Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Fibroids | Ayurvedic Treatment | Prof. Dr. Murali Manohar Chirumamilla, M.D. (Ayurveda)

ఈ సంచికలో >> శీర్షికలు >>

అవీ- eవీ - భమిడిపాటి ఫణిబాబు

మన దేశంలో ఆడవారికి తాము ధరించే బట్టల విషయంలో ఉన్న పట్టింపు,వ్యామోహం, ప్రపంచంలో ఎక్కడా ఉంటుందనుకోను.  బీరువానిండా , ఎన్ని బట్టలున్నా సరే, మొహంలో సంతృప్తి అనేది కనిపించదు. పైగా ఏమైనా అంటే, మీ మొగాళ్ళదేముందీ, ఓ నల్లరంగు ప్యాంటేసికుని, రోజుకో షర్టు మార్చుకున్నా, రోజెళ్ళిపోతుందీ అంటారు. అందుకేనేమో, సాధారణంగా ఇళ్ళల్లో ఉండే బీరువాలోనో, వార్డురోబ్బుల్లోనో, మగాళ్ళ బట్టలకి, ఒక్కటంటే ఒక్కటే “అర” కేటాయిస్తూంటారు. విడిచిన బట్టలు వేల్లాడతీసికోవడానికి కూడా, తలుపు వెనక ఓ మేమోటి కొట్టి, దానికే తగిలించుకోమంటూంటారు. పేరుకి మాత్రం, ఆ బీరువా నాదీ, రెండో బీరువా మావారిదీ, అని అడిగినా అడక్కపోయినా ఇంటికొచ్చినవారందరికీ చెప్పడం.

 ఇంక ఆడవారు ధరించే బట్టల విషయానికొచ్చేటప్పటికి, ఏదో ఉద్యోగాల్లో ఉండే పిల్లలూ, చదువుకునే పిల్లలలకీ అయితే, ఏదో ఓ జీన్స్, ఓ టాప్ తో పనైపోతోంది. కానీ గృహిణుల విషయానికొచ్చేటప్పటికే అసలు గొడవంతానూ. ఏదో రాష్ట్రేతర ప్రాంతాల్లో అయితే, అప్పుడప్పుడు, పంజాబీ డ్రెస్సులైనా వేసికుంటారు. కానీ మనవైపు ఓ వయసు వచ్చినా తరువాత, ఎవరైనా డ్రెస్సులో కనిపిస్త చాలు, బుగ్గలు నొక్కుకుంటూంటారు. విధిగా చీరకట్టులో ఉండాల్సిందే. ఇంక చీర కొంటే, ఒక్క చీరతోనే సరిపోదుగా, దానికో మాచింగు  బ్లౌజూ, ఆ చీరకి పీకో, మళ్ళీ దానికో ఫాలూ—మొత్తం ఈ పై అలంకరణలకి చీర ఖరీదంతా అవుతుంది. అన్నిటిలోకీ ముఖ్యం. ఒకసారి కట్టి విడిచిన చీర, ఇస్త్రీ లేకుండా కట్టడం నిషిధ్ధమోటీ . మనవైపు అయితే ఏదో ఫరవాలేదు, ప్రతీ హౌసింగు సొసైటీలోనూ, అక్కడుండే వాచ్ మన్, తప్పకుండా, బట్టలు ఇస్త్రీ చేసేవాడే ఉంటాడు. అదీ కాకపోతే, వీధిలోకి బండి మీద ఇస్త్రీ  చేసేవాడొకడు, వీధికోడు తప్పకుండా కనిపిస్తూంటాడు.కానీ, కొన్ని చోట్ల  చీర ఇస్త్రీకి ఇవ్వడమంటే, కనీసం ఓ పాతిక రూపాయలైనా ఇవ్వాల్సుంటుంది. మళ్ళీ కాటన్ చీరలకి “స్టార్చ్ “ ఒకటీ. దానికో పదిరూపాయలు ఎగస్ట్రా...పోనీలెండి, ఎవరి ఓపికని బట్టి వారుంటారు. ఏదో బయటకెళ్ళినప్పుడు లక్షణంగా కనిపించాలనే కదా, ఈ తాపత్రయమంతానూ. అదే కాకుండా, ఏ ఇల్లాలు, ఎప్పుడు చూసినా నలిగిన బట్టలే వేసికుంటూంటే, ఏ మగాడికి బాగుంటుందీ ? అందువలన ఈ ఇస్త్రీలూ, స్టార్చి లూ ఇంటి మగాడికోసమే అనుకుంటే, అసలు గొడవే లేదు.

