సుబ్బారావూ-పీనాసి పరాంకుశం - డి వి డి ప్రసాద్

Subbarao - pinasi parankusham

"ఏమండీ! నాన్న ఫోన్ చేసారు, దీపావళి పండగకి తప్పకుండా రమ్మని." సాయంకాలం ఆఫీసు నుండి రాగానే కాఫీ అందిస్తూ చెప్పింది సుబ్బలక్ష్మి.

తలెత్తి చూసాడు సుబ్బారావు. "మొన్న దసరా పండక్కి పిలుస్తారని ఎదురు చూసాను, కానీ పిలవలే! మరిప్పుడు దీపావళికి ఎందుకు పిలుస్తున్నట్లో! దసరా పండగకైతే కానుకలు ఇవ్వాల్సి వస్తుందని, దీపావళి అయితే ఓ రెండు చిచ్చుబుడ్లు చేతిలో పెట్టెయ్యొచ్చు అని దురాశ కదా! నాకు తెలుసులే మీ నాన్నగారి ప్లాను!" పళ్ళు పటపటా కొరుకుతూ అన్నాడు సుబ్బారావు తనకు పిల్లనిచ్చిన మామ పరాంకుశంని తలచుకుంటూ.

వెంటనే సుబ్బలక్ష్మికి చిర్రెత్తుకొచ్చింది. కోపంతో మొహం ఎర్రబడింది. "ఎప్పుడూ ఏదో ఒకటి అనడానికి మావాళ్ళే దొరికారా మీకు ఆడిపోసుకోవడానికి? ఇప్పుడు మీకేం తక్కువ చేసారని? పెళ్ళికి కట్నం బాగానే రాబెట్టారుగా!" అంది రోషంగా.

ఆ మాట వింటూనే ఇంతెత్తున లేచాడు సుబ్బారావు. "ఏమిటీ దండిగా కట్నం ఇచ్చారా? ఇచ్చినట్లే ఇచ్చి మళ్ళీ లాగేసుకున్నారు కదే! మామగారి లాంఛనాలు అని, అత్తగారి లాంఛనాలు అని, అదని, ఇదని, ఇచ్చినదానికన్నా ఎక్కువే తీసేసుకున్నారు. అయినా ఇలా రివర్స్ లాంఛనాలు నేనెక్కడా వినలేదు కనలేదు, రివర్స్ టెండర్స్ లాగా ఇదేదో వింతగా ఉంది." అన్నాడు మామ పరాంకుశం పిసినారితనం తలచుకుంటూ.

కట్నం అంటూ చెప్పి ఐదు లక్షలు ఇచ్చినట్లే ఇచ్చి, ఆ మొత్తం కన్నా ఎక్కువ అల్లుడి దగ్గర మళ్ళీ పుచ్చేసుకున్నాడు పిసినారి పరాంకుశం. ఏమైనా అంటే,"ఇది మా ఇంటి సంప్రదాయం. పెళ్ళి చూపుల్లోనే చెప్పాను, మా సంప్రదాయాల్ని కచ్చితంగా పాటించాలి అని, దానికి ఒప్పుకున్నారు కదా అల్లుడుగారూ! ఇప్పుడు మరి అభ్యంతరం చెప్తే ఎలా?" అన్నాడు నవ్వుతూ.

"అవుననుకోండి!" అంటూ నీళ్ళు నమలవలసి వచ్చింది సుబ్బారావుకి. పాపం సుబ్బారావు మాత్రం ఏం చేస్తాడు? పెళ్ళి చూపులు శతకం (సెంచూరీ) దాటినా, పెళ్ళి కుదరకపోయేసరికి తనకీ బ్రహ్మచారి చెర నుండి ఎప్పుడు విముక్తి దొరుకుతుందోనని ఒప్పేసుకున్నాడు పరాంకుశం పెట్టిన అన్ని షరతులకి. ఏదో నామ మాత్రం లాంఛనాలనుకున్నాడే కానీ, ఇలా ఇచ్చిన మొత్తం కన్నా ఎక్కువే నొక్కేస్తాడని తను మాత్రం కలగన్నాడా ఏమిటి? పెళ్ళిచూపుల్లో కాబోయే మామగారి ఇల్లువాకిలీ, పొలంపుట్రా, హోదా-ఠీవి చూసి, తంతే బూరెల బుట్టలో పడ్డాననుకున్నాడు, కానీ ఇలా బురద గుంటలో పడతాడని అసలు కలగనలేదు. అంతేకాక, అప్పుడు మరో దారిలేదు. పెళ్ళి సంబంధం కుదరక, చివరికి పెళ్ళికాని సుబ్బారావులా మిగిలిపోయే ప్రమాదముందని, పరాంకుశం విధించిన అన్ని షరతులు ఒప్పేసుకున్నాడు మరి!

