ఈ వారం ( 24/5 – 30/5 ) మహానుభావులు
జయంతులు
మే 25
శ్రీ ఇవటూరి విజయేశ్వర రావు : వీరు మే 25, 1938 న విశాఖపట్నం లో జన్మించారు. ప్రముఖ వాయులీన విద్వాంసులు.. వీరు వయొలిన్, గాత్రం రెండింటా పాండిత్యం సంపాదించి, ఎన్నో కచేరీలు చేసారు. వయొలిన్ శిక్షణ శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారి వద్ద తీసుకున్నారు. అనేక బిరుదులు పొందారు.
మే 27
శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి : వీరు మే 27, 1894 న బొమ్మరాజుపల్లి లో జన్మించారు. ప్రముఖ కవి, పండితుడు.. వీరి కవితాగురువులు తిరుపతి వెంకట కవులు. కొన్ని సంస్కృత గ్రంధాలను తెలుగులోకి అనువదించారు. “ చాటు పద్య రత్నాకరము “—వీరి ప్రసిధ్ధ రచన.
మే 28
- శ్రీ సురవరం ప్రతాప రెడ్డి : వీరు మే 28, 1896 న ఇటిక్యాలపాడు లో జన్మించారు. పత్రికాసంపాదకుడి గా, పరిశోధకుడిగా, రచయిత గా, ప్రేరకుడు గా, క్రియాశీల ఉద్యమకారుడు గా ఎంతో పేరు తెచ్చుకున్నారు… నిజాం పరిపాలన లో తెలుగుభాషా సంస్కృతుల వికాసానికి ఎంతో కృషి చేసారు. 354 గురు కవుల జీవిత విశేషాలతో “ గోల్కొండ కవుల సంచిక “ ప్రచురించారు. తెలంగాణా సాంస్కృతిక చరిత్రలో వీరిని ఒక అధ్యాయంగా చెప్పుకుంటారు.
2 శ్రీ నందమూరి తారక రామారావు : వీరు మే 28, 1923 న పామర్రు లో జన్మించారు. గొప్ప నటుడు, ప్రజానాయకుడు. అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో దాదాపు 400 చిత్రాలలో నటించారు. విశ్వ విఖ్యాత నటసార్వభౌముడుగా బిరుదాంకితుడైన ఆయన, అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించడమేగాక, రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా,ఆరాధ్య దైవంగా నిలచిపోయారు. 13 చారిత్రకాలు, 55 జానపద, 186 సాంఘిక, 44 పౌరాణిక చిత్రాలు చేసారు.
మే 30
శ్రీ ఎర్రగుడిపాటి వరదరావు : వీరు మే 30, 1903 న నెల్లూరు లో జన్మించారు. YV Rao గా ప్రసిధ్ధులు. తొలితరం తెలుగు సినిమా నటుడు, నిర్మాత. తెలుగు మూకీ చిత్రాలలో కూడా నటించారు. ఏడు భారతీయ భాషల్లో పనిచేసిన ఘనత వీరొక్కరికే దక్కింది.
వర్ధంతులు
మే 25
శ్రీ గాలి పెంచలనరసింహారావు : తొలితరం ప్రఖ్యాత సంగీత దర్శకుడు. యాదృఛ్ఛికంగా వారు సంగీతదర్శకత్వం వహించిన మొదటి ( 1934 ), చివరి చిత్రం ( 1964 ) రెండు సినిమాలూ ఒకే ఇతివృత్తం – శ్రీసీతారామకల్యాణం – అవడం. చివరి చిత్రంలో స్వరపరచిన “ సీతారాముల కల్యాణం చూతము రారండే “ అన్న పాట ఇప్పటికీ , శ్రీరామనవమి, పెళ్ళిళ్ళల్లోనూ వినిపిస్తూంటుంది.
వీరు మే 25, 1964 న స్వర్గస్థులయారు.
2.శ్రీ బులుసు వెంకటరమణయ్య : ప్రముఖ రచయిత. 1930-32 లో కాశీవిశ్వవిద్యాలయం నుండి, అలంకార శాస్త్రంలో పరిశోధనలు చేసారు. ఎన్నో రచనలు, అనువాదాలూ చేసారు.
వీరు మే 25, 1989 న స్వర్గస్థులయారు.
మే 26
శ్రీ రఘుపతి వెంకటరత్నం నాయుడు : విద్యావేత్తగా, సంఘసంస్కర్తగా, పవిత్రతకు సంకేతంగా, బ్రహ్మర్షిగా ఆంధ్రప్రదేశ్ లో పేరుపొందిన వ్యక్తి. హిందీ, ఉర్దూ, పర్షియన్ భాషలలో కూడా ప్రావీణ్యం కలిగిన వారు. 1911 లో కాలేజీలలో స్త్రీలకు ప్రవేశం కల్పించినవారిలో ఆద్యుడు. ఆంధ్రవిశ్వకళాపరిషత్తు ఆవిర్భావంలో ముఖ్యపాత్ర వీరిదే.
వీరు మే 26, 1939 న స్వర్గస్థులయారు.
మే 27
శ్రీమతి పవని నిర్మల ప్రభావతి : అగ్రశ్రేణి తెలుగు కథా, నవలా రచయిత్రి.. 7 కథాసంపుటాలు, 17 నవలలు రచించారు. ఇవి కాకుండా, కొన్ని ఆధ్యాత్మిక రచనలు కూడా చేసారు.
వీరు మే 27, 2015 న స్వర్గస్థులయారు.
మే 30
శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ : వీరు ప్రముఖ తెలుగు కవి, విమర్శకుడు, సాహితీవేత్త. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. ఆధునిక సాహిత్యంపై తనదైన ముద్ర వేసిన గుంటూరు శేషేంద్ర శర్మ 30కి పైగా రచనలు చేసారు.ఈయన రచనలు అంతర్జాతీయ ఖ్యాతి గాంచాయి. "నా దేశం-నా ప్రజలు" 2004 నోబెల్ సాహిత్య పురస్కారానికి నామినేట్ అయ్యింది.
వీరు మే 30, 2007 న స్వర్గస్థులయారు.
|