Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
adigedimeere answericchedi meere

ఈ సంచికలో >> శీర్షికలు >>

హ్యూమరసం - వారణాసి రామకృష్ణ

`

 

“డే”  లు

“డే” లు అంటే దినాలు అని డైరేటు గా చెప్పలేం ఎందుకూ అంటే దినాలకి మన తెల్గులో అర్ధం వేరేఉంది. జనవరి ఒకటో తారీఖు న్యూ ఇయర్స్ డే అనగా అందరూ గాట్టిగా హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని అరుస్తుంటే వినివిని చెవులు దిబ్బిల్లేసి బాగా ఉబ్బే’డే!’ అప్పుడు అర్ధం అవుతుంది ఓహో న్యూ ఇయర్స్ డే అంటే ఇదా -మనకి వొచ్చిన కొత్త చెవులరోజు అని! అందుకే మన క్షేమం కోరే వాళ్ళంతా ఉగాదికి సుబ్బరం గా తెలుగులో నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తారు.ఇదీ హ్యాపీ న్యూ “సెవుల డే” ఎన కున్నకత!

ఇగ పిబ్రవరి 14, ప్రేమికుల దినోత్సవం! మా కాలనీ ప్రేమావతి ప్రియుడ్ని కలుద్దామని లుంబినీ పార్కుకి వెళ్తే కుర్రాడు హ్యాండిచ్చాడు.ఇంతలో పక్కకాలనీ కుర్రాడు మన్మద్ బీట్ ఎవరికీ వేద్దామా అని ఆలోచిస్తూ ప్రేమావతి కనిపిస్తే హాయ్ చెప్పాడు.ఇంతలో గాట్టిగా జైభజరంగభళి అన్న కేక వినిపించి వీళ్లిద్దరూ తుళ్ళి పడి చూసేలోపలె ఆ దళ కార్యకర్తలు ఇద్దర్ని పట్టుకుని  కుయ్యో మొర్రో,వద్దుకాదు అంటున్నావినక పెళ్లి చేసి పారేసి హుస్సేన్ సాగర్ బోట్లో ఫస్టు నైటు అరేంజ్ చేశారు. దెబ్బకి సరిగ్గా 9 నెలల తర్వాత ‘ఖేర్ కేర్’ మని పిల్లాడి ఏడుపు వినిపించింది.ఆరోజు నవెంబరు 14, అందుకే దాన్ని చిల్డ్రన్స్ ‘డే’ అన్నారు! సెప్పోచ్చేదేటంటే పిబ్రవరి 14 లవర్స్ డే కి నవెంబరు 14 చిల్డ్రన్స్ డే కి డిపరెన్సు కరేట్టుగా  తొమ్మిది నెల్లు!! 

***   ****   ****

‘డే’విడ్- మా కాలనీ కుర్రాడు! పేరులో ‘’డే’’ ఉండటం వల్లో ఏమో ఎప్పుడూ ‘డే’ ల గురించి వాగివాగి సంపుతుంటాడు.అంకుల్,మే 12 మదర్స్ డే, జూన్ 29 డాక్టర్స్ డే,సెప్టెంబర్ 30 హార్ట్ డే ఇట్లా ఈ డే ల ప్రాముఖ్యత చెప్తుంటే ఈ ‘డే’ ల గోల భరించలేక ‘డేవిడ్ ఏ డే అడిగినా చెప్పగలవా? అంటే ఓఎస్అంకుల్ ఏ డే అయినా నే’డే’ ఇప్పు’డే’ చెప్తా అన్నాడు నీ డే ఈ డే తో ఖతం చేస్తా అనుకుని సరే ఐతే 1894 లో గుడ్డుఫ్రై డే  ఏడే వచ్చిందో చెప్పు అడిగేసరికి డేవిడ్ కి బుర్ర తిరిగి తలగోక్కుని ట్యుష్ డే అనుకుంటా అంకుల్ అన్నాడు. పక్కనేఉన్న అయోమయం అప్పారావు కాదు ప్రతి గుడ్ ఫ్రై డే కి హాలిడే వస్తుంది.ఆరోజు నా చేత అంట్లు తోమిoచిబట్టలు ఉతికి ఇస్త్రీ చేయిస్తుంది మా ఆవిడ!కనుక అది గ్యారెంటీ సన్’ డే’ నే అన్నాడు. డేవిడ్ కొంచెం విసుగ్గా లేదంకుల్! గుడ్ ఫ్రై డే ఒక్కో ఇయర్ ఒక్కో డే వస్తుంది కంపల్సరీ సన్ డే అనేమి లేదు అన్నాడు. దాంతో అప్పారావుకి కోపం వచ్చి పిల్లా’డే’వి!

