సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసులు, వాగ్గేయకారుడు - Syamasundar Ambadipudi

సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసులు, వాగ్గేయకారుడు

కర్ణాటక సంగీతములో త్యాగయ్య,ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రులను త్రిమూర్తులుగా పేర్కొంటారు ఈ కర్ణాటక సంగీత త్రయములో మూడవ వాడు శ్యామశాస్త్రి,వయస్సులో వీరిద్దరికన్నా పెద్దవాడు.ఈయన అసలు పేరు వెంకట సుబ్రమణ్యము కానీ చిన్నతనము నుండి శ్యామకృష్ణ అనే ముద్దు పేరుతొ పిలవటం వలన శ్యామశాస్త్రి అనే పేరు వ్యవహారికముగా సార్ధకమైనదని అయన శిష్యులు చెపుతుంటారు.వీరి తండ్రి విశ్వనాధ శాస్త్రి ప్రకాశము జిల్లా లోని గిద్దలూరుకు సమీపాన గల కంభము ప్రాంతీయులు కానీ ఆ ప్రాంతములో మహమ్మదీయుల దాడులకు భయపడి 17వ శతాబ్దములోనే తమిళనాడుకు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.వీరు శ్రీమంతులు. శ్యామశాస్త్రి తల్లిదండ్రులు కంచిలో లభించిన శ్రీ కామాక్షి అమ్మ వారిని పూజించుచు ఉండటమే కాకుండా పుత్ర సంతానము లేనందు వల్ల నెలలో ఆఖరి శనివారం శ్రీ వెంకటా చలపతికి ప్రీతిగా బ్రాహ్మణులకు అన్నసంతర్పణ చేసేవారు ఒకసారి ఒక బ్రాహ్మణుడు వీరికి ఒక సంవత్సరము లోపు ఒక యశోవంతుడైన కుమారుడు కలుగుతాడని చెప్పాడు అయన చెప్పినట్లుగానే వారికి శ్యామశాస్త్రి ఏప్రిల్ 23, 1763లో శ్రీనగరమను తీరువారూరిలో జన్మించాడు.

తండ్రి విశ్వనాధశాస్త్రీ సంస్కృత,తెలుగు భాషలలో పండితుడు అవటంతో తండ్రి వద్దే సంస్కృతాంధ్రములను అభ్యసించాడు.మేనమామ దగ్గర స్వర పరిచయము అయినాక తంజావూరులో సంగీత స్వామి అనబడే యతీంద్రుడు ప్రముఖ తెలుగు సంగీత విద్యాంసుడు శ్యామశాస్త్రిని చూచిన వెంటనే ఆతని విద్యా కౌశులతకు ఆశ్చర్యమొంది వీరిని గొప్ప యశోవంతుడువగునని ఆశీర్వదించాడు అతడు గొప్ప పండితుడు కాగలడని సంగీతస్వామి తెలుసుకొనెను తాళ శాస్త్రము లోను, రాగ శాస్త్రములో అఖండ పండితుడైన సంగీతస్వామి వద్ద బాగుగా విద్యనభ్యసించిరి. ఆ తరువాత తంజావూరు లోని రాజాస్థానములోని సంగీత విద్వాంసుడైన పచ్చి మిరియం అది అప్పయ్య సహకారముతో సంగీత శాస్త్రాలలో మెళుకువలను ఎన్నో అధ్యయనము చేసాడు.అది అప్పయ్య గారికి శ్యామశాస్త్రిగారనిన అపరిమిత ప్రేమ, భక్తియు నుండెడివి. ప్రేమతో "కామాక్షి" అని పిలిచేవారట శ్యామశాస్త్రి గారికి పేదరికము అంటే ఎమిటో తెలియకుండా పెరిగాడు. మంచి భోజనప్రియుడు తాంబూలాది రసాస్వాదన అంటే ఏంతో ఇష్టము.అందుచేతనే ఈయన కీర్తనలు ఉల్లా సము కలిగించేవి గాఉండేవి చక్కని లయ తాళ ప్రదర్శనాలకు అనుగుణముగా వుండేవి నాదోపాసన ద్వారా ఆత్మానందమును పొందవచ్చు అని అయన అభిప్రాయపడేవారు. కష్టసుఖాలను తెలిపే కీర్తనలు, దైన్య రస, ప్రధానములగు భక్తి పిలుపులు ఈయన కీర్తనలలో కానరావు. శ్యామశాస్త్రి తెలుగు, తమిళము, సంస్కృతము భాషలలో అనేక కృతులు కీర్తనలు రచించినప్పటికీ స్వతహాగా తెలుగువాడు అవటం వలన అధిక భాగము తెలుగులోనే వ్రాసాడు.

ఈయన బంగారు కామాక్షి అమ్మవారి ఉపాసకుడు. అమ్మపై తప్ప వేరొకరి పై రచనలు చేయలేదు. ఈయన కలగడ మాంజి, చింతామణి మొదలగు అపూర్వ రాగములను కల్పించాడు. త్యాగరాజాదులచే కొనియాడబడిన ఈయన లయజ్ఞానము శ్లాఘనీయమైనది. ఆనంద భైరవి రాగమన్న ఈయనకు చాల యిష్టమని చెప్తారు. ఆంధ్ర గీర్వాణ భాషా కోవిదుడై ఈయన కృతులలో ముఖ్యమైనవి: ఓ జగదంబా, హిమాచలతనయ, మరి వేరే గతి యెవ్వరమ్మా, హిమాద్రిసుతే పాహిమాం, శంకరి శంకురు, సరోజదళనేత్రి, పాలించు కామాక్షి, కామాక్షీ (స్వరజతి), కనక శైలవిహారిణి, దేవీ బ్రోవ సమయమిదే, దురుసుగా, నన్ను బ్రోవు లలిత, మొదలగునవి.శ్యామశాస్త్రి మధురై వెళ్ళినప్పుడు మీనాక్షి అమ్మవారిని స్తుతిస్తూ తొమ్మిది కృతులను పాడారు అవి నవరత్న మాలిక గా ప్రసిద్ధి చెందినాయి.ఈయన కుమారుడు సుబ్బరాయ శాస్త్రి కూడా ప్రముఖ వాగ్గేయ కారుడే.అలనూరు కృష్ణయ్య, తలగంబాడి పంచనందయ్య తదితరులు ఈయన శిష్యులలో ప్రముఖులు.

త్యాగరాజు తన కీర్తనలలో భావ రాగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వగా, శ్యామశాస్త్రి తన కీర్తనలలో క్లిష్టమైన తాళ రచన చేసినట్లుగా సంగీత అభిమానులు అంటారు. శ్యామశాస్త్రి కీర్తనలలో క్లిష్టమైన తాళ రచనతో పాటు ఆయనకు శిష్యులు అధిక సంఖ్యలో లేకపోవటం వల్ల కూడా ఈయన కీర్తనలు ఎక్కువ ప్రాచుర్యములోకి రాలేదని విమర్శకులు భావిస్తారు ఏది ఏమైనప్పటికి అయన కీర్తనలు సంగీతాభి మానులకు సుపరిచితమే.నేటికీ కర్ణాటక సంగీత ప్రపంచములో అయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది.