భారత రాజ్యాంగం _ బౌద్ధం భారతదేశ తాత్వికచింతనను మలుపు తిప్పింది బౌద్ధం. ఆ బౌద్ధం బోధించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం, సామాజిక న్యాయం, అహింస, సహనం వంటి ఆధునిక విలువల పైన ఆధారపడి భారతదేశ రాజ్యాంగం రూపొందించబడింది. భారత రాజ్యాంగం రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బౌద్ధమతం నుండి ప్రేరణ పొందారు.ఆయన సామాజిక న్యాయం, కుల వివక్ష నిర్మూలన వంటి విలువలను నొక్కి చెప్పారు. రాజ్యాంగం ఈ ఆదర్శాలను ప్రతిబింబిస్తుంది. వ్యక్తిని గౌరవించే లౌకిక రాజ్యాన్ని ప్రోత్సహిస్తుంది. భారత రాజ్యాంగం 3 వ భాగంలో సమానత్వపు హక్కు ప్రకటించబడింది. 15 వ అధికరణం కుల, మత, లింగ వివక్షతలకు తావే లేదు అని ప్రకటించింది. అయితే రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఇన్ని దశాబ్దాల తరువాత కూడా ఇంకా ఈ దేశంలో బహిష్కృతులున్నారు. నిషిద్ధ మానవులున్నారు. వాళ్ల ఇళ్లు ఇంకా ఊరి బయటే ఉన్నాయి. వారి జీవనం ఇంకా వెలివాడల్లోనే మగ్గిపోతూ ఉంది. సమాజం ఇంకా ఆధునికం కాక పోవడం వల్లే ఇంకా బుద్ధుని బోధనలు గాని రాజ్యాంగం చెప్పిన రాజ్యాంగం లో రాసుకున్న విలువలు గాని ఇంకా ప్రజలు అందుకోలేక పోతున్నారు. నడిస్తే నేల మీద పాదముద్రలు పడకూడదని,వారి నీడ తమకు తాకి కూడదని, ఎక్కడా ఉమ్మడానికి కూడా వీల్లేదని తాటాకులు, ఉమ్మి ముంతలు కట్టుకొని తిరిగేలా ‘మనుధర్మం’ దళితులను శాశ్వత నేరస్తులుగా చేసి శిక్షలు ఖరారు చేసింది. ప్రత్యేకంగా ఏ నేరం చేయనక్కరలేదు. మాదిగ కులంలోనో, మాల కులంలోనో, మరో దళిత కులంలోనో పుడితే చాలు! బౌద్ధం వీటన్నిటినీ తిరస్కరించి అతని వృత్తిని బట్టి అతని కులాన్ని బట్టి కాకుండా అతని మానసిక నిర్మలత్వాన్ని బట్టి బౌద్ధ బిక్షువు కావచ్చని బౌద్దం చెప్పింది. వృత్తిని బట్టి పవిత్రతను కులాన్ని బట్టి అతని హోదాను గుర్తించకుండా మనిషిని మనిషిగా చూడాలని కమ్యూనిజం చెప్పింది. ఈ ఆధునిక భావాల వెలుగులో భారత రాజ్యాంగం పురుడు పోసుకుంది. డాక్టర్ అంబేద్కర్ యూరోపియన్ రాజ్యాంగాల నుండి ప్రేరణ పొందినట్లు చెపుతుంటారు. కాని ఆయనే స్వయంగా 25 నవంబర్ 1949 నాటి తన ప్రసంగంలో ఇది పూర్తిగా బౌద్ధం నుంచి స్వీకరించినట్లు చెప్పినారు. భారత రాజ్యాంగం యొక్క తుది ముసాయిదాను 26 జనవరి 1950న సమర్పిస్తూ భారతదేశం బౌద్ధ కాలం నాటి పార్లమెంటరీ ప్రజాస్వామ్య భారతదేశంగా మారిందని