Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు
greeku veerudu - movie review

ఈ సంచికలో >> సినిమా >>

ఆదిత్య హృదయం

aaditya hrudayam - vn adithya

నా  హృదయంలో సినిమాకున్న స్థానం ప్రత్యేకమైనది. సినిమా పరిశ్రమ వ్యక్తుల్లో సిరాశ్రీ గారితో ఉన్న స్నేహం మరింత ప్రత్యేకం. ఆయన ఆలోచనకి నా అక్షరాలనద్దాను. అదే ఈ కాలమ్ సినిమా పరిశ్రమ పుట్టి వందేళ్ళు అయిన సందర్భముగా, నేను కూడా ఈ పరిశ్రమలో ఓ మూల కాలూనినందుకు, పది సినిమాలకు దర్శకత్వం వహించగలిగే అవకాశాలు అదృష్టం కొద్ది నాకు దక్కినందుకు ప్రేక్షకులకి, పరిశ్రమ వారికి సవినయంగా నమస్కరిస్తూ, 1993 మే 18వ తేదిన చెన్నైలో వాహిని స్టూడియోలో అసిస్టెంట్ డైరెక్టర్ గా అప్పాయింట్ అయిన రోజు నుండి 2013 మే వరకు, అంటే దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఈ పరిశ్రమతో నాకున్న అనుభవాలు, అనుభూతులు మీతో ఈ కాలమ్ లో పంచుకుంటాను. కొంతమందన్నా నాలా అవ్వడానికి, ఇంకొంత మంది నాలా అవ్వకుండా ఉండడానికి ఈ కాలమ్ ఉపకరిస్తుందని నా అభిప్రాయం.

"మెదడన్నది మనకున్నది
అది సరిగా పని చేస్తే
విశ్వరహపేటికా విపాటన
జరుగక తప్పదు"

అని ఖడ్గ సృష్టిలో మహా కవి శ్రీ శ్రీ గారు చెప్పినట్లు... నిర్మాత, దర్శకుడు, హీరో - ఈ మూడు ప్రధాన పదవుల్లో ఉండే వారికి ప్రధానంగా కావలసినది "మెదడు". అది కూడా "సరిగా పని చేసే మెదడు".

రైతు ఎలా అయితే వ్యవసాయం చేసి తను పడాల్సిన కష్టమంతా పడి చివరికి ఫలితం కోసం వర్షం మీద ఆధారపడతాడో, సినిమా పరిశ్రమ కూడా అలా తన కష్టమంతా తను పడి చివరికి ఫలితం కోసం ప్రేక్షకుడి హర్షం మీద ఆధారపడతాడి బతుకుతుంది.

అందుకే ప్రేక్షకులని దేవుళ్ళంటాము మా సినిమావాళ్ళం,  దెయ్యం సినిమాలు బాగా తీసే ఒక అద్భుత దర్శకుడు రాంగోపాల్ వర్మ తప్ప.  ఆయనొక్కడే నాకు తెలిసి  పబ్లిగ్గా "నా ఇష్టం వచ్చిన సినిమా నేను తీస్తాను. నచ్చితే చూడు, లేకపోతే మానేయ్." అనగలిగిన దర్శకుడు. ఇండియాలో బహుశా మనుషుల్లో ఆస్తికులు, నాస్తికులు లాగ సినిమా వాళ్ళలో నాస్తికుల నాయకుడాయన. మిగిలిన నిర్మాతలు, దర్శకులందరికీ ప్రేక్షకులే దేవుళ్ళు. ప్రపంచంలో సినిమా ఒక్కటే అఫీషియల్ "డార్క్ బిజినెస్" అన్నారు శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారు. ఒక అర చెయ్యి  మాత్రమే పట్టే చిన్న కన్నంలో(కౌంటర్) డబ్బు , సినిమా టిక్కెట్ చేతులు మారతాయి. లోపలికెళ్ళగానే లైట్లు ఆఫ్ అయ్యి, తలుపులు మూసేసాకే సినిమా మొదలవుతుంది. అందుకే దీన్ని అలా అభివర్ణించారాయన. ఇదీ ఉపోద్ఘాతం. ముష్టిఘాతం లాగా, విద్యుద్ఘాతం లాగా పరిచయ వాక్యాల్ని ఉపోత్ 'ఘాతం' అని ఎందుకన్నారో....

మరిన్ని సినిమా కబుర్లు
music muchchatlu