Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
jyoti patham

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - వనం వేంకట వరప్రసాదరావు

saahiteevanam

ఆముక్తమాల్యద
(గతసంచిక తరువాయి)


ఖాండిక్యుని సహచరులు, మంత్రులు, శ్రేయోభిలాషులు ఆతనికి ఆలోచించడానికి, తాము గుక్క తిప్పుకోడానికి సమయం లేకుండా అవకాశము వచ్చినదే అరుదు అని తమ సలహాలను కురిపించారు.

అవమతిఁ బితృఘ్ను లగుభూ
ధవుల వెదకి పిల్లపిల్ల తరము తునిమి భా
ర్గవుఁడు మునియయ్యె మరి వై
భవము వలదు శాంతికైనఁ బగ దెగ కగునే

దుష్ట బుద్ధితో తన తండ్రిని చంపిన రాజులను వెతికి వెతికి పిల్ల పిల్ల తరము కూడా మిగలకుండా సంహరించి కూడా పరశురాముడు మునికాలేదా? కనుక నీ శత్రువును సంహరించిన తర్వాత కూడా నువ్వు మునివై ప్రశాంతంగా తపస్సు చేసుకో కావాలంటే. రాజ్యవైభవము నీకు అక్కర్లేదు, సరే, కానీ నీ పాలనను కోరుకునే నీ ప్రజలు శాంతితో జీవించడం కోసం అయినా పగ తీర్చుకోవడం అవసరము
కదా. అంతే కాదు.

పగయు వగయును లేక యేపాటి గన్న
నలరు సామాన్య సంసారి యగుట మేలు
మరి తగిలె నేని శాంతిచే మఱవఁ దగదు
రాజ్యభూమికఁ దాల్చిన రాజునకును  

 

పగ, వగ లేక ఏమాత్రము లభించిననూ ఆనందించే  (యేపాటి గన్నన్ అలరు ) సామాన్య సంసారి అవడం మంచిదే, కాదనము, కానీ, రాజ్య భారాన్ని వహించే రాజుకు పగ వగ అంటుకుంటే శాంతి మంత్రాన్ని పఠించడం, పగను వగను మరచిపోవడం తగినపని కాదు. ఒక క్షత్రియునిగా తన భావాలను వెల్లడిస్తున్నాడు రాయలు ఇక్కడ. నాటకీయతతో ఖాండిక్యుని, ఆతని శ్రేయోభిలాషుల సంభాషణల
ద్వారా సాహితీ సమరాంగణములమధ్య ఊయలలూగిన తన మనసును, తన యుద్ధవిజయ కాంక్షల వెనుక ఉన్న కర్తవ్య బాధ్యతల ఆంక్షలను తెలియజేస్తున్నాడు. సమాజం శాంతియుతంగా ఉండాలి అంటే అశాంతికి కారణము ఐన వాడిని రాజు ఏరి పారేయాలి. కన్నుల పంటగా పంట పండాలంటే కలుపుమొక్కలను కర్షకుడు ఏరి పారెయ్యాలి. సైనికుడికి శాంత గుణం బలహీనత, బలము కాదు. మునికి తామసగుణము బలహీనత, బలము కాదు. పాత్రనుబట్టి పాత్రధారి ప్రదర్శన ఉండాలి. రాజు రాజుగానే ఉండాలి, అర్చకుడు అర్చకునిగానే ఉండాలి. సైనికుడు సైనికునిలా కరకుగానే ఉండాలి, ఉపాధ్యాయుడు జ్ఞానియై ప్రసన్నుడై ఉండాలి.  బెరుకుగా ఉండడం రక్షక భటునికీ,
కరకుగా ఉండడం జ్ఞానికీ నప్పదు. ఎవరి పని వారు ఏకాగ్రతతో చేయాలి, ప్రేమగా చేయాలి, బాధ్యతగా చేయాలి, అప్పుడు సమాజం అన్ని రంగాలలో ఆనందమయంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. కనుక ఏ కాలంలో అయినా సమాజము మొత్తానికి ఒకే ఆదర్శము ఉండకూడదు, ఉండదు. వైదికమార్గ అనుయాయుల వికృత ధోరణులకు పరిష్కారముగా బుద్ధుని శాంతిమార్గం కొత్త బాటలు వేసింది. కానీ
క్షత్రియులు కూడా శాంతి కాముకులై, యుద్ధ విరక్తులై, మధ్యభారత వీరయోధుల క్షాత్రం చచ్చిపోవడం వల్లనే వరుసగా విదేశీ దండయాత్రల పరంపర మొదలైంది. ఆసమయానికి జ్ఞానమార్గంలో ఉండాల్సినవాడు భ్రష్టుడైనాడు, వీరమార్గంలో ఉండాల్సినవాడు నిర్వీర్యుడైనాడు, తేలికగా విదేశీ ముష్కరులకు లొంగిపోవడం ప్రారంభము ఐంది. ఆ ప్రమాదమునుండే ఆర్జునుడిని శ్రీకృష్ణుడు రక్షించాడు, కేవలం మానవ మాత్రులైన
క్షత్రియులుగా వారిని చూసినప్పటికీ. వారిని వారించకుండా వారు చెప్పదలచినది అంతా చెప్పేదాకా ప్రశాంతముగా విన్నాడు ఖాండిక్యుడు.
వారు ఆగిపోయినతర్వాత చిరునవ్వుతో తను మొదలుబెట్టాడు.

