దేశ విదేశాల్లో దీపావళి పండుగ - కందుల నాగేశ్వరరావు

దీపావళి పండుగ మనదేశంలో ప్రతి సంవత్సరం జరుపుకొనే పండుగలలో అతిముఖ్యమైన పండుగ. మన దేశంలో అన్ని ప్రాంతములవారు, అన్ని సాంప్రదాయాలవారు చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. హిందువులతోబాటు  జైనులు, సిక్కులు, బౌద్ధమతంలోని ఒక తెగవారు కూడా ఈ పండుగ జరుపుకుంటారు. ఈ పండుగని పురాతన కాలం నుండి జరుపుకుంటున్నట్లుగా మన పురాణాలలోను, ధార్మిక గ్రంథాల్లోను ఆధారాలు ఉన్నాయి.  చాంద్రమానం ప్రకారం ఆశ్వయుజ మాసం ఆఖరి రోజున వచ్చే అమావాస్యని దీపావళి అమావాస్యగా పరిగణిస్తాము. దీపావళిని చెడు మీద మంచి; అజ్ఞానం మీద జ్ఞానం; చీకటి మీద కాంతి యొక్క విజయంగా భావించాలన.

పాత రోజుల్లో దీపావళి పండుగ ఎలా జరిపేవారు:
ఆంధ్రప్రదేశ్ , తెలంగాణా, మహారాష్ట్ర, కర్నాటక ప్రాంతాలలో ఇది రెండు రోజుల పండుగ. దీపావళి ముందు రోజును నరకచతుర్ధశిగా జరుపుకుంటారు.

మా చిన్నప్పుడు నరక చతుర్దశినాడు పిల్లలందరినీ తెల్లవారుజామునే లేపి, వంటికి నూనెరాసి, నలుగుపెట్టి తలకి స్నానం చేయించేవారు. ఆ తర్వాత కొత్తబట్టలు కట్టుకొని తయారయ్యి అమ్మ చేసిన పాయసం ప్రసాదం తినేవాళ్ళం.

ఆ రోజుల్లో దీపావళికి నెలరోజులు ముందు నుండే బాణాసంచా తయారీకి ఏర్పాట్లు జరుగుతుండేవి. మతాబులు, చిచ్చుబుడ్లు, సిసింద్రీలు లాంటివి ఇంటిలోనే తయారు చేసేవాళ్ళం. వంద చిచ్చుబుడ్లకైనా,  మతాబులకైనా కావల్సిన మందుగుండు సామానులు అవరమైన పాళ్లలో బజారులో అమ్మేవారు. మట్టితో చేసిన ఖాళీ చిచ్చుబుడ్లను కుమ్మరివాళ్లు తయారుచేసి అమ్మేవారు. మతాబులను తయారు చేయడానికి కావలసిన గొట్టాలను పాత కాగితాలతో ముందే తయారు చేసుకొని ఎండలో ఎండబెట్టి ఉంచేవాళ్ళం. కొన్న మందుగుండు సామాన్లు కూడా ఒకపూట ఎండబెట్టి తర్వాత చిచ్చుబుడ్లని నింపి వెనుకపక్క బంకమట్టితో  సీలు చేసేవాళ్ళం. మతాబులు సగం వరకు మందుతో నింపి మిగతా సగం ఇసుకతో నింపి సీలు చేసేవాళ్ళం. ఇలా బాణాసంచా తయారుచేయడం మాకు చాలా సరదాగాను, గొప్పగాను ఉండేది.

తాటాకులతోచేసే టపాకాయలు, తారాజువ్వలు ఊరిలోనే ఎవరో తయారుచేసి అమ్మేవారు. కాకర పువ్వువత్తులు, రంగు రంగుల వెలుగునిచ్చే అగ్గిపెట్టెలు, సీమ టపాకాయలు లాంటివి మాత్రం తమిళనాడు రాష్ట్రంలోని శివకాశీలో తయారయిన వాటిని తెచ్చి అమ్మేవారు.

దీపావళినాడు సాయంత్రం మట్టి ప్రమిదలలో నూనె పోసి, వత్తులువేసి ఇంటి బయట అరుగులమీద, గోడలమీద వరుసగా సర్దేవాళ్ళం. పెద్దవాళ్ల పూజలు పూర్తయ్యాక దేవుడికి నైవేద్యం పెట్టిన మిఠాయులు తిన్నాక దీపాలన్నీ వెలిగించడం జరిగేది.   మొదటగ నూనెలో ముంచిన వత్తులు కట్టి తయారుచేసిన గోగుపుల్లను వెలిగించి వాటిని నేలకి కొడుతూ  ‘దుబ్బు దుబ్బు దీపావళి, మళ్ళీ  వచ్చే నాగుల చవితి’ అని పాడటం ఒక ఆచారంగా ఉండేది.  ఆరిపోయిన ఆ గోగుమొక్కలని పారేసిన తరువాత, పిల్లలు ఉత్సాహంగా ఎదురుచూసే బాణాసంచా కాల్చే కార్యక్రమం మొదలయ్యేది. మిగిలిన మతాబులను జాగ్రత్తగా దాచుకొని నాగులచవితి నాడు పుట్ట దగ్గర, మరల కార్తీక పౌర్ణమి నాడు కాల్చడం ప్రతి సంవత్సరం అలవాటుగా మారింది. ఈ రోజుల్లో పెద్దవాళ్లకి గాని పిల్లలకుగాని అంత సమయంగాని, తయారు చేయడానికి కావలసిన ఉత్సాహం కాని లేవు. వేల రూపాయలు పోసి కొని చిన్న సంచీలో తీసుకు వచ్చిన బాణాసంచా పావుగంట కాల్చడానికి కూడా సరిపోదు.