వచ్చిన గొడవల్లా ఏ పెళ్ళికో, అదీ ఇంకో ఊళ్ళో జరిగినప్పుడు , చేసే ప్రయాణాల్లో. వామ్మోయ్, రోజుకి మూడు చీరలూ, వాటి సంబంధిత యాక్సెసరీలూ, ఇంటూ( X )  మనం ఉండాల్సిన రోజులు. లెఖ్ఖ కట్టండి. తెలుస్తుంది. అదృష్టం బాగోపోతే, ఆ పెళ్ళినుండి, ఇంకో చోటకి కూడా ప్రయాణం ఉందా, ఇంక అంతే సంగతులు. పైన చెప్పిన నిష్పత్తిలో అంటే రోజుకి మూడూ, ఇంటూ రోజులు, లెక్కెంటుకుంటూ పోవడమే.  ఇన్ని బట్టలూ సద్దాలంటే, ఇదివరకటి రోజుల్లో లాగ కాదుగా, ఓ నాలుగు బ్యాగ్గులూ, ఓ హోల్డాలూ పెట్టుకుని వెళ్ళడమా మరి? పై చెప్పిన నిష్పత్తిలో సద్దుకోడానికి, ఈరోజుల్లో ఓ రెండుమూడు సూట్ కేసులూ,ఇంకో చిత్రమేమిటంటే, ఆ రెండుమూడు సూట్ కేసుల్లోనూ, రెండుముప్పావు సూట్ కేసులు , ఇంటావిడ బట్టలతోనే నిండిపోతుంది. ఇంటాయన ఓ క్యారీబాగ్గులో ఓ రెండు మూడు జతలతో సరిపెట్టేసికుంటాడు. పైగా బట్టలు సద్దుతూన్నంతసేపూ, ఓ డయలాగ్గు—పోనీ నా బట్టలు కొన్ని తీసేయమంటారేమిటీ—అని. తీసేదీలేదూ ఏమీలేదూ, మన మాటఒకటీ మిగులుతుంది. ఈ మాత్రం దానికి మనం వీధిన పడ్డం ఎందుకూ?పైగా ప్రతీ ప్రయాణంలోనూ ఓ ఒడంబడికోటీ, ఎవరి పెట్టెలు వాళ్ళే లాక్కోవాలీ అని! చట్టప్రకారం అసలు పెద్దాయన అసలు ఏమీ లాగాల్సిన అవసరంలేదు. కానీ , ఏ మగాడు ఊరుకోగలడు చెప్పండి, పాపం ఆ ఇల్లాలు, ఆపసోపాలు పడుతూ, సూట్ కేసులు లాగుతూంటే. ఇదిగో ఇక్కడే “ మాయ”  లో పడిపోతూంటారు. మళ్ళీ వాటికి చక్రాలుండాలి. ఈరోజుల్లో చాలామంది , కన్సెషన్ల ధర్మమా అని, రైళ్ళలో, ఏసీ ల్లోనే ప్రయాణాలూ, నిక్కచ్చిగా ఆ ఏసీ బోగీలు, ట్రైనుకి ఆ చివరో, ఈ చివరో నే ఉంటాయి. స్టేషన్లలో ,  సామాన్లకి కూలీలని పెట్టుకోవాలంటే, ఇద్దరి టిక్కెట్లకీ అయినంత డబ్బూ పెట్టుకోవాలి. హాయిగా చక్రాలున్న సూట్ కేసులైతే, ఇద్దరూ చెరో సూట్ కేసూ లాక్కుంటూ పోవచ్చు. ఏదో ప్లాట్ఫారం మీదైతే పరవాలేదు, కానీ కొన్ని చోట్ల ఓవర్ బ్రిడ్జీ ఎక్కాల్సొచ్చినప్పుడు మాత్రం గొడవే. అలాటప్పుడు  పెద్దాయన విసుక్కుంటాడు, ఏమిటో రెండేసి సూట్ కేసులెందుకూ అన్నా కానీ, వినిపించుకుంటే కదా..  !

 మన వాళ్ళలో ఉండే ఇంకో చిత్రం ఏమిటంటే, ఎవరో తెలిసిన వారో, బంధువులో, వాళ్ళ ఇళ్ళల్లో పెళ్ళిళ్ళయినప్పుడు ఉంటుంది. పైగా ఈ రోజుల్లో పెళ్ళంటే సవాలక్ష కార్యక్రమాలాయె. ఏదో సంగీత్ అంటారు, రిసెప్షనంటారు, ఇంకోటేదో అంటారు, మరీ అన్ని కార్యక్రమాలకీ ఒకటే చీరైతే ఎలా? దేని దారి దారిదే. ప్రత్యేకంగా చీరలో, ఆధునిక యుగంలో, డిజైనర్ డ్రెస్సులో తప్పకుండా ఉండాల్సిందే. కిందటి సారి వాళ్ళింట్లో పెళ్ళికి ఇదే చీర కట్టుకున్నా కదా, మరీ ఈసారికూడా అదే చీరేం బాగుంటుందండీ , అనడం. ఆ పెళ్ళివారు వచ్చిన వాళ్ళు ఏ చీర వేసికున్నారూ, ఏ డ్రెస్సు వేసికున్నారూ అని చూడడమే పనా అంటే, సమాధానం ఉండదు.

ఎన్ని చెప్పండి, డ్రెస్సుల విషయంలో మన దేశంలో ఆడవారికున్న పట్టింపులు నభూతో నభవిష్యతి...

మరిన్ని శీర్షికలు
moogaboina navvula kunche