Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
pancharatnalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

ప్రతాపభావాలు - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

ప్రకృతి పట్ల అప్రమత్తంగా....

వైజాగ్ అంటే సముద్రం. విజయవాడ అంటే కొండలు గుర్తుకొస్తాయి. ఇలా కొన్ని ప్రాంతాల్లో సహజంగా ఏర్పడ్డ సంపదలు వాటికి చిరునామాగా నిలుస్తాయి. అవి ఆయా ప్రాంతాల అందాలను ద్విగుణీకృతం చేస్తాయి.

మొన్న చుట్టాలింట్లో ఫంక్షన్ కని విజయవాడకి వెళ్ళాను. పొద్దుటి పూట ప్రయాణం. బస్ విజయవాడలో ప్రవేశించగానే కృష్ణమ్మను చూడబోతున్నానని, అమ్మవార్ని దర్శించబోతున్నాని ఆనందం.

బస్ లో నుంచి బయటకు చూద్దును గదా, కొండల్ని దొలిచేస్తున్న ఆనవాలు ఆనిపించాయి. అలా కొండల్ని పిండి చేసే అనుమతులు ఉన్నాయో లేదో అన్న విషయం పక్కన బెడితే, ఒక చెట్టు కూల్చితే, విత్తనం నాటి కొన్నాళ్లకు మరో చెట్టును పొందవచ్చు. అదే కొండను దొలిచి నేలమట్టం చేస్తే మరో కొండను పొందగలమా?

ఇప్పటికే మన స్వార్థంతో అరణ్యాలను కోల్పోయాం. తద్వారా జీవ జంతుజాలాన్ని, కల్పవృక్షాలను పోగొట్టుకున్నాం. ప్రభుత్వం కళ్ళు తెరచి అభయారణ్యాలను రూపొందించి ప్రోత్సహిస్తున్నా, అవి ఒకప్పటి విస్తృత అరణ్యాలకు సాటిరావు.

కొన్ని ప్రాజెక్టులు పల్లెసీమల్ని, చేలనీ, నదుల పరీవాహక ప్రాంతాల్నీ మింగేస్తున్నాయి. మానసికంగా అలసిపోయాం, కాస్త సేద దీరుదామంటే జనారణ్యాలు కాని, పచ్చని ప్రదేశాలు కాని కానరాని పరిస్థితి.

ఇప్పటి తరానికి సతత హరితారణ్యాలంటే తెలీదు. కొన్ని జంతువుల ఉనికి అస్సలే తెలీదు.

పోనీ ఇప్పటికైనా కళ్ళు తెరుచుకున్నాయంటే, ఇదిగో ఇలా కొండల్ని పిండి చేయడం. చెరువులని మట్టితో నింపి తామర తంపరగా ఇళ్లను నిర్మించడం.

మనిషి జీవితాల్లాగానే కొన్ని కోల్పోతే మళ్ళీ పొందలేం. ఈ విషయంలో ఉదాశీనంగా ఉండకూడదు. అప్రమత్తంగా ఉండాలి.

అప్పుడే ప్రకృతి సంపదని కాపాడి రేపటి తరానికి భద్రంగా అందించిన వాళ్లమవుతాం.

ఈ ప్రపంచంలోకి పర్యాటకులుగా వచ్చినందుకు వాళ్లూ తమ జీవితాలని అనుభూతించాలిగా మరి.

***

మరిన్ని శీర్షికలు
kerala viharayatralu