సతి సత్యభామా దేవి -
ద్వాపరయుగంలో సత్రాజిత్తు అనే యాదవరాజు ఉండేవాడు. సత్రాజిత్తు సూర్య భగవానుని పరమ భక్తుడు. ప్రతిరోజు అచంచలమైన భక్తితో సూర్యుడిని పూజించేవాడు. ఒకరోజు ఆయన సముద్రతీరంలో తిరుగుతూ ఉండగా సూర్యదేవుడు ప్రత్యక్షమై నీ భక్తికి మెచ్చాను అని చెప్పి ‘శమంతకం’ అనే మణిని బహూకరించాడు. ఆ మణి ఎంతో శక్తి కలది. అది ఉన్నచోట శత్రుభయం నశిస్తుంది, మంచి అదృష్టాన్ని కలిగిస్తుంది. రోజుకు ఎనిమిది బారువుల బంగారాన్ని ఇచ్చి సంపదను పెంచుతుంది. సత్రాజిత్తు ఆ మణిని తీసుకొని నగరానికి తిరిగి వచ్చాడు. ప్రజలు సూర్యునివలె వెలిగిపోతున్న ఆయనను చూసి దైవస్వరూపంగా భావించారు.
ఈ విషయం తెలిసిన శ్రీకృష్ణుడు సత్రాజిత్తుతో ఆ మణిని ఉగ్రసేన మహారాజుకి ఇమ్మని, దానివలన రాజ్యానికి శత్రుభయం పోయి మంచి జరుగుతుందని సూచిస్తాడు. సత్రాజిత్తు నిరాకరించడంతో కృష్ణుడు వెనుదిరిగి తన నివాసానికి తిరిగి వెళ్ళిపోతాడు. ఒకరోజు ఆమణి పూజగదిలో కనపడకపోయేసరికి శ్రీకృష్ణుడు దానిని దొంగిలించాడని బ్రమపడి, ఊరంతా చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడు దానిని వెదికి తీసుకువచ్చి, సత్రాజిత్తుకు ఇచ్చి తనపై పడ్డ నిందను పోగొట్టుకున్నాడు. సత్రాజిత్తు పశ్చాత్తాపంతో వాసుదేవుని క్షమించమని వేడుకొని తన కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహం జరిపించాడు. కన్యకామణితోబాటు శమంతకమణిని బహుమతిగా ఇవ్వబోగా ఆయన దానిని నిరాకరించాడు.
సత్యభామ నీతీ, ధర్మ విచక్షణ, దయా, కీర్తికాంక్ష గలది. అతిలోక సుందరి. శ్రీకృష్ణునికి మూడవ పట్టపురాణి. ఆయనను మెప్పించిన ముద్దుల భార్య. ధైర్యసాహసాలు గల యువతి. రక్మిణీదేవిది శ్రీకృష్ణునిపై అత్యంత భక్తి, కోరికలేని పూర్తి అంకితభావం అయితే సత్యభామాదేవికి శ్రీకృష్ణునిపై అంతులేని ప్రేమభావము. ఇద్దరూ లక్ష్మీదేవికి రెండు అంశలు.
అక్రూరుడు, కృతవర్మ, శతధ్వనుడు అనేవారు ముగ్గురు యాదవ యోదులు. అక్రూరుడు, కృతవర్మా ప్రేరేపించగా శతధ్వనుడు నిద్రిస్తున్న సత్రాజిత్తుని అతి క్రూరంగా సంహరించి శమంతకమణిని కాజేసాడు. సత్యభామ తన తండ్రి మరణానికి ధుఃఖించి తండ్రి శరీరాన్ని నూనె తొట్టిలో పెట్టించి, ఆ సమయంలో హస్తినాపురం ఉన్న బలరామ కృష్ణులకు తన తండ్రి మరణ వార్తను స్వయంగా వెళ్ళి తెలిపింది. వారు ముగ్గురూ ద్వారకకు తిరిగి వచ్చారు. ఈ విషయం తెలిసి శతధ్వనుడు మణిని అక్రూరుని వద్ద దాచి పారిపోయాడు. శ్రీకృష్ణ బలరాములు శతధ్వనుని వెతికి వెంబడించారు. కృష్ణుడు చక్రాయుధం ప్రయోగించి అతని వధించాడు, కాని మణి వాని వద్ద దొరకలేదు. కృష్ణుడు ద్వారక చేరి తన మామగారైన సత్రాజిత్తకు అంత్యక్రియలు జరిపించాడు.