చెప్పారు. బౌద్ధానికి, ప్రజాస్వామ్యానికి ఎంతో సంబంధముంది. బుద్ధుని కాలం లోనే బౌద్ధ భిక్షు సంఘాలు పార్లమెంటరీ విధానాలు పాటించాయి. ఆధునిక కాలానికి తెలిసిన పార్లమెంటరీ ప్రక్రియకు సంబంధించిన అన్ని నియమాలను ఆ సంఘాలు ఆనాడే పాటించాయి. భిక్షువుల సీటింగ్ ఏర్పాట్లకు సంబంధించిన నియమాలు, మోషన్లు, తీర్మానాలు, కోరం, విప్, ఓట్ల లెక్కింపు, బ్యాలెట్ ద్వారా ఓటింగ్, సెన్సర్ మోషన్, రెగ్యులరైజేషన్, రెస్ జ్యుడికాటా( పునఃసమీక్షకు అవకాశం లేని తుది తీర్పు) మొదలైన వాటికి సంబంధించిన నియమాలన్నీ బౌద్ధ సంఘంలో ఉన్నాయి. ఈ పార్లమెంటరీ విధాన నియమాలను బుద్ధుడు ప్రవేశపెట్టాడు. ఆనాటి గణ సమాజాలలో ఉన్న నియమాలతో పాటు కొత్త నియమాలను కూడా చేర్చాడు.స్వేచ్ఛాలోచనకు, స్వయంప్రతిపత్తికి బౌద్ధ సంఘాలు మద్దతు ఇచ్చాయి. ఇవన్నీ వినయ పిటకంలో పొందుపరిచారు. ప్రముఖ చరిత్రకారుడు ఎరిక్ హాబ్స్‌బామ్ భారతదేశంపై బౌద్ధమత చారిత్రక ప్రభావంను వివరిస్తూ డాక్టర్ అంబేద్కర్ రాజకీయ ఆలోచనలపై బౌద్ధం అపారమైన ప్రభావాన్ని చూపించిందని పేర్కొన్నారు. అంబేద్కర్ బౌద్ధమతాన్ని ప్రజాస్వామ్యయుత మతంగా భావించారు. 3 అక్టోబర్ 1954న రేడియో ప్రసంగంలో అంబేద్కర్ ఇలా ప్రకటించారు. "నా సామాజిక తాత్వికచింతన లో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం భావాలను ఫ్రెంచ్ విప్లవం నుంచి అరువు తెచ్చుకోలేదు. వాటిని బుద్ధునిబోధనల నుండి పొందాను.బౌద్ధంలో స్వేచ్ఛ, సమానత్వానికి సౌభ్రాతృత్వానికి అత్యున్నత స్థానం ఉంది. సోదరభావానికి, మానవత్వానికి మరో పేరే బౌద్ధం." బౌద్ధం లో ప్రజాస్వామ్యం గురించి అంబేద్కర్ చెబుతూ ఇలా అంటాడు. "భిక్షు సంఘానికి అత్యంత ప్రజాస్వామ్య రాజ్యాంగం ఉంది. బుద్ధుడు భిక్కులలో ఒకరు మాత్రమే. ఆయన కేబినెట్‌లో ప్రధానమంత్రిగా ఉండేవారు. ఆయన ఎప్పుడూనియంత కాదు. ఆయన మరణానికి ముందు ఎవరినైనా ఒకరిని నియమించమని రెండుసార్లు భిక్షువులు అడిగారు. సంఘానికి అధిపతి తాను కాదని ధర్మం సంఘానికి సుప్రీం కమాండర్ అని చెప్పినాడు. అతను నియంతగా ఉండటానికి నిరాకరించాడు. నియంతను నియమించడానికి నిరాకరించాడు. పాశ్చాత్య ప్రజాస్వామ్యం కు సంబంధించిన ఆదర్శం, సమగ్రత, గౌరవానికి ప్రాధాన్యతనిస్తూ, ధర్మంలోని అనేక లక్షణాలు, అంతర్దృష్టులతో నిండి ఉంది బౌద్ధం. ధర్మం లేని నిజమైన ప్రజాస్వామ్య రాజకీయం ఉంటుందా? ప్రజా జీవితంలో