Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
bommala katha

ఈ సంచికలో >> శీర్షికలు >>

తమిళనాడు తీర్థయాత్రలు - కర్రానాగలక్ష్మి

tamilnadu

ఈ వారం మనం తమిళనాడులోని మరో ముఖ్యమైన యాత్రాస్థలమైన ‘ కన్యాకుమారి ‘ గురించి తెలుసుకుందాం కన్యాకుమారి భారతదేశానికి క్రింది భాగంలో సముద్రతీరంలో వుంది . మనదేశం ఒక ద్వీపకల్పమని తెలుసు కదా ? అంటే మనదేశానికి మూడువైపులా సముద్రం వుంది , ఆ మూడు సముద్రాలు కలిసేచోట వున్న  ఒడ్డున వుంది కన్యాకుమారి వూరు . ఇక్కడ వున్న కన్య భగవతి అమ్మవారు , మందిరంలోని అమ్మవారిపేరు మీదుగా యీ వూరికి కన్యాకుమారి అనే పేరు వచ్చింది .

తమిళనాడు రాష్ట్ర ముఖ్యపట్టణమైన చెన్నై కి సిమారు 750 కిలోమీటర్ల దూరంలో వుంది కన్యాకుమారి , దీనిని ఆంగ్లేయుల కాలంలో ‘ కేప్ ఆఫ్ కొమరిన్ ‘ గా వ్యవహరించేవారు . స్వాత్రంతం తరువాత తమిళనాడు ప్రభుత్వం కన్యాకుమారిగా వ్యవహరించసాగింది .

సముద్రతీరం కాబట్టి యెండలు యెక్కువగానే వుంటాయి , చెమట కూడా .

సముద్రతీరంలో నడుస్తూ మూడుసముద్రాలు కలసిన ప్రదేశం చూస్తూవుంటే యెంత ఆశ్చర్యమో , ఓ పక్క నురగలు కక్కుతూ యెగసిపడే అలలతో బంగాళాఖాతం , నీలంరంగు నీళ్లతో వున్న హిందుమహా సముద్రము , బురద రంగులో అరేబియన్ సముద్రము మూడువైపుల నుంచి మూడు సముద్రాలు కలవడం , వాటి కలయిక చూడగలగడం ఓ అద్భుతమే . ప్రతీరోజూ మొదటి సూర్యకిరణం మనదేశం మీద పడేదికూడా యిక్కడే . ప్రతీరోజూ సూర్యోదయం సూర్యాస్తమయం చూడడానికి చాలా మంది పర్యాటకులు వస్తూ వుంటారు . కన్యాకుమారి వెళ్లిన ప్రతీయాత్రీకుడూ మన భూభాగాన్ని తాకే తొలి సూర్యకిరణాన్ని చూడాలనుకుంటాడు . అందుకే కన్యాకుమారి బీచ్ పగలు సాయంత్రం చాలా రద్దీగా వుంటుంది .

గంగ , యమున , సరస్వతీ నదుల సంగమమైన ప్రయాగరాజ్  ( అలహాబాద్ ) కి హింధువులలో యెంత ప్రాముఖ్యత వుందో అంతే ప్రాముఖ్యత కన్యాకుమారికి కూడా వుంది , యెందుకంటే యిక్కడ మూడు సముద్రాలు కలుస్తాయి మరి , ప్రయాగరాజ్లో పితృదేవతలకు జరిపేపిండప్రదానాలు యిక్కడ కూడా జరుపుతారు . కన్యాకుమారి తీరంలో సముద్రంలో 11 పుణ్యతీర్థాలు వున్నాయని అంటారు . ఈ పుణ్యతీర్థాలలో స్నానం సర్వపాపాలను ప్రక్షాళన చేస్తుందట .