అక్రూరుడు బయపడి ద్వారకను విడిచి పారిపోయాడు. ద్వారకా నగరంలో ఉపద్రవాలు జరిగాయి. వర్షాలు కురువ లేదు. ద్వారకా నగరంలోని వయోవృద్ధులు వచ్చి కృష్ణుడికి అక్రూరుడు మహా తపస్వి అని, ఆయన ద్వారకను వదలి వెళ్ళడం వలననే ఇలా జరిగింది అని చెప్పారు. అప్పుడు కృష్ణుడు దూతలను పంపి అభయం ఇచ్చి ఆయనను ద్వారకకు పిలిపించాడు. ఆయనను పూజించి, ఆ మణిని మీ వద్దనే ఉంచుకొని మీరు యజ్ఞాలు నిర్వర్తించండి అని తీయటి మాటలతో చెప్పాడు. మా అన్నగారు బలరాములవారు నన్ను నమ్మరు కాబట్టి ఒక్కసారి నిండు కొలువులో అందరికీ చూపించు అని వినయంగా అడిగాడు. అప్పుడు అక్రూరుడు వస్త్రంలో కట్టిన శమంతకమణిని బయటకు తీసి కృష్ణునకు ఇచ్చాడు. కృష్ణుడు మణిని అందరికీ చూపించి తిరిగి అక్రూరునికి ఇచ్చి వేశాడు.
నరకాసురుడు ఒక రాక్షసరాజు. దానవ వంశానికి చెందిన ఘటకాసురుని వధించి ప్రాక్జ్యోతిష, కామరూప, భౌమ వంశాలను స్థాపించాడు. భూదేవికి ప్రియ పుత్రుడు. నరకాసురుడు కృతయుగంలో వరాహమూర్తి వలన భూదేవికి జన్మించిన వాడు. ఆయన భార్య పేరు మాయ. నరకునకు భగదత్తుడు అనే ఒక కుమారుడు ఉన్నాడు. నరకాసురుడు దేవతలకు తల్లియైన అదితిదేవి కుండలాలనూ, వరుణదేవుని ఛత్రాన్ని, దేవతల మణి పర్వతాన్ని అపహరించాడు. దేవేంద్రుడు శ్రీకృష్ణుడికి నరకుడు చేసే అత్యాచారాలను విన్నవించి సహాయంకోరాడు.
అవతార పురుషుడైన శ్రీహరి నరకాసురుడిని వధించడానికి గరుడవాహనం ఎక్కి వెళ్ళడానికి సిద్ధమవుతున్న సమయాన సత్యభామ ఆయనతో ఇలా అన్నది. నాథా! నీవు రణరంగంలో రాక్షసమూకలతో యుద్ధంచేసి సంహరిస్తుంటే నాకు చూడాలని కుతూహలంగా ఉంది. నన్నుకూడా నీతో తీసుకొని వెళ్ళు. ఆ విధంగా అడిగిన సత్యభామతో శ్రీకృష్ణుడు అబలవైన నీవు రణరంగమునకు వద్దు. నేను దానవుని సంహరించి త్వరగా తిరిగి వస్తాను అన్నాడు. సత్యభామ అందుకు ఒప్పుకోలేదు. నీ అండ ఉండగా నాకేమీ కాదు, నేను కూడా నీతో వస్తాను అని నమస్కారం చేసింది.
అప్పుడు వాసుదేవుడు సత్యభామను వెంటపెట్టుకొని గరుత్మంతునిపై ఎక్కి ప్రాక్జ్యోతిషపురానికి చేరాడు. ఆ నగరం రకరకాల దుర్గాలతో కూడి మురాసురుని బాహుపాశాలతో చుట్టబడి ఉంది. శ్రీకృష్ణుడు ఆ పర్వత దుర్గాలను ముక్కలుచేసి మురాసురుని పాశాలను ఖండించాడు. తన పాంచజన్యం పూరించి అయిదు తలల మురాసురుని నిద్రలేపాడు. యుద్ధంలో వాని అయిదు తలలను తన చక్రాయుధంతో ఖండించి వధించాడు. తండ్రి మరణానికి చింతిస్తూ నరకాసురుడిచే ప్రేరేపించబడిన మురాసురుని ఏడుగురు కుమారులు ఆయుధాలతో కృష్ణునిపై దాడిచేసారు. వారిని కూడా కృష్ణుడు తుదముట్టించాడు. అప్పుడు నరకాసురుడు స్వయంగా యుద్ధరంగంలో ప్రవేశించాడు.
