Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
endaro mahanubhavulu andarikee vandanaalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

ప్రతాపభావాలు - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

pratapabhavalu

మానవ సేవే మాధవ సేవ!

నాకు కొన్ని విషయాలు చిత్రంగా అనిపిస్తాయి.

నిత్య వ్యవహారాల్లో కొట్టుమిట్టాడే సాధారణ మనిషి, పోనీ తన స్వార్థం కోసమే అనుకుందాం ఎవరికోసం ఏం చేయట్లేదంటే అర్థం ఉంది.
జీవితం బుద్బుదప్రాయమని, అంతా మిథ్య అని సన్యాసం తీసుకుని, పదిమందిని పోగేసుకుని, ఎదురుగా వందలాది మందికి వినసొంపైన మాటలు చెప్పే స్వామీజీలు, గురూజీలు పరోపకారానికి ఎందుకు ఉపక్రమించరు?

రోజుల తరబడి కేవలం ప్రవచనాలు, ఉపన్యాసాలు చెప్పే బదులు కార్యాచరణకు పూనుకోవచ్చు కదా! వాళ్లు డబ్బు కోసం పాకులాడక్కర్లేదు. డోనర్స్ దండిగా డొనేట్ చేస్తూనే ఉంటారు. అంచేత రెక్కాడితే కాని డొక్కాడదే అన్న సమస్య లేదు. వాళ్లు స్వచ్ఛందంగా చెయ్యాలనుకుంటే ఎన్ని పనులు లేవు. మొక్కలు పాతి పర్యావరణాన్ని కాపాడవచ్చు. ప్లాస్టిక్ లాంటి వాటిని వాడకుండా ప్రజల్లో అవగాహన కలిగించొచ్చు. ఆసుపత్రులకెళ్లి రోగులకు సాంత్వన కలిగించొచ్చు. సహాయం చేసే వాళ్లు లేనివాళ్లకు సహాయం చెయ్యొచ్చు. ఆర్థికంగా ఆదుకోవచ్చు. రోడ్ల మీద యాక్సిడెంట్ అయి, గాయపడిన, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్లను రక్షించవచ్చు. రక్త, అవయవదానాలూ చేయవచ్చు. శరీరం అశాశ్వతం అనన్ స్పృహ ఉన్నవాళ్లు కదా!

భూకంపాలు, తుపానులులాంటి ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడు స్వచ్ఛంద సంస్థలు, సైనికులు సహాయం చేయడానికి ముందుంటారుగాని, వీళ్లెందుకు కనిపించరు?

పరోపకారార్ఢం ఇదం శరీరం, మానవ సేవే మాధవ సేవ  అని తెలిసిన వీళ్లే ఇలా ఆశ్రమాలకు అంకితమై, తామరాకుపై నీటి బొట్టులా..ఎవరికీ కాకుండా, ఓ మూల సత్శంగాలు చేసుకుంటే ఎలా?

జనాభ లెక్కల సేకరణ, ఓటర్ల నమోదు, పబ్లిక్ పరీక్ష పేపర్లు దిద్డడంలాంటి కార్యక్రమాల్లో టీచర్లను కాకుండా ప్రభుత్వం వీరి సేవలను ఉపయోగించుకుంటే ఉచితంగా ఉంటుంది. పైపెచ్చు అవకతవకలకు ఆస్కారం ఉండదు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యోగులు, సాధువులందరూ సర్వజనహిత కార్యక్రమాల్లో పాల్గొంటే, ప్రపంచంనూతన రూపును సంతరించుకుంటుందనడంలో సందేహం లేదు.

మరిన్ని శీర్షికలు
weekly-horoscope 24th may to 30th may