సినిమాలలోనూ, పాటలు సాహిత్యవిలువలు పోగొట్టకుండా శ్రావ్యంగా ఉండేవి.
వీరు ఏప్రిల్ 5, 1974 న స్వర్గస్థులయారు.
ఏప్రిల్ 7
- శ్రీ కొండవీటి వెంకట కవి : వీరి అసలు పేరు కొండవీటి వెంకటయ్య. ప్రసిద్ధ కవి, హేతువాది చలనచిత్ర సంభాషణ రచయిత. అనేక గ్రంధాలు రచించారు.
త్రిశతి పేరుతో బుద్ధుడు, వేమన, గాంధీల గురించి మూడు శతకాలు రచించారు. అతి సామాన్యుడిగా కనిపించే అసాధారణ తాత్వికుడు, వేదాంతి .
వీరు ఏప్రిల్ 7. 1991 న స్వర్గస్థులయారు.
- శ్రీ భమిడిపాటి రామగోపాలం : భరాగో గా పరిచితులైన సుప్రసిధ్ధ రచయిత. తన 78 వ ఏట కాళ్ళూ వేళ్ళూ పడిపోయినా, సహితీ వ్యాసంగాన్ని మానలేదు. ఆరు కథాసంపుటాలు, మూడు నవలలూ రచించారు. “ ఇట్లు మీ విధేయుడు “ కి కేంద్రసాహిత్య ఎకాడమీ పురస్కారం లభించింది.
వీరు ఏప్రిల్ 7, 2010 న స్వర్గస్థులయారు.
ఏప్రిల్ 8
శ్రీ శంకరంభాడి వరదాచారి : తెలుగు ప్రజలకు, ఆంధ్ర ప్రదేశ్‌రాష్ట్రానికి రాష్ట్ర గీతమైన “మా తెలుగు తల్లికి మల్లె పూదండ” అందించారు. రాష్ట్ర చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని రమ్యంగా వర్ణించిన నాలుగు పద్యాలు అవి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆ గీతాన్ని రాష్ట్ర గీతంగా గుర్తించి గౌరవించింది. వీరు ఎన్నో రచనలు చేసారు.
వీరు ఏప్రిల్ 8, 1977 న స్వర్గస్థులయారు.
ఏప్రిల్ 9
శ్రీ అయిమల్ మన్మధరాజు రాజా : వీరు A M రాజా గా ప్రసిధ్ధిచెందారు.
1950వ దశకములో తమిళ, తెలుగు సినిమా రంగాలలో విశిష్టమైన నేపథ్య గాయకులు,సంగీతదర్శకులు,నటుడు. విప్రనారాయణ, చక్రపాణి, ప్రేమలేఖలు, మిస్సమ్మ పాటలు రాజా గాత్ర మాధుర్యానికి కొన్ని మచ్చు తునకలు. ఈయన వివిధ భాషలలో 10,000 పాటలు పాడి, వందకు పైగా సినిమాలకు సంగీతం సమకూర్చారు.
వీరు ఏప్రిల్ 9, 1989 న స్వర్గస్థులయారు.
|