కళల ఆవిర్భావం . - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

కళల ఆవిర్భావం .

కళల ఆవిర్బావం.
ఆనాడు : అంటే కొన్ని వేల సంవత్సరాలనాడు. భూమి అంతా సూర్యుని వేడితో కాలిపోయి ఆకాశమంతా ప్రచండ స్వరూపంతో నిండిపోయింది. ఎక్కడ చూసినా నీరు లేదు వాన లేదు. పశువులూ, పక్షులూ మలమల మాడిపోతున్నాయి.
అడవులన్నీ దగ్ధమై పోతున్నాయి. అడవి మనుషుల గుంపులన్నీ తల్లడిల్లి పోతున్నాయి. అడవులు వదలి బయటికి వచ్చారు.
సూర్యుడే భగవానుడు:
సూర్యుని వేడి వాళ్ళను కూడా వెంటాడింది. తాళలేక తల్లడిల్లి పోయారు. సూర్యుని వల్ల భయంతో కూడిన భక్తి భావం ఏర్పడింది. చేతులు జోడించి నమస్కారాలు చేశారు. సూర్యుణ్ణి దైవంగా భావించి ఆరాధించారే కానీ, ఆకలికి తట్టుకోలేక పోయారు. ఈ ఆకలిని ఎలా తీర్చు కోవాలి? ఏమీ పాలుపోలేదు. ఆకాశమంతా మేఘావృతమైన మేఘాలు చల్లని గాలులతో, ఉరుములతో, పిడుగులతో వర్షం కురవనారంభించిది. ఎండతో మండిపోయే గుంపులకు కొంచెం శాంతి లభించింది. భూమి అంతా చల్లబడిపోయింది. అందరి దాహమూ తీరింది. జంతువులూ, పక్షులూ, క్రిమి కీటకాదులూ, శబ్దాలు మొదలుపెట్టాయి. విత్తనాలన్నీ విచ్చుకున్నాయి. దశదిశలా ఆనందం తొణికిసలాడింది. ఇది గుంపులో వారికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతవరకూ సూర్యుని వేడితో మగ్గిన వారందరూ ఈ వర్షంవల్ల ఓ జలదేవతా, నీవు మాకు మహోపకారం చేశావని వరుణదేవునికి సాగిలపడి మొక్కారు. వేడితో మ్రగ్గిపోయినవారు జలదేవతతో ధన్యులయ్యారు.
పకృతే దేవత :
వర్షం కురవటంతో ఏ ప్రక్క చూసినా కొండవాగులూ, నదీప్రవాహాలూ, మొత్తంగా ప్రవహించి భూమిమీద అక్కడక్కడా సరస్సులు ఏర్పడ్డాయి. పచ్చబడిన భూమి పైరుల్ని పెంచుతోంది. పగిలి విచ్చిన విత్తనాల ద్వారా పండి ఒరిగిన చెట్ల భారాన్ని భూమి భరిస్తోంది. ఎటు చూసినా పండ్లవాసనలు, పక్షుల కిలకిలారావాలు, ఆకలి దప్పులతో అలమటిస్తున్న అడవి గుంపులకు ఆహారం దొరికింది. ఆకలి తీరింది. హమ్మయ్య అన్నారు. దీనికంతకూ కారణం ప్రకృతే అనుకున్నారు. ప్రకృతినే దైవంగా పూజించారు.
పూజలూ, పునస్కారాలూ :
ఒక గుంపువారు సూర్యుడే భగవంతు డన్నారు. మరోగుంపు వర్షాన్నే దేవతగా చిత్రించింది. ఇంకోగుంపు ప్రకృతి మాతనే పూజించింది. ఇలా సంతోషాన్ని పట్టలేక ఎవరి నోటికి వచ్చిన పదాలను వారు సమకూర్చుకున్నారు. గొంతెత్తి కేకలు వేశారు. కేకలే పాటలైనాయి. ఆనందంతో అవయవాలన్నీ చలించాయి. స్త్రీలూ, పురుషులూ కేరింతలు కొడుతూ నోటితో పాటలు పాడ నారంభించారు. స్త్రీలు పుష్పాలను తీసుకున్నారు. పురుషులు కందమూలాల్ని తీసుకున్నారు. వారి వారి భక్తికొద్దీ నైవేద్యాలు చెల్లించారు. వారి సంతోషాన్ని, తృప్తినీ విజయాన్ని పాటలతో ఆటలతో వెల్లడిచేసి ఆనాడే ఆటవికజాతి జానపద కళల పునాదుల్ని వేశారు.
