Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
tamilnadu

ఈ సంచికలో >> శీర్షికలు >>

చమత్కారం - భమిడిపాటిఫణిబాబు

chamatkaaram

ఒకానొకప్పుడు అంటే, నాగరికత అంతగా అభివృధ్ధి చెందని రొజుల్లో , మనుషులు అడవుల్లో దొరికే జంతువులని వేటాడి, కాల్చుకునో, ఒక్కోప్పుడు పచ్చిగానో , ఆ మాంసం తినేవారుట… తపస్సు చేసుకునే ఋషులూ, మునులూ కందమూలఫలాలు ఆరగించేవారుట. అవన్నీ ఎన్నో యుగాలక్రితం.కాలక్రమేణా మనిషి వివిధరకాల రుచులకీ అలవాటు పడ్డాడు.

గుర్తుండే ఉంటుంది—మన చిన్నప్పుడు మన పెద్దలు చెప్పినమాటే వినడం, వాళ్ళు తింటూ మనకీ పెట్టేదే తినడమూనూ.. ఆరోజుల్లో ఇళ్ళల్లో అమ్మపెట్టే తిండే తప్ప, బయట తిండి తినే అవకాశమూ ఉండేది కాదూ, అవసరమూ ఉండేది కాదూ. శరీరానికి  శక్తిని ఇచ్చే తిండే పెట్టేవారు, అలాగే పెరిగి పెద్దయాము కూడా. శాఖాహారం తినే వాళ్ళింట్లో మచ్చుకైనా మాంసాహారమనేది ఉండేది కాదు. విజ్ఞాన శాస్త్రం ప్రకారం, మాంసాహారం తినేవాళ్ళే ఎక్కువ శక్తితో ఉంటారంటారు. వాళ్ళే గొప్పగొప్ప క్రీడాకారులుగా పేరుకూడా తెచ్చుకున్నారు. అలాగని పప్పుధాన్యాలు తినేవారు ఏదో వెనకబడిపోయారనీ కాదూ, కానీ కొంచం తక్కువ. ఇదివరకటి రోజుల్లో తినే తిండివలన ఆరోగ్యాలూ బాగానే ఉండేవి. తిండికి సాయం, స్వఛ్ఛమైన గాలి, నీరూ, చేసేపనులూ కూడా ఈ ఆరోగ్యానికి ముఖ్యకారణం.

కానీ రోజులన్నీ ఒకేలా ఉండవుగా, నాగరికతా పెరిగింది, పశ్చిమదేశాల్లో దొరికేవన్నీ , మన దేశంలోనే లభ్యం అవడం ప్రారంభమయింది. కొత్తగా ఏదైనా దొరికితే, అది వస్తువవనీయండి, ఆహారమవనీయండి, ఒక్కసారి వాడిచూస్తే నష్టం ఏముందీ, అనేసుకుని వాడడం మొదలెట్టేసారు. దానితో దేశంలో ప్రతీచోటా, వీటి వాడకం ఎక్కువయిపోయింది. 92 తరవాత, ఆర్ధికసంస్కరణల ధర్మమా అని, విదేశీ కంపెనీలు కూడా, తమతమ ఉత్పత్తుల్ని మన దేశంలోనే తయారుచేయడం ప్రారంభం అయింది. దగ్గరలోనే ప్రతీదీ లభ్యం అవడంతో, మనుషులు ఎడాపెడా ఉపయోగించడం మొదలెట్టారు. ఓ నియమిత పధ్ధతిలో తినే, తిండికి, ఈ విదేశీ పదార్ధాలు పోటీపడ్డాయి. వారి వ్యాపార ప్రకటనల్లో కూడా, ఓ కొత్త ఒరవడి ప్రారంభం అయింది… ప్రతీ విదేశీ ఉత్పత్తినీ “ దేశీయ “ పేరుతో , అంటే  “ మీ టూత్ పేస్ట్ లో ఉప్పుందా, బొగ్గుందా.. “ అనేవాడొకడూ, “ తులసి “ పేరు వాడి, జనాల్ని “ ఫిదా “ చేసేవాడొకడూ… ఇలా మారిపోయింది వాతావరణమంతా…