దీపావళి పండుగను వివిధ ప్రాంతాలలో భిన్నరీతులలో జరుపుకుంటారు. ఇంటిని పూలతో అలంకరించడం, సాయంత్రం ఇంటి చుట్టూ దీపాలను వెలిగింది వరుసగా పేర్చడం, బాణాసంచా కాల్చడం, బందుమిత్రులకు మిఠాయిలు పంచడం, ఇంటిలో క్రొత్తగా పెళ్ళయిన దంపతులకు కానుకలు ఇవ్వడం,  వారితో కలిపి విందు భోజనం చేయడంలాంటివి అన్ని ప్రాంతాల ప్రజలు పాటిస్తారు.

దీపావళి పండుగ ఎందుకు జరుపు కుంటాము:
దీపావళి పండుగను జరుపుకోవడానికి రకరకాల కారణాలు చెబుతారు. ఎక్కువ మంది నమ్మే కారణాలు

1. శ్రీరామచంద్రుడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు,  వారి అనుచరులతో కలిసి 14 ఏళ్ళ వనవాసం తరువాత అయోధ్యా నగరానికి తిరిగి వచ్చిన సందర్భంగా ప్రజలు నగరాన్ని రంగు రంగుల పూలతో అలంకరించి, రంగవల్లులు దిద్ది, ఇళ్ళ చుట్టూ దీపాలను పెట్టి పండుగ చేసుకొన్నారు. ఈ విధంగా వారు శ్రీరామచంద్రుడు తిరిగి వచ్చినందుకు తమ ఆనందాన్ని వ్యక్తపరిచుకున్నారు. అప్పటి నుండి ప్రతీ సంవత్సరం దీపావళి పండుగ  జరుపుకొనే ఆచారం మొదలైందని ఎక్కువ మంది,  ఉత్తరభారతదేశంలో పూర్తిగాను ప్రజలు నమ్ముతారు

2. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి  నరకాసురుడనే రాక్షసునితో యుద్ధానికి వెళ్లాడు. యుద్ధంలో కృష్ణభగవానునికి సృహతప్పితే సత్యభామాదేవి నరకాసురుడితో యుద్ధంచేసి వానిని సంహరించింది. తరువాత విజయోత్సాహంతో సత్యభామ శ్రీకృష్ణుడితో కలిసి నగర ప్రవేశం చేసినప్పుడు నగరవాసులు దీపాలతో అలంకరించి వారికి స్వాగతం  పలికేరని, అప్పటి నుండి దీపావళి పండుగ జరుపుకుంటున్నామని ఆంధ్రా, తెలంగాణా, కర్నాటక, మహారాష్ట్ర ప్రాంతపు ప్రజలు నమ్ముతారు. 

3. భవిష్య, బ్రహ్మవైవర్త పురాణాల ప్రకారం విష్ణుమూర్తి వామనుడుగా అవతరించి రాక్షసరాజైన బలి చక్రవర్తిని తన పాదంతో పాతాళానికి తొక్కివేసాడు. లక్ష్మీదేవి బలిచక్రవర్తికి ఒక వరం ఇచ్చిందట. దాని ప్రకారం మహాబలికి సంవత్సరానికి ఒకరోజు పాతాళం నుండి భూలోకానికి రావడానికి స్వాతంత్ర్యం లభించింది. దీనిని మహాబలి గౌరవార్ధం కేరళవాసులు 10రోజులపాటు ‘ఓనం’ పండుగగా జరుపుకుంటారు.

4. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్,  రాజస్థాన్ రాష్ట్రాలలో దీపావళికి లక్ష్మీపూజ, వ్యాపారులు కొత్త లెక్కల పుస్తకాలు తెరవడం ఆచారం. ఒకసారి శివుడు రాత్రంతా పార్వతీదేవితో పాచికలు ఆడి ఓడిపోయాడని, అప్పటినుండి లక్ష్మీదేవికి పూజచేసిన తరువాతనే జూదం ఆడాలనే ఆచారం మొదలయ్యిందని మరో నమ్మకం. విక్రమాదిత్య చక్రవర్తి పట్టాభిషేకం చేసుకున్నరోజున విక్రమార్క శకం మొదలవుతుంది. క్రొత్త సంవత్సరం రోజునే దీపావళి పండుగ జరుపుకుంటున్నామని అభిప్రాయం. అందుకనే వ్యాపారులు ఆరోజు కొత్త చిట్టా పుస్తకాలు  తెరుస్తారు.