ఇక కోవెల గురించి చెప్పుకోవాలంటే కోవెల తూర్పుద్వారం సముద్రం వైపు తీసివుంటుంది , కాని ఆ ద్వారం కొన్ని ప్రత్యేక దినాలలో తప్ప మిగతా సమయాలలో మూసివేస్తారు . ఉత్తర ద్వారం లోంచి ప్రవేశం వుంటుంది , పొడవైన నడావా గుండా లోపలకి వెళితే నవరాత్ర మండపం దాటుకొని ద్వజస్థంబం దాటుకొని లోపలకి వెళితే కన్యాకుమారి అమ్మవారు పావడ కట్టుకొని నిలుచున్నట్టుగా వున్న విగ్రహం చేతిలో జపమాల తో దర్శనమిస్తుంది . ఈ విగ్రహం 3వేల సంవత్సరాలకు ముందుదని చరిత్రకారులు నిర్ధారించేరు , పౌరాణిక ప్రమాణాల ప్రకారం యీ విగ్రహం పరశురాము చే ప్రతిష్టించబడింది . పరశురాముడు నీలం రాయితో మలచబడ్డ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు పురాణాలలో వుంది . యజుర్వేదం లోని వైష్ణవ ఉపనిషత్తులోని తైత్తరీయ సంహితలో కన్యాకుమారిని గురించిన వర్ణన వుంది . గర్భగుడిలోని భైరవుని విగ్రహం కన్యాకుమారి శక్తిపీఠమని నిరాధారణ చేస్తుంది . ఇక్కడ భైరవుడు ‘ నిమిష ‘ అనే పేరుమీద పూజలందుకుంటున్నాడు . కన్యాకుమారిని , భైరవి , భారతి , భద్ర , కన్యా మాత నామాలతో పూజలందుకుంటోంది . కన్యకుమారి చెలికత్తెలుగా చెప్పే విజయసుందరి , బాలసుందరి లకు కూడా గర్భగుడిలో ఉపమందిరాలు వున్నాయి .

శిల్పకళ గురించి చెప్పాలంటే తమిళనాడు మందిరాలను పోలే వుంటుంది ప్రత్యేకంగా చెప్పుకోడానికి యేమీలేదు . మందిరం లోపల వున్న నాలుగు స్థంబాల మండపం గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాలి , యీ నాలుగు స్థంబాలను చేత్తో కొడితే ఒక్కోస్థంబం నుంచి వీణ , ఫ్లూటు , తబల , జలతరంగం శబ్దాలు వస్తాయి . సరిగమలు , మృదంగం శబ్దాలు రావడం చూసేం , కాని ఒకే మండపంలో నాలుగు వాయిద్యాల శబ్దాలు రావడం వింతే , కన్యాకుమారి వెళ్లేవారు యీ మండపన్ని మిస్ అవకండి .

మందిరం లోపల వున్న పాతాళగంగ తీర్థం నుంచి తెచ్చిన నీళ్లతో అమ్మ వారికి నిత్య అభిషేకాదులు నిర్వహిస్తారు .

ఆషాఢ పూర్ణిమ , కార్తీక పూర్ణి , పౌష్యపూర్ణిమ లలో కోవెల తూర్పుద్వారం తెరచి వుంచుతారు . అమ్మవారు సముద్రానికి అభిముఖంగా వుంటుంది . అమ్మవారి విగ్రహం కళకళలాడుతూ వుంటుంది . సర్వాలంకారాలతో వున్న అమ్మవారి ముక్కెర మాత్రం చాలా ప్రత్యేకంగా వుంటుంది . జాతికెంపులు మణులతో చేసినది , చీకట్లో అది దీపంలా మెరుస్తూ వుంటుంది . ఈ కాంతి సముద్రంలో వెళుతున్న ఓడలలోని వారికి అది ఓడరేవులోని కాంతిగా భ్రమ కలిగించేదట , దాంతో ఓడలు తీరంవేపుగారవాడంతో ఓడలు తీరంవెంటవున్న కొండలకు కొట్టుకొని ప్రమాదాలు జరిగేవట , అందుకని ఆంగ్లేయుల కాలంలో కోవెల తూర్పుద్వారాన్ని మూసివేసేరట , అమ్మవారి విగ్రహాన్ని ఆభరణాలనూ కూడా తరలించడానికి ప్రయత్నాలు చేసేరట ఆంగ్లేయులు , అమ్మవారే రక్షించుకున్నారట.

