Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

ఆదిత్య హృదయం

aadityahrudayam

1989, 90ల మధ్య విజయవాడలో మూడు రోజులు తెలుగు రచయితల వర్క్ షాప్, సెమినార్ జరిగాయి, ఇంటర్ మీడియెట్ చదువుతున్నప్పుడు. నిజానికి ఇంటర్ మీడియెట్ కన్నా ఎక్కువగా యండమూరిని, మల్లాదిని, యద్ధనపూడిని, అరెకపూడి (కోడూరి)ని విపరీతంగా చదువుతున్న రోజులు.

ఆ మూడు రోజుల వర్క్ షాప్ కి అధ్యక్షులు యండమూరి వీరేంద్ర నాథ్ గారని తెలిసి, ఇంకా తెలుగునాట పేరుమోసిన మరో ఇరవై మంది ప్రముఖ  రచయితలు, త్రులు కూడా కమిటీలో ఉన్నారని తెలిసి నా పేరు కూడా ఎన్ రోల్ చేయించుకున్నాను.

నవల, నాటకం, సినిమా, కవిత, కథ, కథానిక రాయాల్సిన పద్ధతులు, రాసే విధానంలో వ్యత్యాసం, టార్గెట్ ప్రేక్షకుడి మనోభావాలు - ఇలా అన్ని కోణాల్లోని రాత, కోతల గురించి విపులంగా చర్చించారు, నేర్పించే ప్రయత్నం చేశారు.

మూడోరోజు ఉదయం ఔత్సాహికులైన మా నాలుగొందల మంది పై చిలుకు యువతీ యువకులకి ఓ గంట టైమిచ్చి, వైట్ పేపరిచ్చి సింగిల్ పేజీ షార్ట్ స్టోరీ రాయమన్నారు. ఇది నేనూహించని పరిణామం. పైగా వాటినన్నిటినీ యండమూరిగారు, కమిటీ మెంబర్లు లంచ్ టైంలో దిద్ది ఆఫ్టర్ లంచ్ వాటికి గ్రేడ్ లిచ్చి, వాటిని అందరికీ చదివి వినిపించి తప్పొప్పులు విశ్లేషిస్తారట!

ఎందుకొచ్చిన గొడవ - తప్పించుకుని వెళ్లిపోదాం అనుకున్నాను. మళ్లీ ఏదో ఒక చిన్న కథ రాద్దాంలే! యండమూరిగారు రెండు నిమిషాలైనా నన్ను నుంచోపెట్టి మంచో, చెడో ఏదో ఒకటి మాట్లాడతారు కదా! అనుకున్నాను.

ఈ మీమాంసలో ఓ పావుగంట అయిపోయింది కూడా పేపరు, పెన్ను నా చేతికిచ్చి.

సరే, నెమ్మదిగా కథ గురించి ఓ పావుగంట ఆలోచించాను.

ఏ' కాకి '

అని టైటిల్ పెట్టి కథ రాశాను. చిన్న కథ.

అప్పుడప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు. సగం చీకటి, సగం వెలుతురు. ఎక్కడినుండో ఎగురుకుంటూ వచ్చిందో ఒంటరి కాకి. ఓ ఇంటి పైకప్పు మీద వాలింది. అటూ ఇటూ వెతుకుతూంటే, దాని దృష్టి దూరంగా రోడ్డు మీద పారేసిన బస్తాలాంటి వస్తువు మీద పడింది. ఔట్ ఫోకస్ లో అది కనపడక, ఆ దిశగా మరో మేడ మీద పిట్టగోడపై వాలింది ఆ కాకి. ఇప్పుడు కాస్త స్పష్టంగా కనపడిందా వస్తువు. అది బస్తా కాదు. రోడ్డు మీద అడ్డంగా పడున్న మనిషి శరీరం. కదలికలు లేక, అచేతనంగా పడి ఉన్నాడు కాబట్టి శవం అని నిర్ణయించుకుంది కాకి. దాని కళ్లు ఆనందంతో మెరిశాయి. ఒక్క తన ఆకలి తీరడానికే ఆహారం కోసం వెతుకుతుంటే, కొన్ని వేల కాకుల ఆకలి తీరడానికి ఆహారం దొరికేసిందని సంతోషపడింది.