ధర్మం కంటే మరేదైనా అవసరమా? సామాజిక ఆర్థిక రాజకీయ అంశాలను ‘‘రాజ్యాంగ నైతికత’’ దృక్పథం నించి చూడాల్సిన అవసరం నేడు ఉంది. దలైలామా బౌద్ధమతం, ప్రజాస్వామ్యం రెండూ ఒకే దృక్కోణాన్ని పంచుకుంటాయని నమ్ముతారు. "బౌద్ధమతం, ప్రజాస్వామ్యం అనుకూలంగా ఉండటమే కాదు, అవి ప్రతి వ్యక్తి సమానత్వాన్ని అంగీకరిస్తాయి. అప్పటి సంఘం ప్రజాస్వామ్య బద్ధంగా పనిచేసిందని అతను భావించాడు.భారత రాజ్యాంగంలోని అధికరణం 14 చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పింది. చట్టం నుంచి ప్రజలందరికీ సమాన రక్షణ లభిస్తుంది. పౌరులకి గల ఈహక్కుని ప్రభుత్వం ఏ పౌరునికి నిరాకరించరాదని రాజ్యాంగం చెబుతుంది. పారదర్శకత, స్వావలంబన అనేవి నిజానికి బౌద్ధ విలువలు. కానీ అవి సార్వత్రికమైనవి కూడా. బౌద్ధమతం, ప్రజాస్వామ్యం ఒకదానికొకటి అవసరం అని డేవిడ్ కాజిన్స్కీ అభిప్రాయపడ్డారు. భారత రాజ్యాంగం పౌరులందరికీ సమాన మైన హక్కులను, అవకాశాలను వాగ్దానం చేసింది. అయినప్పటికీ కొందరు సర్వ హక్కులనూ యధేచ్చగా అనుభవిస్తున్నారు. ఇంకొందరు తమ కనీస హక్కులను సాధించు కోడానికి నిరంతర పోరాటం చేయాల్సి రావడం స్వతంత్ర భారతంలో విషాదం. స్వేచ్ఛ, సమానత్వం అనేవి రాజ్యాంగంలో ఉన్నా వాటి ఉనికి సమాజంలో లేదు. అందుకని – రాజ్యాంగం హామీ ఇచ్చినా చాలామంది ఆ హామీని నమ్మి హాయిగా, స్వేచ్ఛగా ఈ దేశంలో బతకలేకపోతున్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ప్రజలకు అందేలా చూసే బాధ్యత ప్రభుత్వాలది. ప్రభుత్వాలు సమాజాన్ని చైతన్యవంతం చేయాలి. ప్రజల హక్కులను బాధ్యతలను – అందరికీ అర్థం అయ్యేలా చేయాలి. తరతరాలుగా ఉన్న సామాజిక అంతరాల కారణంగా కొన్ని కులాల వారి మనస్సుల్లో పేరుకొని పోయి ఉన్న ‘ఉన్నత’ భావన – కొన్ని కులాల వారి మనస్సుల్లో ఉన్న తక్కువ భావన చెరిగిపోవాలి. అలాంటి మానసిక పరివర్తన సమాజంలో రాకుండా ‘సమానత్వం’ సాధ్యం కాదు. అందుకే ఎండ్లూరి సుధాకర్ తన నల్ల ద్రాక్ష పందిరి కవితలో ఇలా చెప్తాడు ‘‘నేనేనాటికైనా నలుగురి మధ్య స్వేచ్ఛగా బతగ్గలనా? నలుగురూ కలిసి నా వృషణాల మీద తన్నినప్పుడు నా జాతి మర్మాంగాలను క్రూరంగా కోసేసినపుడు నా స్త్రీలని రాక్షసంగా చెరచి చంపినపుడు నన్నింకా తుంగలో తొక్కి సంచుల్లో కుక్కుతున్నప్పుడు లోలోపల అంటరానితనపు ఫర్మానాలు అచ్చువేసుకుంటున్నప్పుడు నమ్మకమంటే నాకింకా అనుమానమే’’ మన దేశ రాజ్యాంగంలో అత్యంత