"ఏమైనా సరే...నేను రాను!...రాను..." అన్నాడు సుబ్బారావు గట్టిగా.

సుబ్బారావు మాటలకి కోపం తెచ్చుకున్న సుబ్బలక్ష్మి విసురుగా వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత, వంటింట్లోంచి వచ్చిన క్షిపణుల దాడికి, సర్జికల్ స్ట్రైక్ కి రాజీపడక తప్పలేదు సుబ్బారావుకి. దీపావళి పండుగకి వెళ్ళడానికి ఒప్పుకున్న తర్వాత, "మీరెంత మంచివారండీ! నేను అట్టే శ్రమపడకుండానే ఒప్పేసుకున్నారు!" ఆనందంగా అని వేడివేడి కాఫీ అందించేసరికి తెల్లమొహం వేసాడు పాపం సుబ్బారావు.

ఎలాగూ సుబ్బలక్ష్మి మాటే చెల్లుతుంది కాబట్టి, తను ఇక వాదనలకు దిగడం వల్ల కంఠశోష తప్ప మరేమీ మిగలదని అర్థమైంది సుబ్బారావుకి. కాకపోతే, దీపావళి పండగకి మామగారే విధంగా సత్కరిస్తారో అని భయం ఓ మూల ఉండనే ఉంది.

దీపావళికి రెండు రోజుల ముందే సతీసమేతంగా మామగారి ఊరు చేరుకున్నాడు సుబ్బారావు. అతని అత్తగారు కాంతం కూతుర్నీ, అల్లుడ్నీ ఆప్యాయంగా పలకరించింది. తల్లి పలకరింపులకి సుబ్బలక్ష్మి పులకరించినా, సుబ్బారావు కళ్ళు మాత్రం మామగారిని వెతుకుతూనే ఉన్నాయి. అతని చూపుల్ని కాంతం గమనించినట్లుంది.

"మీ మావయ్యగారు పండుక్కి మీకోసం బట్టలు కొని తేవడానికి బజారుకెళ్ళారు. కొద్దిసేపట్లో తిరిగి వస్తారు. ఈలోగా మీరిద్దరూ కాళ్ళూ, చేతులూ కడుక్కొని వస్తే, కాఫీ ఇస్తాను" అందామె.

తన కోసం మావగారు బట్టలు కొనడానికి వెళ్ళారనగానే పెళ్ళిలో తనకి పెట్టిన నాసిరకం బట్టలు గుర్తుకు వచ్చాయి సుబ్బారావుకి. ఈసారి కూడా తప్పకుండా ఊరంతా తిరిగి ఎక్కడ కారు చవుకగా దొరుకుతాయో వెతికి మరీ బట్టలు పిసినారి మావయ్య కొంటాడని ఉసూరుమన్నాడు సుబ్బారావు.

సరిగ్గా భోజనాల సమయానికి ఇంటికివచ్చిన పరాంకుశం అల్లుడ్ని పలకరించాడు.

"అల్లుడుగారూ, అంతా కులాశానా! దీపావళి పండగకి మీరెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాను. మీ ఊళ్ళో దీపావళి టపాకాయలు చవగ్గా దొరుకుతాయటగా, అమ్మాయి చెప్పింది, ఏమైనా తెచ్చారా!" అని అడిగాడు.

ఒక్కసారి మామగారిమీద కోపం వచ్చినా తమాయించుకున్నాడు బాగోదని. పళ్ళికిలించి చెప్పాడు, "లేదు మామయ్యగారూ, నాకు ఆఫీసు పనులతో వీలుపడలేదు."

"అయ్యో! మీరు తెస్తారనుకొని, చౌక బేరం వదిలేసుకున్నాను." అని సోఫాలో కూలబడ్డాడు పరాంకుశం. తనతో తెచ్చిన సంచీ తెరిచి, అందులోంచి బట్టలు బయటకు తీసాడు.