కడుపు కూటికై, కాట్లాటలు :
ఆనాడు ఆటవికులకు ప్రతినిత్యం ఆహార సమస్య ఘోరంగా వుండేది. వారికి పంటలు లేవు . ఎలా పండించాలో తెలియదు. నాగలికొయ్య ఆనాటికింకా పుట్టలేదు. అడవిలో మ్రగ్గిన పండ్లనూ, దుంపలనూ, జంతువుల పచ్చిమాంసాన్నీ తినేవారు. ఇలా వారు ఆహారం కోసం గుంపులు గుంపులుగా బయలుదేరి సమిష్టిగా ఆహారాన్ని సాధించేవారు.
ఈ ఆహార సాధనలో గుంపుల మధ్య కలహాలు వచ్చి ఒకారి నొకరు జయించుకునే వారు. ఈ దండయాత్రలో భీకరమైన కేకలూ, గంతులూ వేసేవారు. విజయానందంతో, వీరనృత్యాలు చేసేవారు, నోటికొచ్చిన కవితలు ఆశువుగా చెప్పేవారు. ఆ కవితల్ని ఆనందంగా గానం చేసేవారు.
భజనలూ, భక్తిగీతాలూ :
ఈ విధంగా ప్రాచీన మానవజాతులు, నృత్య, గీత, అభినయాలతో కాలం వెళ్ళబుచ్చేవారు. ఇందులో కొంతమంది తన్మయీభావంతో నిపుణత్వాన్ని ప్రదర్శించే వారు. నిపుణులు ప్రత్యేకంగా వరుసలు తీరి, వరుసక్రమంలో ఒక నాయకుని చెప్పు చేతలలో రకరకాల నాట్యవరుసల్నీ, అభినయాన్నీ నిర్ణయించేవారు.
క్రమానుగతంగా కాలం మారినకొద్దీ మానవుడు విజ్ఞానం పొందుతూ వచ్చాడు. వేష భాషల్లో మార్పు రాసాగింది. వారనుకునే దేవతాది అతీత శక్తులు క్రూర స్వభావాలు కలవి కావనీ, అవి మానవుల, లక్షల కొద్దీ జీవరాసుల రక్షణ కొరకే వచ్చిన శక్తులనీ భావించసాగారు. ఎంతో భక్తితో ఎల్లకాలం మమ్ము కాపాడాలని, ఆరాధిస్తూ భక్తిమయమైన గీతాలు, నృత్యాలు, భజనలు, అభినాయలతో స్త్రీ పురుషులు కలిపి తమ సంతోషాన్ని దేవతలకు తెలియచేసేవారు. తమ తమ బిడ్డలూ, పశువులూ, పంటలూ బాగుండాలనీ, వాటిని కాపాడే శక్తులు మీరేనని దేవతలను స్తుతించేవారు.