ప్రధానమైనది పీఠిక. ఈ పీఠికను ఎవరూ మార్చడానికి వీలు లేదు. ఈ పీఠిక ఇలా ఉంది. భారత ప్రజలమైన మేము, భారతదేశాన్ని సర్వసత్తాక ,సామ్యవాద, లౌకిక ,ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి, పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని; ఆలోచన, భావప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనల స్వాతంత్ర్యాన్ని ; అంతస్తుల్లోనూ, అవకాశాల్లోనూ, సమానత్వాన్ని చేకూర్చడానికి;, వారందరిలో వ్యక్తిత్వ గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి; మన ఈ రాజ్యాంగ పరిషత్ లో 1949, నవంబర్ 26వ తేదీన ఎంపిక చేసుకొని, శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము. బుద్ధుడు తన సంఘంలో ప్రజాస్వామ్యాన్ని గణతంత్రాన్ని సామ్యవాదాన్ని అమలు చేశాడు. బౌద్ధాన్ని పూర్తిగా ఆకలింపు చేసుకున్న అంబేద్కర్ కూడా ఈ భావాలను రాజ్యాంగ పీఠికలోనే పొందుపరిచాడు. పౌరులందరికీ సమాన హోదాను, సమాన అవకాశాలను, ప్రజల మధ్య సౌభ్రాతృత్వం పెంపొందించడానికి రాజ్యాంగం దోహద పడుతుంది. అయితే రాజ్యాంగంలోని ఆశయాలకు, ఆదర్శాలకు సామాజిక వాస్తవానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. వైరుధ్యం వుంది. దేశంలో సామాజిక రాజకీయ సంక్షోభాలు ఏర్పడినప్పుడు ఈ వైరుధ్యం తీవ్రతరం అవుతుంది. "రాజ్యాంగానికి, సామాజిక వాస్తవానికి మధ్య పూర్తిగా అంతరం ఉన్నప్పుడు ప్రజల దృష్టిలో అది ఒక కల్పనగానే ఉంటుంది. ఈ అంతరం ఏ మేరకు తగ్గుతుందో లేదా తొలగిపోతుందో ఆ మేరకు రాజ్యాంగం వాస్తవంగా ఉంటుంది” అని లెనిన్ అన్నాడు. బుద్ధుని కాలం వేరు. సైన్సు ఎంతో అభివృద్ధి చెందిన నేటి కాలం వేరు. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ దేశంలో రాజకీయ రంగంలో సమానత్వం ఉన్నప్పటికీ, సామాజిక, ఆర్థిక రంగంలో అసమానతలు కొనసాగుతూ ఉన్నాయి. రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉంది. కానీ సామాజిక, ఆర్థిక జీవితంలో సమానత్వం లేకుండా ఎంతకాలం ఉండగలం? ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాజకీయ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. ఎంత తొందరగా ఈ వైరుధ్యాన్ని రూపుమాపగలిగితే అంత మంచిది. అలా కాకపోతే అసమానత్వంతో బాధపడుతున్న వారు ఏ ప్రజా స్వామ్యాన్ని రాజ్యాంగ సభ రూపొందించిందో దాన్ని బద్దలు కొడతారంటారు ప్రొ. శేషయ్య. బుద్ధుడు సమాజంలోని దుఃఖాన్ని రూపుమాపడానికి అష్టాంగ మార్గాలు సూచించాడు. పంచశీల బోధించాడు.