Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly-horoscope 24th may to 30th may

ఈ సంచికలో >> శీర్షికలు >>

రాజ్యంకోసం (బాలల కథల సంపుటి సమీక్ష) - -గుడిమెట్ల చెన్నయ్య

rajyam kosam

బాలలకు మనోవికాసాన్ని కలిగించి,వారి తెలివితేటలను పెంచి,వారి సమస్యలకు పరిష్కారాన్ని సూచించి ,వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదద్దాలనేదే  శ్రీ బొందల నాగేశ్వరరావు "రాజ్యంకోసం"కథల సంపుటిలోని సారాంశం.

నేటి బాలలే రేపటి పౌరులు.అంటే ఈ దేశ దిశ నిర్దేశకులు వారే.మరి వారు మంచి పౌరులు కావాలంటే సన్మార్గాన పయనించేవారై,సత్ ప్రవర్తన కలిగిన వారై, సత్బుద్ధికూడిన వారై, సశ్చీలురై వుండాలి.తద్వారా శాంతియుతంగా జీవించ గలుగుతారు.ఆనందమయ జీవితాన్ని పొందగలుగుతారు.

మరి అలాంటి మంచి పౌరులుగా బాలలు తయారుకావాలంటే వారికి చిన్నతనం నుండే మంచి మంచి విషయాలు తెలిపే బాధ్యత మనందరిపైనా వుంది.అందులో రచయిత పాత్ర మరీ ముఖ్యం.

రచయిత తాను చెప్పదలుచుకొన్నది సూటిగా చెప్పగలుగుతాడు.అందులోనూ పిల్లలకు తెలియ చెప్పే విషయంలో మరీ జాగ్రత్తగా వుంటాడు.వారికి చెప్పేటప్పుడు ముద్దు ముద్దు మాటలతో ముచ్టటగా అర్థమైయ్యేలా చెప్పాలని తపన పడతాడు.
ఆ పనే రచయత బొందల నాగేశ్వరరావుగారు చేశారు. స్వయంగా ఆయన మితభాషి. కాబట్టేనేమో వారి కథలు అంత నిడివిగానూ కాకుండ,మరీ అంత చిన్నవిగా కాకుండ చక్కగా చిక్కగా వుంటాయి  . అందువల్ల బాలల మనసులో అవి పది కాలాల పాటు పదిలంగా నిలిచి పోతాయి. వారు ఎన్నుకునే వస్తువు,వారి శైలి చదువరులను యిట్టే ఆకర్షిస్తాయి.

ఈ బాలల కథాసంపుటిలో19కథలున్నాయి.కథలన్నీ పిల్లల ప్రయోజనం కోసం ఉద్దేశించినవే. మచ్చుకు కొన్ని....
ఎవరైనా పిల్లలు ఇంటిదారి మరిచిపోయి ఇబ్బందిలో వుంటే ఆవిషయాన్ని వారికీ,వీరికీ కాక తిన్నగా పోలీసులకు తెలియజేయాలనేది'మంచి నిర్ణయం' కథలోని సారాంశం.ఇందులో దిక్కు తోచక తపించేవారికి ఒక మార్గాన్ని సూచిస్తారు రచయిత.

ఐకమత్యంతో వున్నామంటే ఎటువంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చుననే సందేశాన్ని యిస్తారు 'ఐకమత్యమే బలం'అనే కథలో.
ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్న లోకోక్తిని తెలుపుతుంది, 'రామ చిలుక తెలివి' కథ.

ఇలా రావిచెట్టు,రాజ్యం కోసం,మంచి నేస్తాలు,ముష్ఠవాడు,ముగ్గురు మిత్రులు,అన్నదమ్ములు, హితబోధ, సమయస్ఫూర్తి, జాలిగుండె, తాకటితలిస్తే,ఆస్తి పంపకాలు ,ఎలుకల సాహసం, ఇరుగుపొరుగు,సాధన,ఊహించని ప్రతిఫలం,లైలుకథలలోకూడా మంచి,మంచి సూచనలు, సలహాలు వున్నాయి.

లైలుకథ గురించి చెప్పాలంటే 'ర' అక్షరం సరిగ్గా పలుకలేనివాడిలో ఒక కథనే చెప్పిస్తుంది టీచర్ .దీన్ని మీరు చదివితేనే మంచిది,నేను చెప్పేకంటే.

శ్రీ బొందల నాగేశ్వరరావు ప్రముఖ నాటక,కథారచయిత.సమాజంలో జరిగే సంఘటనలే వీరి కథా వస్తువులు.చెన్నై మద్రాసు పోర్టు ట్రస్టులో సీనియర్ అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసరుగా పదవి విరమణ పొందికూడా సమాజంలోని చెడును ఎత్తి చూపుతూ మంచి మార్గాన్ని సూచిస్తూ ఎన్నో రచనలను చేశారు,చేస్తున్నారు కూడా.అలాంటి వారి కలంనుండి బాలలకు తగిన పుస్తకాలూ రావడం ఆహ్వానించదగ్గ విషయం.
వారి ఈ సాహితీ కృషి ఇలాగే కొనసాగాలని కోరుకొంటూ వారికి అభినందనలను తెలుపుకొంటున్నాను.

పదిమంది చదవదగిన పుస్తకం
పదిలంగా దాచుకోదగిన పుస్తకం
మంచి పుస్తకం,మదిలో నిలిచే పుస్తకం.

-శుభం-                               

 

మరిన్ని శీర్షికలు
advandam book review