ఆలోచనలో వైవిధ్యం!
డా. ఎం కిరణ్ కుమార్ అంటే మీకు తెలుశా? బహుశా మీకు తెలియక పోవచ్చు.
అదే కొన్ని హింట్స్ ఇస్తాను. ఇట్టే చెప్పేస్తారు-
"డబ్బులెవరికీ ఊరికే రావు"
"మీరు కష్టపడి సంపాదించిన డబ్బును నగలు కొనేప్పుడు జాగ్రత్తగా కర్చుపెట్టండి"
ఇప్పుడు..మీ మనసులో లలితా జ్యువెల్లరీ యాడ్..అందులో గుండుతో ఉన్న ఒక వ్యక్తి టక్కున మనసులో మెదులుతారు. ఆయనే డా. ఎం కిరణ్ కుమార్!
‘గొప్ప వ్యక్తులు వివిధ పనులు చేయరు, చేసే పనుల్లో వైవిధ్యం చూపిస్తారు’ అని రాస్తాడు వ్యక్తిత్వ వికాస నిపుణుడు శివ్ ఖేరా తన ‘యు కెన్ విన్’ పుస్తకం మొదటి పేజీలో!
అడ్వర్టైజ్ మెంట్ అంటే సినీతారలు, క్రికెట్ ఆటగాళ్లు కొండకచో మధ్య తరగతి జనాలు అన్న భావం అందరిలో నెలకొంది. గొప్పవాళ్లు ‘నేను వాడుతున్నాను’ అని చెబితే చాలు, జనం వేలం వెర్రిగా కొని వాడతారని ఉత్పాదకుల, యాడ్ రూపకర్తల ధీమా, అది ఎన్నో ఏళ్లుగా అడ్వర్టైజ్ మెంట్ రంగాన్నేలుతోంది.
అయితే తన నగల అమ్మకాన్ని తన భుజాలపై వేసుకుని మనలో ఒకడిగా, మన శ్రేయోభిలాషిలా, మన మనసులకు నచ్చేట్టుగా..అదీ మనం కష్టపడి సంపాదించే ప్రతిపైస విలువా తనకు తెలుసని, ఇతర వర్తకులు చెప్పే మాటలు నమ్మొద్దని, వాళ్లు వేసే ఎరలకు లొంగొద్దని..ప్రలోబాలకు లోనవ్వొద్దని.. నాలుగు షాపులు తిరిగి ఒక నిర్ణయానికి రావాలని..తమ దుకాణాల్లో ధరకు తగిన విలువైన వస్తువులను ఇస్తానని ప్రమాణం చేస్తూ టీ వీల్లో, వార్తాపత్రికల్లో ఘంటాపథంగా..నమ్మకంగా చెబితే ఎవరు నమ్మరు? నమ్మితీరతారు.
అందుకే అతి తక్కువ కాలంలో ఎక్కువ శాఖలుగా విస్తరించి అశేష కొనుగోలుదార్లను ఆకర్షిస్తోంది.
మన ప్రొడక్ట్ మీద ముందు మనకు నమ్మకం ఉండాలి. తర్వాత రాజీ లేని నాణ్యతను అందిస్తామన్న నమ్మకం కలిగి ఉండాలి. అప్పుడే జనం మధ్య అలా గట్టిగా చెప్పగలరు.
మొన్నొకరోజు రైల్లో విజయవాడకు వెళ్ళాను. కొత్తగా ఓ శాఖ వెలుస్తోందట, వరసగా అక్కడి టీ వీలో అదే యాడ్! విచిత్రం ఏమిటంటే అన్నిసార్లు చూస్తున్నా, వింటున్నా విసుగనిపించలేదు. పైపెచ్చు వెళ్లి మన స్థాయికి తగ్గ ఏదో ఓ నగ కొనుక్కురావాలన్న కోరిక బలంగా కలిగింది. అలా ఉండాలి యాడ్ అంటే!
నేను రాస్తున్నది లలితా జ్యువెల్లరీ వారి ప్రకటనకు అడ్వర్టైజ్ మెంట్ కాదు. నాకూ దానికీ సంబంధమూ లేదు. వైవిధ్యం అనేది ప్రజల మనసులను ఎలా గెలుస్తుంది? అన్న దానికి ఒక ఉదాహరణ.
మొనాటనీగా చేస్తూ పోవడం కాదు. చేసే దాంట్లో కూసింత వైవిధ్యం కలబోస్తే విజయపు మెట్లు సునాయాసంగా ఎక్కొచ్చు.
మీరేమంటారు?
’ఎస్‘ అంటారు నాకు తెలుసు!
***
|