కానీ ప్రజల ఆకలిని పోగొట్టడానికి రాజ్యాంగం పని హక్కును ఒక ప్రాథమిక హక్కుగా, ఒక చట్టంగా రూపొందించలేక పోయింది. అంటరానితనాన్ని నిర్మూలించలేక పోయింది. దీన్ని ఎండ్లూరి సుధాకర్ తన కవితలో ఇలా చెపుతాడు.ఉు ‘‘బుక్కెడు బువ్వకోసమో – దోసెడు గంజికోసమో ఆ పిల్ల మా గుడిసెల ముందు బౌద్ధ భిక్షువయ్యేది- పేగులు ఏడుస్తున్నాయో పెదవులు నవ్వుతున్నాయో నాలుగు ముఖాలవాడు కూడా నుదురు చూసి చెప్పలేడు అన్నానికి కళ్లులేవుగానీ ఉంటే ఎండిన మెతుకులు కూడా చెమ్మగిల్లి ఉండేవి అంటరానితనానికి ఆకలికి మధ్య ఆ పిల్ల చెరువెండిన చేప పిల్లలా గిల గిలా తన్నుకునేది’’ (నల్లద్రాక్ష పందిరి). బుద్ధుడు తన ఆరామాన్ని సంఘాన్ని వివిధ వనాలలో, ప్రకృతి మధ్య ఏర్పాటు చేశాడు. బుద్ధుడు పర్యావరణానికి పెద్దపీట వేశాడు. భూటాన్, లడఖ్ వంటి బౌద్ధ ప్రభావిత ప్రాంతాలు పర్యావరణ పరిరక్షణలో ఆదర్శంగా నిలుస్తున్నాయి, ఇది బౌద్ధ తత్వాల ఆధునిక ప్రస్తుతతను చాటుతుంది.మన పొరుగు దేశం భూటాన్ బౌద్ధ దేశం. ఆ దేశం పర్యావరణానికి పెద్దపీట వేసి అంతర్జాతీయంగా ఎన్నో ప్రశంసలు పొందింది కార్బన్ న్యూట్రల్ కంట్రీ గా ప్రపంచం లో గుర్తింపు ను తెచ్చుకొంది. ఆ విధం గా భారతదేశంలోని లద్దాఖ్ కూడా కార్బన్ న్యూట్రల్ ఎన్ టిటి గా కూడా అభివృద్ధి చేయాలి. ఇది దేశానికి ఒక హాల్ మార్క్ గా సృష్టించడమే మనం బుద్ధునికి ఇచ్చే గొప్ప నివాళి. బౌద్ధం పురుషులతో పాటు మహిళలకూ సమాన హక్కులు కల్పించిన తొలి తాత్విక ధార్మిక పద్ధతిగా చరిత్రలో నిలిచింది. బుద్ధుడు తన కాలంలోనే సాంఘికంగా నిరాదరించబడిన మహిళలకు బిక్షుణిగా జీవించే అవకాశాన్ని కల్పించాడు. సమానత్వం, అహింస, సహనం, స్వేచ్ఛ, వివక్షారహితంగా ఉండటం వంటి ఆదర్శాలు బౌద్ధ ధర్మంలో కేంద్ర బిందువులుగా నిలిచాయి. ఈ తాత్విక ప్రభావం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగంలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. రాజ్యాంగం భారతదేశ పౌరులందరికీ ఆర్టికల్ 15 ద్వారా కుల, మత, లింగ, జాతి, ప్రాంతవివక్షలు లేకుండా – సమాన హక్కులు, విధులు కల్పిస్తుంది. మన రాజ్యాంగం చూపిన మార్గమే బౌద్ధ ధర్మం చూపిన మార్గం. ఉదాహరణకు ఈ విశ్లేషణ ఆర్టికల్ 19(1)(a) ప్రకారం రచయితకు ఏర్పడిన హక్కులో భాగంగా రాయబడినట్లుగా గమనించవచ్చు.