Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Dharmam

ఈ సంచికలో >> శీర్షికలు >>

మట్టిలో మాణిక్యాలు - ఆర్.సి. కృష్ణస్వామి రాజు

mattilo manikyalu

సురేంద్ర నగరం రాజా వారికి ఒక చెడ్డ అపోహ వుండేది . విద్య అనేది పండితుల ధనికుల పట్టణ వాసుల అగ్ర కులాల  వారికి మాత్రమే అబ్బుతుందని భావించేవాడు. మిగిలిన వారు విద్యలో రాణించలేరని అలాంటి వారిపైన ధనం వెచ్చించి విద్యాబుద్ధులు నేర్పాలనుకోవడం వృథా ప్రయత్నంగా భావించేవాడు. రాజు గారి అభిప్రాయాన్ని మంత్రి తీవ్రంగా వ్యతిరేకించేవాడు . ప్రకృతిలో అందరూ సమానమేనని అవకాశాలు రాక అవకాశాలు  లేక అవకాశాలు దొరకక విద్యను అభ్యసించడం లేదని వాదించేవాడు. మంత్రి ప్రోద్బలంతో ఒక వేసవి మాసంలో పల్లెలన్నీ తిరిగి సామాన్యులకు సైతం విద్య అందించే అవకాశాలు పరిశీలిద్దామని బయలుదేరారు. ఇద్దరూ గుర్రం పైన ప్రయాణం మొదలుబెట్టినారు. కయ్యిలు కాలువలు దాటి కొండలు గుట్టలూ దిగి అలసి ఒక చింత చెట్టు కింద చేరారు. చింత చెట్టు పక్కనే నిండుగా తామర పూలు వున్న తామర కొలను కూడా వుంది.

వారికి దగ్గరలో పెద్ద చింత చెట్టు కింద ఒక కుమ్మరి కుటుంబం కనిపించింది.  కుటుంబ యజమాని ఎద్దుల బండిలో బంక మట్టి గడ్డలు తెచ్చి కుప్ప పోసినాడు. మట్టి లోని రాళ్లు చెత్తా చెదారం ఎత్తి  వేయసాగాడు. బంక మన్ను గడ్డలను కుమ్మరి భార్య నలుగ కొట్ట సాగింది. ఇద్దరు కూతుళ్ళూ నలుగ గొట్టిన మన్నును జల్లెడతో జల్లించినారు. జల్లించిన మన్నును కుప్ప చేసినారు. కుమ్మరి గబగబా వచ్చి కొలనులోని నీళ్లు తెచ్చి  కుప్ప పైన నీళ్లు చల్లి కస కసా తొక్కినాడు. బాగా మెత్తబడిందనుకున్నాక మట్టి ముద్దను సారె పైన పెట్టినాడు. సారె  గిర గిర తిరుగుతూ  వుంటే మట్టిని ఒడుపుగా పట్టుకొన్నాడు. నిదానంగా మట్టి ముద్ద మంచి కుండగా మారింది. పచ్చి కుండలను తీసి తీసి కుమ్మరి భార్య ఎండ బెట్టసాగింది.

రకరకాల కుండలు రంగు రంగు కుండలు వివిధ పరిమాణాల కుండలు తయారు కాసాగాయి. ఆసక్తిగా చూస్తున్న రాజు వైపు తిరిగి మంత్రి "రాజా! మీరే కళ్లారా చూశారు కదా, మట్టి ఒకటే,అయినా రకరకాల కుండలు తయారయ్యాయి. అలాగే మనుష్యులంతా ఒకటే. అందరికీ అవకాశాలు ఇస్తే, అవకాశాలు వస్తే,అవకాశాలు కల్పిస్తే ప్రతిభ వున్న వారు నిలబడతారు. ప్రతిభ లేని వారు పక్కకెళ్లి పోతారు. రాజ్య సంక్షేమకులుగా మనం అందరికీ సమాన  అవకాశాలు ఇవ్వాలి. లేకపోతే చదువు అనేది తెలివైనోళ్ల వున్నోళ్ల పెద్ద ఊరోళ్ళ  పెద్ద కులపోళ్ల కొంగు బంగారమవుతుంది. వున్నోడు వున్నోడుగా వుండిపోతాడు.లేనోడు లేనోడిగానే మిగిలిపోతాడు.అలాగే చింత చెట్టు పక్కనున్న తామర కొలను చూడండి మహారాజా,బురదలోంచి ఎంత అందమైన  తామర పూలు పుట్టుకొచ్చాయో,మట్టిలో మాణిక్యాలు వుంటాయి మహారాజా ! పాలకులుగా మనం మాణిక్యాలను వెలికి తీయాలి. ప్రతి ఒక్కరిలోనూ ఎదో ఒక శక్తి సామర్ధ్యం వుంటుంది. వాటిని వెలికి తీసే నైపుణ్యం విద్యకు మాత్రమే వుంది. ఆ సదుపాయం మనం ప్రతి ఒక్కరికీ అందించాలి. పాలకులుగా మనం అందించేది అందిద్దాం. అందుకుంటే వారి అదృష్టం. అందుకోనివారిది దురదృష్టం " అని వినమ్రంగా సలహా ఇచ్చాడు.

దీర్ఘంగా ఆలోచించిన రాజుకు నిజమేననిపించింది. ఒకే  మట్టితో  కుమ్మరి రక రకాల కుండలు తయారు చేసినాడు.  అంటే ప్రజలంతా ఒకటే. ప్రకృతి పరంగా అందరూ సమానమే.  విద్యకు తెలివైనవాళ్లు  తెలివితక్కువవాళ్లు, డబ్బున్నోళ్లు డబ్బు లేనోళ్లు, పట్టణమోళ్లు పల్లెటూరోళ్లు, పెద్ద కులం వాళ్ళు చిన్న కులం వాళ్ళు   అని తేడాలు  ఏమీ వుండవు.ఎవరు కష్టపడి  చదివినా విద్య వస్తుంది. విద్య అనేది ఎవరు నేర్చినా వృధా కాదు. నేర్చిన విద్య జీవితంలో ఎప్పుడో ఒకసారి వారికి గానీ ఊరికి గానీ  ఉపయోగపడుతుంది. మంచి కుమ్మరి మంచి రకవారీ కుండలను తయారు చేసినట్లుగా మంచి బడులను తెరిచి మంచి గురువులను నియమించి మట్టిలోని  మాణిక్యాలను వెలికి తీయవచ్చునని తెలుసుకున్నాడు. తదుపరి ప్రయాణం కొనసాగించకనే తమ రాజ్యానికి వెళ్లి విద్యా వ్యాప్తికి ప్రణాళికలు రచించాడు. కొన్నేళ్ళకే సురేంద్రనగరం విద్యా సుగంధాలను వెదజల్లింది.

మరిన్ని శీర్షికలు
Mamidikaya Endu Royyalu