'పాడు' పనులు -
"ఇదిగో వదినా..! నీ సుఖంకోరి చెపుతున్నా ఆనక నేను చెప్పలేదని సన్నాయి నొక్కుళ్ళు నొక్కొద్దు... చేతులు చివరికంటా కాలిపోయాక 'సున్నం' రాసీ సుఖమేమీ ఉండదు. వెంటనే వెళ్లి అన్నయ్యని అదుపులోపెట్టుకో.. సంసారాన్ని చక్కదిద్దుకో.. లేదంటే నీ కొంప కొల్లేరే. అయినా ఒకరికిద్దరు వయసుకొచ్చిన ఆడ పిల్లల్ని ఇంట్లో పెట్టుకొని, ఈ వయసులోకూడా ఇదేం పాడుబుద్ది. నలుగురేమనుకుంటారోననే ధ్యాసకూడా లేకుండా తగుదునమ్మా అని ఊరవతల పాడుబడిన కొంపలో చేరి కులుకుతున్నది చాలక, హనీమూన్ కొచ్చిన కొత్తజంటలా 'యుగళ గీతాలు' కూడా పాడుతుంటే చూస్తూ ఊరుకుంటావా? హవ్వ..! ఊరోళ్ల కంటబడితే నీకెంత నామర్దా.." మహంకాళి మాటలు చెవుల్లో మళ్ళీ మళ్ళీ మార్మోగుతూ మనసులో కెలుకుతున్నాయి కామాక్షి కి. పరమేశ్వరుడి లాంటి తన భర్త పరమేశం పక్కదారి పట్టాడంటే పూర్తిగా నమ్మలేక పోతోందామె. తనకు అందిన తాజా సమాచారం ప్రకారం, తన మొగుడు పరమేశం రోజూ ఎవరికంటా పడకుండా రోజూ ఊరవతల పాడుబడిన ఓ పాత కొంపలోకెళ్ళి,ఏ ఎదవ దానితోనో కులుకుతున్నాడట. అది అనోటా ఈనోటా నాని ఇన్నిరోజులకి, అదీ మహంకాళి మంచి మనసువల్ల తనకు చేరింది. అందుకే ఆలస్యం చేయకుండా అంతు తేల్చుకుందామని బయకుదేరిందామె.
యుద్దానికన్నీ సిద్ధం చేసుకుని ఉన్నఫళాన సైటు దగ్గరకు చేరుకుంది.ఆలోచిస్తూ నడుస్తున్నదల్లా అలికిడి కావడంతో ఒక్కసారిగా ఆగిపోయింది కామాక్షి. అల్లంత దూరంలో పరమేశం వస్తూ కనిపించాడామెకు. "రా..రా.. నా దొంగ మొగుడా..! ఎన్నాళ్ళాడుతారీ దొంగాట. దొరికి పోయారుగా నాకు ..రా.. ఒక్కదెబ్బకు రెండు పిట్టలు.. ఈ రోజుతో నా దెబ్బకు దాని పనేకాదు, నీపని కూడా ఠా..!." అనుకుంటూ, పళ్ళుపటపట కొరుకుతూ ఓ పక్కగా నక్కి దాక్కుంది.
పరమేశం పిల్లిలా 'క్యాట్ వాక్' చేస్తూ వచ్చి ఊరికి దూరంగా విసిరేసినట్టున్న ఆ పాడుబడిన ఇంటి ముందు ఆగేడు. తన స్మార్ట్ ఫోన్ తీసి సంతృప్తిగా ఓసారి చూసుకున్నాడు. ముఖానికి పట్టిన చెమటలను కర్చీఫ్ తో తుడుచుకుంటూ, అటూ, ఇటూ చూసుకుంటూ తననెవరూ గమనించడం లేదని రూఢి చేసుకున్నాక, దొంగలా పెద్ద పెద్ద అంగలతో ఆత్రంగా, ఆవురావురుమంటూ లోపల దూరేడు. అతను వెళ్లిన కాసేపటికి లోపలినుంచి ఓ ఆడమనిషి మాటలు వినిపించేయి. ఆ తర్వాత "ఇంకేం..ఇంకేం.. కావాలే.." అంటూ పాటందుకున్నాడు పరమేశం. "పాటలతోనే ఇంకా ఏమేమి కావాలని ఆడుగుతున్నట్టున్నాడు దాన్ని... దొంగసచ్చినోడు.. ఇప్పటిదాకా దానికేమేమి తీసిచ్చాడో, ఎంతెంత తగలేశాడో.. అదికూడా తేలిపోవాలీరోజు" అనుకుంది కామాక్షి కసిగా.
