Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
endaro mahanubhavulu andarikee vandanaalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

కర్నాటక తీర్థయాత్రలు / విహారయాత్రలు - కర్రా నాగలక్ష్మి

karnataka  viharayatralu

( ఛాముండేశ్వరి కొండలు )

కర్నాటక రాష్ట్రంలో మరో ముఖ్యమైన నగరం మైసూరు . పురాణకాలంలో దీనిని క్రౌంచ పట్టణం , మహిషూరు ( మహిషాసురుని వూరు ) గా వ్యవహరింపబడేదట , ఆంగ్లేయుల నోళ్లల్లో పడి మైసోర్ గా మారి కర్నాటక ప్రభుత్వం చొరవతో తిరిగి మైసూరు గా పిలవబడుతోంది . పురాణాల ప్రకారం మైసూరుని క్రౌంచాపురి అని వ్యవహరించేవారు .

మైసూరు నగరానికి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో వున్నాయి ఛాముండీ హిల్స్ . పూర్వం యీ కొండని  ‘ మహాబాలగిరి ‘ అని పిలిచేవారు . ఈ కొండల యెత్తు సుమారుగా 800 మీటర్ల నుంచి 1200 మీటర్ల వరకు వుంటుంది . ఈ కొండలలోనే వేంచేసి వుంది కర్నాటక ప్రజలు గొప్పగా వారి కులదేవతగా చెప్పుకొనే ఛాముండాదేవి కోవెల . సంవత్సరానికి రెండుసార్లు మైసూరు పాలకులచే ఉత్సవాలు జరిపించు కొంటుందీ అమ్మవారు . ఆషాఢమాసం లో ఒకమారు నవరాత్రులలో ఒకమారు మైసూరు పాలకులు బంగారు పల్లకీలో అమ్మవారిని ఊరేగించడం ఆనవాయితీ . ఈ అమ్మవారికి ప్రతీ సంవత్సరం కన్నుల పండుగగా తెప్పోత్సవం నిర్వహిస్తారు . ఆషాఢ శుక్రవారాలలో భక్తులు శ్రధ్దా భక్తులతో వచ్చి అమ్మవారికి పొంగళ్లు సమర్పించుకుంటారు .

10 వ శతాబ్దంలో హోసలరాజులు ఈ మందిరాన్ని నిర్మించినట్లు , 12 వ శతాబ్దంలో విజయనగర రాజులు ఈ మందిరానికి మరమ్మత్తులు చేసి మంటపాలనిర్మాణం చేసినట్లు శిలాశాసనాలు లభ్యమయేయి .శంకరాచార్యుల విరచితమైన అష్టాదశపీఠ శ్లోకంలో  క్రౌంచపట్టణే ఛాముండి అని వుండడం వల్ల శంకరులవారు ఈ మందిరాన్ని దర్శించుకొని వుంటారనేది కొందరి అభిప్రాయం .

ఇక ప్రస్తుతం లోకి వస్తే నగర వాతావరణం దాటి కొండలలోకి రాగానే మనస్సు అహ్లాదకరంగా మారడం నిజం . కొండ పాదాల దగ్గర జ్వాలాముఖి శ్రీ త్రిపురసుందరి కోవెల వుంటుంది . ఈమె ఛాముండేశ్వరీ దేవికి సహోదరి అని అంటారు . ఈమె రక్తబీజుడిని సంహరించేటప్పుడు  ఛాముండేశ్వరికి సహయపడిందట , ముందుగా ఈమెని దర్శించుకొని తరువాత కొండమీదకి వెళ్లాలి . సుమారు వెయ్యి మీటర్ల యెత్తులో అమ్మవారి కోవెల వుంటుంది . అల్లంత దూరాన్నుండే పెద్ద మహిషాసురుని విగ్రహం కనబడుతూ వుంటుంది . ఒకచేత్తో కత్తి , మరోచేత్తో పాముని పట్టుకొని భీకరంగా వుంటాడు . ఏడంతస్థుల రాజగోపురం అల్లంతదూరం నుంచి కనువిందు చేస్తుంది . పూర్వకాలంలో 1008 రాతిమెట్లు యెక్కి ఈకోవెల చేరుకొనేవారు . ఈ 1008 మెట్లు అమ్మవారి సహస్రనామాలని అంటారు . మోటారు రోడ్డు వచ్చిన తరువాత మెట్లగుండా వచ్చే భక్తులు తగ్గేరు . సుమారు యేడువందలో మెట్ల దగ్గర పెద్ద నల్లరాతి నంది విగ్రహం వుంటుంది . బసవన్నా లేచి రావయ్యా అంటే రంకెవేసి లేచి వస్తుందేమో అనేంత సజీవంగా వుంటుందీ నంది . నంది అలంకారాలైన యిత్తడి గిట్టలు , గొలుసులు మొదలైనవి శిల్పి నైపుణ్యాన్ని తెలియజేస్తూ వుంటాయి . ఈ నంది సుమారుగా 15 అడుగుల యెత్తు 24 అడుగుల పొడవు వుంటుంది . ఇది ఏకశిలానిర్మితం కూడా , నందికి యెదురుగా చిన్న శివకోవెల కూడా వుంటుంది .