బ్రతుకు కోసం నృత్యగానాలు :
చల్లటి గాలుల్లో విహరించేటప్పుడు ఒడలు పొంగి ప్రకృతిమాత ఒడిలో ఒదిగి పోయి పాటలు పాడుతూ ఒడలు మరిచి నిద్రపోయేవారు. పండువెన్నెల విరిసే సుందర రాత్రులలో స్త్రీ పురుషుల పాటలు పాడుతూ నృత్యాలు చేసేవారు. వర్షం రాకపోతే రకరకాల వాయిద్యాలతో భూనభోంతరాలు దద్దరిల్లి పోయేటట్లు, పాటలతో, ఆటలతో, కేకలతో వుత్సవాలు చేసేవారు. క్రూరమృగాల బారినుండి రక్షించుకోవడానికి, ఆ యా మృగాల వేషధారణలతో, వాటి అరుపులతో, వాటి అభినయంతో కదలికలతో వెళ్ళి వాటిని సంహరించి, వాటి మాంసాన్ని తెచ్చుకునేవారు. వాటి చర్మాలను దుస్తులుగా మార్చుకునేవారు. కొన్ని జంతువుల చర్మాలను, పెద్ద వెదురు బొంగులను ముక్కలు చేసి ఆ రంధ్రాలకు చర్మాలను అమర్చి వాటిని వాయిద్యాలుగా మార్చుకునేవారు. ఈ విధంగా ఆనాటి అటవికులు జీవిత విధానాల కోసం, నృత్య గానాలను నేర్చుకోవడంతో జానపదకళలకు అంకురార్పణ చేసారు.
జానపద కళలకు పునాది :
ఇలా దేవతలను పొగుడుతూ వారి గుణగణాలను కథలుగాను, పాటలుగాను వ్రాసి పాత్రలను సృష్టించి ఒకడు ప్రధానుడై, సూత్రధారుడై మిగిలినవారిని నడిపిస్తూ కార్యక్రమం నడపటం వాడుకైంది. ఈ పద్దతి ఎప్పుడైతే వచ్చిందో ప్రతి ఒక్కడూ తాను ఆభినయించబోయే పాత్రను బాగా పోషించటానికి అనేక రకాల కృషిచేసి ఒక రూపానికి తీసుకువచ్చి, వారి వారి గుంపులలో ప్రదర్శనాలు ఇస్తూ వుండేవారు.
పైవిధంగా కార్యక్రమాలు జరిగేటప్పుడు ప్రేక్షకులు పరాకుగా వుండకుండా మధ్య మధ్య హాస్యాన్ని పురికొల్పుతూ, ఆనందంకోసం గానాన్ని, మనుషుల నుత్తేజ పర్చటానికి వీరనృత్యాలనూ, హృదయాలను కరగించటానికి శోకరసాన్నీ, యువతీ యువకుల ఆనందం కొరకు శృంగారరసాన్ని ఎన్నుకుని జానపద నాట్యకళకు ఆదిమవాసులు ఆనాడే పునాదులు వేశారు. దేవతారాధనలోను , ఉత్సవాలలోను చాలవరకు ప్రాచీన నాటకాలు ఆడబడుతుండేవి. నాటి ఆటవిక ప్రజలు శత్రువుల మీద దాడి జరపాలనుకున్నప్పుడు శత్రువులను రాక్షసులుగా చిత్రించేవారు. వారు చేసే హింసాకాండను కళ్ళకు కట్టినట్టు చూపేవారు. వాళ్ళకు పది తలలున్నాయనీ, ఇరవై చేతులున్నాయనీ, జంతువులకున్నట్లు కోరలు, కోడిగ్రుడ్డంత కండ్లు మొదలైన వికృతాకారాలను నాటకరూపాల్లో చూపించి ప్రజలను సమీకరించేవారు.
తొలి మానవ సంఘం :
ప్రపంచంలో మానవుడు అడవుల్లో చెట్లపై కోతివలె నివాస మేర్పరుచుకుని స్త్రీ పురుషులు ఎవరి నిలయాలలో వారు నివసిస్తూ వుండేవారు. ఈ విధంగా విడివడి కలుసుకున్న కుటుంబాలే మానవ కుటుంబం. ఇదే తొలి మానవ సంఘం, పశువులను సాధుపరచి భూములను సాగుచేసి, అడవులను ఛేదించి కుటీరాలను నిర్మించి, నదీకాసార ప్రాంతాల గ్రామాలు నిర్మించి, గ్రామం మధ్యలో ఒక దిబ్బ పేర్చి, ఒక చెట్టు నాటిగాని, ఒక దేవునిమూర్తి స్థాపించి గాని గ్రామప్రజ లందరూ ఆరాధనలు, పాటలు, భజనలు, నృత్యాలు, నాటకాలు ఆడుతూ వుండేవారు.