5. చరిత్రకారుల ప్రకారం వాత్సాయన కామసూత్రంలో ప్రస్తుత దీపావళిని పోలిన పండుగ గురించి చెప్పబడింది. ఆరోజు  యక్షులు వరుసగా దీపాలు వెలిగించి, ఇళ్ళముందు మంటలు వేసి,  పాచికలు మొదలైన జూదం ఆడేవాళ్ళు. యక్షుల రాజైన కుబేరుడు, లక్ష్మీదేవి ఇద్దరూ సంపదకు చిహ్నం. అదే ఈనాటి దీపావళి అని, అందుకనే దీపావళినాడు లక్ష్మీపూజ చేయడం ఆచారంగా వచ్చిందనేది ఇంకొక అభిప్రాయం. కాశ్మీరులో కూడా  లక్ష్మీ పూజనే దీపావళికి  మూలకారణంగా నమ్ముతారు. పూర్వం వారు దీపావళి పండుగను ‘దీపమాల’ అనేవారు.

6. సిక్కులకు ఆరవ గురువైన ‘గురు హరగోవింద సింగ్’ ను పదిహేను సంవత్సరాల జైలుశిక్ష తరువాత దీపావళి నాడు విడుదల చేసారు. అందువలన సిక్కుమతస్తులు దీపావళి రోజున మట్టిపాత్రలలో దీపాలు వెలిగించి ఇంటి చుట్టూ అలంకరిస్తారు. జైన మతస్థులకు ఆఖరి తీర్థంకరుడైన ‘మహావీర్’ నిర్యాణం పొందిన  రోజు కాబట్టి వారు కూడా ఆరోజును పవిత్రదినంగా భావించి పండుగ జరుపుకుంటారు.

విదేశాలలో దీపావళి పండుగ:
దీపావళి పండుగను మన దేశంలోనే కాకుండా థాయిలేండ్, ఇండోనేషియా, మలేసియా, మైనమార్, గయానా, కెన్యా, ఫిజి, శ్రీలంక, మారిసస్, సురినామ్, సింగపూర్, ఇంగ్లాండ్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాలలో కూడా జరుపుకుంటారు.

సింగపూర్‌లో దీపావళికి  అక్కడి ప్రభుత్వం శలవు దినంగా ప్రకటించింది. భారతీయులు ఎక్కువగా ఉండే ‘లిటిల్ ఇండియా’ ప్రాంతంలో షాపులన్నీ ఎరుపు, పసుపు రంగు పూలతో అలంకరిస్తారు. మలేసియా ముస్లిమ్ దేశమైనా అక్కడ  కూడా ప్రభుత్వం శలవు దినంగా ప్రకటించింది. ఆ దేశ రాజధాని కౌలాలంపూర్లో ప్రజలు ఇంటి చుట్టూ దీపాలు అలంకరిస్తారు. మారిసస్ లో  హిందువులు మిగతా మతస్థులు కలిసి బాణాసంచా కాల్చిన తరువాత విందు చేసుకుంటారు. లండన్ నగరంలో దీపాలంకరణతో ఈ పండుగను జరుపుతారు.

అమెరికాలోని మన దేశస్థులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలైన న్యూజెర్సీ, ఇల్లినోయిస్, టెక్సాస్, కాలిఫోర్నియా ప్రాంతాలలో దీపావళినాటి రాత్రి అందరూ ప్రార్థనలు జరిపి శాఖాహార పదార్థాలతో విందు చేసుకుంటారు. ఆస్ట్రేలియాలో హిందువులు ఎక్కువగా ఉన్న సిడ్నీ, మెల్బోర్న్ నగరాలలో సాంప్రదాయక నాట్యములు, సాంస్కృతిక కార్యక్రమాలు, బాణాసంచా కాల్చడంతో ఈ పండుగ జరుపుకుంటారు.

ఉపశ్రుతి:
దీపావళి పండుగకు ఇల్లంతా శుభ్రం చేసుకోవడం, ఇంటిని చక్కగా అలంకరించుకోవడం, కొత్తబట్టలు కట్టుకొని ఇష్ట  దైవానికి పూజచేసుకుని, బంధుమిత్రులతో విందువినోదాలలో సరదాగా పాలుపంచుకోవడం అనేవి చాలా ఆనందదాయకం మరియు స్వాగతించ దగ్గ విషయాలు.

ఆధునిక యుగంలో జనసాంద్రత పెరిగింది. మన  జీవన విధానం వలన, పరిశ్రమల వలన పరిసరాల్లో వాయు, నీటి, శబ్ధ కాలుష్యాలు విపరీతంగా పెరిగిపోయి ప్రజల ఆరోగ్యాలు ప్రమాద స్థితిలో పడుతున్నాయి. అందువలన మనం రసాయనిక పదార్థాలతో తయారయ్యే ఈ బాణాసంచా కాల్చడం మాని చక్కగా దీపాలంకారణతో దీపావళి పండుగ చేసుకుంటే బాగుంటుందికదా!