గర్భగుడిలో అమ్మవారు కూర్చోని వున్నట్లుగా వుంటుంది , ఎడమకాలు మడతవేసుకొని కుడికాలితో ఏడు చక్రాలలోని చివరి చక్రాన్ని నొక్కుతున్నట్లగా వుంటుంది . ఈ రకంగా కూర్చొని వున్న అమ్మవారికి యెన్నో యోగశక్తులు వుంటాయని అంటారు . ఇక్కడ నుండి కరంజి సరస్సు , మైసూర్ పేలస్ చూడొచ్చు . మొత్తం మైసూరు నగరం బొమ్మలకొలువులో  బొమ్మలు పేర్చినట్లుగా కనబడుతూ వుంటుంది . చీకటి పడ్డ తరవాతైతే మొత్తం మైసూరు నగరాన్ని విద్యుత్దీపాలకాంతిలో చూడ్డం ఓ గొప్ప అనుభూతని చెప్పొచ్చు .

ఛాముండేశ్వరి కోవెలలో ప్రతీ ఆషాఢమాసంలో శుక్రవారాలు , అమ్మనవార వర్థంతి , దశర పూజలు విశేషంగా జరుపబడతాయి .           ఆషాఢ శుక్రవారాలు కోవెలని పూలతో అలంకరిస్తారు . గర్భగుడిలో మూలవిగ్రహం ఋషి మార్కండేయుని ద్వారా స్థాపించబడింది . మూలవిరాట్టుకి ప్రతీరోజూ పగలు సాయంత్రం అభిషేకం నిర్వహిస్తారు . దీనివల్ల మందిర పవిత్రత పెరుగుతుందని యిక్కడి పూజారుల నమ్మకం . అమ్మనవార వర్థంతి గురించి కొంచెం వివరంగా చెప్తాను . ప్రతీ ఆషాఢ కృష్ణపక్ష  రేవతీ నక్షత్రాన అమ్మవారి జన్మదినంగా జరుపుతారు . వర్థంతి అని రాసి జయంతి గురించి చెప్తున్నానని అనుకోవద్దు . సంస్కృతం లో పుట్టిన రోజు , మరణించిన రోజు రెండింటికీ వర్థంతి అనే పదం వుపయోగిస్తారు . కన్నడిగులు సంస్కృతం లోంచి తీసుకున్న ‘ వర్థంతి ‘ ని వుపయోగించడం వల్ల తెలుగులో మనకి జయంతి వర్థంతి అనే రెండు పదాలు వేరుగా వుండడం వల్ల సందేహం రావడంలో వింతలేదు . అయితే అమ్మవారి పుట్టిన రోజు యే పురాణం ఆధారంగా చేస్తున్నారు అనే అనుమానం కూడా మనకి రావడం సహజం కాని యిక్కడ అమ్మవారి పుట్టినరోజుని మైసూర్ వడయార్ వంశరాజైన ముమ్మిడి కృష్ణరాజ వడయార్ ఛాముండేశ్వరీదేవి ‘ ఉత్సవ విగ్రహాన్ని ‘ మందిరానికి సమర్పించిన రోజున జరుపుకోడం ఆచారం . ఈ విగ్రహాన్నే మైసూర్ దశరా వుత్సవాలలో బంగారు అంబారీలో వూరేగిస్తారు . ప్రస్తుతం మనం చూస్తున్న మందిరం కూడా కృష్ణరాజ వడయార్ చే నిర్మింపబడింది . ‘ అమ్మనవార వర్థంతి ‘ కి అమ్మవారికి నిత్యాభిషేకాలతో పాటు రుద్రాభిషేకం , పంచామృతాభిషేకం మొదలైనవి నిర్వహిస్తారు .

విశేష పూజాదినాలలో లక్షలాది భక్తులు శ్రద్దాభక్తులతో అమ్మవారిని దర్శించుకుంటారు . సతీదేవి యొక్క శరీరభాగాలు పడి అష్టాదశ పీఠాలుగా గుర్తింపబడ్డ ప్రదేశాలలో మైసూరు ఛాముండీ దేవి ఒకటి . ఇక్కడ సతీదేవి యొక్క కేశాలు పడ్డాయట , అందువల్ల హిందువులకి పవిత్ర స్థానంగా పేరుపొందింది . దీనిని క్రౌంచ పీఠం అనికూడా అంటారు .

మైసూర్ దశరా వుత్సవాలు ప్రపంచవ్యాప్తంగా పేరుపొందేయి . విదేశీపర్యాటకులు ప్రత్యేకంగా యీ వుత్సవాన్ని చూడ్డానికే దశరాలలో భారతదేశం వస్తారనేది అతిశయోక్తి కాదు . మహారాజా పేలస్ నుంచి ఛాముండి కొండవరకు జరిగే అమ్మవారి వూరేగింపు చూడచక్కగా వుంటుంది . ముఖ్యంగా ఒకేసారి అన్ని యేనుగలను చూడ్డం , ఏనుగులను అలంకరించిన తీరు చాలా బాగుంటుంది , వీలైతే ఒకసారి దశరా వుత్సవాలను చూడ్డానికి మైసూరు వెళ్లండి .

పై వారం మైసూరు పేలస్ , బృందావన్ గర్డెను గురించి చదువుదాం అంతవరకు శలవు .

మరిన్ని శీర్షికలు
weekly-horoscope october 11th to october 17th