‘డే’ ల గురించి నీకేం తెలుసు?గుడ్ ఫ్రై డే అంటే హాలిడే! కచ్చితంగా సండే నే అరిచాడు. ఇద్దరూ ఆ డే కాదంటే కాదని పోట్లాడుకున్నాక నేను వారించి ఏ ఇయర్ అయినా గుడ్ ఫ్రై డే వచ్చేది ‘ఫ్రైడే’ అంటే శుక్రవారమే! ఐతే నేను అడిగింది గుడ్డు ఫ్రై డే ఏ డే వస్తుందో చెప్పమని! దాంతో మళ్ళీ డేవిడ్ తలగోక్కుంటే నేను నవ్వి ఏ డే అయితే నీ లంచ్ బాక్సు లో ఉడకబెట్టిన గుడ్డు ఉంటుందో ఆ డే ని గుడ్డు ఫ్రై డే అంటారు! అదీ ఆంచరు, చెప్తే మళ్ళీ డే ల గోలెత్తకుండా డేవిడ్ తెల్లమొహం పెట్టి  డేక్కుంటూ పోయాడు!

****    *****    ****

మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవం! ఆ రోజు టీవీ దినపత్రికలు ఆఫీసులు ఎక్కడ చూసినా ‘మహిళలూ మీరు గొప్పోళ్ళు,ఆడాళ్ళు మీకు జోహార్లు’అనే పొగడ్తలే! మహిళ అబల కాదు సబల అని టీవీలో ఒకావిడ అరుస్తుండగా ఇంకో చానెల్లో మహిళల మీద ఆ’డే’ జరిగిన అత్యాచారాల వార్తలు వస్తుంటాయి! ఆడది ఆకాశం లో సగం అని ఆవేశంగా ఓ మహిళా ఉద్యమ కార్యకర్త ఆవేశ పడుతుండగా పీకలు తెగ్గోసి పైకి ఆకాశం లోకి పంపి ఆకాశం లో సగం ఏంటి పూర్తిగా ఆమెనే ఆవరించేలా చేసాం అంటారు. ప్రతి రంగంలో మహిళ దూసుకుపోవాలి అనిచెప్పి మహిళని ఆఫీసులకి ఫ్యాక్టరీలకి ఆఖరికి మిలిటరీలోకి పంపి మగాడు మాత్రం ఇంట్లో ముసుగుతన్నిపడుకుంటున్నాడు! మా కాలనీ గోపాల్రావు ఇంతే!చక్కగా పెళ్ళాం జీతంతో తాగి తందనాలాడుతూ బేవార్సుగా బతికేస్తాడు. బైటపని చెయ్యడు ఇంట్లో పనీ అంతకంటే చెయ్యడు! పైగా ఎప్పుడు చూసినా పెళ్ళాన్ని వుబ్బెస్తూo టాడు. ఆమెకి శరీరం ఉంది కనుక వ్యాయామం అవసరం అన్ని పనులు చేసుకోవాలి! మెదడుంది పిల్లలకి పాఠాలు చెప్పాలి! మెళ్ళో పుస్తే వుంది మొగుడితాగుడికి తాకట్టుపెట్టాలి ఈ టైపులో లెక్చర్లు దంచుతాడు.ఆవిడకి కాస్త రెస్టు ఇవ్వొచ్చుకదా గోపాలరావు అంటే భలే వాడివేగురూ!మహిళలకి స్వేచ్ఛా స్వాతంత్ర్యం వుండాలి, ఆవిడ బైటికెళ్ళిపని చేస్తేనే ప్రపంచంలోని అన్ని విషయాలు తెలిసేది, లేకపోతే అజ్ఞానం లో వుండి పోతుంది అంటాడు. సరే అయితే నువ్వు ఇంట్లో పన్లు చెయ్యి అంటే ‘అప్పుడు ఆమె కుటుంబజీవితం, పిల్లల ప్రేమకి దూరమవుతుంది!ఆవిడ హక్కుల్ని నేను సదా కాపాడుతానునా పెళ్ళాoదేవత’ గంభీరంగా చెప్తాడు. వార్నీ! ఒకప్పుడు చక్కగా నీడ పట్టున వుండి వేళకిoత  తిని పిల్లలకింత పెట్టి హాయిగా బ్రతికిన మహిళలకి స్వేఛ్చ స్వాత్రంత్యం పేర్లు పెట్టి భలే తెలివిగా బుట్టలోవేసి నెత్తినబరువులు వేసి వాడుకుoటున్నారు! అందుకేనేమో మార్చి అవగానే వస్తుంది ఏప్రిల్ ఫస్టు అనగా ‘ఆలి’ ఫూల్స్ ‘డే’ వస్తుంది!  