ఇక స్థలపురాణానికి వస్తే

బాణాసురుడు శివుని వద్దనుండి వరాలుపొందుతాడు , ఆవర ప్రభావం వల్ల శివుణ్ణి తన రాజ్యానికి కాపలాదారుగా నియమించుకొని మితిమీరిన అహంకారంతో ముల్లోకాలను గజగజలాడిస్తూవుండగా బాణాసురుని వధించేందుకు ముక్కోటి దేవతలూ వుపాయాలు వెతుకుతూ వుంటారు . బాణాసురుడు బ్రహ్మ దేవుని  వద్దనుంచి కన్యచేతిలో తప్ప మరణం లేనట్లు వరం పొందిన సంగతి తెలుసుకుంటారు . దేవతలు పార్వతీదేవిని ప్రసన్నురాలిని చేసుకొని ఆమెను భూలోకంలో జన్మించి భాణాసురుని సంహరించమని కోరుతారు . పార్వతీదేవి కన్యగా భూలోకంలో అవతరించి శివుని వివాహమాడదలచి మూడుసముద్రాల సంగమ ప్రాంతంలో తపస్సుచేసుకొని శివుని ప్రసన్నుని చేసుకొగా శివుడు కన్యాకుమారిని వివాహమాడటానికి ప్రాతఃకాలంలో వస్తానని మాట యిస్తాడు . శివుడు ముహూర్త సమయానికి శచీంద్రంలో బయలుదేరుతాడు . 

జరుగుతున్న పరిమాణాలు చూస్తున్న దేవతలు పార్వతి శివుని వివాహం చేసుకొని కైలాసం వెళ్లిపోతే తిరిగి పార్వతి కన్యగా అవతరించి భాణాసురుని సంహారించడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి వివాహం ఆపడానికి నారదుని సహాయం అడుగుతారు , నారదుడు కోడిపుంజు రూపంలో సూర్యోదయమయినట్లుగా కూస్తాడు . కన్యాకుమారి సూర్యోదయమయినా శివుడు వివాహమంటపానికి రాలేదని కోపగించి మండపాన్ని నాశనంచేసి ఉగ్రరూపంలో తిరుగుతూ అడ్డుగా వున్నవాటిని నాశనం చేస్తూ వుంటుంది . పార్వతి వివాహసమయంలో అథిధుల కొరకై వండుతున్న అన్నం వుడకక ముందే అమ్మవారు కోపంతో పారబోస్తుంది , కన్యాకుమారి బీచ్ లో వుండే యిసుక సన్నని బియ్యాన్ని పోలి వుంటుంది , అప్పుడు అమ్మవారు పారబోసిన బియ్యమే యిప్పటికీ యిలా యిసుకరూపంలో వున్నాయని అంటారు . 

కొన్నాళ్లకి శాంతించిన పార్వతి తిరిగి ధ్యానంలో మునిగిపోతుంది . భాణాసురుడు తపస్సుచేసుకుంటున్న పార్వతి అందానికి మోహించి ఆమెను చెరపట్టడానికి వస్తాడు . పార్వతీదేవి బాణాసురుని వధిస్తుంది . ఇది శక్తి పీఠం అనికూడా చెప్పుకున్నాం కదా ? సతీదేవియొక్క వెన్నుభాగం యిక్కడ పడిందని అంటారు . అందకే కుండలిని జాగృతం చేసుకోదలచిన వారు యిక్కడ ధ్యానం చేసుకుంటే చాలా సులువుగా కుండలిని జాగృతం అవుతుందని అంటారు . మహావిద్య , మహా తంత్రోపాసకులు యిక్కడ పూజలు చేసుకొని శక్తులను పొందుతారు .       పరశురాముడు , అగస్త్యుడు మొదలయిన పురాణపురుషులే కాక రామకృష్ణ పరమహంస , వివేకానందుడు యిక్కడ ధ్యానం చేసుకున్నారు . వివేకానందుడు యిక్కడ ధ్యానం చేసుకున్న తరువాత సన్యాస దీక్ష పుచ్చుకొన్నాడు . ఇంకా చాలామంది యీ కాలపు గురువులు కూడా యిక్కడ ధ్యానం చేసుకొని సన్యాసదీక్ష పుచ్చుకున్నట్లు వారి ఆత్మకథలలో రాసుకున్నారు .