నాసిరకం బట్టలు చూస్తూనే సుబ్బారావు చీదరించుకున్నాడు. ఏదో సెకండ్ హ్యాండ్ బట్టలు ఫుట్ పాత్ దుకాణం నుంచి మామగారు కొట్టుకొచ్చినట్లు ఉందని అనుకున్నాడు. అతని మనసులో మాట ఊహించినట్లు పరాంకుశం అన్నాడు, "మీరనుకున్నట్లు ఇవి పుట్ పాత్ బట్టలు కావు అల్లుడు గారూ. పెద్ద మాల్ లోనే బై వన్, గెట్ వన్ కింద తీసుకున్నాను. కారు చవగ్గా ఉన్నాయనుకోండి! ఒకటేమో మీకు, రెండోది నాకు! అసలు దీపావళి పండక్కి మంచి బట్టలెందుకు చెప్పండి? బట్టల మీద ఏ చిచ్చుబుడ్డి రవ్వలో, కాకరొత్తుల చిటపటలో పడితే ఎలాగూ పాడవుతాయి కదా! అంత మాత్రానికి ఖరీదైన బట్టలెందుకసలు? అదన్నమాట సంగతి!" అన్నాడు.

మామగారి రీజనింగ్ కి ఒళ్ళు మండింది సుబ్బారావుకి. మామ పరాంకుశం పిసినారితనం ముందే తెలుసు గనుక మారు మాట్లడలేదు. సాయంకాలం ఐదైయ్యేసరికి బయటకు వెళ్ళడానికి రెడీ అయ్యాడు సుబ్బారావు. అది చూస్తూనే, "ఏమిటి అల్లుడు గారూ, సినిమాకా బయలుదేరారు? పదండి! శివ-శక్తి థియేటర్లలో కొత్త తెలుగు సినిమాలు ఆడుతున్నాయి. నేను కూడా హాల్లో సినిమాలు చూసి చాలరోజులైంది." అని వెంటపడ్డాడు పరాంకుశం.

వంటికి కారం పులుముకున్నట్లు అనిపించింది సుబ్బారావుకి. స్వర్గానికెళ్ళినా సవితిపోరు తప్పనట్లు, వీధిలోకి బయలుదేరినా మామ పోటు తప్పదనిపించింది సుబ్బారావుకి.

"సినిమాకు కాదు మామగారూ! అలా వీధిలో తిరిగివద్దామని బయలుదేరుతున్నాను. అంతే!" అన్నాడు కసిగా పళ్ళు నూరుతూ.

"అంతేనా! అంతేనా అల్లుడుగారూ! వీధిలో చల్లగాలికి తిరగడమెందుకు? చక్కగా నాతో పేకాట ఆడొచ్చు కదా! టైం పాస్ అయిపోతుంది! మజాకి మజా! డబ్బుకి డబ్బు!" జేబులోంచి పేకముక్కలు బయటకు తీసాడు పరాంకుశం.

పేక ముక్కల్ని చూడగానే మనసు లాగింది సుబ్బారావుకి. అసలే ఇక్కడికొచ్చిన దగ్గరనుండు పేకాట ఆడక చేతులు తెగ దురద పెడుతున్నాయి. అయితే పాత సంగతులు గుర్తుకు వచ్చి తమాయించుకున్నాడు. నెల రోజుల క్రితం ఏదో పనిమీద మామగారు తమ ఊరికి వచ్చినప్పుడు ఇలాగే రెచ్చగొట్టి పేకాడించి, ఆ నెల మొత్తం జీతం దోచుకున్న వైనం గుర్తుకు గచ్చింది. 'అమ్మో! మాయదారి మామగారు, ఈసారి కూడా జేబులో ఉన్న మొత్తం కాజేస్తాడు కాబోలు, జేబులో డబ్బులు లేకపోతే పేటీఎం, ఫోన్ పే అయినా పర్వాలేదంటాడు.' అనుకొని తనకేమీ వినపడనట్లే మామగారి మొహంవైపు కూడా చూడకుండా బయటకు పరుగు తీసాడు సుబ్బారావు.