ఇక్కడ చర్చించిన అంశాలు చారిత్రక, తాత్విక విశ్లేషణలు బౌద్ధ ధర్మం బోధించిన సామాజిక సమానత్వ భావనలపైన, రాజ్యాంగం కల్పించిన బలమైన నైతిక పునాదులపైన చర్చగా మనం చూడొచ్చు. చాలామంది భారత రాజ్యాంగం ఇతర దేశాల రాజ్యాంగాలనుంచి కాపీచేసిందని భావిస్తారు. కానీ వాటిలోని ప్రాథమిక విలువలు — స్వాతంత్యం, సమానత్వం, న్యాయం, మానవ హక్కులు — అన్ని బౌద్ధ ధర్మ మూలసూత్రాల నుంచే పుట్టినవేనని చరిత్ర, తాత్విక విశ్లేషణలు సూచిస్తున్నాయి. ఈ మూలసారాన్ని పునరావిష్కరించడమే భారత రాజ్యాంగంలో జరిగింది. అందుచేత భారత రాజ్యాంగాన్ని ఒక పునర్నూతన బౌద్ధ ధర్మసూత్రంగా చూడవచ్చు. భారత రాజ్యాంగం పైన కాకుండా భారత దేశ జెండా పైన కూడా బౌద్ధం ప్రభావం ఉంది బౌద్ధం ప్రభావం ప్రపంచంలో అతి కొద్ది చక్రవర్తులలో ప్రజారకం ప్రజారంగకంగా పరిపాలించిన అశోకుని ధర్మ చక్రాన్ని భారతదేశ జెండా పైన స్వీకరించారు. ఇది బౌద్ధమతాన్ని స్వీకరించిన అశోక చక్రవర్తి స్థాపించిన ధర్మచక్రం. ధర్మచక్రంలోని 24 చువ్వలు బుద్ధుని బోధనలను సూచిస్తాయి.అవి నైతిక సూత్రాలను నొక్కి చెబుతాయి. ఇవే మరో రకంగా ఆదేశిక సూత్రాలుగా వచ్చి చేరాయి.ఇవి పాలకుల నైతిక జీవనశైలికి, సమాజ నిర్మాణానికి మార్గదర్శక సూత్రాలఅయ్యాయి. భారతదేశ జెండాలో అశోక చక్రాన్ని చేర్చడం ద్వారా న్యాయం, ధర్మం, శాంతియుత సహజీవనానికి దేశనిబద్ధతను సూచిస్తుంది. సమాజంలో మానసిక పరివర్తన, చైతన్యం లేనంత వరకు రాజ్యాంగ ఆదర్శాలు పూర్తిగా సాకారం కావు.ఇది బౌద్ధం ద్వారా నే సాకార మౌతుంది. ప్రభుత్వం, సామాజిక వేత్తలు ప్రజలు కలిసి ఈ అంతరాన్ని తగ్గించడానికి కృషి చేయాలి. అప్పుడే బౌద్ధం, రాజ్యాంగం సూచించిన సమానత్వం, సౌభ్రాతృత్వం వాస్తవ రూపం దాల్చగలవు. ___ పిళ్ళా కుమారస్వామి 9490122229 ఆధారాలు: ప్రొ. శేషయ్య రచనా సర్వస్వం-1 ‘రాజ్యాంగం-పౌరహక్కులు’ డాక్టర్ అంబేద్కర్ అండ్ డెమోక్రసీ __(క్రిస్టోఫ్ జాఫ్రెలాట్ , నరేందర్ కుమార్ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై జరిగిన చర్చ కు లోక్ సభ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన సమాధానం. రాజ్యాంగ నైతికతకు నెత్తుటి ప్రశ్న ఎండ్లూరి సుధాకర్ కవిత్వం (సాహిత్య వ్యాసం )- డా. ఎం.ఎం. వినోదిని14/03/2018 విహంగ మహిళా పత్రిక ‘The Buddha and His Dhamma’ by Dr. Ambedkar. Dr. Ambedkar’s Constituent Assembly Debates.