***   *****   *****

మే 5 ప్రపంచ నవ్వుల డే! మా కాలనీ లో దుర్వాస రావ్ ఉన్నాడు. ఎప్పుడూ దుర్వాసన కొడుతు మొహం దుమదుమలాడుతూ సీరియస్ గా ఉంటాడు. ఎవరైనా హ్యాపి బర్త్ డే అంటే చాలు క్లాసు పీకుతాడు. బర్త్ డే అని సంకలు గుద్దుకోవటం కాదు ఎందుకు పుట్టామో తెలుస్కుని చావాలి! కోపంగా చెప్తాడు.సరే వీడ్ని గెలకటం ఎందుకులే అని ఊరుకుని మన బర్త్ డే రోజు మౌనంగా మన దారిన మనం పోతుంటే దార్లో పట్టుకుని ‘ఏంటి సార్ మీబర్త్ డే అటగా! బర్త్ డే అంటే అది ఒక విశేషమైన డే గా సేలిబ్రేట్ చేసుకోవాలి’ అంటూ మళ్ళీ క్లాసు పీకుతాడు. ఇట్టాంటి దుర్వాస రావు మే 5 నాడు పార్కులో అందర్నీ చేరేసి నాలికలు అందరివీ బైటపెట్టిoచి ముక్కు చిట్లిస్తూ ‘వే’ అంటూ నవ్వే ప్రయత్నం చేయించాడు. పైగా పత్రికా విలేఖర్లనీ పిలిచి ఫోటోలు తీయించాడు. నవ్వు రాకపోయినా ’కి కి క్కి’ మని నవ్వి అనక ఇంటికెళ్ళి స్కూటర్ తన జాగాలో పార్క్ చేసాడని కోపంగా పక్కింటాయన్ని బండ బూతులు తిట్టాడు. ఒత్తిళ్ళు సహజం!వాటిని నియంత్రించుకుంటూ ప్రశాంతం గా ఉండే ప్రయత్నం నిత్యం చేస్తేనే డే లకి సార్ధకత!అంతే కానీ నవ్వుల డే కదానని కిచకిచ నవ్వి మళ్ళీ మామూల్ అయిపోతే నవ్వుల’డే’ నవ్వులపాలయిన ‘డే’ నే అవుతుంది!

ఇక మే 30 పొగాకు వ్యతిరేక డే, మా కాలనీ స్మోకర్స్ అసోసియేషన్ పెసిడెంటు నూకారావు ఆ డే నాడూ డే అంతా మరిన్ని సిగిరెట్లు తాగేస్తాడు. ఓసారి ఎవరో చూసి నూకారావు గారు ఇవాళ పొగాకు డే చెప్తే తెలుసు అందుకే కాల్చేస్తున్నా అన్నాట్ట.అయ్యో!పొగాకు వ్యతిరేక డే నాడు అస్సలు తాగకూడదు అంటే ఇవాళ ఒక్క రోజే మీకు పొగాకు వ్యతిరేకం నాకైతే నిత్యం ఇదంటేఒళ్ళుమంట!సదా సర్వత్రా వ్యతిరేకిని అందుకే కోపం కసి కలగలిపి దీన్ని‘తగలెడు తున్నా’ అన్నాట్ట!   