ఇవన్నీ ఒక ఎత్తైతే, అంతర్జాలం సులభంగా అందుబాటులోకి రావడం తో, జనాలు ప్రతీదీ, నెట్ లోనే వెదికేయడం. అక్కడేదో చదవడం, తమకి తామే , రాత్రికిరాత్రే ఎంతో విజ్ఞానం సంపాదించేసామనుకుని , ఆ చదివినదాన్ని ఆచరణలో పెట్టేయడం.  మనిషికి ఏదైనా అనారోగ్యం చేస్తే, ఎవరో ఒక డాక్టరుకి చూపించుకోవడం , వైద్యం చేయించుకోవడం ఓ పధ్ధతిగా ఉండేది. కానీ  గూగులమ్మ ధర్మమా అని, అంతర్జాలం అందుబాటులో ఉన్న ప్రతీవాడూ, వైద్యుడైపోయాడు. దానికి సాయం, ఎవరెవరో ఆరోగ్యసూత్రాలు బోధించేవారే.. ఇంకో చిత్రం ఏమిటంటే, ఒకడు చెప్పినదానితో మరోడు ఏకీభవించడు… ఫలానా రోగానికి ఫలనాది వాడమనేవాడొకడైతే, మరొకడు అస్సలు ఆ పదార్ధాన్నే దగ్గరకు రానీయకూడదంటాడు. దీనితో పరిస్థితి అంతా గందరగోళంగా తయారయింది.

వీటికి సాయం, గత కొన్ని సంవత్సరాలుగా, ఓ కొత్తదోటి వచ్చింది --  VEGAN DIET – అని. కనిపించడం తరవాయి, అదేదో సంజీవిని అనుకుంటారు, మన యువతరం. చూస్తూంటాం, ఒకేచోట రోజంతా కూర్చోవడం, దానికి సాయం మామూలుగా చేసే వ్యాయామం ( అంటే ఏదో పెద్ద పెద్ద యోగాసనాలు కూడా కాదు, ప్రతీరోజూ ఓ గంట నడవడం ) కూడా లేకపోవడంతో, ఊబకాయాలు ఎక్కువైపోయాయి. ఈ రోజుల్లోనేమో ఆడవారికి “ జీరో సైజూ “ , మగవారికి పొట్టనేది లేకపోవడం ఓ ఫాషనాయే.. తనమాటెలా ఉన్నా, పక్కవాడికి పొట్టనేదిలేకపోవడం వీడు తట్టుకోలేడు… వెంటనే టకటకా మని, నెట్ వెతికితే ఇదిగో, ఈ   VEGAN DIET  ఇలాటివాటికి సంజీవినిలాటిదని తెలుసుకుంటాడు.

వెంటనే ఆచరించేయడం ప్రారంభం. పోనీ ఓ డాక్టరుని సంప్రదిస్తే ఏం పోతుందీ? అబ్బే, గూగులమ్మ చెప్పిందీ, మనం ఆచరించేయడం అంతే…ఫలితం—మరు క్షణం నుండీ రోజూ తీసుకునే , పాలూ, పెరుగూ, నెయ్యీ అన్నీ నిషిధ్ధం. పైగా  VEGAN  అనిపించుకోవడం  ఓ స్టేటస్ సింబలోటీ.  అన్ని సంవత్సరాలనుండీ వాడుతూన్న పాలూ పెరుగూ మానేస్తే, శరీరానికి కావాల్సిన పోషకపదార్ధాలు ఎక్కణ్ణుంచి వస్తాయీ అనే ఆలోచనే ఉండదు. ఇవి లేకపోవడంతో, శరీరంలో కొత్త సమస్యలు, మళ్ళీ డాక్టర్లూ, వైద్యాలూ… ఆ పాలూ పెరుగూ మళ్ళీ మొదలూ.. మరి అవన్నీ మానేసి సాధించిందేమిటంట ? అలాటివి అడక్కూడదు…

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
endaro mahanubhavulu andarikee vandanaalu