ఇంటిదొంగ - నయన కస్తూరి

Inti donga

రాజారావు ఆరోజు రాత్రి తాను నడిపే దుకాణం నుండి ఇంటికి వచ్చి, చొక్కాను, అందులో పెట్టిన ఆ రోజు సంపాదనతో సహా గోడ మీది మేకుకి తగిలించి, స్నానం చేసి, భార్య అన్నం పెడితే తిని, భార్యా. ,పిల్లలతో కాసేపు మాట్లాడి పడుకున్నాడు .

రాజరావు, భార్య వరలక్ష్మి దంపతులు మధ్యతరగతికి చెందినవారు. వారికి జానకి అని ఒక కుమార్తె, గోపాల్ అనే ఒక కుమారుడు ఉన్నారు. తల్లితండ్రులిద్దరికి పిల్లలికి మంచి చదువు- సంధ్యలే కాక మంచి బుద్ది, జ్ఞానాన్ని నేర్పించాలని కోరిక. అందుకని కొంచెం కష్టమైనా, డబ్బు ఎక్కువగానే ఖర్చుపెట్టి, మంచి పేరున్న బడిలోనే చేర్చి చదువిస్తున్నారు.కానీ ఆ తల్లితండ్రులు ఇవి సాధించడంలో ఎంతవరకు విజయవంతమయ్యారో తెలియదు మనకు.
.........................
ఆ రోజు రాజారావు బయటకు వెళ్తూ,చొక్కా జేబులో ముందు రోజు పెట్టిన డబ్బులు తీసుకుందామని గదిలోకి వెళ్లి,డబ్బులు తీసాడు. చూడగానే కొంత డబ్బు తక్కువయిందనిపించి ,మళ్ళీ చూసుకున్నాడు. మూడు వేల రూపాయలు తక్కువైంది. భార్యను, పిల్లలిని పిలిచి చెప్పాడు.....
"అయ్యో రామా! పోయిందా డబ్బు? నేనెందుకు తీస్తా అండి? నేనా చొక్కా కూడా ముట్టుకోలేదండీ "చెప్పింది వరలక్ష్మి కంగారుగా.
'ఏరా, గోపాల్! నీకేమైనా అవసరం పడి తీసావా?"కొడుకుని అడిగాడు రాజరావు.
"నాన్నా!..... నేనేమి తియ్యలేదు నాన్నా. నాకు అవసరమైతే నిన్నే అడుగుతా కదా? నేనొక్క పైసా తియ్యలేదు." అని నొక్కి వక్కాణించి చెప్పాడు గోపాల్.
"నేను తియ్యలేదు నాన్నా " జానకి ఏడుపు గొంతుతో అంది.
"అబ్బ ఉండవే జానూ! నిన్నెవరూ ఏమీ అనలేదు ". అని వరలక్ష్మి కసురుకుని,
"ఏవండీ ఒక వేళ మన పనమ్మాయి ఏమైనా తీసిందంటారా?" అని తన సందేహం వెలిబుచ్చింది. "ఏమో మరీ ఈ మధ్య రోజూ జేబులో డబ్బులు తగ్గుతున్నాయి." రాజారావు ఆలోచనలో పడ్డాడు..
"అమ్మయ్య! అనుమానం తనమీదనుండి పనమ్మాయి మీదకు పోయింది. తన మీదకు రాలేదు.. తనిక నిర్భయంగా రోజూ కొంచెం కొంచెం డబ్బులు కొట్టేయచ్చు నాన్న చొక్కా జేబు లోంచి .. స్నేహితులతో మజా చేసుకోవచ్చు." అని ఊపిరి పీల్చుకుని తన గదిలోకి పోయాడు గోపాల్.