***    ****   ****

ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే! పొద్దునే టీవీలో ఏదో సిన్మా పాట వస్తోంది అందులో ఓ పడుచు పిల్ల చున్ని ఎగరేసి ఎదపొంగులు చూపిస్తూ ఐ లవ్ ఇండియా అంటూ కొండల్లో పరిగెత్తుతూ గంతులేస్తోంది! ఇంతలో అప్పారావు సుపుత్రుడు బబ్లూ వస్తే ఒరే బబ్లూ ఇవాల్టి డే కి ఉన్న గొప్పదనం ఏంటో చెప్పగలవా అడిగితే ఓ ఎస్ అంకుల్ ఇవాళ ఇండిపెండెన్స్ డే! అంటే హాలిడే!జాలి డే! వాడూ గంతులేశాడు. బుర్రగోక్కుని బైటికొస్తే వీధులు శుభ్రo చేసే రాములు పనిమానేసి దిగాలుగా కూర్చుని కనిపిస్తే ఏంటి రాములు డల్ గా వున్నావు అడిగితే  ఏందీ సార్ ఈ డే? సుక్కదొరకదు ముక్క దొరకదు.దిమాక్ ఖరాబ్ అయి పిచ్చిలేస్తన్నదిఅన్నాడు. ఆఖరికి గాంధీ గారు కలలు కన్న ఈ డే ఇలా ’ డ్రై’  డే గా మిగిలి పోయింది!

****   *****   ****

నవెంబరు 19 వరల్ద్ టాయిలెట్ డే! ప్రతి మనిషి తన జీవితం లో 3 సంవత్సరాలకి పైగా అక్కడే గడుపుతాడట, అంచేత అవి శుభ్రంగా పెట్టుకోవాలని టాయిలెట్’డే’ పెట్టారు. ఈ విషయంలో మా అయోమయం అప్పారావు కన్ఫ్యూజ్ అయ్యి రోజంతా బైటికి రాకుండా టాయిలెట్ లోనే గడి పెట్టుకున్నాడు. వాళ్ళ ఆవిడ బబ్లుకి టాయిలెట్ కి వస్తోందట గడి తియ్యండి అని ఎంత అరిచినా వినకపోతే ఎవరోవెళ్లి అందేటి అప్పారావు టాయ్ లెట్ లో అంతసేపు ఏంచేస్తున్నావు, తలుపు తీయ్యి చెప్తే నవెంబర్ 19 నాడు టాయిలెట్ లోనే గడపాలి, తియ్యను అన్నాట్ట.కర్మ!నెత్తి నోరుబాదుకుని నచ్చచెప్పి తలుపు తీయిన్చేసరికి అందరికి నీరసం డే వచ్చేసింది!

****   ****   ****

డిసెంబర్ 6 బ్లాక్ డే! వివాదాస్పద స్థలం లో ఒకళ్ళు తోడ కొట్టి గుడి కడతాం అంటారు ఇంకోళ్ళు ఠాట్ వీల్లేదు పడకొడతాం, దడికడతాం అంటారు కానీ కట్టేదేదో పెద్దబడి లేదా అందరికీ ఉపయోగపడే ధర్మాసుపత్రి అందరూ కలిసికడితే ప్రపంచం మొత్తం చప్పట్లు కొడుతుంది కదా అని సామాన్యులు వాపోతారు కానయితే డిసెంబర్ 7 బధిరుల డే అయ్యింది.దాంతో ఎన్ని మంచి విషయాలు గొంతుచించుకు చెప్పినా బధిర మనస్తత్వం ప్రబలిన మనుషులకి అవి వినిపించవు, కనిపించవు!