మీ నొడివినయది కార్యం
బౌ నిప్పని సేయ రాజ్యమంతయు మనకున్
వానికిఁ బరలోకము జిత
మౌ నొక్కట, నిందు వాసు లరయఁగ వలయున్

నిజమే. మీరు చెప్పినది చేయదగినదే. యిలా చేయడం వలన మనకు రాజ్యమంతా, వాడికి స్వర్గలోకము ఒకేసారి లభిస్తాయి. వీటిలో, రాజ్యము-స్వర్గము అనే ఈ రెండిటిలో తారతమ్యాన్ని గమనించవలసి ఉంది. నిజమైన నాయకుడు సంభాషించవలసిన తీరు యిది అని చెప్తున్నాడు రాయలు. మెత్తగా వారి వాదనలోని దోషాలను చెప్తున్నాడు రాజు.

పరలోకసుఖము శాశ్వత
మరయ మహిరాజ్యసౌఖ్యమల్పానేహః
పరిభోగ్యం బిందుల కై
దురితము కావించి తొలగుదునె పరమునకున్?

సరిగా చూస్తే పరలోక సుఖము శాశ్వతము. భూపాలకుడినై అనుభవించే సుఖము స్వల్పకాలికమైనది. (అల్పానేహః పరిభోగ్యంబు) అలాంటి తాత్కాలికమైన ఇహలోకపు సుఖము కోసం శాశ్వతమైన పరలోక సౌఖ్యాన్ని పోగొట్టుకుంటానా? (పోగొట్టుకోను!)

బద్ధాంజలిపుటు దీనున్
గ్రుద్ధతఁ దనమఱుఁగు సొరఁగ గూల్చుట కడుఁ గీ
డుద్ధతి పరలోకార్జన
బుద్ధికి నను కండువాక్యములు తలఁపరొకో

అంజలి ఘటించి దీనుడై తన ఆశ్రయముకోసం వచ్చినవాడిని క్రుద్ధుడై, గర్వించి, చంపడం పరలోకసౌఖ్యాన్ని కోరుకునేవాడికి మిక్కిలిగా కీడు కలిగిస్తుంది అని కండుమహర్షి పలుకులను గుర్తుకు తెచ్చుకోరా?

అనుచు వెడలి వచ్చి  యా రాజు నడిగి త
ద్ధర్మ నైచికీ వధక్రమంబు
దెలిసి, తగిన నిష్కృతి వచింప, నాతండు
మగుడఁ గ్రతువు సాంగముగ నొనర్చి

ఆ విధముగా తన మంత్రుల, శ్రేయోభిలాషుల పలుకులలోని అధర్మాన్ని, తన ధార్మిక చింతనలోని మర్మాన్ని మృదువుగానే ఐనప్పటికీ, సునిశ్చయముగా తెలియజేసిన ఖాండిక్యమహారాజు బయటకు వచ్చి, కేశిధ్వజుడిని సమీపించి, యాగధేనువు మరణించిన కారణాన్ని వివరముగా అడిగి తెలుసుకుని, ఆ దోషానికి తగిన ప్రాయశ్చిత్త మార్గాన్ని తెలియజేయగా, కేశిధ్వజుడు తన రాజధానికి తిరిగివచ్చి, యాగశాలలో ప్రవేశించి, ఖాండిక్యమహారాజు చెప్పిన విధముగా చేసి, క్రతువును పూర్తిచేశాడు.

(కొనసాగింపు వచ్చేవారం)
***వనం వేంకట వరప్రసాదరావు

మరిన్ని శీర్షికలు
sudhamadhuram