ప్రకృతిలో:
ప్రకృతిలో ప్రతి మనిషికీ, ప్రతి జంతువుకీ, త్రుళ్ళడం, గెంతడం, పాడడం, సంతోషించడం, శృంగారించుకోవడం, బాధపడడం, మొదలైన సహజగుణాలున్నాయి. మాట లేకపోయినా జంతువులు కూడ దెబ్బతగిలితే బాధపడతాయి , ఏడుస్తాయి, మంచి ఆహారము దొరికితే సంతోషపడతాయి, ఎగిరి గంతేస్తాయి, వర్షం వచ్చే ముందు చల్లని గాలిలో విహరిస్తాయి.
ఇదే విధంగా ప్రతి మనిషీ ఈ లక్షణాలను కలిగి వున్నాడు. మనిషికి సంతోషం కలిగినప్పుడు ఎంతో మందహాసం కనబడుతుంది అందులోనే కళ ఇమిడి
కళ అనేది ఒక ప్రత్యేక పదార్థం కాదు. ఇది కళ అని కూడ మానవుడికి తెలియదు. కోపం వచ్చినప్పుడు ప్రతి ఒక్క అవయవమూ, కళ్ళూ, ముఖమూ కంపించి పోతాయి. భావాలు ఎంతో గంభీరంగా వుంటాయి, ఆ ఆకారాన్ని ఇతరులు చూసినప్పుడు ఎంతో భీతి కలుగుతుంది. అతనికి తెలియ కుండానే అందులో కళ ఇమిడివుంది. కాని కావాలనుకున్నప్పుడు ఆ కోపం తెప్పించలేడు. నటించక పోవచ్చు. సహజం అతనిలో ఉద్రేకం కలిగినప్పుడే, ఆ భావాన్ని మనం చూడ గలుగుతాం. సంతోషం బాధ, క్రోధం, శత్రుత్వం మానవునికి సహజ గుణాలని పైనే తెలుసుకో గలిగాం. ఈ గుణాలను కళారూపంలో అభివృద్ధి పొందించాలంటే పై వాటినన్నిటికి అవగాహన చేసుకుని జీర్ణం చేసుకున్నప్పుడే అది సాధ్య మవుతుంది.
భావయుతమైన నటన:
ఆదిమ సమాజపు మనుష్యులు జంతు సమానులుగా వుండేవారని తెలుసు కున్నాం. అడవులలో వాళ్ళ నివాసం అవడం వల్ల వారు జంతువుల లాగే నటించే వారు. అరుపులు, నడకలు, కూతలు, పోట్లాటలు, గర్జనలు, జంతు విన్యాసాలు జరిగేవి. ఇవి చూచే మానవుడు భావయుతమైన నటన మెదలు పెట్టాడు.
నాగనృత్యం:
భావాన్ని బట్టి నటన సృష్టిలోనే వుంది. పాము వచ్చింది, పరుగెత్తింది, పడగ విప్పింది, మెలికలు తిరిగింది, కాటువేసింది. ఈ నటనను చూపించాలటే పాము ఆడటం చూడాలి. దాని అభినయం చెయ్యాలి. మనిషి మెలికలు తిరిగి పోవాలి. కాటు తప్ప మనిషి మాదిరి, కండ్ల లోను, ముఖంలోను, అభినయాన్నిచూపించాలి. దీనినే నాగ నృత్యంగా పేర్కొన్నారు.