***   ****    ****

 డిసెంబర్ 1 ఎయిడ్స్ డే! మా కాలనీ లో శాంతి అనే టీచరమ్మ ఉంది. ఆవిడ డిసెంబర్లో  బైటికి రాదు,ఎవరికీ మొహం చూపించదు.అంటే ఆవిడకి ఎయిడ్స్ అనుకుంటున్నారా? అబ్బే కాదు!పదేళ్ళ కిందట టీచరమ్మ ఎయిడ్స్ శిబిరం లో శిక్షణ పూర్తి చేస్కొని ఎయిడ్స్ అవగాహనా కార్యక్రమాలలో విరివిగా పాల్గోంది. అప్పుడు వచ్చిన యువతకందరికీ కండోములు ఇచ్చి ఎయిడ్స్ అవగాహన కలిగించే ప్రయత్నం చేసారు.ఎయిడ్స్అవగాహన  ఎలావున్నాబోలెడు మందికి అక్కడ చక్కటి ప్రేమావగాహన కుదిరిపొలోమని లేచిపోయారు. వాళ్ళల్లో టీచరమ్మ కూతురూఉంది.అప్పట్నించిఆవిడని అంతాఎయిడ్స్ టీచరమ్మ, ఎయిడ్స్ టీచరమ్మ అనటం మొదలెట్టారు. ఎయిడ్స్ అవగాహనా శిబిరాల్లో ఎయిడ్స్ ని నిరోధించే అవగాహనల సంగతేమో కానీ ప్రేమలు పెరిగటo లేచిపోవటాలు మాత్రం ఖాయమని అందరూ అంటారు.

***   ****    ****

అమెర్కా లో మా అయోమయం అప్పారావు మేనమామ సుబ్బారావు గారు ఆ మజ్జిన షష్టిపూర్తి అనగా 60 వ బర్త్ డే జరుపుకుంటూ అందర్నీ పిలిచాడట! ఫంక్షన్ కి వచ్చిన ఓ అమెరికన్ ‘హ్యాపీ సాస్ పూర్ టీ’డే’  మైడియార్ సుబ్రోవ్’ చెప్పి బోకే ఇచ్చేసి మా అప్పారావు దగ్గరికి కొచ్చి ‘ఏదో పదో పాతికో తప్ప మేము కూడా ఇన్నిన్ని పెళ్ళిళ్ళు చేసుకోం, కానీ ఒక ఇండియన్ 60 మందిని పెళ్లి చేసుకోవటం నిజంగా గ్రేట్!’ అన్నాట్ట. అప్పారావు ఉలిక్కిపడి షష్టిపూర్తి డే అంటే ‘60 పెళ్ళిళ్ళడే’ కాదు 60 ఏళ్ళు వచ్చిన సందర్భంగా చేసుకుంటున్న బర్త్ డే! సుబ్రావ్ గారికి ఉన్నది ఒక్క వైఫే చెప్తే’ఆ అమెరికన్ డామ్మని కింద పడిలేచి ‘వ్వాట్! ఒక్క వైఫ్ తో ఇన్నేళ్ళబట్టి కాపురం చేస్తున్నాడా? ఓ మై గాడ్!’ అని బోల్డు ఆశ్చర్య పోతూ బుర్ర గోక్కుంటూ వెళ్ళిపోయ్యాట్ట!

 

ఇన్ని డే ల గురించి ఓపిగ్గా సదివాం! ఏ డే అయినా మంచిభావం నింపుకుని ఇయరంతా  అదే భావం తో ఉం’డే’ ప్రయత్నం చేస్తే ‘డే’ ఏదైనా ఆ’డే’కి అదే సార్ధకత! ‘డే’ ల గురించి చెప్పిందంతా నే’డే’ మర్చిపోయి మర్నా’డే’ మళ్ళీ మామూల్ ‘డే’ అయిపోకూడదని సిన్న రిక్వెస్ట్! సరేనా, సారీ.. స’డే’నా?!  

 

..

మరిన్ని శీర్షికలు
chamatkaaram