రాజారావు, వరలక్ష్మి రోజూ పనమ్మాయి మీద ఒక కన్నేసి ఉంచారు. రోజూ జేబులోని డబ్బులు తక్కువ అవుతూనేవున్నాయి.. ఇంటిదొంగను ఎలా పట్టాలా అని రాజారావు ఆలోచనలో లో పడ్డాడు. రాజారావు.
ఒక రోజు ఏదో పని మీద సైకిల్ పై వెళ్తూ, పిల్లల బడి మీదనుండి వెళ్ళాడు. అది విశ్రాంతి సమయం అవడం వలన అందరూ బయటే ఉన్నారు. అలా చూస్తుంటే గోపాల్ కనిపించాడు. ఐస్క్రీమ్ బండి దగ్గర స్నేహితులు అయిదారుగురితో కలిసి ఉన్నాడు.పక్కగా నిలబడి వాళ్ళ మాటలు వింటున్నాడు .రాజారావు. వాళ్ళకి ఐస్ క్రీం కొనిస్తున్నాడు. " మీకేం కావాలంటే అవి తినండిరా అందరికీ నేను ఇస్తా, తీసుకోండి " అని గోపాల్ అంటుంటే, స్నేహితులు "ఒరేయ్ నీకన్ని డబ్బులెక్కడివిరా? రోజూ మా అందరికీ నువ్వే కొంటున్నావు?"అని తింటూ అడిగారు.
"ఎక్కడివేంటిరా? మా నాన్న ఇస్తాడురా! ఎంతకావాలంటే అంత! మీకు మీ నాన్నలు ఇవ్వరేమో! "అని కాలర్ ఎగరేస్తూ చెప్పాడు.
"తెలిసిందిరా " అనుకుంటూ త్వరగా ఇంటికి వెళ్లి, భార్యకూడా చూడకుండా చొక్కా జేబులో లోని డబ్బులన్నీ తీసేసి తన జేబులో పెట్టుకున్నాడు. తాను దారిలో కోసుకొచ్చిన దూలగుంటాకు మేకుకున్న చొక్కాజేబులో వేసాడు. ఆ చొక్కాను మామూలుగా మేకుకి తగిలిచి వెళ్ళిపోయాడు.
రాత్రి రోజూలాగా వాళ్లనాన్న అన్నం తింటున్నప్పుడు గోపాల్ నాన్న గదిలోకి వెళ్లి డబ్బులు తియ్యడానికని, చొక్కాజేబులో చేయి పెట్టాడు. డబ్బులు దొరకలేదు కానీ దూలగుంటాకు తగిలింది. డబ్బులు కోసం వెతుకుతూ ఉండేసరికి ఆకులు చేతికి బాగా అంటుకుని దురద పట్టుకుంది. భయపడి గట్టిగా "అమ్మా! నాన్నా! తొందరగా రండి!" అని అరిచేసరికి, "ఏమయిందిరా? అలా అరుస్తున్నావు?"ఆంటూ వరలక్ష్మి లేవబోతుంటే " ఉండు వరం, నేను వెళ్తాను!"అని రాజరావు గదిలోకి వెళ్ళేటప్పడికి గోపాల్ రక్తం వచ్చేలోగా
అర చేతిని గోక్కుంటూ కనిపించాడు.
" నాన్నా చెయ్యి మండిపోతోంది. అంతా దురద. భరించలేకపోతున్నా నాన్నా!"
"ఏం నాన్నా నా చొక్కా జేబులో చెయ్యి పెట్టావా?..... ఇక అక్కడ డబ్బులు దొరకవమ్మా ఐస్ క్రీంలకి..... వెళ్లి చేతులు కడుక్కుని కొబ్బరి నూనె రాసుకో. వెళ్ళు." అన్నాడు రాజారావు.
"నన్ను క్షమించు, నాన్నా! ఇక ఎప్పుడూ అలా చెయ్యను " అని చెంపలు వాయించుకున్నాడు, గోపాల్.
" వరం, ఇంటి దొంగ దొరికాడు. అనవసరంగా పనమ్మాయి మీద అపోహపడ్డాము. మన గోపాల్ చెయ్యి చూడు." అని జరిగిందంతా భార్యతో చెప్పి ఆమెకు సందేహ నివృత్తి చేసి ఇంటిదొంగను పట్టించాడు రాజారావు. గోపాల్ మళ్ళీ ఎప్పుడూ నాన్న జేబులోంచే కాదు, మరి ఎవరి దగ్గరనుండి దొంగతనం చేయలేదు!

మరిన్ని కథలు

Muniki sayapadda janthuvulu
మునికి సాయపడ్డ జంతువులు
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Prayatnam thone falitham
ప్రయత్నంతోనే ఫలితం
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Saadhana
సాధన
- డా:సి.హెచ్.ప్రతాప్
Nammaka droham
నమ్మకద్రోహం
- డా:సి.హెచ్.ప్రతాప్
Kantham
కాంతం
- యు. విజయశేఖర రెడ్డి
Paschaattaapam
పశ్చాత్తాపం
- సుధా ఆత్రేయ