వెనుకటి రోజుల్లోనే కాక ఈనాటికి మనం అడవులకు వెళ్ళి చూసినట్లయితే జంతు నాట్యాలు ఎన్నో చూడ గలుగుతాం. వాటిలో కూతకు రాజు కోవెల అని ఈ నాటికి చెప్పుకుంటున్నాం. అలాగే నృత్యంలో నెమలి నృత్యం చూడ దగింది. పింఛం విప్పి అది చేసే నృత్యం మనలనెంతో ఆహ్లాద పరుస్తుంది. ఉత్తేజ పరుస్తుంది. ఆనందపరుస్తుంది. దాని కూత కూడ వినదగిందే. మేఘాలు పట్టినప్పుడూ, చల్లని గాలులు వీచేటప్పుడూ, ఒడలుపొంగి పింఛాన్ని విప్పి మందహాసంతో నాట్యం చేస్తుంది.
మానవుని అనుకరణ:
అదే విధంగా మానవుడు కూడ చేతులతో, నడుముతో, ముఖభావాలతోనే ఆ నృత్యాన్ని చేస్తున్నాడు. ఇది ప్రత్యేకంగా నెమలిని చూసి నేర్చుకొన్నదే. ఇదే జంతువుల అనుకరణ. దీనికే భరతనాట్య ప్రముఖులు మయూర నృత్యం అని నామకరణం చేసారు.
ఈ నృత్యాలు చేయాలంటే ఎంతో శరీరసాధన వుండాలి. ఇలా ఇకదాని కొకటి, అవినాభావసంబంధ మున్నప్పటికీ నృత్యంలో రమ్యత కనబడుతుంది. ఇటువంటి నృత్యాలు, శాస్త్రయుక్తంగాను, భావయుక్తంగాను భరతనాట్యశాస్త్రం తెలిసినవారే చక్కగా చేయగలుగుతారు. వారే గరుడనృత్యం, సింహనృత్యం, మయూర నృత్యం, నాగనృత్యం ఇలాంటివి ఎంతో అద్భుతంగా నటిస్తారు. దీనినే భావయుత నటన అంటారు.
భూత నటన:
ఈ నటన కేవలం దేవతల్ని సంతోషపెట్టటానికి ఏర్పడింది. దుష్టభూతాలను తృప్తి పరచడానికి, అంటువ్యాధుల నిర్మూలన కోసం, వర్షం కోసం, పంటలకోసం, పశువుల కోసం, నాటి నుంచి నేటి వరకు ఈ భూతనటన సాగుతూనే వుంది.
గ్రామాలలో అమ్మవారి జాతర్ల సమయంలో, దేవుళ్ళ ఉత్సవాలలో, స్త్రీలు పురుషులు అందరూ కలిసి ఎంతో చిత్ర విచిత్రంగా ఆటల్లో . పాటల్లో పాల్గొంటారు. ఎంతో తన్మయత్వంతో ఒక నిండు నమ్మకంతో, వుత్సాహ ఉద్రేకాలతో పాత్రల్లో నటిస్తారు. ఇది ఎంతో స్వభావ సిద్ధంగా వుంటుంది. కారణం వాళ్ళు ఒక ఫలితాన్ని ఆశిస్తున్నారు గనుక వారు దానికి అంకితమైపోతారు. వర్షం కురవాలని సామూహిక నృత్యాలు చేస్తారు. వర్షం కురిస్తే వుత్సవాలు జరుపుతారు. ఆ నృత్యంలో ఒక ఆవేశం వుంటుంది. అందువల్లనే దీనిని భూతనటన అన్నారు పెద్దలు. ఈ భూత నటన మానవుని అజ్ఞానదశను సూచిస్తుంది. ఇది ఈనాటికీ వెనుకబడ్డ ప్రాంతాలలో వుంది.
నేర్చుకున్న నటనలు :
భావయుతనటన, భూతనటన మొదలైనవన్నీ అనాగరిక జాతులనుండి, అడవి జాతులనుండి వాళ్ళను అనుకరించి మనం నేర్చుకున్నాం. ఈనాటికీ కొండప్రాంతా లలో నివసిస్తూవున్న చెంచులు, కోయలు, ఖాండులు, సవరలు, పండాలు మొదలైన కొండ జాతుల వారి నృత్యాలు మనల్ని ఆశ్చర్య చకితుల్ని చేస్తుంటాయి. వీరికీ కళ ఎలా అబ్బిందా అనిపిస్తుంది. ఈ నాటికీ ఆ ప్రాంతాలలో నివశిస్తున్న కొండ జాతుల వారందరూ వారి వారి నృత్యాలను పోషించుకుంటున్నారు.