అప్పుడైతే అలా బయటకు వెళ్ళి తప్పించుకున్నాడు కానీ, ఆ రాత్రి భోజనాలయ్యాక మాత్రం పరాంకుశం బారి నుండి తప్పించుకోలేకపోయాడు పాపం సుబ్బారావు. రెచ్చగొట్టి మరీ, చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా పేకాడి మొత్తం దోచేసుకున్నాడు పరాంకుశం. మనసులో మామగారిని తిట్టుకున్నా, బయటకు ఏమీ అనలేకపోయాడు.

దీపావళి రోజు రానే వచ్చింది. మామగారు కొన్న కొత్తబట్టలు(?) ఏడ్పుగొట్టు మొహంతో వేసుకోక తప్పింది కాదు సుబ్బారావుకి. దీపాలు పెట్టేవేళ అతని చేతికి ఓ చిచ్చుబుడ్డి, రెండు కాకరవొత్తులు అందించి, "పండుగ చేసుకోండి అల్లుడుగారూ! మళ్ళీమళ్ళీ ఇలాంటి దీపావళి రోజు రాదు! ఏడాదికోసారి మాత్రమే వస్తుంది. దీపావళికోసం ఈపాటి ఖర్చు పెట్టక తప్పదనుకోండి!" అన్నాడు పరాంకుశం.

చేతిలో ఉన్న చిచ్చుబుడ్డిని, కాకరొత్తుల్ని చూసి నవ్వుకున్నాడు సుబ్బారావు. తన పిసినారితనంతో డబ్బులు కూడబెట్టి అతను ఏం బావుకుంటాడో అర్ధం కాలేదు సుబ్బారావుకి. అలా చాలా ఘనంగా(?) అత్తవారింట మొదటి దీపావళి పండగ జరుపుకున్నాడు సుబ్బారావు.

ఆ తర్వాత, మామగారు పిలిచినప్పుడల్లా పండక్కి, పబ్బానికి వెళ్ళి వస్తూనే ఉన్నాడు, పేకాటలో మామగారిచేత దోపిడీ చెయ్యబడుతూనే ఉన్నాడు. సుబ్బారావు వెళ్ళనప్పుడు తనే సతీ సమేతంగా పరాంకుశం దిగబడి పోయి, అల్లుడి చేత ఖర్చు చేయించి, కావలసినవి కొనిపెట్టించుకుంటున్నాడు. సమయం దొరికినప్పుడల్లా, సుబ్బారావు చేత పేకాట ఆడించి డబ్బులు కొట్టేస్తూనే ఉన్నాడు.

అలా ఐదేళ్ళు గడిచేసరికి, సుబ్బారావుకి పేకాట మీద ఆసక్తి చచ్చిపోయింది. ఇప్పుడు సరదాకి కూడా పేక ముట్టుకోవడంలేదు సరికదా, చూస్తే కూడా చీదరించుకుంటున్నాడు. ఇంతకుముందు ఆఫీసు పని పూర్తైన తర్వాత, ఏ స్నేహితుడి ఇంట్లోనో, క్లబ్బులోనో పేకాడుతూ సమయం గడిపిన సుబ్బారావు, ఇప్పుడు నేరుగా ఇంటికి వచ్చేస్తున్నాడు.

ఈ సారి దీపావళి పండక్కి రమ్మని మామ పరాంకుశం నుండి పిలుపు వస్తే విసుక్కున్నాడు. "మీ నాన్నకి ఇదేం పాడు బుద్ధి! పండక్కి అల్లుడికి పెట్టేదేమీ లేదు కానీ, దోచుకోవడమంటే మహా సరదా! ఇలాంటి పినాసీ మామగార్ని నేనెక్కడా చూడలేదు. నేనీసారి వెళ్ళనుగాక వెళ్ళను." అని భీష్మించుకున్నాడు.

ముందు నయాన, భయాన చెప్పి చూసింది సుబ్బలక్ష్మి. 'ససేమీరా!' అన్నాడు సుబ్బారావు. చివరి అస్త్రం...బ్రహ్మాస్త్రం వదిలింది...అదే కడివెడు కాదు కానీ...ఓ నాలుగు చుక్కలు కన్నీరు మాత్రం కార్చింది మొహం మాడ్చుకొని. ఆ నాలుగు చుక్కలకే చుక్కలు కనిపించాయి సుబ్బారావుకి. అంతే! ఆ బ్రహ్మాస్త్రం దెబ్బకి లొంగక తప్పింది కాదు సుబ్బారావుకి.