ఇప్పుడు మనం చూస్తున్న ఈ కోవెల నిర్మాణం యీ ప్రాంతాన్ని పరిపాలించిన చోళులు , తరువాత తిరువాన్కోరు రాజులు నిర్మించేరు .     కన్యాకుమారి కి దేశం నలుమూలలనుంచి రైలు , విమాన సౌకర్యాలు వున్నాయి .

కన్యాకుమారిలో అమ్మవారి కోవెలే కాక వివేకానంద రాక్ మెమోరియల్ , మహాత్మగాంధి మెమోరియల్ , కామరాజ్ మెమోరియల్ , తిరువళ్లువార్ స్టాట్యూ చూడవలసినవి , అయితే యివి సముద్రం మధ్యలో నిర్మింపబడడం వల్ల సముద్రం ప్రశాంతంగా వున్నప్పుడు మాత్రమే మోటారు , చేతి పడవలను అనుమతిస్తారు .

వివేకానంద రాక్ మెమోరియల్ —సముద్రం మధ్యలో కొండమీద నిర్మింపబడిన ధ్యాన మందిరం , ఈ ప్రదేశంలోనే వివేకానందుడు ధ్యానం చేసుకొని జ్ఞానోదయం పొందేడు . ఇది రెండు భాగాలుగా వుంటుంది ఒకటి ధ్యానమందిరం రెండవది శ్రీపాద మందిరం . వివేకానందుని జీవిత చరిత్రను తెలియజేసే పటాలను భద్రపరచేరు . ధ్యానమందిరం చాలా ప్రశాంతంగా వుంటుంది , కళ్లుమూసుకొని ధ్యానంచేసుకుంటే యెంతో ప్రశాంతంగా వుంటుంది . వివేకానందుని గురువైన రామకృష్ట పరమహంస కూడా యిక్కడే ధ్యానం చేసుకున్న ప్రదేశం కూడా యిదే . శ్రీపాద మందిరంలో రాతి పాదముద్రలు వుంటాయి , ఇవి వివేకానందుని పాదముద్రలని కొందరు , కన్యాకుమారి పాదముద్రలు అని కొందరు అంటారు

గాంధీ మెమోరియల్ —-గాంధీగారి అస్తికలు సముద్రంలో నిమజ్జనం చెయ్యడానికి ముందు ప్రజల దర్శనం కొరకు యీ ప్రదేశంలో వుంచేరు , అనంతరం యీ మెమోరియల్ నిర్మాణం చేసేరు .

కామరాజ్ మణిమండప మోన్యుమెంట్ —-ఇది కామరాజ్ అస్తికలను ప్రజల దర్శనార్దం వుంచిన ప్రదేశం , కామరాజ్ నేషనల్ కాంగ్రేస్ ప్రెసిడెంటు మరియు తమిళనాడు పూర్వ ముఖ్యమంత్రి , ఇతను ‘ నల్ల గాంధి ( బ్లాక్ గాంధి ) గా ప్రసిధ్దుడు . దీనిని మణిమండపం అనికూడా అంటారు .

తిరువళ్లువార్ విగ్రహం —— తిరువళ్లువార్ ని తమిళ ఆదికవి అని అంటారు , తిరువళ్లువార్ అనేక గ్రంధాలు తమిళంలో రాసిన కవి . కన్యాకుమారి లో సముద్రంలో  చిన్న ద్వీపం మీద 2000 సంవత్సరం జనవరిలో కట్టబడింది . ఈ విగ్రహం సుమారు 95 అడుగులయెత్తు కలిగి 38 అడుగుల యెత్తైన గట్టుమీద నిర్మింపబడింది . మొత్తం గట్టుతో కలిపి ఈ విగ్రహం యెత్తు 133 అడుగులు , యీ విగ్రహం నడుందగ్గర కాస్త పక్కకి వంగి నాట్యభంగిమను గుర్తుచేస్తూ వుంటుంది . ఈ విగ్రహం సుమారు 7000 టన్నులు బరువుంటుంది  , యిది డాక్టరు గణపతి స్థపతిగారి ఆధ్వైర్యం లో మలచబడింది . సముద్రం కల్లోలంగా వున్న సమయంలో యీ ద్వీపానికి బోట్లని అనుమతించరు .

మళ్లా వారం మరో ప్రదేశంలో పర్యటిద్దాం , అంతవరకు శలవు .

మరిన్ని శీర్షికలు