ఈ విధంగా ఆనాడు దేవుణ్ణి గూర్చీ, దేవతలగూర్చీ ప్రజలలో ప్రచారం జరిపే వారు రాను రాను లౌకిక విహారార్థం శ్రీ మంతుల ఇండ్లలోను, రాజ మందిరాలలోను, వారి తృప్తి కొరకు మాత్రమే నాటకాలు వ్రాయటం, చిత్రాలు గీయటం, నృత్యం చేయటం, కవిత్యం వ్రాయటంతో నాటకాది లలిత కళలన్నీ ప్రజలనుండి దూరమయ్యాయి. ఎప్పుడైతే జమీందారి, శ్రీమంతుల యుగం వచ్చిందో అప్పుడు ప్రజలను దోచుకోవడం మెదలు పెట్టారు. ప్రజలు అనేక బాధలకు గురికావడం వల్ల కళలకు దూరమయ్యారు. కళలన్నీ రాజుల కొరకూ, వారి భోగభాగ్యాల కొరకూ అంకితమై పోయాయి.
శ్రీమంతుల పోషణ:
ఆనాడు దేవకార్యాలన్నీ శ్రీమంతులే చేయిస్తూ వుండేవారు. అందువల్ల ఈ నాట్యాచార్యులూ, గాయకులూ, కవులూ, చిత్రకారులూ అందరూ రాజమందిరాలకే ఆహ్వానింపబడ్డారు. అందువల్ల సామాన్య ప్రజలలో నానాటికి కళ దూరమై పోయింది. ప్రజల జీవితం దుర్బర మైపోయింది. అనందోత్సవాలు, దూరమైపోయాయి. ఇందువల్ల సామాన్య ప్రజలు రాజ మందిరాలకు పోయే అవకాశం లేనందున పూర్తిగా ఆ ఉత్సవాలకు ఆ ప్రదర్శనలకు దూర మయ్యారు. రాను రాను ఆ కార్యక్రమాల్లో శ్రీమంతులకూ, మధ్యతరగతి ప్రజలకూ, విద్యావంతులకూ, పండితులకూ మాత్రమే స్థానం వుండేది. పేద ప్రజలకు అంటు దోషాలు అంట గట్టి, దేవస్థానాల్లో ప్రవేశం లేకుండా స్వార్థ పరులు కళలను దోచుకున్నారు.
ఒకనాడు జీవితానందం కొరకు వృద్ధి పొందాయి. ఒకనాడు జీవితంలోఆనందం లేక కేవలం కష్టాలను మరచి పోవడానికి తప్పత్రాగి ఆ మత్తులో ఆటలాడారు, చిందులు త్రొక్కారు. పాటలు పాడారు. మొత్తంమీద నాట్యకళ, దేవకార్యాల నుండి, మోటు
చిందుల నుండి, పురాణ కథల నుండి, భజన మేళాలనుండి వృద్ధి పొందిందని నిస్సందేహంగా చెప్పవచ్చు.
డా.మిక్కిలినేని రాథాకృష్ణగారి వ్యాసంనుండి.

మరిన్ని వ్యాసాలు

రామసక్కని బాలల కథలు
రామసక్కని బాలల కథలు
- దుర్గమ్ భైతి
రాష్ట్ర కూటులు .
రాష్ట్ర కూటులు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
విష్ణుకుండీనులు శాసనాలు.
విష్ణుకుండీనులు శాసనాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
పింగళి వెంకయ్య.
పింగళి వెంకయ్య.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Second World War - 7
రెండవ ప్రపంచ యుద్ధం -7
- శ్యామకుమార్ చాగల్