అలా అనుకోగానే కళ్లెర్రబడ్డాయామెకి.. ఆలస్యం చేయకుండా వెంటనే లోపలదూరి పరమేశం పీకపట్టుకుంది. కానీ పక్కన ఆడమనిషి జాడే కనపడకపోవడంతో "ఇప్పటిదాకా నీతో మాట్లాడుతున్నదెవరు? అసలెవత్తది? ఏదీ ఎటుపోయింది? ఎన్నాళ్లనుంచి అడుతున్నారీ నాటకాలు... చెప్పు.." అంటూ చుట్టూ కాళిక లా కలియ దిరగసాగింది. ఊహించని ఈ హఠాత్పరిణామానికి పరమేశానికి పై ప్రాణాలు పైనే పోయాయి. ఏం చెప్పాలో, ఏం చేయాలో తెలీక గుటకలు మింగ సాగేడు.
"అదెవర్తో చెప్పమంటే.. ఏమీ ఎరుగని నంగనాచిలా గుటకలు మింగుతూ ఏమిటా నటన..?" అంటూ దుడ్డుకర్ర తీసుకొని పరమేశాన్ని పిచ్చి కొట్టుడు కొట్టేసింది. పాటలంటే పడిచచ్చే పరమేశానికి పాటల మీద పిచ్చిప్రేమ. అందువల్లనే ఈ మధ్యవచ్చిన 'స్టార్ మేకర్' 'స్టార్ సింగర్ 'లాంటివి సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతుండడంతో పరమేశం కూడా 'సోషల్ మీడియా'లో 'లేడీ సింగర్స్' ను పరిచయం చేసుకుని, ఫోన్ తో తనూ పాటలుపాడి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయాలనే ప్రయత్నాలు మొదలుపెట్టేడు. కానీ ఆ విషయం చెపితే కారుణ్యం లేని కామాక్షి ఒప్పుకోదని భయపడి ఇలా ఊరికి దూరంగా వెళ్లి, ఆన్లైన్లో అడవాళ్ళతో 'డ్యూయెట్లు' పాడుతున్నాడు.
అందులో భాగంగానే రీసెంట్ గా తెలుగు రాష్ట్రాల్లో దుమ్ములేపుతోన్న 'ఇంకెం..ఇంకేం.. కావాలే" పాట రికార్డింగ్ చేసుకుంటుండగా, అదను కోసం చూస్తోన్న కామాక్షి పరమేశాన్ని పక్కా ప్లానుతో పట్టుకుని "నీకు ఇంకా.. ఇంకా.. కావాలా.." అంటూ ఇరగదీసేసింది. పాపం పరమేశం పోయేది పాటలు పాడటానికని తెలీక, ఏం పాడు పనులు చేయడానికి పోతున్నాడోననుకొని చూసిన వాళ్ళు చెడుగా చెప్పడంతో కామాక్షి తో కీళ్ళిరగ్గొట్టించుకోవాల్సివచ్చింది. పాటల పిచ్చి వల్ల 'స్టార్ మేకర్' తో 'స్టార్ సింగర్'ని అయిపోదా మనుకుంటే 'స్టార్' బాగోలేక చావ బాదించు కోవాల్సి వచ్చిందంటూ బావురుమన్నాడు పాపం 'పాడు'పనుల పరమేశానికి. పాటలు తప్ప పాడుపనులెరుగని పరమేశం ఋజువులతో సహా విషయమంతా చెప్పి కామాక్షిని నమ్మించే సరికి తలప్రాణం తోక్కొచ్చింది.