శ్రీకృష్ణుడితో యుద్ధానికి సిద్ధమవుతున్న నరకుడుని చూసి సత్యభామ వడివడిగా ముందుకు వచ్చింది. తన వాలుజడను ముడివేసుకుంది. చీర ముడి బిగించింది. పైట సవరించుకుని యుద్ధం చేయాలనే ఉత్సాహంతో కృష్ణుని పక్కన వచ్చి నిలబడింది. అలా సిద్ధమైన భామను చూసి కృష్ణుడు పరిహాసంగా నేను ఈ దానవునితో గెలవలేనని అనుకుంటున్నావా అంటూనే తన ధనస్సును సత్యభామ చేతి కిచ్చాడు. కృష్ణుని చేతినుండి ధనస్సును అందుతున్న సత్యభామకు ఎక్కడలేని శక్తి వచ్చింది. ఆ నారీమణి నారి బిగించి ధనస్సుతో శరములు ప్రయోగించింది. అతి వేగంగా బాణములు వదులుతూ శత్రువైన నరకాసురుడిని నొప్పిస్తూ, ప్రియుడైన కృష్ణుని మెప్పించింది. నాట్యం చేస్తేనే అలసిపోయే అబల, ఎడమ పాదం ముందుకు ఉంచి కుడిపాదం వంచి శత్రువులను అంతం చేయడానికి ముందుకు ఎలా వచ్చింది అని అందరూ అనుకొనేటట్లుగా సత్యభామాదేవి సమరరంగంలో విలసిల్లింది. ఆ యుద్ధంలో సత్యభామ మోము కృష్ణుడికి చల్లని చంద్రబింబంలాగా, నరకాసురునికి మండే సూర్యబింబంలాగా కనపడింది. సత్యభామ ప్రయోగించిన బాణాలకు రాక్షససేన నిర్వీర్యమై వెనుదిరిగి పరిగులెత్తింది.
అప్పుడు నరకాసురుడు కృష్ణునితో రాక్షసవీరులు ఆడవారితో పోరాటానికి ఆరాటపడరు, పౌరుషం ఉంటే నువ్వు యుద్ధం చెయ్యి అన్నాడు. శ్రీకృష్ణుడు సత్యభామ ధైర్యసాహసాలను మెచ్చుకొని ఆమెను తదుపరి యుద్ధప్రయత్నం నుండి విరమింపచేసి ఆమె చేతిలోని ధనస్సును తిరిగి తీసుకున్నాడు. నరకాసురుడి సైన్యంపై శతఘ్ని అనే దివ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. నరకాసురుడి సైన్యం హాహాకారాలు చేస్తూ నేలకూలింది. చక్రాయుధాన్ని ప్రయోగించి నరకాసురుడి తల ఖండించాడు. దానవుడు నేల కూలాడు. దేవతలు పూల వర్షం కురిపించారు. భూదేవి నరకాసురునిచే దేవతలనుండి తస్కరించబడిన వస్తువులను తెచ్చి భక్తితో వాసుదేవునికి సమర్పించింది. భూదేవి కోరికపై నరకాసురుని కమారుడైన భగదత్తునికి అభయమిచ్చి సర్వసంపదలనూ ప్రసాదించాడు. నరకాసురుడు ఓడించి చెరపట్టిన గుణవతులైన పదహారువేల రాజకుమార్తెలను విడిపించాడు. వారి కోరికపై శ్రీకృష్ణుడు వారందరిని భార్యలుగా స్వీకరించాడు.
లోక కంఠకుడైన నరకాసురుడిని వధించి, విజయాన్ని సాధించినందుకు ఆనందంతో ప్రజలు దీపాలతో ఇళ్ళను అలంకరించి శ్రీకృష్ణ సత్యభామలకు స్వాగతం చెప్పారు. అప్పటి నుండి నరకాసురుని వధించిన రోజును నరకచతుర్దశి గాను, మరునాడు శ్రీకృష్ణ సత్యభామలు నగర ప్రవేశం చేసిన రోజును దీపావళి గాను మనం పండుగ చేసుకుంటున్నాము.