రోడ్లు తుడిచే వాళ్లొచ్చారు. ఆ శవాన్ని పట్టించుకోకుండా చుట్టూ తుడిచేసి వెళ్లిపోయారు. పాలవాళ్లు, పేపర్ల వాళ్లు, ఆటోస్టాండ్ లో డ్రైవర్లు, స్కూలు పిల్లల రిక్షాలు అందరూ ఆ శవాన్ని తప్పుకుని పోతున్నారు.

పోలీసు పెట్రోలింగ్ వ్యాను, టీ బండి వాడు, బడ్డీకొట్టు వాడు, దూరంగా నించుని సిగరెట్లు తాగేవాళ్లు, పేపరు కొని చదివేవాళ్లు - నెమ్మదిగా ట్రాఫిక్ రద్దీ అలాగే పెరుగుతోంది, కాకి కడుపులో ఆకలిలాగ. ఒక్కో బిల్డింగు దాటుకుంటూ, మజిలీల మీద మజిలీలు వేస్తూ కాకి ఆ శవంవైపు వస్తోంది.

పిచ్చికాకి, తనా శవాన్ని పొడిస్తే చుట్టూ ఉన్న మనుషులు దాన్ని చంపుతారేమో అని భయపడుతూ భయపడుతూ శవం వైపు వస్తోంది.
దగ్గిరకొచ్చాక ఆఖరున ఆ శవం పై నున్న కరెంటు తీగ మీద ఆగింది. హఠాత్తుగా షాక్ కొట్టి గిలగిల తన్నుకుంటూ కావుకావుమని చావుకేక పెట్టి చచ్చిపోయింది, ఆ తీగకే అంటుకుని...

ఒక్క క్షణంలో ఎక్కడి నుండొచ్చాయో కొన్ని వేల కాకులు బిలబిలమంటూ వచ్చాయి. చనిపోయిన కాకి చుట్టూ ఎగురుతూ అరవడం మొదలెట్టాయి, కిందున్న మానవ సమాజం సిగ్గుపడేలా.వేలమంది మనుషుల మధ్య మానవుడు ఏకాకి.కాకికున్న ఐకమత్యం కూడా లేని బతుకు ఈ సమాజంలో మానవుడిది.

రోడ్డు మీద పడిపోయిన మనిషిది కాదు శవం.
చుట్టూ ఉన్న మనుషులంతా జీవచ్ఛవాలం.
కాకులని చూసైనా నేర్చుకోని ఏకాకులం.

అని ముగించాను.

సాయంత్రం సభలో నేనూహించినట్టుగానే యండమూరిగారు నన్ను నిలబెట్టి మాట్లాడారు.

'ఏ' గ్రేడ్ ఇస్తూ, కథావస్తువు చిన్నదైనా చదివించే గుణం, నెరేటివ్ స్టైల్ బావున్నాయని ప్రశంసించి, సినిమాల్లోకొస్తే స్క్రీన్ ప్లే బాగా రాస్తావని ప్రోత్సహించారు.

ఒక చిన్న తెలిసున్న సామెతని కథగా రాస్తే అంత పెద్ద ప్రశంస లభించిందని పొంగిపోయాను. తెలుగు పాఠకలోకాన్ని ఉర్రూతలూగించిన ఆ గొప్ప రైటర్ కి మనసులోనే శతాధిక వందనాలర్పించుకున్నాను.

మీ
వి.ఎన్.ఆదిత్య  

మరిన్ని సినిమా కబుర్లు
sandeep kishan in&as