అయితే ఈసారి మామగారింట తనకి లభించిన ఘన స్వాగతానికి అశ్చర్యానికి లోనయ్యాడు సుబ్బారావు. ఖరీదైన బట్టలు తనకివ్వడమే కాకుండా, సుబ్బలక్ష్మికి కూడా నాలుగుతులాల నెక్లెస్ పండుగ కానుకగా ఇచ్చిన పరాంకుశంవైపు వింతగా చూసాడు సుబ్బారావు. పేకాట మాటే ఎత్తలేదు రోజంతా! 'తనేమీ కలగనలేదు కదా!' అని ఎందుకైనా మంచిదని తనని తాను గిల్లి చూసుకున్నాడు కూడా. అంతేకాక, సుబ్బలక్ష్మిని కూడా గిల్లాడు. ఆమె కెవ్వుమనడంతో, కలకాదు వాస్తవమే అని గ్రహించాడు. అపనమ్మకంగా మామగారివైపు చూసాడు.

"అంతగా ఆశ్చర్యపడకండి అల్లుడుగారూ! మీరనుకున్నట్లు నేను పీనాసి పరాంకుశం కాను! అందరు తండ్రులులానే నా కూతురూ, అల్లుడూ సుఖంగా ఉండాలన్న ఆశ నాకూ ఉంది. అల్లుడి సొమ్ము దోచుకోవాలన్న దురాశ కూడా నాకెన్నడూ లేదు!..."

నోరు తెరిచి వింటున్నాడు సుబ్బారావు.

"అసలు సంగతేమిటంటే...మీకు పేకాట పిచ్చి బాగా ముదిరిపోయిందని, అది వెంటనే తుంచకపోతే తన బతుకు బస్టాండేనని సుబ్బలక్ష్మి కన్నీళ్ళు పెట్టుకుంటే, నాకలా చెయ్యక తప్పింది కాదు. పెళ్ళికి ముందే మీకా దురలవాటు ఉందని తెలుసు. ఆ ఒక్క విషయంలో మీకు బలహీనత ఉందని, అది తప్పించి మిగతా అన్ని విషయాల్లోనూ మీరు చాలా మంచివారని తెలుసుకున్నాను. పెళ్ళికి ముందు మీ అమ్మ, మేనమామా నాకా విషయం చెప్పారు. అందుకే రకరకాలుగా నాటకాలాడి మీదగ్గర డబ్బులు దోచుకున్నాను. ఆ డబ్బులంతా మీ ఇద్దరి పేర బ్యాంక్ లో దాచాను. దేవుడి దయవల్ల, మీకు పేకాట మీద మోహం తగ్గింది, మా అమ్మాయి సుబ్బలక్ష్మి కాపురం నిలబడింది. నేనేమైనా తప్పు చేసి ఉంటే క్షమించండి అల్లుడు గారూ! అంతా మీ మంచి కోరే చేసాను. ఈ దీపావళి మనమంతా ఘనంగా జరుపుకోవాలి." అని బుట్టెడు టపాకాయలు సుబ్బారావు చేతిలో పెట్టాడు పరాంకుశం.

మామగారి మాటలు విన్న సుబ్బారావు నివ్వెరపోయాడు. తనలో మార్పు కోరి నాటకాలాడిన మామగారంటే ఎంతో ఆప్యాయత కలిగింది. కొద్దిగా సిగ్గు కూడా పడ్డాడు. మామగారి చేతులు పట్టుకున్నాడు.

"ఛ..ఛ...అంత మాటలనకండి మామయ్యగారూ. మీరే నన్ను క్షమించండి! మీరు ఏం చేసినా నా మంచి కోరే చేసారు! నిజంగా ఈ దీపావళి పండగ జీవితంలో మర్చిపోలేనిది." మనస్పూర్తిగా అన్నాడు సుబ్బారావు.

భార్య సుబ్బలక్ష్మివైపు, అత్తగారు కాంతంవైపు ఆనందంగా చూసాడు సుబ్బారావు. వీధిలో టపకాయలు జోరుగా పేలుతున్నాయి. తారాజువ్వలు వెలుగులు విరచిమ్ముతూ నింగికెగిసిపోతున్నాయి. ఆ రోజు ఆ కుటుంబానికి నిజమైన దీపావళి పండగ!